ఐక్యత ఇంకెంత దూరం? | AP Vital Write about Special Status | Sakshi
Sakshi News home page

ఐక్యత ఇంకెంత దూరం?

Apr 13 2018 1:05 AM | Updated on Mar 23 2019 9:10 PM

AP Vital Write about Special Status - Sakshi

చంద్రబాబు పాలనను అంతం చేయడమే వామపక్షాల ప్రథమ కర్తవ్యం. ఇందులో వైఎస్సార్‌సీపీ నిర్వహించగలిగిన ప్రత్యేక పాత్ర ఉంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకునే వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు ఏచూరి, రాజా సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టు పార్టీలు ఇదే వైఖరిని అవలంబించాలి. మొదటి నుంచీ ప్రత్యేక హోదా విషయంలో ఒకే వైఖరితో ఉన్న వైఎస్సార్‌సీపీని విమర్శిస్తూ, తెలుగు ప్రజలను దగా చేసినవారు చంద్రబాబు.

వామపక్షాలు ఎంతగా బలహీనపడినా, వారి ప్రాతినిధ్యం ఎంతగా తగ్గిపోయినా, బెంగాల్, త్రిపుర రాష్ట్రాలలో ప్రాభవానికి గండి పడినా భారత రాజకీయాలలో ఆ పార్టీల ప్రాముఖ్యాన్ని కాదనలేం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఓటింగ్‌ శాతం ఒక అంకెకు మించకపోవచ్చు. కానీ ప్రజా పోరాట క్షేత్రంలో, ప్రజా ఉద్యమాలలో సాపేక్షంగా కమ్యూనిస్టు పార్టీల పాత్ర గణనీయమైనది. ఈనాడు కమ్యూనిస్టు పార్టీలు ముప్పయ్‌కి పైగా ఉన్నాయి. వివిధ ప్రాంతాలలో వివిధ స్థాయిలలో శక్తి మేరకు పీడత ప్రజానీకం తరఫున ఉద్యమిస్తూనే ఉన్నాయి. కమ్యూనిస్టు (మార్క్సిస్టు) భావజాలాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా మన దేశ ఆర్థిక రాజకీయ సాంస్కృతిక వాస్తవికతను నిర్ధారించుకోవడం నేటికీ అసాధ్యమే. 

కమ్యూనిస్టు అభిమానులు, ఆ పార్టీ ఉద్యమ ప్రభావం ఉన్న ప్రాంతాలలోని సాధారణ ప్రజలు కమ్యూనిస్టుల పట్ల సానుభూతితోనే ‘వీళ్లు చీలికలైపోయారు’ అని భావించడం సత్యదూరం కాదు. సాయుధ పోరాటమే, అదీ మావో జెడాంగ్‌ ప్రతిపాదించిన రీతిలో తప్ప మరో మార్గం లేదు అనిపించే మావోయిస్టులు తప్ప నాకు తెలిసిన మిగిలిన కమ్యూనిస్టు గ్రూపులలో అందునా, ప్రధానమైన సీపీఎం, సీపీఐ మధ్య వ్యూహం విషయంలో గుణాత్మకమైన విభేదాలు లేవు. సాధించవలసింది జనతా ప్రజాస్వామ్యమా, జాతీయ ప్రజాస్వామ్యమా లేక నూతన ప్రజాస్వామ్యమా వంటి పడికట్టు పదాలతో తమ తమ వ్యూహాలను బంధించుకున్న తీరు తప్ప, ఆచరణాత్మకంగా ఛేదిం చుకోలేని ప్రతిబంధకాలేమీ లేవు.

సరైన దృష్టితో చూడాలి
ఈ సందర్భంగా తొలితరం భారత కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ రథసారథి, దక్షిణ భారతావనిలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, ఆదర్శ కమ్యూనిస్టు పుచ్చలపల్లి సుందరయ్య జీవిత చరమాంకంలో రాసిన (తన మరణానంతరం ప్రచురించమని కోరారు) ఆత్మకథలో కనిపించే ఒక విలువైన విషయం మీ ముందుంచుతాను. దీనిని ‘విప్లవ పథంలో నా పయనం’ పేరుతో (తెలుగు) ప్రజాశక్తి బుక్‌హౌస్‌ ప్రచురించింది. ‘నేడు దేశంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీలు అన్నింటిలోకి అత్యంత విప్లవకరమైన పార్టీ అని మన సీపీఎంను గురించి మనం భావిస్తాం. కానీ అది ఇంకా నిరూపించుకోవలసి ఉన్నది. ఎందుకు అంటున్నానంటే ఇంకా మనం (పార్టీ) విప్లవం సాధించలేదు కనుక!’ అని అందులో సుందరయ్య చెప్పారు. కానీ ఈ వాక్యాన్ని సీపీఎంకు వ్యతిరేకంగా ఉపయోగించదలుచుకుంటే అంతకంటే అల్పత్వం ఉండదు. ఆ కొలమానం ప్రకారం సుందరయ్య అభిప్రాయం అన్ని కమ్యూనిస్టు పార్టీలకు వర్తిస్తుంది. ఎందుకంటే ఏ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం వల్ల కూడా భారతదేశంలో విప్లవం సాధ్యం కాదు. 

కానీ ఆ వాక్యంలో ఉన్న ప్రధాన అంశం ఏమిటంటే, తమదే నిజమైన విప్లవ పార్టీ, మిగిలినవి వివిధ రూపాలలో తరతమ భేదాలతో రివిజనిస్టు లేదా అతివాద దుందుడుకు పార్టీలు అని ముద్ర వేసి, గిరి గీసుకుని కనిపిస్తున్న వామపక్షాలు ‘ప్రపంచ కార్మికులారా! ఏకంకండి!’ అన్న మార్క్స్‌ మహత్తర సందేశానికి భిన్నంగా వ్యవహరించరాదనే ఆ వాక్యం సందేశం. కనుక ఇప్పుడు కావలసింది భారత కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్యత. ఇంకా, ప్రధానంగా ఉన్న రెండు కమ్యూనిస్టు పార్టీల విలీనం వీలైనంత త్వరగా సాధించి దేశ ప్రజల నేటి భౌతిక వాస్తవ పరిస్థితికి అనువైన రీతిలో విప్లవాన్ని సాధించాలని కూడా ఆ వాక్యం అంతరార్థం. కమ్యూనిస్టు ఉద్యమం ఐక్యం కాకుండా, చీలికలు పేలికలుగా కార్మిక వర్గ ఐక్యతకు విఘాతం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నంత వరకు ప్రజలకు కమ్యూనిస్టులు న్యాయం చేయలేరు. సీపీఐ, సీపీఎం పార్టీల అఖిల భారత సభలు త్వరలో జరుగుతున్న నేపథ్యంలో రాస్తున్నదే తప్ప, ఏ ఒక్క పార్టీనో విమర్శించేందుకు, కించపరిచేందుకు ఇది రాయడం లేదు. అదే సమయంలో ఐక్యత దిశగా మెల్లమెల్లగా కొన్ని అడుగులు పడుతున్న సంగతి కూడా గమనార్హమే. ప్రజాశత్రువులైన పాలకులు ఏ పేర్లు పెట్టుకున్నా ప్రజా వ్యతిరేక, స్వార్థ సంకుచిత మతతత్వ విధానాలతో ఒక సునామీ మాదిరిగా ప్రమాదం ముంచుకు వస్తున్న దశలో నత్త నడక సరికాదు. 

బీజేపీ నినాదం పరమార్థం వేరు
కమ్యూనిస్టు పార్టీలు అఖిల భారత స్థాయిలో గుర్తించవలసిన అంశం మరొకటి ఉంది. భారతదేశం మొత్తానికి ఒకే విధమైన ఎన్నికల ఎత్తుగడలు అసాధ్యం. అటు ప్రజా వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల, సామ్రాజ్యవాద ఆశ్రిత ఆర్థిక విధానాలతో పాటు మత తత్వాన్ని కూడా తీవ్ర స్థాయికి తీసుకుÐð ళ్లాలని ప్రయత్నిస్తున్న నరేంద్ర మోదీ, అమిత్‌షాల ఆధిపత్యంలో బీజేపీ అఖండ హిందూ (భారత్‌) రాజ్యం స్థాపించాలని చూస్తున్నది. ఈ విధమైన మతతత్వంలో మోదీ, షాల ప్రభుత్వానికి పొరుగున ఉన్న ముస్లిం మతతత్వ రాజ్యం పాకిస్తాన్‌ ఆదర్శం. దీనికితోడు ఒకే జాతి, ఒకే పన్నుల విధానం, ఒకే భాష చివరికి ఒకే మతం అన్న స్థితి కానవస్తున్నది. వివిధ జాతులు గల సుందర భారత వైవిధ్యాన్ని తుడిచివేసి ఏకశిలా సదృశమైన అఖండ భారతం పేరిట సమాఖ్య స్వరూపాన్నే సమాధి చేయాలని చూస్తున్న మోదీ, షాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. రోహిత్‌ వేముల ఆత్మహత్య మొదలు ఈ పాలకుల సామాజిక అణచివేతకు గురి అవుతున్న వ్యవస్థలో అట్టడుగు వర్గాల మీద, మైనారిటీల మీద, మహిళలపైన, ఆదివాసీల మీద ఆగడాలు పెరిగిపోవడం గమనార్హం. కాంగ్రెస్‌ ముక్త భారత్‌ మాత్రమే వారి నినాదం కాదు. అన్యమత, అన్య రాజకీయ పార్టీల, ప్రజాస్వామిక, లౌకిక వ్యవస్థ, సమాఖ్య స్వరూపాల ముక్త భారత్‌ను కూడా వారు కోరుతున్నారు. రానున్న ఎన్నికలలో మళ్లీ దేశవ్యాప్తంగా అవకాశవాద రాజకీయ పార్టీలతో, నేతలతో జత కట్టి రాజ్యాధికారం సాధించి తన పంజా విస్తరించాలన్నది బీజేపీ సంకల్పం. 

భారతతో పాటే కొన్ని ఇతర దేశాలు స్వాతంత్య్రం సాధించాయి. కానీ ఆ రాజ్యాల మాదిరిగా భారత్‌ నియంతృత్వ రాజ్యంగా, మత రాజ్యంగా తయారు కాకుండా, ప్రజాస్వామ్య లౌకికరాజ్యంగా తీర్చిదిద్దిన ఘనత తమదేనని కాంగ్రెస్‌ చెప్పుకున్నది. ఆ పార్టీ మళ్లీ అధికారం చేపట్టాలని అర్రులు చాస్తున్నది. ఈ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ చేసుకుంటున్న ప్రచారం ఎంత వరకు నిజమో తెలియదు కానీ, దేశాన్ని ఆ పార్టీ అవినీతి మయం చేసిందన్న మాట మాత్రం పూర్తిగా నిజం. అంతేకాదు, బీజేపీ చేయదలిచిన, చేస్తున్న తప్పిదాలకు అవకాశం కల్పించిన పార్టీ కూడా అదే. కాంగ్రెస్‌ పాలన పట్ల విసిగిపోయిన ప్రజలు గత్యంతరం లేదని భావించిన దశలో బీజేపీకి పట్టంగట్టారు. ఒకవిధంగా కాంగ్రెస్‌ పరిచిన బాటలోనే బీజేపీ అధికారంలోకి Ðð ళ్లింది. అందుకే కాంగ్రెస్‌ హయాంలోని ఆర్థిక విధానాలను మరింత విస్తృతంగా, మూర్ఖంగా అనుసరిస్తున్నది. దేశ సమాఖ్య స్వరూపాన్ని భగ్నం చేయడంలో కాంగ్రెస్‌ కూడా తన వంతు ప్రయత్నం చేసింది. బాబ్రీమసీదు తాళాలు తెరి పించడంలోను, షాబాను కేసులోను ఆ పార్టీ వ్యవహరించిన తీరు చాలా దుష్పరిణామాలకు దారి తీసింది. బాబ్రీ మసీదు కూల్చివేతను కాంగ్రెస్‌ ఆపలేకపోయింది. మతతత్వవాదులను సంతృప్తిపరిచే విధంగా వ్యవహరించింది.

రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఒక వేది కను నిర్మించాలన్న సీపీఎం అఖిల భారత స్థాయిలో ముసాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించింది. కాంగ్రెస్, బీజేపీలను ఒకే గాట కట్టడం సరికాదనీ, బీజేపీని ఒంటరిని చేసి ఓడించడం, తక్షణ కర్తవ్యమనీ కొందరు కమ్యూనిస్టు నేతలు, ఇతరులు కూడా వాదించడంలో వాస్తవికత లేదని అనడం సరికాదు. నిజానికి అలాంటి ప్రత్యామ్నాయ విధాన రూపకల్పనలో వామపక్షాలు దాన్ని తమ పాలనలో సైతం అక్కడైనా ఆచరణాత్మకం చేయకపోవడం కమ్యూనిస్టుల వైఫల్యానికి పెద్ద కారణం. అది గుర్తించడం ఎంత ముఖ్యమో, ఆ వ్యూహాన్ని అమలు పరచాలంటే సమయం సందర్భం, తగిన ఎత్తుగడను రూపొందించుకోవడం అంతే ముఖ్యం. ఉదాహరణకు దానిని అమలు చేయడమనే కారణంతో దేశం మొత్తానికి ఒకే విధమైన పంథా తగదు కూడా. దేశ వైవిధ్యంతో పాటు, వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు, వాటి ప్రభావం ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలు తమ వ్యూహాన్ని అమలు చేసుకునే దిశగా ఎన్నికల ఎత్తుగడలను అనుసరించే స్వేచ్ఛ ఇవ్వాలి.

వైఎస్సార్‌సీపీ వైఖరి సమర్థనీయం
ముందు కమ్యూనిస్టు పార్టీలలో డెమొక్రాటిక్‌ సెంట్రలిజం పేరుతో సెంట్రలిజం (కేంద్రీకృత ప్రజాస్వామ్యం స్థానంలో కేంద్రీకృతమే) సాగడం సరి కాదు. ఉదాహరణ: ఆంధ్రప్రదేశ్‌. రాష్ట్రాన్ని అవినీతి మయం చేసి శుష్క వాగ్దానాలతో అధికారం దక్కించుకుని, అవకాశవాదంతో అందలం ఎక్కి అలాగే కొనసాగాలనుకుంటున్న నారా చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీని ఓడించడం ప్రథమ ప్రాధాన్యం అవుతుంది. చంద్రబాబు వ్యతిరేక ఓటును చీల్చి పరోక్షంగా చంద్రబాబుకే మేలు చేసే తృతీయ ఫ్రంట్‌ రూపొం దించడంలో వామపక్షాలు పాలు పంచుకోవడం కూడని పని. ప్రధాన ప్రతి పక్షం, జగన్‌ నాయకత్వంలోని వైఎస్సార్‌సీపీతో యోచించి, పరస్పరం పోటీ నివారణ స్వతంత్ర వేదికల వంటి ఏర్పాటుతో వామపక్షాలు వ్యవహరించడం సముచితం. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ బలమైన శక్తులు కావు. కాబట్టి ఆ రెండింటికీ ప్రత్యామ్నాయ ఫ్రంట్‌ అనే ప్రశ్నే ఉదయించదు. చంద్రబాబు పాలనను అంతం చేయడమే వామపక్షాల ప్రథమ కర్తవ్యం. ఇందులో వైఎస్సార్‌సీపీ నిర్వహించగలిగిన ప్రత్యేక పాత్ర ఉంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకునే వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు ఏచూరి, రాజా సంఘీభావం తెలి పారు. రాష్ట్రంలో కూడా కమ్యూనిస్టు పార్టీలు ఇదే వైఖరిని అవలంబించాలి. ఇక తెలంగాణలో సీపీఎం బహుజన వామపక్ష సంఘటన కోసం కృషి ఆరం భించింది. అయితే ఇందుకు సీపీఐ కలసి రాకపోవడం శోచనీయం. 

మొదటి నుంచీ ప్రత్యేక హోదా విషయంలో ఒకే వైఖరితో ఉన్న వైఎస్సార్‌సీపీని విమర్శిస్తూ, తెలుగు ప్రజలను దగా చేసినవారు చంద్రబాబు. ఆయనకు నిన్నటిదాకా అండగా ఉన్నవారు పవన్‌ కల్యాణ్‌. అయితే ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌తో జత కట్టడం వామపక్షాల పట్ల నివారింపదగిన అపోహలకు ఆస్కారం ఇవ్వడమే. విస్తృతమైన ప్రజా ఉద్యమంలో వైఎస్సార్‌సీపీతో మాత్రమే కాకుండా, హోదా కోసం పోరాడుతున్న సాధన సమితి వంటి ఇతర పౌర సంఘాలను కూడా కలుపుకుని వెళ్లాలి. బీజేపీ, తెలుగుదేశం పాలనలకు వ్యతిరేకంగా పోరాడడం ద్వారా కమ్యూనిస్టు పార్టీలు తమ పునాదిని, ప్రజా సంబంధాలను విస్తృతం చేసుకోవడానికి అవకాశాలను పెంచుకోవాలి.

వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు 
డాక్టర్‌ ఏపీ విఠల్‌
మొబైల్‌ : 98480 69720

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement