నాకు నచ్చిన ఐదు పుస్తకాలు

Annamraju Venugopala srinivasamurthy favorite five books - Sakshi

చదువరుల శీర్షిక

శేషప్రశ్న(శరత్‌చంద్ర ఛటర్జీ)

శరత్‌ బెంగాలీ నవలకు బొల్లిముంత శివరామకృష్ణ తెలుగు అనువాదం శేషప్రశ్న. తుప్పుపట్టిన సంప్రదాయ ధోరణులను, వ్యక్తి హితానికి ఉపయోగపడని విధానాలను కమల ఖండించే పద్ధతి గొప్పగా ఉంటుంది. సంఘసేవలో చురుకుగా పాల్గొంటూ కమల మన్ననలు కూడా చూరగొన్న రాజేంద్ర ఆలయం తగలబడి పోతున్నప్పుడు అందులో విగ్రహాన్ని కాపాడాలని ప్రయత్నించి తాను ఆహుతైపోతాడు. అక్కడున్న వారందరూ రాజేంద్ర త్యాగాన్ని కీర్తిస్తుంటే కమల మాత్రం మౌనంగా ఉండిపోతుంది. చివరికి అంటుంది: ‘అజ్ఞానం ఎప్పుడూ బలి కోరుతుంది’. ఎప్పటిలాగే ఆమె ఆలోచనాతీరు అందరికీ శేషప్రశ్నే అవుతుంది.

జీవితాదర్శం (చలం)
జీవితాదర్శం, శాంతి. దానికి అడ్డుగా ఉండే ఏ ఐశ్వర్యం గానీ, శృంగారం గానీ, మరేదైనా గానీ జీవితానికి చాలా విరోధం, అంటాడిందులో చలం. లాలస పాత్ర కడు రమణీయంగా వర్ణించబడింది. ఇందులోని మరో గొప్ప పాత్ర, దేశికాచారి. విడువలేని బంధం వద్దంటాడు. స్వేచ్ఛలో ఉన్న శాంతి, ప్రశాంతి మరెందులోనూ ఉండదనీ, దానికోసం ప్రయత్నిస్తూ సాగిపోవడమే జీవితమనీ ఈ నవల బోధిస్తుంది.

పాకుడురాళ్లు (రావూరి భరద్వాజ)
ఒక సాధారణ యువతి గొప్ప సినీనటిగా ఎదిగిన క్రమంలో ఆమె జీవనయానంలోని స్థితిగతులు అత్యంత కరుణ రసాత్మకంగా చిత్రీకరించబడ్డ  గ్రంథరాజం ఇది. జ్ఞానపీఠ అవార్డుకు నోచుకొని తెలుగు బావుటాను ఎగురవేసిన ఈ నవలలోని మంజరి పాత్ర ఉత్థాన పతనాలను చదువుతుంటే జీవితం పట్ల ఒక చిత్రమైన సానుభూతితో కూడిన అవగాహన ఏర్పడుతుంది. హర్ష విషాదాల నడుమ సాగిపోయే జీవన చిత్రం– చివరికి మిగిలేదేమీ లేదనే సత్యంతో పాటు పాఠకులను ఒక ద్వంద్వాతీత స్థితికి తీసుకువెడుతుంది. ‘ప్రేమించకబడకపోవడం కంటే దుఃఖం, దారిద్య్రం ఏముంది?’ అని మంజరి ప్రశ్నిస్తున్నట్లనిపిస్తుంది.

ఒక యోగి ఆత్మకథ (పరమహంస యోగానంద)
‘మనసుకు, ఆత్మకు ఉన్న కిటికీలను తెరిచే పుస్తకం’గా కీర్తింపబడిన ఈ పరమహంస యోగానంద ఆత్మకథ జిజ్ఞాసువులందరూ చదవాల్సిన ఆధ్యాత్మిక పరిమళాల గ్రంథం. చదవినకొద్దీ వశపరుచుకునే మహత్తర పుస్తకం. ఈ అసాధారణమైన కథ మనలో నిద్రాణమైవున్న జ్ఞానతృష్ణను మేలుకొల్పుతుంది.

మోరీతో మంగళవారాలు (మిచ్‌ ఆల్బం)
మిచ్‌ ఆల్బం ఆంగ్లరచన ట్యూజ్‌డేస్‌ విత్‌ మోరీకి ఇది తెలుగు అనువాదం. అనువాదకులు డాక్టర్‌ పద్మిని, ప్రొఫెసర్‌ నరసింహారావు. జీవించడం తెలియాలంటే మరణించడం ఎలాగో తెలియాలని తెలుసుకున్న మానవతావాది మోరీ. ఈ అద్భుత గురువుకు ఆత్మీయ విద్యార్థి మిచ్‌ ఆల్బం. గురువుతో అర్థవంతంగా పంచుకున్న మంగళవారాల గాథలను మిచ్‌ కరుణరసాత్మకంగా చిత్రించిన తీరు అమోఘం! ‘జీవితానికి అర్థం తెలుసుకోవడానికి మార్గం, ఇతరుల్ని ప్రేమించడానికి అంకితమవడం’ అనే వినూత్న సందేశాన్నిచ్చిన ఈ పుస్తకం మళ్లీ మళ్లీ చదివింపజేస్తుంది.

- అన్నంరాజు వేణుగోపాల శ్రీనివాసమూర్తి
9989792549

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top