పద్మావతీ దేవీ పాహిమాం

Padmavati devi special story - Sakshi

కలియుగ దైవం శ్రీనివాసుని హృదయేశ్వరి శ్రీపద్మావతి అమ్మవారు తిరుచానూరులో కొలువై భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. నిత్య ధూపదీప నైవేద్యాలతో స్వతంత్ర లక్ష్మిగా పూజలందుకుంటోంది. తన పతిౖయెన శ్రీవారి తరహాలోనే నిత్య, వార, పక్ష, మాస, వార్షిక ఉత్సవా లను జరిపించుకుంటూ, నిత్యకల్యాణం... పచ్చ తోరణంలా భాసిల్లుతోంది. అమ్మవారి ఆలయంలో రెండు ఉపాలయాలున్నాయి. ఒకటి శ్రీ కృష్ణ బలరామ ఆలయం, రెండవది శ్రీసుందరరాజ స్వామి ఆలయం. ఒకప్పుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుచానూరు సన్నిధి వీధి చివర్లో అప్పట్లో  ఉన్న శ్రీవరదరాజస్వామి ఆలయంలో నిర్వహించే వారని తెలుస్తోంది. ముందుగా తిరుమల ఆలయంలో ధ్వజారోహణం చేసి, ఆ తరువాత వాహన సేవలను తిరుచానూరు పుర వీధుల్లో నిర్వహించేవారని వినికిడి. 

అమ్మవారి ఆవిర్భావం...
పద్మపురాణం, వేంకటాచల మహాత్మ్యం, వరాహ పురాణం, స్కందపురాణాల్లో అమ్మవారి ఆవిర్భావ వివరాలు వివరించి ఉంది. వాటిలోని సారాంశం... తాను నివాసముండే విష్ణు వక్షస్థలంపై భృగుమహర్షి తన్నినా విష్ణువు అతన్ని క్షమించడాన్ని జీర్ణించుకోలేక శ్రీమహాలక్ష్మి వైకుంఠాన్ని వీడి భూలోకానికి చేరుకుంటుంది. అలా శ్రీమహాలక్ష్మి ముందుగా కొల్హాపురం (మహారాష్ట్రలోని కొల్హాపూర్‌) చేరుకుంటుంది. లక్ష్మీ విరహితుడైన స్వామి వారు అమ్మవారిని వెతుక్కుంటూ  భూలోకానికి చేరుకుంటాడు. ఎక్కడ వెతికినా అమ్మవారి దర్శనం లభించదు. ఆ సమయంలోనే స్వర్ణముఖి నదీ తీరంలో కొలను తవ్వి, అందులో తామర పుష్పాలు వేసి పన్నెండు సంవత్సరాలు తపస్సు ఆచరిస్తే మహాలక్ష్మి కటాక్షిస్తుందని అశరీరవాణి పలుకుతుంది. దీంతో స్వామివారు ఇప్పుడున్న పుష్కరిణిని కుంతాయుధంతో తవ్వి బంగారు తామర పుష్పాలను వేసి, తామర పుష్పాలు విచ్చుకోవడానికి శ్రీసూర్యనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠించి 12 ఏళ్లు తపస్సు ఆచరిస్తాడు. స్వామి వారి తపస్సుకు మెచ్చిన శ్రీమహాలక్ష్మి అమ్మవారు కార్తీక మాసం, ఉత్తరాషాఢ నక్షత్రం, పంచమి తిథి, శుక్రవారం రోజున బంగారు కమలంపై శ్రీవారిని అనుగ్రహిస్తుంది. పద్మం నుంచి ఆవిర్భవించడంతో పద్మావతీదేవి అయ్యింది. శ్రీనివాసుని హృదయేశ్వరిగా ఉంటూ  శుకమహర్షి ప్రార్థన మేరకు శ్రీపద్మావతి అమ్మవారు పద్మాసనంపై భక్తులను అనుగ్రహిస్తోంది.

స్వతంత్ర లక్ష్మిగా పద్మావతీ దేవి...
గ్రామం ఏర్పడక మునుపే శ్రీపద్మావతి అమ్మవారు వెలియడంతో స్వతంత్రలక్ష్మి అయింది. గ్రామం ఏర్పడక మునుపు ఆలయం నిర్మితమైతే అది స్వతంత్ర గ్రామం ఏర్పడిన తరువాత ఆలయ నిర్మాణమైతే అది పరతంత్ర అని పురాణాలు చెబుతున్నాయి. ఈ లెక్కన తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారు స్వతంత్రలక్ష్మిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారు వెలసిన తరువాత నిత్య ధూపదీప నైవేద్యాల కోసం శుకమహర్షి అగ్రహారాన్ని నిర్మించి, వంద వైష్ణవ కుటుంబాలకు ఇక్కడ ఆవాసం ఏర్పాటు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. శుకమహర్షి పేరుతో అప్పట్లో తిరుశుకనూరుగా పిలిచేవారు. అదే
తిరుచానూరుగా మార్పు చెందింది. స్వతంత్ర లక్ష్మి అయిన శ్రీపద్మావతి అమ్మవారికి శ్రీవారితో సమానంగా నిత్య, వార, పక్ష, మాస, వార్షిక ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోని ఏ వైష్ణవాలయాల్లోను ఇలా అమ్మవారికి ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహించరు. ఏటా వైశాఖ మాసంలో వసంతోత్సవాలు, జ్యేష్ఠ మాసంలో తెప్పోత్సవాలు, భాద్రపద మాసంలో పవిత్రోత్సవాలు, కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు కల్యాణోత్సవం జరుగుతుంది. ప్రతి సోమవారం అష్టదళ పాద పద్మారాధన, ప్రతి నెల మొదటి బుధవారం అష్టోత్తర శత కలశాభిషేకం, గురువారం తిరుప్పావడ, శుక్రవారం ఉదయం మూలమూర్తికి అభిషేకం, మధ్యాహ్నం ఉద్యానవనంలో ఉత్సవవర్లకు అభిషేకం, సాయంత్రం వీధోత్సవం, శనివారం పుష్పాంజలి సేవ జరుగుతాయి.

పంచమీతీర్థం విశిష్టత...
కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు  పద్మ సరోవరం(పుష్కరిణి)లో పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా పంచమీతీర్థం (చక్రస్నానం) నిర్వహిస్తారు. పంచమీతీర్థం రోజున పుష్కరిణిలో నిర్వహించే చక్రస్నానం ఆచరించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. చక్రస్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగి శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. తన పట్టపురాణి పద్మావతి అమ్మవారికి నిర్వహించే చక్రస్నానానికి తిరుమల నుంచి ముల్తైదువు సారెను శ్రీవారు పంపించడం ఆనవాయితీగా వస్తోంది.

లక్ష కుంకుమార్చన... పుష్పయాగం
కార్తీక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ రోజు ఉదయం లక్ష కుంకుమార్చన సేవను ఆలయంలో నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. లోక కల్యాణార్థం అష్టోత్తర శత నామావళిని లక్ష మార్లు స్తుతిస్తూ కుంకుమతో అమ్మవారిని ఆలయ అర్చకులు, వేద పండితులు అర్చిస్తారు. అలాగే  బ్రహ్మోత్సవాల్లో అలిసిన అలమేలు మంగమ్మను సేదదీర్చడానికి బ్రహ్మోత్సవాలు ముగిసిన మరుసటి రోజు సాయంత్రం ఆలయంలో పుష్పయాగం నిర్వహించడం సాంప్రదాయం.  

ఉపాలయాలు – శ్రీ కృష్ణ బలరామ ఆలయం
శ్రీపద్మావతి అమ్మవారు ఆవిర్భవించింది కలియుగంలో. అంతకు మునుపే శుకమహర్షి అభ్యర్థన మేరకు  శ్రీకృష్ణుడు యోగముద్రలో ఇక్కడ వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. ద్వాపర యుగాంతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధం వలన కలిగిన పాపాలను పోగొట్టుకోవడానికి కలియుగ ప్రారంభంలో బలరామునితో కలిసి శ్రీకృష్ణుడు తీర్థయాత్రలు చేస్తుంటారు. అలా స్వర్ణముఖి నది సమీపంలో మునులు తపస్సు చేసుకుంటున్న (నేడు ముండ్లపూడి) ప్రాంతంలో వారితో కలిసి తపస్సు చేస్తాడు. ఇది తెలుసుకున్న శుకమహర్షి లోక కల్యాణార్థం తిరుశుకపురం (తిరుచానూరు)లో శిలారూపంలో కొలువుతీరాలని శ్రీకృష్ణుడిని అభ్యర్థిస్తాడు. మహర్షి కోరిక మేరకు బలరామునితో కలిసి యోగముద్రలో శ్రీకృష్ణుడు శిలగా మారి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. తరువాత శుకమహర్షి... ఆలయాన్ని, రాజగోపురాన్ని నిర్మించాడని, ఆ తరువాతి కాలంలో శ్రీపద్మావతి అమ్మవారిని ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి.

శ్రీసుందరరాజస్వామి ఆలయం...
అమ్మవారి ఆలయ ప్రాంగణంలో దాదాపు 106 ఏళ్ల కిందట మహంతుల కాలంలో శ్రీసుందరరాజ స్వామి ఆలయ నిర్మాణం జరిగింది. సుమారు 18వ శతాబ్దంలో ముష్కరులు భారతదేశంలోని హిందూ ఆలయాలను ధ్వంసం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని తిరుమాళగన్‌జోలై అనే గ్రామంలో ఉన్న శ్రీసుందరరాజస్వామి ఆలయం నుంచి శ్రీదేవి భూదేవి సమేత శ్రీసుందరరాజస్వామి ఉత్సవవర్లను శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి తీసుకొచ్చి భద్రపరిచారు. తరువాత కాలంలో మహంతుల పరిపాలనలో స్వామివారి ఆలయాన్ని నిర్మించి శ్రీదేవి భూదేవి సమేతంగా మూల మూర్తులను ప్రతిష్ఠించారు. అప్పటినుంచి  ప్రతి ఏటా జ్యేష్ఠ మాసం, స్వామివారి నక్షత్రం ఉత్తరాభాద్రకు ముగిసేలా మూడురోజులపాటు శ్రీసుందరరాజ స్వామి వారికి అవతారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా మారింది.

శ్రీసూర్యదేవాలయం...
రాష్ట్రంలో అరసవల్లి, తిరుచానూరులో మాత్రమే సూర్యదేవాలయాలు ఉన్నాయి.  తిరుచానూరులో కొలువైన శ్రీసూర్యనారాయణ స్వామి వారిని సాక్షాత్తు ఆ మహావిష్ణువే ప్రతిష్టించాడని అనేక పురాణాలు చెబుతున్నాయి. తిరుచానూరులోని సూర్యదేవాలయం అత్యంత పురాతనమైనది. ఈ ఆలయం శ్రీపద్మావతి అమ్మవారి పుష్కరిణికి అభిముఖంగా ఉంది. ఇక్కడి నిలువెత్తు సూర్యనారాయణస్వామి మూలవిరాట్‌ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. 

శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుచానూరులోనే...
ఒకప్పుడు శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుచానూరులోనే నిర్వహించేవారని వినికిడి. దీనికి కారణం... తిరుమల గిరులు అరణ్యంతో నిండి ఉండేవి. క్రూరమృగాలు అధికంగా ఉండేవి. దీనికితోడు ఎటువంటి వసతులు లేకపోవడంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుచానూరులో నిర్వహించే వారని పెద్దలు చెబుతున్నారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి ఎదురుగా అప్పట్లో వరదరాజస్వామి ఆలయం ఉండేది. ఆ ఆలయంలోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించేవారని, అయితే ముందుగా తిరుమల ఆలయంలో ధ్వజారోహణం, ధ్వజావరోహణం మాత్రమే చేసి, వాహన సేవలన్నీ ఇక్కడే నిర్వహించేవారు. అయితే వెయ్యేళ్ల కిందట భగవద్రామానుజాచార్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని, శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిరుమల క్షేత్రంలోనే జరిపించాలని చెప్పడంతో నాటి నుంచి తిరుమలలోనే బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

అమ్మవారి తరువాతే అయ్యవారు...
ఏ ఆలయానికి వెళ్లినా మొదటిగా అక్కడున్న అమ్మవారిని దర్శించుకున్న తరువాతనే స్వామిని దర్శించుకోవాలి. ఇది మన సంప్రదాయం. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలలో ఈ సంప్రదాయమే  కనబడుతుంది. శ్రీవైష్ణవ సంప్రదాయంలోనూ ముందుగా మహాలక్ష్మిని ఆరాధించిన తరువాతే స్వామిని సేవించాలని ఉంది. ఇలా ముందుగా శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకుని, ఆ తరువాత శ్రీవారిని దర్శించుకోవాలన్నది తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. ఇలా కొనసాగిస్తే సంప్రదాయ పరిరక్షణ అవుతుంది. తల్లిని సేవించిన తరువాతే తండ్రి, ఇతర పరివార దేవతలను సేవించడం ఉత్తమోత్తమం. తిరుచానూరులోనూ ఇదే సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు. పురాణ, ఇతిహాసాలలో పేర్కొన్నట్లు తిరుమల శ్రీవారి దర్శనార్థం దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులు చాలామంది ముందుగా శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకుని ఆ తరువాత తిరుమల శ్రీవారి దర్శనానికి వెళతారు. కోరిన కోర్కెలు తీర్చే అమ్మ ముందుగా భక్తుడి ఆవేదనను అయ్యవారికి తెలియజేస్తుందన్నది భక్తుల విశ్వాసం. 

శ్రీవారికి వైఖానసం... అమ్మవారికి పాంచరాత్రం
తిరుమలలో కొలువైన కలియుగ దైవం శ్రీనివాసునికి వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం నిత్య కైంకర్యాలు, పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రీవారి హృదయేశ్వరి శ్రీపద్మావతి అమ్మవారికి మాత్రం పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు, పూజలు నిర్వహిస్తున్నారు. మన రాష్ట్రంలో తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, భద్రాచలం, శ్రీకూర్మం, సింహాచలం, తమిళనాడులోని శ్రీరంగం, కాంచీపురం (కంచి), కుంభకోణం, మన్నార్‌గుడి, కర్ణాటకలోని తిరునారాయణపురం వంటి పలు ఆలయాలలో పాంచరాత్ర ఆగమ శాస్త్రోక్తంగా పూజలు జరుగుతున్నాయి.

వార్షిక ఆదాయం రూ.25 కోట్లు
శ్రీపద్మావతీ అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య దశాబ్దకాలంగా పెరుగుతోంది. ఒకప్పుడు ఐదారు వేల మంది దర్శించుకునేవారు. ఈ సంఖ్య నేడు సాధారణ రోజుల్లో 20 నుంచి 25 వేల వరకు, పర్వదినాల్లో 30 నుంచి 40 వేల వరకు పెరిగింది. ఆదాయం కూడా అంతకంతకు పెరుగుతోంది. ఒకప్పుడు వార్షిక ఆదాయం రూ.1 కోటి నుంచి 2 కోట్లు ఉంటే, ప్రస్తుతం రూ.25 కోట్లకు చేరింది. 

రూ.75 కోట్లతో వసతి సముదాయం
తిరుమల తరహాలో తిరుచానూరులో టీటీడీకి సంబంధించి చెప్పుకోదగ్గ వసతి సముదాయం లేదు. దీంతో దాదాపు రెండేళ్ల క్రితం పూతలపట్టు – నాయుడుపేట రహదారిలోని తిరుచానూరు సమీపంలో టీటీడీకి ప్రభుత్వం ఒక ఎకరం స్థలాన్ని అప్పగించింది. ఈ స్థలంలో... తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం తరహాలో రూ.75 కోట్లతో వసతి సముదాయ భవన నిర్మాణం చేపడుతున్నారు. సెల్లార్‌లో కార్‌ పార్కింగ్, పై అంతస్తులో క్యాంటీన్, ఆ పై అంతస్తులో డార్మిటరీ, ఇక మిగిలిన 5 అంతస్తుల్లో 200 గదులను నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే చెన్నై, నెల్లూరు వైపు నుంచి వచ్చే భక్తులకు ఉపయోగకరంగా ఉండడంతోపాటు తిరుమలలో రద్దీ సమయంలో గదుల కొరతను  అధిగమించేందుకు ఈ భవనం దోహదపడనుంది. 

రూ.7 కోట్లతో అన్నదానం క్యాంటీన్‌...
శ్రీపద్మావతి అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులకు తిరుమల తరహాలో అన్నదానం చేసేందుకు దాతల సహకారంతో సుమారు పదేళ్ల క్రితం అన్నదానం క్యాంటీన్‌ను ప్రారంభించారు. మొదట్లో ప్రైవేటు బస్టాండు దగ్గర ఉన్న టీటీడీకి చెందిన కల్యాణమండపంలో అన్నదానం క్యాంటీన్‌ను నిర్వహించేవారు. ఆ తరువాత ఆలయ సమీపంలోని ఆస్థాన మండపం కిందకు మార్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్నదానం క్యాంటీన్‌ను అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్నారు. సుమారు రూ.7 కోట్లతో తోళప గార్డెన్‌లో భవన నిర్మాణ ప్రాజెక్టు పూర్తి కానుంది. ఒకేసారి 400 మంది భోజనం చేసేలా విశాలమైన డైనింగ్‌ హాల్, ఆధునిక వసతులతో కిచెన్‌ ఏర్పాటు చేశారు. 
– ఎస్‌. శశికుమార్‌ తిరుపతి 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top