ఆ సమయంలో వాంతులు?

There are many changes in hormones during monthly - Sakshi

నాకు నెలసరి సమయంలో బాగా వాంతులు అవుతున్నాయి. ఎన్ని మందులు వాడినా ఫలితం ఉండడం లేదు. వైద్యం మీద అవగాహన ఉన్న నా ఫ్రెండ్‌  ‘స్పాస్మోడిక్‌ డిస్మెనోరయా’ అని చెబుతోంది. ఇది నిజమేనా? దీని గురించి వివరంగా తెలియజేయగలరు.
– జి.ప్రీతి, ఖమ్మం

నెలసరి సమయంలో హార్మోన్లలో అనేక మార్పులు జరుగుతాయి. ఇందులో ప్రొస్టాగ్లాండిన్స్‌ అనేవి కీలకం. ఇవి కొందరిలో మాములుగా విడుదల అవుతాయి. కొందరిలో ఎక్కువగా విడుదల అవుతాయి. ఇవి గర్భాశయం పైన చూపే ప్రభావం వల్ల, అది బాగా ముడుచుకున్నట్లయ్యి బ్లీడింగ్‌ బయటకు వస్తుంది. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, అది విడుదలయ్యే మోతాదును బట్టి  ఈ సమయంలో పొత్తికడుపులో నొప్పి తీవ్రత ఉంటుంది. కొందరిలో నొప్పి కొద్దిగా, కొందరిలో బాగా ఎక్కువగా, కొందరిలో ఏమీ ఉండదు. ఇలా నెలసరి సమయంలో మెలిపెట్టినట్లు ఉండే పొత్తికడుపు నొప్పినే ‘స్పాస్మోడిక్‌ డిస్మెనోరియా’ అంటారు. గర్భాశయంలో ఏ సమస్యా లేకపోయినా కూడా ప్రొస్టాగ్లాండిన్స్‌ ప్రభావం వల్ల ఈ నొప్పి కొందరిలో 1–3 రోజులు ఉండి తగ్గిపోతుంది. ఇది మామూలే. దీనికి నొప్పి మరీ ఎక్కువగా ఉంటే ఆ రోజులలో నొప్పి నివారణ మాత్రలు వాడుకోవచ్చు.

మరి కొందరిలో గర్భాశయంలో ఫైభ్రాయిడ్స్, అడినోమియోసిస్, ఎండోమెట్రియోసిస్‌ వంటి ఇతర సమస్యల వల్ల కూడా నొప్పి బాగా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ప్రొస్టాగ్లాండిన్స్‌ కండరాలను కుంచింప చేస్తాయి. నెలసరి సమయంలో విడుదలయ్యే ప్రోస్టాగ్లాండిన్స్‌ గర్భాశయ కండరాలపైనే కాకుండా, మిగతా బాగంలో ఉన్న కొన్ని కండరాలపైన, అవయవాలపైన ప్రభావం చూపడం వల్ల, కొందరిలో ఈ సమయంలో వికారం, వాంతులు, తలనొప్పి వంటి దుష్ప్రభావాలు ఉంటాయి. దీనికి ఈ సమయంలో రానిటిడిన్, ఓన్‌డన్‌సెట్రాన్‌ వంటి మాత్రలు వాడి చూడవచ్చు.అలాగే మెడిటేషన్, యోగా వంటి వ్యాయామాలతో కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి తగిన సలహా తీసుకోవడం మంచిది.

మా బంధువులలో ఇద్దరు ముగ్గురు అండాశయాలలో నీటిబుడగల సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇవి రావడం ప్రమాదమా? నివారణ చర్యలు ఏమిటి? అండాశయాలలో నీడిబుడగలు ఏర్పడడం అనేది జన్యుపరమైన సమస్యల వల్ల వస్తుందా? తీసుకునే ఆహారం లేక ఇతర కారణాల వల్ల వస్తుందా? తెలియజేయగలరు.
– కె.రాధిక, రాజమండ్రి

అండాశయాలలో నీటిబుడగల సమస్యను పాలిసిస్టిక్‌ ఓవరీస్‌ అంటారు. ఇవి హార్మోన్లలో అసమతుల్యత, అధికబరువు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారణాలు వంటి ఇంకా తెలియని ఎన్నో కారణాల వల్ల ఏర్పడడవచ్చు. కొందరిలో జన్యుపరమైన కారణాల వల్ల, సన్నగా ఉన్నవారిలో కూడా నీటిబుడగల సమస్య ఏర్పడవచ్చు. సాధారణంగా గర్భాశయం ఇరువైపుల ఉంటే అండాశయాలలో పరిపక్వత చెందని అండాలు ఉంటాయి. పీసీవో ఉన్నవారిలో పరిపక్వత చెందని అండాలు చాలా ఎక్కువగా ఏర్పడి, స్కానింగ్‌లో చిన్నచిన్న నీటిబుడగలలాగా కనిపిస్తుంటాయి.మగవారిలోఎక్కువగా ఉండే టెస్టోస్టిరాన్‌ అనే ఆండ్రోజెన్‌ హార్మోన్, పీసీవో ఉన్న ఆడవారిలో ఎక్కువగా విడుదల అవుతుంది.ఇవి ఎక్కువగా ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ వల్ల ఏర్పడతాయి. కొందరిలో అధిక బరువు వల్ల, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ ఏర్పడి పీసీవో రావచ్చు.

వీటి వల్ల పీరియడ్స్‌ సక్రమంగా రాకపోవడం, మొటిమలు, అవాంఛిత రోమాలు, మెడచుట్టూ నల్లగా ఏర్పడటం, సాధారణంగా గర్భం దాల్చటంలో ఇబ్బందులు, అబార్షన్లు, గర్భంతో ఉన్నప్పుడు మధుమేహం రావటం, తర్వాత కాలంలో షుగర్, బీపీ, గుండె సమస్యలు వంటివి ఏర్పడే అవకాశాలు ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, హార్మోన్ల అసమతుల్యత తీవ్రతను బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఉండవచ్చు.వీటి చికిత్సలో భాగంగా మందులతో పాటు, జీవనశైలిలో మార్పులు, ఆహారంలో మార్పులు, బరువు తగ్గటం సక్రమంగా వ్యాయమాలు చెయ్యటం తప్పనిసరి. చాలామందికి కేవలం జీవనశైలిలో మార్పులతో కూడా ఇవి అదుపులో ఉంటాయి.

వీటిని పూర్తిగా నివారించలేము. కానీ, వాటివల్ల వచ్చే సమస్యలను, చికిత్సలు, పైన చెప్పిన జాగ్రత్తలలో కొంతవరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు. చికిత్సలో భాగంగా సమస్యను బట్టి ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ తగ్గించడానికి మెట్‌ఫార్మిన్‌ మాత్రలు, ఓరల్‌ కాంట్రాసెప్టివ్స్, యాంటీ ఆండ్రోజన్స్‌ వంటి అనేక మందులను ఇవ్వడం జరుగుతుంది. గర్భం కోసం ఇచ్చే చికిత్సలో మందులతో గర్భం రానప్పుడు, ల్యాపరోస్కోపీ ద్వారా కొన్ని నీటిబుడగలను తీసి, మందులతో మరలా చికిత్స చేయడం జరుగుతుంది. పీసీవో సమస్యను పూర్తిగా తొలగించడం చాలా కష్టం. వీటి మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. చికిత్స, మందులూ, అవి ఇంకా పెరగకుండా హార్మోన్లను అదుపులో ఉంచడానికి మాత్రమే పనికి వస్తాయి.

ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్‌ రాకుండా ఉండడానికి ఫిష్‌ ఆయిల్‌ సప్లిమెంట్లు తీసుకోమని చెబుతుంటారు. ఇవి మెడికల్‌షాప్‌లలో అమ్ముతారా? మాత్రల రూపంలో ఉంటాయా? ఎంత మోతాదులో తీసుకోవాలి? మాత్రాల రూపంలో కాకుండా తినే ఆహారంతో సమకూరాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి తెలియజేయగలరు.
– ఆర్‌.దేవిక, శ్రీకాకుళం

ఫిష్‌ ఆయిల్‌లో ఛీజ్చి వంటి ఒమేగా 3 ఫ్యాటీయాసిడ్స్‌ ఉంటాయి. ఇవి ఎక్కువగా చేప శరీరం నుంచి చేసినవి ఉండాలి. అవి చేప లివర్‌ నుంచి తీసినవి ఉండకూడదు. వీటిలో విటమిన్‌–ఎ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల అది శిశువుపైన దుష్ప్రభావాలు చూపే అవకాశాలు ఉంటాయి.ఫిష్‌ ఆయిల్‌లోకి ఛీజ్చి వల్ల గర్భిణీలలో బీపీ పెరగటం, నెలలు నిండకుండా కాన్పులు అవ్వడం వంటివి తగ్గవచ్చు అనేది విశ్లేషకుల అంచనా. ఛీజ్చి కడుపులోని శిశువు నాడీవ్యవస్థ పనితీరుకు, కళ్ళ పనితీరు సక్రమంగా ఉండేటట్లు చేస్తాయి. ఇవి ఛీజ్చి 300  ఉండే మందుల షాపులలో దొరికే ఫిష్‌ ఆయిల్‌ క్యాప్సూల్స్‌. రోజుకొకటి చొప్పున తొమ్మిది నెలలు, కాన్పు తర్వాత 3 నెలల వరకు వాడవచ్చు. చేపలు తినేవారికి ఈ క్యాప్సూల్స్‌ అవసరం లేదు. వారానికి రెండు మూడుసార్లు చేపలు ఆహారంలో తీసుకుంటే చాలు. ఛీజ్చి ఎక్కువగా చేపలు, రొయ్యలు వంటి సముద్రపు ఆహారంలో దొరుకుతుంది. అవిసెగింజలు, వాల్‌నట్స్‌ వంటి వాటిలో దొరుకుతుంది. మాంసాహారం తీసుకోని వారిలో ఆల్గేతో తయారుచేసే వెజిటేరియన్‌ క్యాప్సూల్స్‌ తీసుకోవచ్చు. ఇవి కూడా ఫిష్‌ ఆయిల్‌ క్యాప్సూల్స్‌ అంత ఎఫెక్టివ్‌గా ఉంటాయి.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో హైదర్‌నగర్‌ హైదరాబాద్‌
 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top