క్రికెట్‌ క్రీడపై కుహనా దేశభక్తి క్రీనీడ

Aakar Patel write article on cricketer Sreesanth issue

అవలోకనం
ప్రియాంకా చోప్రా హాలీవుడ్‌కు వెళ్లిపోవాలనుకుంటే దాన్ని దేశద్రోహంగా చూడం. మన క్రికెటర్ల విషయంలో ఇది ఎందుకు భిన్నంగా ఉండాలి? ఒక ప్రైవేట్‌ సంస్థ అయిన బీసీసీఐకి తన తరఫున ఎవరు ఆడాలో, ఆడరాదో నిర్ణయించే హక్కు ఉంది. కానీ, శ్రీశాంత్‌ తన వృత్తి విషయంలో, క్రీడా నైపుణ్యం విషయంలో ఏమి చేయాలో చెప్పే హక్కు మనకు ఎవరికీ లేదు.

ముప్పయ్యేళ్ల క్రితం క్లయివ్‌ లాయిడ్‌ నేతృత్వంలోని వెస్ట్‌ ఇండీస్‌ క్రికెట్‌ జట్టు ప్రాబల్యం క్షీణించడం ప్రారంభించింది. దీంతో అలన్‌ బోర్డర్‌ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ప్రపంచంలోకెల్లా బలమైన జట్టుగా మారింది. ఆస్ట్రేలియా జట్టులో చాలా మంది ఎడమ చేతి ఆటగాళ్లు ఉండేవారు. అలన్‌ బోర్డర్, ఓపెనింగ్‌ బ్యాట్స్‌మేన్‌ కెప్లర్‌ వెసల్‌ కూడా ఆ బాపతే. నిజానికి కెప్లర్‌ దక్షిణ ఆఫ్రికా దేశస్తుడు. దక్షిణ ఆఫ్రికా జాతి వివక్షను పాటిస్తూ నల్ల జాతీయులకు, ఆసియా సంతతి, మిశ్రమ జాతుల వారికి ఓటింగ్‌ హక్కును నిరాకరించింది. దీంతో ప్రపంచ క్రికెట్, ఆ దేశంతో క్రీడా సంబంధాలపై నిషేధం విధించింది. అందువల్ల సొంత దేశం తరఫున ఆడలేని కెప్లర్‌ తన జాతీయతను మార్చుకున్నాడు. ఆ తర్వాత కొన్నేళ్లకు జింబాబ్వే దేశస్తుడైన గ్రేమ్‌ హిక్‌ ఇంగ్లండు జట్టు తరఫున ఆడాడు.

ఆస్ట్రేలియా జట్టులో ఆడాలని నిర్ణయించుకున్న దక్షిణ ఆఫ్రికా క్రీడాకారులలో కెవిన్‌ పీటర్సన్‌ కూడా ఒకడు. లూక్‌ రోంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు రెండింటి తరఫునా ఆడాడు. ఇయాన్‌ మోర్గాన్‌ కూడా ఐర్లాండ్, ఇంగ్లండ్‌ జట్లు రెండింటిలోనూ ఆడాడు. ఇతర దేశాలకు చెందిన ఈ వ్యక్తులు తమ జట్లలో చేరి ఆడటం పట్ల ఈ దేశాలకు ఎలాంటి అభ్యంతరాలు లేవనేది స్పష్టమే. అలాగే తమ మాతృ దేశం తమను కోరుకోవడం లేదని లేదా అవసరం లేదనుకుంటోందని భావించిన పౌరులు మరో దేశానికి వెళ్లి క్రికెట్‌ ఆడాలని కోరుకోవడంలో ఆయా దేశాలకు సైతం ఎలాంటి అభ్యంతరాలూ లేవనేది కూడా స్పష్టమే.

ఈ వారం, భారత మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ ఎస్‌ శ్రీశాంత్, బీసీసీఐకి తను అక్కర్లేకపోతే మరే ఇతర దేశం తరఫునైనా ఆడతానని అన్నాడు. శ్రీశాంత్‌ విషయంలో ఇచ్చిన మునుపటి ఆదేశాలను ఒక న్యాయస్థానం కొట్టివేసి, అతనికి క్రికెట్‌ ఆడే హక్కు లేదని చెప్పింది. ఆ తర్వాతనే శ్రీశాంత్‌ ఈ మాట అన్నారు. 2013 ఐపీఎల్‌ సీజన్‌లో శ్రీశాంత్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో అతన్ని క్రికెట్‌ నుంచి నిషేధించారు. అప్పుడు అతని వయసు 29 ఏళ్లు. ఒక్కో బంతిపై పందెం కాయడాన్ని స్పాట్‌ ఫిక్సింగ్‌ అంటారు. ఫలానా బంతికి ఒక బౌలర్‌ వికెట్‌ తీసుకుంటాడని లేదా నో బాల్‌ వేస్తాడని లేదా బాట్స్‌మేన్‌ బౌండరీ కొడతాడని పందెం కాయమని బుకీలు పిలుస్తారు.

బుకీ, బౌలర్‌తో లాలూచీ పడగలిగితే అతను ఏదైనా ఒక బంతిని ఎలా బౌల్‌ చేస్తాడనే విషయంపై ముందుగానే అంచనాకు రాగలుగుతాడు. గెలుపు లేదా ఓటమి అంటూ పందేలు కాసి విసిగిపోయి, ఏదైనా మరింత ఉద్విగ్నభరితమైనదాని కోసం ఎదురుచూసే వారికి (మన దేశంలో అలాంటి వారు చాలావరకు గుజరాతీలే) ఆ బుకీలు స్పాట్‌ బెట్టింగ్‌ అవకాశాన్ని కల్పిస్తారు. బుకీకి, క్రీడాకారులకు మధ్య లాలూచీ ఉన్నా ఇలాంటి పందేలలో హస్తలాఘవాన్ని ప్రదర్శించడం తేలికేం కాదు. కొన్నేళ్ల క్రితం కొందరు పాకిస్తానీ క్రికెటర్లు ఇలా చేస్తూ బ్రిటిష్‌ మీడియాకు దొరికిపోయారు. శ్రీశాంత్‌ పై వచ్చిన ఆరోపణలు కూడా అ కాలం నాటివే. అతనిపై నిషేధం విధించినా, న్యాయస్థానం ఆ ఆరోపణలను కొట్టేసింది.

గత నాలుగేళ్లుగా అతను క్రికెట్‌ ఆడలేకపోయాడు. దీంతో శ్రీశాంత్‌ ఎంతగా అసంతృప్తితో ఉన్నాడంటే, తాజా కోర్టు ఆదేశాల తర్వాత ‘‘నిషేధం విధించినది బీసీసీఐ తప్ప ఐసీసీ కాదు. భారత జట్టు తరఫున కాకపోతే నేను మరే దేశం తరఫునైనా ఆడవచ్చు. నాకు ఇప్పుడు 34 ఏళ్లు. మహా అయితే మరో ఆరేళ్లు మాత్రమే ఆడగలను. క్రికెట్‌ ప్రేమికునిగా నేను క్రికెట్‌ ఆడాలని కోరుకుంటున్నా. అంతేకాదు, బీసీసీఐ ఒక ప్రైవేటు సంస్థ. దాని జట్టును భారత్‌ క్రికెట్‌ జట్టు అంటున్నది మనమే. అయినా అది ఒక ప్రైవేటు సంస్థ మాత్రమేనని మీకు తెలుసు.’’

అతని దృక్కోణం ఏమిటో సులువుగానే తెలుస్తోంది. తన జీవితాన్నంతటినీ పెట్టుబడిగా పెట్టిన క్రీడలో అతన్ని భారత్‌లో ఆడనివ్వడం లేదు. అలాంటప్పుడు మరో దేశం తరఫున ఎందుకు ఆడకూడదు? అతను ఆ పని చేయడం పూర్తిగా సరైనదేనని నాకు అనిపిస్తోంది. దీని వల్ల తలెత్తే జాతీయతను మార్చుకోవడం వంటి ఆచరణాత్మక సమస్యలను పక్కన పెట్టండి. ఒక భారతీయుడు మరో దేశస్తుడు కావడం కంటే ఒక దక్షిణ అఫ్రికా దేశీయుడు ఆస్ట్రేలియా పౌరుడు కావడం చాలా తేలిక. ఏది ఏమైనా శ్రీశాంత్‌ విదేశాల్లో తాను ఆడేది టీ–20 క్రికెట్‌ మాత్రమేనని సూచించాడు.

అతని నిర్ణయం ఏదైనా కానివ్వండి, సొంత దేశం వద్దంటున్నా, దాని పట్ల విధేయతను ప్రదర్శించి మరో దేశం తరఫున ఆడవద్దని అతన్ని కోరడం అన్యాయం అంటాను. క్రికెట్‌ క్రీడను ఇంత తీవ్రంగా పట్టించుకునేది మన భారతీయులం మాత్రమే. మనం బోలెడంత జాతీయవాదాన్ని ఆ క్రీడలో పెట్టుబడిగా పెట్టాం. బీసీసీఐ జట్టు, పాకిస్తాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నియంత్రణలోని జట్టును ఓడిస్తే ‘‘పాకిస్తాన్‌’’ను ‘‘భారత్‌’’ ఓడించినట్టు లెక్క. క్రికెట్‌ క్రీడలోని గెలుపు, ఓటముల విషయంలో వ్యక్తమయ్యే మన ఉద్వేగాలు ప్రబలమైనవి. జనాదరణ గల మన మరే సాంస్కృతిక రూపంలోనూ అంత బలంగా ఉద్వేగాలు వ్యక్తం కావడం కనిపించదు.

ప్రియాంకా చోప్రా లాంటి హీరో లేదా హీరోయిన్‌ బాలివుడ్‌ను వదిలేసి హాలీవుడ్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటే.. ఆమె చర్యలను మనం దేశద్రోహంగా చూడం. పైగా భారతీయులలో ఒకరు హాలీవుడ్‌లో విజయాలను సాధిం చడం గొప్పని భావిస్తాం. ఇది మన క్రికెటర్ల విషయంలో మాత్రం ఎందుకు భిన్నంగా ఉండాలి? దీన్ని అర్థం చేసుకోవడం తేలికేం కాదు. ఈ విషయంలో ఎవరైనాగానీ శ్రీశాంత్‌ పట్ల సానుభూతిని చూపవచ్చు. ఒక ప్రైవేట్‌ సంస్థ అయిన బీసీసీఐకి తన తరఫున ఎవరు ఆడాలి లేదా ఎవరు ఆడరాదు అని నిర్ణయించే హక్కు పూర్తిగా ఉంది. ఆ సంస్థ ప్రపంచంలోనే అత్యంత అవినీతిగ్రస్తమైన క్రీడా సంస్థ అనే విషయాన్ని ఇప్పటికి పక్కన పెడదాం. శ్రీశాంత్‌ తన వృత్తి విషయంలో, క్రీడా నైపుణ్యం విషయంలో ఏమి చేయాలో చెప్పే హక్కు మనలో ఎవరికీ లేదు. అతను మన బూటకపు క్రికెట్‌ దేశభక్తి జ్యోతిని ఎత్తిపట్టాలని ఆశించడం అల్పత్వం, బాల్య చాపల్యం.

- ఆకార్‌ పటేల్‌
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత‘  aakar.patel@icloud.com

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top