
మూడో అడుగు!
బలి చక్రవర్తి ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుడి కొడుకు. మహాబలవంతుడు. జన్మరీత్యా రాక్షసుడైనప్పటికీ సత్యం,
బలి చక్రవర్తి ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుడి కొడుకు. మహాబలవంతుడు. జన్మరీత్యా రాక్షసుడైనప్పటికీ సత్యం, దానం, ధర్మం అనే గుణాల వల్ల సత్ప్రవర్తనతో మహాదాతగా, గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు. అయితే రాక్షస సహజమైన ప్రవృత్తి వల్ల తన సవతి సోదరులైన దేవతలపై దండెత్తి, వారిని జయించి, నిర్దయగా వారిని వెళ్లగొట్టి, వారి రాజ్యాలను ఆక్రమించుకుని అందరినీ తన చెప్పుచేతల్లో ఉంచుకున్నాడు. అంతటితో తృప్తి పడక ఇంద్రపదవిమీద కన్నేశాడు. ఇంద్రపదవి కావాలంటే బలపరాక్రమాలతోపాటు యజ్ఞయాగాదులు కూడా చేయాలని, నూరు అశ్వమేధయాగాలు చేస్తే ఇంద్రపదవి లభిస్తుందని రాక్షసుల గురువైన శుక్రాచార్యులవారి సూచన మేరకు 99 అశ్వమేధయాగాలు చేశాడు. మరొక్క మారు అశ్వమేధం చేస్తే చాలు ఇంద్రపదవి బలిచక్రవర్తి వశమౌతుంది. దాంతో ఇంద్రుడికి భయం పట్టుకుంది. బలిచక్రవర్తి ఒక్కడూ మంచివాడు కావచ్చు కానీ మిగిలిన రాక్షసులు అలా కాదు కదా, తమ రాజు అండ చూసుకుని లోకాలన్నింటినీ నానాయాతనలకు గురి చేస్తారు కదా, మరి అప్పుడేం చేయాలి? అనుకుంటూ దుష్టశిక్షకుడు, శిష్టరక్షకుడు అయిన విష్ణుమూర్తిని ఆశ్రయించాడు ఇంద్రుడు.
విష్ణువు ఇంద్రుడికి అభయమిచ్చాడు. దీనికితోడు రాక్షసుల చేతిలో పరాజితులైన దేవతల తల్లి అదితి తన కుమారుల దీనస్థితికి తల్లడిల్లి, భర్త అయిన కశ్యపునితో మొరపెట్టుకుంది. కశ్యపుడు ఆమెకో దివ్యవ్రతాన్ని చెప్పి ఆచరింపజేశాడు. ఆ వ్రత ఫలితంగా సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే ఆమె కడుపున వామనుడై పుట్టాడు. బలి చక్రవర్తి నూరో అశ్వమేధయాగం చేస్తున్న సమయానికి ఆ యాగానికి వెళ్లాడు. బ్రహ్మతేజస్సుతో ముచ్చటగొలుపుతున్న ఆ బాల వటువును చూసిన బలిచక్రవర్తి ఏమికావాలో కోరుకోమన్నాడు.
మూడంటే మూడడుగుల చోటు కావాలన్నాడు వటువు. అతను అంత అల్పమైన చిత్రమైన కోరిక కోరినందుకు అబ్బురపడ్డ బలి చక్రవర్తి మరేదైనా కోరుకోమన్నాడు. తనకు మూడడుగుల చోటు తప్ప మరేదీ వద్దన్నాడు వామనుడు. ఆ బాల బ్రహ్మచారి కోరికకు అబ్బురపడుతూనే సరేనని అంగీకరించాడు బలి. అప్పుడు రాక్షసగురువు శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో ఆ వచ్చినవాడు సాక్షాత్తూ విష్ణువేనని, నీ రాజ్యాన్ని అపహరించి, నిన్ను పరాభవం చేయడానికే వచ్చాడని, కొన్ని సందర్భాల్లో అసత్యం చెప్పినా దోషం కాదని చెప్పి, ఆ దానకార్యక్రమాన్ని వారించేందుకు ప్రయత్నించాడు.
బలి అందుకు అంగీకరించలేదు. సాక్షాత్తూ విష్ణువే తనముందు వామనుడై చేతులు చాచి అర్థించడం, దానికి తాను సరేననడం తనకెంతో గర్వకారణమని అతిశయంతో అంటూ వామనుడడిగిన మూడడుగుల భూమిని ఇచ్చేందుకు దానపాత్ర చేత పుచ్చుకున్నాడు. కనీసం అప్పుడైనా ఆపుదామని శుక్రాచార్యుడు సూక్ష్మరూపంలో దానపాత్రలో ప్రవేశించి, దానినుంచి నీరు పడకుండా అడ్డుకున్నాడు. అప్పుడైనా అసలు విషయం గ్రహించని బలి అలాగే చూస్తుండిపోవడంతో వామనుడు పాత్రకు ఏదో అడ్డుపడిందంటూ తన చేతనున్న దర్భపుల్లతో పొడిచాడు. దాంతో శుక్రాచార్యుడు కన్నుపోయి, ఒంటికంటివాడయ్యాడు. దానధార నే లమీద పడడంతోటే వామనుడు త్రివిక్రమరూపం ధరించి, నభోవీధివరకు వ్యాపించాడు. ఒక అడుగుతో నేలను, రెండో అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించేసి, మూడో అడుగు ఎక్కడ వేయాలని అడిగాడు. బలి చక్రవర్తి తన శిరస్సు చూపడంతో, పాతాళానికి అణగదొక్కేశాడు. ఇక్కడ ఒక సందేహం తలె త్తవచ్చు. దానశీలిగా పేరుపొందినబలిచక్రవర్తిని పాతాళానికి తొక్కెయ్యడం ఎంతవరకు సమంజసమని...
బలి ఎంతో మంచివాడు, మరెంతో సత్యసంధుడు కావచ్చు, శౌర్యపరాక్రమాలలో ముల్లోకాలలోనూ ఎవరికీ సాటిలేనివాడు కావచ్చు. అయితే రాక్షసగుణాలు కలవాడు. దేవతలందరినీ జయించి, వారిని తరిమి కొట్టాడు. భవిష్యత్తులో ఇంద్రపదవి లభిస్తుందనే వరం ఉన్నప్పటికీ, ఇంద్రపదవిని చేజిక్కించుకునేందుకు ఇప్పటినుంచే ప్రయత్నాలు చేశాడు. అంతటితో తృప్తి చెందకభవిష్యత్తులో బ్రహ్మ కావడం కోసం రహస్యంగా అనేక యాగాలు చేశాడు. సాక్షాత్తూ విష్ణుమూర్తియే తన నుంచి దానం గ్రహిస్తున్నాడని అతిశయించాడు.
అందుకే విష్ణువు వామనమూర్తిగా మారి అతని అహాన్ని పాతాళానికి తొక్కేశాడు. అయితే అతని మంచితనానికి, సత్యసంధతకు సంతోషించి, పాతాళలోకానికి చక్రవర్తిని చేశాడు. ఏడాదికోసారి అంటే దీపావళి అమావాస్య మరునాడు భూలోకానికి వచ్చి, తన ప్రజలను చూసేలా వరమిచ్చాడు. అదే బలిపాడ్యమి. ఎంతటి గొప్పవాడైనప్పటికీ అతని ఉన్నతిని అణచివేయడానికి అహం ఒక్కటీ ఉంటే చాలు అనేందుకు ఇదే ఉదాహరణ.
- డి.వి.ఆర్.