గణపతిని  పూజించిన శివుడు | Shiva worshiped Ganapati | Sakshi
Sakshi News home page

గణపతిని  పూజించిన శివుడు

Sep 9 2018 12:16 AM | Updated on Sep 9 2018 12:16 AM

Shiva worshiped Ganapati - Sakshi

ఒకసారి శివుడు తన గణాలను తీసుకుని ఒక రాక్షసుడి మీదికి యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికి వెళ్లే తొందరలో గణపతిని కలిసి తాను Ðð ళుతున్న పని గురించి చెప్పి, అనుమతి తీసుకోవడం మరచిపోయి హడావుడిగా వెళ్లడంతో అడుగడుగునా ఆయనకు, ఆయన పరివారానికి అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రతి పనిలోనూ విఘ్నాలు ఏర్పడుతుంటాయి. శివుడు వాటిని పట్టించుకోకుండా రథం ఎక్కబోయాడు. రథచక్రం కాస్తా ఊడిపోవడంతో తన వాహనమైన నందిని పిలిచాడు. నంది రావడం తోటే అధిరోహించబోయాడు. ఉత్సాహంగా ముందుకు ఉరకబోయిన నందికి కాలు మడతబడినట్లయి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. ఏమి చేద్దామా అన్నట్లుగా తన పరివారం వైపు చూస్తాడు శివుడు. వారంతా ఏదో పోగొట్టుకున్నట్లుగా నిరాశానిస్పృహలతో, కళ తప్పిన ముఖాలతో కనపడ్డారు. గతంలో ఎప్పుడూ ఇలా జరిగిన అనుభవాలు లేకపోవడంతో ఏమి జరుగుతోందో చూద్దామని కన్నులు మూసుకోగానే మనోనేత్రం ముందు బాలగణపతి నవ్వుతూ దర్శనమిచ్చాడు. అప్పుడు గుర్తుకొచ్చింది శివుడికి... విష్ణుమూర్తి సహకారంతో గజాసురుడి ఉదరం నుంచి వెలికి వచ్చిన తర్వాత తన సతిని చూద్దామన్న వేగిరపాటుతో తన నివాసానికి రావడం, వేలెడంత కూడా లేని బుడత ఒకడు తనను లోనికి వెళ్లనివ్వకుండా అడ్డగించడం, తాను ఆగ్రహంతో ఆ బాలుడి శిరస్సు ఖండించడం, పార్వతి ద్వారా అసలు విషయం తెలుసుకుని, ఆ బాలుడికి ఏనుగు తల అతికించి తిరిగి బతికించిన సందర్భంలో... ‘‘నాయనా! గణేశా! ఇకపై దేవదానవ యక్ష గంధర్వ కిన్నర కింపురుషుల దగ్గర నుంచి, మామూలు మనుషులు, మహిమాన్విత గుణాలు కలిగిన రుషులు ఏ పూజలు, వ్రతాలు, శుభకార్యాలూ చేసినా ప్రథమ పూజ నీకే. నూత్నంగా ఎవరు ఏ పని తలపెట్టినా  ముందుగా నిన్ను తలచుకుని, నీకు పూజ చేయనిదే ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తి కాదు, అందుకు త్రిమూర్తులమైన మేమూ అతీతులం కాము సుమా’’ అని చెప్పిన మాట, ఇచ్చిన వరం గురించి.

వరమిచ్చిన తానే దానిని విస్మరించి, తన కుమారుడే కదా అన్న తేలికపాటి దృష్టితో యుద్ధానికి బయలు దేరేముందు గణపతిని స్మరించకుండా వచ్చేసినందుకే తనకూ, తన పరివారానికీ అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయని గ్రహించాడు. దాంతో ఎంతో నొచ్చుకుని వెంటనే వెనక్కు వెళ్లి, తన పరివారంతో గణపతి పూజ చేయించాడు. తాను కూడా గణపతిని కలిసి తాను యుద్ధానికి వెళుతున్నాననీ, తనకు ఏ విఘ్నాలూ లేకుండా విజయం సాధించేలా చూడమని గణపతికి చెప్పి, వీడ్కోలు తీసుకుని తిరిగి వచ్చి ఈ సారి యుద్ధంలో ఘన విజయం సాధించాడు శివుడు. పిల్లలతో అబద్ధం చెప్పకూడదని, దొంగతనం, అవినీతి, లంచగొండితనం నేరమని చాలా నీతులు చెబుతూ ఉంటాం. కానీ, తీరా మన దగ్గరకొచ్చేసరికి వాటన్నింటినీ పక్కన పెట్టేస్తాం. అది చాలా తప్పు. ఏ మంచినైనా ముందు మనం ఆచరిస్తేనే, పిల్లలు కూడా వాటిని అనుకరిస్తారని తెలుసుకోవడమే ఇందులోని నీతి. 
– డి.వి.ఆర్‌. భాస్కర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement