అంబేడ్కర్‌ సవరణకే ‘ఎసరా’?

ABK Prasad Guest Column Article 16 (4) Of The Constitution Of India - Sakshi

రెండో మాట 

బడుగు, బలహీన వర్గాలకు అంబేడ్కర్‌ ఆదినుంచీ ఉద్యోగ సద్యోగాల్లో, విద్యాసంస్థల్లో, స్థానిక సంస్థల్లో సూత్రబద్ధమైన రిజర్వేషన్లు నిర్దేశించాన్నది తెలిసిన విషయమే. ఆ వర్గాల సముద్ధరణ పూర్తి స్థాయిలో జరిగే వరకూ రిజర్వేషన్లు కొనసాగాలన్నది ఆయన అభిమతం. అయితే ప్రస్తుత వ్యవస్థలో తనలాంటి దళిత వ్యతిరేకులు ఉన్నంత కాలం.. అంబేడ్కర్‌ లక్ష్యం నెరవేరదన్న నమ్మకం చంద్రబాబులో బలంగా ఉంది. కనుకనే సుప్రీంలో రిట్‌ ద్వారా రిజర్వేషన్ల శాతాన్ని 34 నుంచి 24 శాతానికి అంటే 10 శాతానికి తగ్గించేలా కుట్రపన్ని ‘సంతృప్తి’ చెందాడు. కానీ, వైఎస్సార్‌సీపీ పాలకులు ఆ తగ్గిన 10 శాతం రిజర్వేషన్లను తమ పార్టీ ద్వారానే నింపదలిచి, బీసీలకు అండగా నిలిచారు.

భారత రాజ్యాంగంలోని 16(4)వ నిబంధన కుల ప్రాతిపదికపైన వివక్షతో కూడుకు న్నది. అది ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యాసం స్థలలో వెనుకబడిన వర్గాల ప్రవేశం విష యంలో ప్రమోషన్ల విషయంలో వివక్షతో కూడిన నిబంధన. కాబట్టి ఆ నిబంధన చెల్లనేరదు. కనుక, కులం పేరుతో ఒక వ్యక్తిని వెలివేసే సమాజంలో దళిత బలహీన వర్గాలకు (ఎస్సీ, ఎస్టీ, బీసీ) రిజర్వేషన్ల కల్పన ఆచరణలో అసాధ్యం. కాబట్టి సమాజంలో బడుగు, బలహీన వర్గాల వారి సంక్షేమాన్ని కాపాడటానికి ప్రభుత్వం సాధ్యమైన చర్యల న్నింటినీ తీసుకోవాలి. ఆదేశిక సూత్రాలలోని 46వ నిబంధనను ప్రభుత్వం తప్పక పాటించాల్సిన విధిగా రాజ్యాంగం నిర్దేశించింది.

బడుగు, బలహీనవర్గాలంటే నా ఉద్దేశం.. తమ కాళ్లపై తాము నిలబడ లేని స్థితిలో ఉన్నవారనే, ఈ విషయంలో ఆదేశిక సూత్రాలలోని 46వ నిబంధన లక్ష్యాన్ని నెరవేర్చేదాకా ప్రభుత్వమూ, దేశ పార్లమెంటూ విశ్రమించరాదు, ఇవి తమ బాధ్యతను పూర్తిగా నిర్వర్తించి తీరాలి. ఈ ఆశయం నెరవేరేదాకా ఆదేశసూత్రాల్లోని 29వ రాజ్యాంగ నిబంధన (క్లాజ్‌ 2), 16వ రాజ్యాంగ నిబంధన (క్లాజు 4) ప్రకారం బడుగు, బల హీనవర్గాల అభివృద్ధికి ఆటకం కలుగుతూనే ఉంటుంది కాబట్టే ఎస్సీ, ఎస్టీ తదితర వెనుకబడిన (ఓబీసీ) వర్గాలకు అనుకూలంగా 15వ రాజ్యాంగ నిబంధనను సవరించి ప్రత్యేకంగా 5వ క్లాజును భారత రాజ్యాంగంలో చేర్చవలసివచ్చింది. ఈ కొత్త క్లాజు ప్రకారం పార్ల మెంటు, రాష్ట్రాల శాసనవేదికలు తమకు అనుకూలమైన చట్టాలు చేసుకోవచ్చు.
– రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రైటింగ్స్‌ అండ్‌ స్పీచెస్‌.

ప్రభుత్వ ఉద్యోగాలలో, విద్యాసంస్థలలో బడుగు బలహీన వర్గాలకు పూర్తి న్యాయం జరిగే వరకూ ఒక్క పార్లమెంటుకే కాదు. రాష్ట్రాల శాసనవేదికలకు కూడా, తమకు అనుకూలమైన చట్టాలు చేసుకునే హక్కు ఉందని రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌.. నిర్దేశించి, శాసించారు. కానీ ఆ రాజ్యాంగపరమైన బాధ్యతలనుంచి తప్పుకుని అష్టావక్ర మార్గాలకు మళ్లి అడుగు ఊడిన తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్ర బాబు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్ని కలలో రిజర్వేషన్ల ప్రాతిపదికపై జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న అభ్యు దయకర విధానాన్ని అడ్డుకోజూస్తున్నారు. కానీ కనీస సంక్షేమ పాలనా విధానాలు కూడా అలర్జీగా భావిస్తున్న బాబు, అతని పార్టీ. ఇటీవల రాష్ట్ర శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో పొందిన అవమానకరమైన ఓటమి నుంచి కూడా గుణపాఠం నేర్చుకునే దశలో లేరు. 

శ్రీకృష్ణదేవరాయల పాలన గురించి ఒక ప్రశస్తి ఉంది. రైతాంగ శ్రేయస్సుకు కాడీ, మేడికి అంకితమై ప్రజాసేవలో శ్రమ జీవనాన్ని  శ్లాఘించి, నమస్కరించిన రాయలు... పాలకుడైన వాడు చేతలలోనే కాదు, తన గుండెల్లో సహితం ప్రజల అభివృద్ధిని సదా కాంక్షించాలని కోరుకున్నవాడు. కానీ సమాజాభ్యున్నతికి ఏ శ్రమశక్తి దోహదపడు తుందో ఆ వర్గాల  (బడుగు, బలహీన వర్గాలే జనాభాలో హెచ్చు మంది) మౌలిక జీవన ప్రమాణాలను పెంచేందుకు దోహదకారి కాగల ఉపాధి, ఉద్యోగ సదుపాయాలను రిజర్వేషన్ల ద్వారా, ప్రమోషన్ల ద్వారా కల్పించేందుకు జరిగే కృషిని అడ్డుకోజూస్తే పరిణామం ఎలా ఉంటుందో జగన్‌ నిరూపించారు. జనరల్‌ ఎన్నికల్లో గోళ్లు ఊడి, ముఖాలు కందగడ్డలై చేసేది లేక దింపుడు కళ్లెం ఆశతో చంద్రబాబు, అతని పాలనలో లాభించిన కొందరు వందిమాగధులు తప్ప బుద్ధి ఉన్న వాళ్లెవరూ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు మోకాలడ్డలేరు. 

రాష్ట్రంలో మూడు రకాల స్థానిక సంస్థలకు (జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలు+గ్రామ పంచాయతీలు) ఎన్నికల సంరంభం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కొద్ది రోజుల క్రితం టీడీపీ నాయ కత్వం హీన రాజకీయాలకు తెరలేపి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాల రిజర్వేషన్లకు మోకాలడ్డుతూ రాష్ట్ర హైకో ర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేయించింది.. దాన్ని రాష్ట్ర గౌరవ న్యాయ స్థానం కొట్టివేయగా.. తనకు తెలిసిన పాత కుట్రలో భాగంగానే సుప్రీంకోర్టుకు బాబు వర్గం ఎగబాకింది. ఈ ‘ఎగబాకుడు’ ఇవాల్టి కొత్త ‘విద్య’ కాదు, గత పాలనలో చంద్రబాబు అన్యమార్గాల ద్వారా ఉమ్మడి రాష్ట్ర హెకోర్టును ఉపయోగించుకున్న అలవాటుతోనే ఇప్పుడు సుప్రీంకోర్టుకూ ఎగబాకారు. దేశ అత్యున్నత న్యాయస్థానంగా మనం భావించి ఆదరించుకునే సుప్రీంకోర్టు ప్రస్తుత అనిశ్చిత పరిణామాల దృష్ట్యా, ఎప్పుడు, ఏ నిర్ణయం ప్రకటిస్తుందో తెలియని అనూహ్యమైన దశలో ఉన్నాం. అలాంటి ఏ కారణం వల్లోకానీ ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను సుమారు 60 శాతం వరకు కల్పించాలన్న నిర్ణయానికి అవరోధం ఏర్పడింది.

అయితే 2019 ఎన్నికల్లో బలహీనపడిపోయి ‘డీలా’ అయిపో యిన బాబు వర్గం ‘సుప్రీం’ను కదపడంలో ఒక ఆశ ఉండి ఉంటుంది. బడుగు, బలహీన వర్గాలకు ఆదినుంచీ ఉద్యోగ సద్యోగాల్లో, విద్యా సంస్థల్లో, స్థానిక సంస్థల్లో నిర్దేశిస్తున్న సూత్రబద్ధమైన రిజర్వేషన్లను అంబేడ్కర్‌ కల్పించారు. ఆ వర్గాల సముద్ధరణ పూర్తి స్థాయిలో జరిగే వరకూ రిజర్వేషన్లు కొనసాగాలన్న నాటి లక్ష్యం.. ప్రస్తుత వ్యవస్థలో తనలాంటి సమసమాజ వ్యతిరేకులు ఉన్నంత కాలం నెరవేరదన్న నమ్మకం బాబులో బలంగా ఉంది. కనుకనే చంద్రబాబు వర్గం హీన మనస్తత్వంవల్ల సుప్రీంలో రిట్‌ ద్వారా రిజర్వేషన్ల శాతాన్ని 34 నుంచి 24 శాతానికి అంటే 10 శాతానికి కుదించివేసి మరీ  ‘సంతృప్తి’ చెందింది.. కానీ ‘తలదన్నేవాడి తాడిని తన్నేవాళ్లు’ ఎప్పుడూ సిద్ధం గానే ఉంటారన్న ఇంగితం కూడా బాబు వర్గానికి లేకపోయింది. బాబు పన్నాగాన్ని పసికట్టిన వైఎస్సార్‌సీపీ పాలకులు ఆ తగ్గిన 10 శాతం రిజర్వేషన్లను తమ పార్టీ ద్వారానే నింపడానికి నిర్ణయించి ప్రతి సవాలు విసిరారు.

తగ్గిన సీట్లను పార్టీ పరంగా భర్తీ చేసి 34 శాతం జనరల్‌ స్థానాల్లో బీసీ అభ్యర్థులను నిలపాలని నిర్ణయించారు. మొత్తంమీద చూస్తే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ, కోల్పోయినప్పుడూ చేస్తూ వచ్చిన పని–బీసీ రిజర్వేషన్లు పూర్తి కాకుండా జాగ్రత్తపడుతూ రావడమే. సుప్రీం నిర్ణయాన్ని అడ్డుపెట్టు కున్న బాబు గమనించాల్సిన కీలకమైన అంశాన్ని మాత్రం ఎవరూ మరచిపోరాదు. ఎందుకంటే సుప్రీం నిర్ణయాల్లో కూడా తరచూ మనం చూసే తీర్పులు కొన్ని పరస్పరం విరుద్ధంగా ఉంటున్నాయి. ‘సుప్రీం’ లోనే కాదు, తీర్పులిచ్చే వివిధ ‘బెంచ్‌’ తీర్పులు కూడా పరస్పరం విరుద్ధంగా ఉంటున్నాయి. ఉదాహరణకు రాష్ట్రంలో వైఎస్‌ మరణా  నంతరం కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు బడుగు, బలహీన వర్గాల రిజర్వేషన్లకు అనుకూలంగా రాష్ట్ర హైకోర్టు తీర్పు ఇవ్వగా, దాన్ని వేరే డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసింది. 

రాజ్యాంగ ఆదేశిక సూత్రాలలో అంతర్భాగంగా నమోదైన 46వ నిబంధన.. రిజర్వేషన్లను అమలు జరిపే బాధ్యతను పార్లమెంటుకూ, రాష్ట్ర శాసనసభలకూ అప్పగించింది. బహుశా ఈ నిర్దేశాన్ని ఉల్లంఘిం  చడాన్ని దృష్టిలో పెట్టుకునే జేఎన్‌యూ రాజకీయ శాస్త్రాచార్యుడు ప్రొఫెసర్‌ నరేంద్ర కుమార్‌ ‘సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు అంబేడ్కర్‌ ప్రతిపాదించగా సభ ఆమోదించిన తొలి రాజ్యాంగ సవరణ (రిజ ర్వేషన్ల నిబంధన)కే విరుద్ధమని’ శఠించాల్సి వచ్చింది. బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్‌ పౌరుల స్థాయిలో ‘ఒక హక్కు’ కాకపోయినా.. బలహీన వర్గాలకు ఉద్యోగ సద్యోగాలలో, ఎన్నికలలో తగినంత ప్రాతినిధ్యాన్ని నికరం చేయడం ప్రభుత్వ బాధ్యత అనీ, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సానుకూలంగా నిర్ణయించే అధికారం ఉందనీ గతంలోనే తీర్పులున్న విషయం మరవరాదు (అజిత్‌ సింగ్‌ వర్సెస్‌ పంజాబ్‌ స్టేట్, సి.ఎ. రాజేంద్రన్‌ వర్సెస్‌ కేంద్ర ప్రభుత్వం). 

మనం తరచుగా గాంధీజీ ‘గ్రామ స్వరాజ్యం’ గురించి మాట్లాడు  కుంటున్నాం, ఆ గ్రామ స్వరాజ్య సాధన ఆశయంగా మహోన్నతమైనదే. కానీ భూస్వామ్య వ్యవస్థ బంధాలు పూర్తిగా గ్రామసీమల్లో తొలగకుండానే, పెట్టుబడిదారీ వ్యవస్థా బంధాలు బలంగా నెల కొంటున్న మన సమాజంలో.. ‘గ్రామ స్వరాజ్యం’ బలమైన వ్యవస్థగా పాతుకుపోవడం కష్టసాధ్యమని కూడా మరచిపోరాదు. బహుశా ఈ కారణం చేతనే డాక్టర్‌ అంబేడ్కర్, భూస్వామ్య వ్యవస్థా బంధాలు కూలంకషంగా తొలగకుండా గ్రామ స్వరాజ్యమనే మహత్తర ఆశయం నెరవేరడం కష్టసాధ్యమన్న వేదనను వెలిబుచ్చాల్సి వచ్చింది. ‘ఎవ రైనా ఎస్సీ, ఎస్టీలలో పుట్టాలని కోరుకుంటారా?’ అన్న అహంకారాన్ని చంద్రబాబు ప్రదర్శించడమే ఇందుకు సరైన ఉదాహరణ. మన గ్రామ సేవల్లో ఈనాటికీ, వెలివాడల్లోనూ, మలివాడల్లోనూ ఈ జాడ్యం ఈ క్షణం దాకా తొలగిపోవడం లేదని, ఇందుకు కారణం కుల, మత, వర్గ, లింగ వ్యత్యాస ధోరణులు సమూలంగా తొలగక పోవడమేనని  బేష రతుగా మనసుల్లో ఎలాంటి ‘రిజర్వేషన్లు’ లేకుండా ఒప్పేసుకోవడం లోనే విజ్ఞత ఉంటుంది. నేటి పెక్కుమంది పాలకులూ, న్యాయ మూర్తులూ, న్యాయవాదులూ, న్యాయస్థానాలూ ఈ ‘మాలోకాని’కి అతీతులు కారు!

ఏబీకే ప్రసాద్‌
సీనియర్‌ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top