శ్రీవిష్ణు సహస్రనామం దాచుకో!

Sai patham  antarvedam 34 - Sakshi

 ∙సాయిపథం – అంతర్వేదం 34

ఎవరైనా ఒక స్వాములవారి దగ్గరికెళ్లి ‘ఈ గ్రంథాన్ని నిత్యం పారాయణ చేయదలచాన’ని చూపించి చెప్తే– ‘మంచిదే గాని దీనితో పాటు దాన్ని కూడా కలిపి పారాయణం చేస్తే విశేషఫల’మంటూ చెప్తారు. లేదా– ‘దీనికంటే ఫలానా గ్రంథమైతే నీకొచ్చిన కష్టానికి ఆ గ్రంథం నప్పుతుంద’ని అనొచ్చు. లేదా– ‘ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను, స్వీకరించి మననం చేసుకుంటూ ఉండు’ అని చెప్పొచ్చు. ఇలాగని స్వాముల వారిని తక్కువ చేస్తూ చెప్పడం దీని అభిప్రాయం కాదు గాని, లోకంలో జరిగే సాధారణ విధానాన్ని చెప్పడానికి మాత్రమే. ఈ నేపథ్యంతో చూస్తే– సాయి దగ్గరికి ఎవరైనా వచ్చి ఒక గ్రంథాన్ని ఆయన చేతికిస్తూ పరిశీలించవలసిందనే ఆలోచనతో నమస్కరిస్తే– కొందరిచ్చిన పుస్తకాన్ని అలా స్పృశించి వెంటనే భక్తులకు ఇచ్చేస్తూండేవారు. మరికొందరిచ్చిన పుస్తకాన్ని తెరిచి, రెండుమూడు పుటలు తిరగేసి వెంటనే ఇచ్చేస్తూ ఉండేవారు. మరికొందరిచ్చిన పుస్తకాల్ని అలా చూస్తూనే శ్యామాని పిలిచి– ఈ పుస్తకాన్ని భద్రంగా దాచు అంటూ అతనికిస్తూ ఉండేవారు. అందుకని ఎక్కువమంది భక్తులు సాయికి గ్రంథాలను ఇవ్వదలిస్తే– రెండు ప్రతుల్ని తీసుకెళుతుండేవారు. సాయి ఒక ప్రతిని తీసేసుకున్నా, శ్యామాకో మరెవరికో దాచవలసిందని ఇచ్చేసినా తమ పారాయణానికి అడ్డు రానే రాదనే అభిప్రాయంతో. ఎందుకలా సాయి ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క తీరులో ప్రతిస్పందిస్తూ ఉండేవారో ఎవరికీ అర్థమయ్యేది కాదు. అయితే సాయి చేతి నుంచి ఆ పారాయణం చేద్దామనుకున్న గ్రంథాన్ని తీసుకున్న వాళ్లు మాత్రం దాదాపుగా మోక్షాన్ని పొందినంత ఆనందాన్ని అనుభవిస్తుండేవారు. 

ఇంతేకాదు, మంచిగ్రంథం అనుకున్న పుస్తకాన్ని కూడా భక్తులు సాయి చేతికిస్తూండేవారు. ‘కాకా’కి భాగవతమంటే ఇష్టం. దాన్ని సాయి చేతికీయగానే రెండు పుటలు తిరగేసి–‘శ్యామా! ఇది నీకు చాలా బాగా ముందు ముందు పనిచేస్తుంది. దాచుకో!’ అని శ్యామాకిచ్చేశారు. ‘బాబా! ఇది మీరు నాకు ఇచ్చేస్తున్నారేమిటి? ఈ పుస్తకం కాకాది’ అన్నాడు శ్యామా. ‘నాకు తెలియదా? అందుకే నీకిచ్చాను. నీకు పనిచేస్తుందని. దీన్ని బట్టలో కట్టి దాచిపెట్టుకో!’ అన్నాడు సాయి.అలాగే ఏకనాథ భాగవతం, పంచరత్న గీతాలు, వివేకసింధు, భక్తి లీలామృత్‌ వంటి అనేక గ్రంథాలను ఎవరెవరో ఇస్తూ ఉంటే, వాటిని శ్యామాకిచ్చి ‘భద్రంగా దాచు’ అని ఇచ్చేస్తుండేవాడు సాయి. గమనించాల్సిన విషయమేమిటంటే– ఏనాడూ ఆ పుస్తకాన్ని చూస్తూ గాని, చూశాక గాని– ఇది హిందూ ధర్మానికి సంబంధించినది అనే తీరు దృష్టి ఆయన ముఖంలో కనిపించేది కాదు. తానొక మహమ్మదీయుడనే భావాన్ని ఏనాడూ కనపరచేవారు కాదు. ఇప్పటికీ మన హిందూ ధర్మంలో కొందరు ‘ఈ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాం. ఈ మీదట లలితా సహస్రనామాలను చదవద్దు. శివాలయాలకి వెళ్లద్దు. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే తీర్థాన్ని నంది వెనుక పారబోసెయ్యండి’ అని చెప్పేవాళ్లను చూస్తుంటాం. ఇలా హిందూ ధర్మాన్ని రెండు ముక్కలుగా చేసేవాళ్లని అక్కడక్కడా చూస్తుంటే, రెండు మతాలూ ఒక్కటిగా చూస్తూ, ఆ మత భేద దృష్టి ఉండరాదని చెప్పే సాయి ఎంత ఉన్నతుడు!  ఇలా రోజులు జరుగుతూ ఉంటే ఒకసారి ఓ విచిత్రం జరిగింది.

మసీదులో విష్ణుసహస్రనామాలు
రామదాసు బువా అనే భక్తుడు ఉండేవాడు. ఆయన పరమ నిష్టాపరుడు. ఎప్పుడూ తన అనుష్ఠానాన్ని సక్రమంగా చేస్తుండేవాడు. ఓసారి ఆయన మసీదులో తన అనుష్ఠానాన్ని ప్రారంభించి, సంధ్యావందనం ముగించుకుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రారంభించాడు. నుదుట విభూది రేఖలతో శరీరం నిండుగా శివనామాలతో కాషాయ వస్త్రాలను ధరించి శ్రావ్యంగా ఆ స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటే ఆయనకి సమయమే తెలియలేదు. ఇవికాక ఆధ్యాత్మ రామాయణాన్నీ, ఇంకా కొన్ని పారాయణలనీ చేస్తూనే ఉన్నాడు. కాసేపటికి పారాయణలన్నీ ముగిశాయి. అంతలో సాయి రామదాసుని పిలిచి– ‘దాసూ! నా కడుపులో పోటుగా ఉంది. నొప్పి తగ్గేలా అనిపించడం లేదు. అంగడికి పోయి సునాముఖీ ఆకును తీసుకురావూ! అన్నాడు. కల్లాకపటం తెలియని వాడూ, అమాయకుడూ సాయి పట్ల చెప్పలేని భక్తిభావం ఉన్నవాడూ అయిన రామదాసు మరుక్షణం పరుగులాంటి నడకతో మందుల వీధి వైపు బయల్దేరాడు.

రామదాసు అలా వెళ్లగానే సాయి ఆ పారాయణ పుస్తకాల వద్దకు వెళ్లాడు. ఇంకా మరొకటి పారాయణ చేయవలసి ఉందన్న గుర్తుగా పుస్తకం పుటల మధ్య బయటకి తొడిమ కనిపించేలా పెట్టిన మామిడాకును చూస్తూ రామదాసుకున్న ప్రాచీన ధోరణిని ప్రశంసించుకున్నాడు లోలోపల. అక్కడే విష్ణు సహస్రనామం పుస్తకం కనిపించింది. వెంటనే శ్యామాని పిలిచి– ‘శ్యామా! ఈ పుస్తకం ఏమిటో నీకు తెలుసా? ఒకప్పుడు నాకు గుండె దడదడలాడటం మొదలైంది. కంగారు పడిపోయాను. ఏమవుతుందో తెలియని స్థితికి వెళ్లిపోయాను. ఏమీ తోచక అక్కడే కనిపించిన ఈ విష్ణు సహస్రనామ పుస్తకాన్ని గుండెల మీద పెట్టుకున్నాను. కొంతసేపటికి నా గుండె చేసిన హడావుడి మొత్తం పోయింది. ప్రశాంతపడ్డాను. ఒక్క మాటలో చెప్పాలంటే నా జీవితాన్ని రక్షించింది ఈ పుస్తకమే’ అంటూ ‘శ్యామా! ఈ పవిత్రగ్రంథాన్ని నువ్వు తీసుకెళ్లు’ అన్నాడు.

వెంటనే శ్యామా ‘బాబా! ఈ పుస్తకం నాకొద్దు. అది రామదాసుది. ఆయనెంత అనుష్ఠానపరుడో అంత అనుమానమ్మనిషి. ఈ పుస్తకాన్ని నేను దొంగతనం చేశాననుకుంటూ ఇంకా ఏమైనా పుస్తకాలనీ వస్తువుల్నీ కూడా తానే ఎక్కడో దాచుకుని, అవిగాని పొరపాటున కనిపించకపోతే నన్ను దొంగగా ప్రచారం చేస్తూ పదిమందిలో నా పరువు తీసేస్తాడు. పైగా ఆయనకి కోపం వస్తే వీర చిందులు తొక్కేస్తాడు.నన్నెందుకు అతనికి బలి చేస్తావు? మన్నించు. నాకొద్దు!’ అన్నాడు శ్యామా.మళ్లీ సాయి శ్యామాని చూస్తూ ‘నా ప్రాణాల్నే రక్షించిన గ్రంథమంటూ చెప్పినా, నేనే తీసుకోవలసిందని చెప్తున్నా అలా అంటావేమిటి? నీ దగ్గరుంచుకో! దీనివల్ల ఎంత మంచి జరుగుతుందో నీకు తెలియదు. దాచుకో!’ అన్నాడు. బిక్కముఖం వేస్తూ ‘సాయీ! నాకీ శ్లోకాలను చదవడం రాదు. నా నాలుక బండబారిపోయింది. నోరు తిరగదు కూడా. దాంట్లో ఏవో సంధులూ సమాసాలూ పదాలను విరగ్గొట్టి అర్థం చేసుకోడాలూ నాకు రావు. పైగా తప్పులు చదివితే ఏమవుతుందో? ఎందుకు నన్నిలా ఇబ్బందిపెడతావు? అన్నింటికీ మించి రామదాసుతో గొడవ మామూలుగా ఉండదు. దయచేసి..’ అంటుండగానే, శ్యామా వాక్యం పూర్తి కాకుండానే సాయి ‘శ్యామా! మారు మాటాడకు. ఈ పుస్తకాన్ని నీ వద్దే భద్రం చెయ్యి’ అన్నాడు. శ్యామాకి సాయి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలున్నా కూడా లోలోపల అనుకున్నాడు– ‘ఎందుకింత పట్టుపడుతున్నాడు సాయి? నాకూ రామదాసుకీ కలహం కలిగితే వినోదిద్దామనుకుంటున్నాడా? అయినా ‘వద్దు మొర్రో’ అనుకునే వాడికి అంటగడితే సన్యాసికి పెళ్లి చేసిన చందమే కదా!’ అని.

అదే సమయంలో శ్యామా పట్ల ఎంతో వాత్సల్యం అనురాగం ఉన్న సాయి కూడా లోలోపల అనుకున్నాడు. ‘ఎందుకింతగా శ్యామా విరోధిస్తున్నాడు? వైద్యుడు రోగిని గమనించి తీపిమందునే ఇస్తాడా? ఔషధం చేదుగా ఉంటుందని రోగి తీసుకోనంటే వైద్యుడు ‘అలాగే’ అంటాడా? కొండలంతటి పరిమాణంలో పాపాలు ఉన్నా తెగ్గొట్టి వ్యక్తిని ఉద్ధరించేది విష్ణు సహస్రనామం కాదూ! వ్యక్తిగా వందమంది మధ్యలో ఉన్న భీష్ముణ్ణి అలా శ్రీహరిలోనికి అందరూ చూస్తుండగా లీనం అయ్యేలా చేసింది ఈ గ్రంథం కాదూ? సరే! ఈ గ్రంథంలో భక్తినీ శ్రద్ధనీ శ్యామాకి పుట్టించాల్సిందే! నమ్మినవాడికి తోవ చూపించని పక్షంలో గురువుండీ ప్రయోజనమేమిటి?’ అని. ఇలా ఇద్దరూ అనుకుంటూ ఉంటే సాయే స్వయంగా శ్యామా దగ్గరకొచ్చి ఆ విష్ణు సహస్రనామ పుస్తకాన్ని శ్యామా జేబులోకి నెట్టేసి– ‘శ్యామా! ఇతర కర్మకలాపాలన్నింటికీ నిష్టా నియమం, ఉపవాస విధి, మంచిరోజు, ఉపదేశం పొంది ఉండటం వంటి ఎన్నో విధానాలుంటాయి. ఉన్నాయి. దీనికి అక్కర్లేదు. భీష్ముడు శవాల గుట్టలున్న ప్రదేశంలో కదా దీన్ని చెప్పాడు. పరమ పవిత్రుడైన శ్రీహరి పరస్పర క్రోధావేశాలతో ఒకరినొకరు చంపుకున్న కురుక్షేత్ర ప్రదేశానిక్కదా వచ్చాడు! ఇంతకంటే నీక్కావలసిన సాక్ష్యం ఏమిటి? ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడే చదువుకోగలిగిన పుస్తకం ఇది! నీకు తెలుసో తెలియదో! ఏకనాథ్‌ మహారాజు కూడా ఈ పుస్తకాన్నే పొరుగింట్లో ఉన్న బ్రాహ్మణుడికి అంటగట్టాడు బలవంతానా. ఆ పొరుగింటి బ్రాహ్మణుడు కులానికి మాత్రమే బ్రాహ్మణుడు తప్ప ఏకోశానా అతనిలో బ్రాహ్మణ ధోరణే కనిపించేది కాదు. ఒక నియమం నిష్ట, పూజ ధ్యానం ఆచారం.. ఇలా ఏదీ అతనిలో కనిపించకపోతుంటే నీలాగే ఆయనా ఎందుకిలా అంటగడతాడు? అనుకుంటేనే ఈ పుస్తకాన్నే బలవంతానా అతనికిచ్చాడు. ఆ తర్వాత ఆ బ్రాహ్మణుని ఇంటికి ప్రతిరోజూ తానే వెళ్తూ శరీరంలోని రోగాలను నిరోధించడానికి పోట్లాడే తెల్ల కణాల్లాంటి జాతి అయిన బ్రాహ్మణులు ఇలా ఆచారం సంప్రదాయం లేకుండా ఉంటే అది సరికాదని భావించి, బ్రాహ్మణుడు చేసే పూజలు వ్రతాలు ధ్యానాల వల్ల లోకం రక్షింపబడుతుందని భావించి ఆ బ్రాహ్మణుని చేత రోజుకి ఒక శ్లోకాన్ని కంఠస్థం చేయించాడు. అర్థాన్నీ భావాన్నీ లో అర్థాన్నీ వివరించాడు. అలా చేయగానే ఆ బ్రాహ్మణుడు వత్తిని పైకి జరిపితే వెలిగే దీపంలా ఆచార సంప్రదాయ ధోరణిలోకి మారిపోయాడు’ అంటూ శ్యామాకి చెప్పాడు. ఏదో విషసర్పాన్ని రాత్రివేళ ఎవరైనా పడుకున్న గదిలోకి విడిచిపెడుతూ– దీనివల్ల మీ దగ్గరకు ఏ దొంగలూ రాలేరన్నట్టనిపించింది శ్యామాకి. అయిష్టంగానే ఆ పుస్తకంతో అలా తన గదికి వెళ్లిపోయాడు శ్యామా.

‘పుండుకి పుడక గుచ్చుకుంద‘న్న సామెతలా ఈ సంఘటన అంతటినీ చూస్తున్న అణ్ణా (చించణకర్‌) విషయాన్నంతటినీ ముందుకు ముందే అంగడి నుంచి వస్తున్న రామదాసుకి చేరవేశాడు. అణ్ణాది ఎవరైనా కలహించుకుంటే వినోదించే స్వభావం. అందుకే అక్కడిది ఇక్కడికీ, ఇక్కడిది అక్కడికీ చేరవేస్తూ తనదైన కలహభోజనాన్ని సకాలంలో ముగిస్తుండేవాడు.ఇంతలో రామదాసు వచ్చాడు. సునాముఖీ ఆకుని సాయికి ఇవ్వాలనే మాట మర్చిపోయి, శ్యామా గదికి వెళ్లి, ‘శ్యామా! నువ్వే సాయిని మోసం చేస్తూ ఆయనకి కడుపునొప్పి వచ్చిందని చెప్పించి నా పుస్తకాన్ని కాజేశావు! నేనెవరికీ భయపడేవాణ్ణి కాదు.బాబా దొంగతనం చేయవలసిందని ప్రోత్సహించేవాడు కానే కాదు. నువ్వే నీ దొంగబుద్ధికి బాబాని బలిచేస్తూ ఇలా చేశావు. నా పుస్తకాన్ని నాకివ్వకపోయావో ఇక్కడే నా తలని గోడకి కొట్టుకుంటాను– అంటూ శ్యామాని తెగ నిందించసాగాడు. శ్యామా ఏమి చెప్పబోయినా వినిపించుకునే స్థితిలో లేనేలేడు రామదాసు. పెద్ద తుఫానొచ్చాక కొంతసేపటికి ప్రశాంతత వచ్చేటట్టు రామదాసు కోపంతో ఊగిపోవడం తిట్టిపోయడం– అంతా ముగిశాక శ్యామా అతనితో ‘రామదాసూ! ఒకే ప్రశ్న అడుగుతాను. సమాధానం చెప్పు. ఈ పుస్తకాన్ని వజ్రాలతో పొదిగావా? రత్నాలతో అక్షరాలని చెక్కించావా? ఇదేమైనా ప్రపంచంలోనే లభ్యంకాని పుస్తకమా? ఏ అంగడిలో చూసినా వంద ప్రతులు ఉండే పుస్తకం కదా! నేనెందుకు దొంగతనం చేశాననుకుంటున్నావు? పోనీ! నేను పిసినారినా? డబ్బుల్లేనివాడినా? ఎందుకలా నోరు పారేసుకుంటావు? కాలు జారితే వెనక్కి తీసుకోగలం గాని నోరుజారితే వెనక్కి తీసుకోలేం! ఆలోచించు! నీలా వెర్రికోపంతో చిందులు తొక్కే స్వభావం కాదు నాది. ఇక ఆపై నీ ఇష్టం. శాంతిస్తావో– ఇంకాసేపు తిట్టుకుంటావో’ అన్నాడు. శ్యామా పలికిన ఈ మాటలు రామదాసులో ఆలోచన రేకెత్తించాయి. నిజమే కదా! అనిపించేలా అనిపించాయి ఆ మాటలు.

రామదాసు కొద్దిగా మెత్తబడినట్లు అనిపించగానే– అంటే ఆలోచనలో పడి తాను చేసింది తప్పే అనే భావంతో ఉన్నాడనిపించగానే శ్యామా మళ్లీ అదే నిదానమైన కంఠస్వరంతో ‘రామదాసూ! నేను మోసగాణ్ణీ, అసత్యాలు పలికేవాణ్ణీ– దొంగతనాలు చేసేవాణ్ణీ అన్నావే! దానికి నేను ఏమాత్రమూ బాధపడను గాని, నువ్వే బాబాతో నాటకమాడించానన్నావే! అది మాత్రం వాడి బాణాన్ని గుండెలో గుచ్చినట్టుగా నన్ను బాధిస్తోంది. ఎందుకంటావా? బాబా ఎప్పుడూ నాటకాలాడేవాడు కాడు. పైగా ఎవరు నాటకాలాడిస్తారా అని చూసేవాడూ కాడు. ఎవరైనా నాటకాలాడుతుంటే సరిదిద్దేవాడు ఆయన! ఇంతకాలం బాబా దగ్గర ఉండి బాబా గురించి ఇలా మాట్లాడటమనేది ఔషధం దొరకని వ్యాధితో బాధపడుతున్న రోగిలా నన్ను కలచివేస్తోంది’ అని ముగించాడు. రామదాసు మరింత ఆలోచనలో పడిపోయి మౌనంగా నిలబడిపోయాడు. అందరికీ తంపులు పెట్టే లక్షణమున్న అణ్ణా చల్లగా జారుకున్నాడు తాను రగిల్చిన నిప్పు అంటుకోలేకపోయిందే అనుకుంటూ. ఇంతలో సాయి ఆ మందిరంలోకొచ్చాడు. నిదానమైన కంఠస్వరంతో రామదాసుని తన దగ్గరికి రమ్మని పిలుస్తూ అతను దగ్గరకొచ్చాక ‘రామదాసూ! ఎందుకు అనవసరంగా అలా ఉద్రేకపడిపోతావు? శ్యామా ఎవరు? మన పిల్లాడులాంటివాడు కదా! అతణ్ణి అలా మసీదు మొత్తం దద్దరిల్లిపోయేలా అరిచెయ్యడం నీలాంటి నిష్టాపరునికీ సంప్రదాయపరునికీ తగునా? ప్రతి పవిత్రగ్రంథాన్నీ  నువ్వలా నిష్టగా పారాయణం చేస్తుంటే నేనెంత ఆనందపడతానో తెలుసా? అయినా ప్రతి మంత్రం చివరా ‘ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః’ అంటుంటావే? అది నీలో ఎంత ఉందో ఎప్పుడైనా గమనించుకున్నావా? ఆధ్యాత్మ రామాయణాన్ని పారాయణం చేస్తావుగా రోజూ! మనసుకొచ్చే వికారాలని పోగొట్టుకోవాలని కదా దాంట్లో కనిపిస్తుంది. విష్ణు సహస్రనామాలని చదువుతావు కదా శ్రావ్యంగా. చెవులకింపైన కంఠస్వరంతో పారాయణకాలంలో మమ్మల్ని కూడా కట్టిపడేస్తావుగా!అనేక యుద్ధాలను ధర్మబద్ధంగా మాత్రమే చేశాడు కాబట్టే భీష్ముడు ప్రశాంత స్థితిని పొందగలిగాడు. శ్రీహరిలో లీనం కాగలిగాడు. అహంకారాన్నీ మమకారాన్నీ విడిచిపెట్టాలని చెప్పే ఈ పారాయణాల్ని కేవలం చదివేసి పూజ అయిపోయిందనుకోవడం కాదుగా! ఆచరణలో కొద్దిగానైనా చూపించగలగాలిగా! ఒక చిన్న పుస్తకానికి– ఎక్కడైనా దొరికేదానికి ఇంత రాద్ధాంతం అవసరమా? ఏ చెట్టు తొర్రలో ఉన్న అగ్ని ఆ చెట్టునే దహించివేసేటట్లు నీలోని కోపం నిన్నే...’ అంటూ మౌనంగా ఉండిపోయాడు. రామదాసు తనది తప్పేనని మనఃపూర్వకంగా అంగీకరిస్తున్నట్లు తలాడించి మెల్లగా తలెత్తి నీరునిండిన కళ్లతో సాయికి నమస్కరించాడు. సాయి అన్నాడు– ‘నా కడుపునొప్పి అంతా నాటకమే. నేనే శ్యామాకి ఆ పుస్తకాన్ని ఇవ్వదలచి ఇచ్చాను.’ 

కొసమెరుపు: ఏ విషయాన్నైనా ఆవేశంతో కేకలతో అరిచేవాళ్లు ప్రశాంతతకి లొంగిపోతారు. శ్యామా అలాగే బాబా మాట్లాడిన సమయంలో రామదాసు ఎందుకు మౌనంగా ఉండిపోయాడు? లోకంలో అందరూ గమనించుకోగలగాలి. స్వభావమనేది ఒక్కసారిగా పోయేది కాదు. మెల్లగా మెల్లగా కదా పోతుంది. ఇంతా అయ్యాక రామదాసు శ్యామాని చూస్తూ ‘నా పుస్తకానికి బదులు పంచరత్నగీత పుస్తకాన్ని ఇవ్వు’ అని తీసుకున్నాడు. అనుకున్నాం కదా రామదాసు పిసినారి అని. ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే– ఇంత గొడవకి కారణభూతమైనది విష్ణుసహస్రనామం కారణంగా కదా! కాబట్టి ఎంతో గొప్పదై ఉంటుందనే భావనతో పట్టుబట్టి శ్యామా విష్ణుసహస్రనామాల్ని చదివి కంఠస్థం చేయడమే కాకుండా, పూర్తి వ్యాఖ్యానాన్ని కూడా ఒక పండితుని ద్వారా తెలుసుకున్నాడు తర్వాతి కాలంలో. 
(సశేషం)
- డా. మైలవరపు శ్రీనివాసరావు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top