యశోదమ్మ మళ్లీ పుట్టింది...!

యశోదమ్మ మళ్లీ పుట్టింది...!


మెడికల్ మెమరీస్: యశోద హాస్పిటల్ మలక్‌పేట విభాగాన్ని 1994లో ప్రారంభించిన తొలిరోజులవి. ఒక రోజు అపస్మారకస్థితిలో ఉన్న 18 ఏళ్ల బాలింతను ఆమె బంధువులు మా హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. గోదావరి జిల్లాలకు చెందిన ఆ అమ్మాయి కొద్దిరోజుల క్రితమే ఒక చిన్నారికి జన్మనిచ్చింది. విజయవాడలోని ఒక ఆసుపత్రికి చెందిన వైద్యులు ఆమెకు సిజేరియన్ చేసి పురుడు పోశారు. అయితే ప్రసవం తర్వాత ఆమెకు రక్తస్రావం ఆగలేదు. అక్కడి వైద్యులు ఎన్నివిధాల ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. భయంతో భీతిల్లిన ఆమె బంధువులు పొత్తిళ్లలో పసికందుతో పాటు ఆమెను హుటాహుటిన కారులో హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

 

  నిజానికి నిమ్స్‌కు తీసుకెళ్లాలన్నది వారి ఉద్దేశం. కానీ హైదరాబాద్ శివార్లకు చేరే సమయానికే ఆమె పూర్తిగా స్పృహకోల్పోయింది. ఆమె చనిపోయి ఉంటుందన్న అనుమానంతో దార్లోనే ఉన్న మా ఆసుపత్రికి తీసుకువచ్చారామె బంధువులు. అప్పటికి మలక్‌పేట విభాగం ప్రారంభించి కేవలం 20 రోజులే అయింది. పైగా పూర్తిస్థాయి వైద్యపరికాలన్నీ ఇంకా సమకూర్చుకోలేదు. కానీ ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉండటంతో మరో ఆలోచనే చేయకుండా ఆమెను అడ్మిట్ చేసుకున్నాం. మా సర్జన్ వెంటనే చికిత్స మొదలుపెట్టి రక్తస్రావాన్ని ఆపడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అప్పటికింకా స్కానింగ్ సౌకర్యం లేకపోయినా అదృష్ట్టవశాత్తు రక్తస్రావం జరుగుతున్న ప్రదేశాన్ని గుర్తించాం. మరోవైపు 20 సీసాలకు పైగా రక్తం ఎక్కించాం. ఈ చికిత్స ఫలితంగా రక్తస్రావం ఆగింది.

 

 ‘హమ్మయ్య ప్రాణాపాయం తప్పింది’ అంటూ ఊపిరిపీల్చుకున్నాం. అయితే నేనూ, మా కార్డియాలజిస్టు కలసి రౌండ్స్‌కు వెళ్తున్న సమయంలో ఆమె కీలకావయవాలను పర్యవేక్షిస్తున్న మానిటర్‌ను చూశాం. ఆమె గుండెవేగం అంతకంతకూ పడిపోతోంది. 80... 60... 50... ఇలా క్రమేపీ గుండెవేగం తగ్గిపోతోంది. వెంటనే ఆమెకు పేస్‌మేకర్ అమర్చాం. దాంతో గుండెవేగం నార్మల్‌కు వచ్చింది. ఆ తర్వాత చేసిన రక్తపరీక్షల్లో ఆమెకు జాండిస్ ఉన్నట్లు తేలింది. జాండిస్ ఉంటే రక్తం గడ్డకట్టదు. దాంతో రక్తస్రావం ఆగదు. అందువల్ల రక్తస్రావాన్ని ఆపే కొన్ని ఫ్యాక్టర్స్ ఇచ్చాం.

 

  ఫలితంగా పరిస్థితి నిలకడకు వచ్చింది. నాలుగు రోజుల తర్వాత ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడి, నెమ్మదిగా కోలుకుంటోందని భావిస్తున్న తరుణంలో ఉన్నట్టుండి మళ్లీ పల్స్ పడిపోవడం మొదలైంది. దాంతో వెంటిలేటర్ పెట్టాం. మరో పదిరోజుల తర్వాత కిడ్నీలు పనిచేయడం మానేసాయి. డయాలసిస్ మెషిన్ పెట్టాం. ఇలా ఆ యువతి హాస్పిటల్‌లో అడ్మిట్ అయిన దగ్గర్నుంచి ఆమెకు జరుగుతున్న చికిత్సను ఒక సవాలుగా స్వీకరించి నేను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నాను. ఆమె శరీరంలో గుండె, శ్వాసకోశాలు, కిడ్నీలు... ఇలా క్రమంగా ఒక్కటొక్కటిగా మెరుగుపడుతూ వచ్చాయి. దాంతో పేస్‌మేకర్, వెంటిలేటర్, డయాలసిస్ మెషిన్... ఇలా ఒక్కొక్కదాన్నీ తొలగిస్తూ పోయాం.

 

 మరో నాలుగురోజుల్లో డిశ్చార్జ్ అవుతుందనగా ఆమె తీవ్రమైన మానసిక రుగ్మత (అక్యూట్ సైకోసిస్)కు లోనైంది. శరీరంలోని ఒక్కో అవయవంలో రోజుకో సమస్య తలెత్తుతూ ఉంటే అవన్నీ చూస్తూ ఉండటం వల్ల ఏర్పడ్డ మానసిక రుగ్మత అది. వీటన్నింటి కారణంగా తాను చనిపోతానేమో అన్న ఆందోళన పెరిగి, అదే జరిగితే పొత్తిళ్లలోని తన పాపాయికి ఏమవుతుందోనన్న ఆవేదన అది. చాలామంది రోజుల పర్యంతం శారీరక, మానసిక ఒత్తిళ్లను భరించీ, భరించీ, వాటితో యుద్ధం చేసి అలసిపోతారు. చివరకు యుద్ధంలో గెలిచినా... తీవ్రంగా కుంగిపోయి ఉండటం వల్ల కొందరికి అక్యూట్ సైకోసిస్ వస్తుంది. ఈ అమ్మాయి విషయంలోనూ అదే జరిగింది. అప్పటికి మా హాస్పిటల్‌లో సైకియాట్రిస్ట్ లేరు. బయటనుంచి పిలిపించి చికిత్స ఇప్పించాం. అదృష్టవశాత్తు ఆమె ఈ యుద్ధంలోనూ గెలిచింది. విజేతగా నిలిచింది.

 

 కొడిగట్టడానికి సిద్ధంగా ఉన్న కొన ఊపిరితో మా దగ్గరకు వచ్చి... నిండు ఆరోగ్యంతో పండంటి బిడ్డను పొత్తిళ్లలో పట్టుకుని ప్రేమానురాగాలతో దగ్గరకు తీసుకుని లాలిస్తున్న ఆ అమ్మను చూసి మేము లోలోపలే అమితానందం పొందాం. ఒక సవాల్‌ను స్వీకరించి రెండు నిండు ప్రాణాలకు న్యాయం చేసేందుకు మేం చేసిన పోరాటానికీ, పడిన శ్రమకూ, చేసిన కృషికీ ససాక్ష్యంగా సాక్షాత్కారమైన విజయమది. అదే మా కళ్లెదుట చిర్నవ్వుతో నిలబడ్డ నిలువెత్తు దృశ్యం. ఆ కన్నతల్లి తన్మయంతో నాతో ‘నా బిడ్డకు యశోద అని పేరు పెట్టుకుంటానయ్యా’ అంది. అంతే... నా మనసూ, తనువూ తీవ్ర ఉద్విగ్నతకు లోనయ్యాయి. యశోద... మా అమ్మపేరు. ఆ సమయాన నాకు కనిపించిన దృశ్యం వేరు. అదీ.... నా ఎదుట ఒక అమ్మ! ఆ అమ్మ పొత్తిళ్లలో మా అమ్మ!!      

 - నిర్వహణ: యాసీన్

డాక్టర్ జీఎస్ రావు,

 మేనేజింగ్ డెరైక్టర్,

 యశోద హాస్పిటల్స్,

 హైదరాబాద్  

 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top