దాసర  అంజప్ప కోడి  కథ

P Venkat Reddy Translated Kannada Short Story In Sakshi Funday

కథా ప్రపంచం

మా ఊరి పాతకాలపు వయోవృద్ధుల్లో చాలా వృద్ధుడు అంజప్ప. ఏ విషయమైనా  చర్చకు  వచ్చినప్పుడు నేను వయస్సులో ఉన్నప్పుడు అలా జరిగింది, ఇలా జరిగింది అనేవాడు. ఆ  సంఘటనలు చూచినవాళ్లు ఎవరూ ఇప్పుడు బ్రతికి లేరు. ఆ కాలములో అంజప్ప సిపాయిలాగా ఎంతో చురుగ్గా  ఉండేవాడట. ఇప్పుడు  అతని వయస్సు అడిగితే నూరేండ్లు ఉండవచ్చు అంటాడు. పోయిన పది  సంవత్సరముల నుండి అతని  వయస్సు నూరేండ్లే. ముఖ్యంగా ఈ కారణంచేత ఏ సందర్భములో నైనా, ఎంతవారికైనా బుద్ధి చెప్పే  అధికారం చెలాయిస్తాడు. ఈ విషయములో  ఇతరులకు  సందేహమేమైనా ఉండవచ్చునేమోగాని తనకు  లేశ  మాత్రం సందేహం కూడా లేదు. ఇలా చెయ్యి, అలా చెయ్యి అని అంజప్ప చెప్పినపుడు వినకపోతే–  
‘‘ఏమయ్యా! మీ తండ్రి  పిల్లాడిగా ఉన్నప్పుడే నా గడ్డం నెరిసింది.  నా మాటలకు  లెక్క లేదా నీకు!’’  అనేవాడు. 

బహుశా సుదీర్ఘ  అనుభవము వల్లనేమో అతను చెప్పిన మంచి/బుద్ధి మాటలు సరైనవిగానే ఉండేవి. వయస్సులో  జాంబవంతుడైనట్లే, అంజప్ప  బుద్ధిలో  హనుమంతుడంతటి  వాడు.మూడురోజులకు  మునుపు అంజప్ప, రంగప్ప ఇంటికి  వచ్చినాడు. మా ఊరి కరణం అయిన రంగప్పను  మా తాలూకా బెంచిమేజిస్ట్రేట్‌గా నియమించినట్లు కొన్ని రోజులు  క్రితం ఆజ్ఞలు  వచ్చినవి. మా ఊరి  కరణంకు న్యాయం చెప్పే అధికారం కలిగినదని, ఊరి ప్రజలందరూ చాలా సంతోషపడ్డారు. 

చాలా  శక్తివంతమైన  పదవి, హోదా అని ప్రజల భావన. ఎంత  కాదన్నా ఇది  సుబేదారు హోదా కలిగిన పదవి  కింద లెక్క. పూర్వము ఈ న్యాయాధి కారము సుబేదారు, ఆ పై అధికారులకు మాత్రమే ఉండేది. ఈ ప్రభుత్వం, సుబేదారు నుంచి  న్యాయాధికారాలు  తీసేసారు అనే  భావన. అందుచేత  ఒక విధంగా  ఈ పదవి సుబేదారు కంటే గురి గింజంత ఎక్కువ పదవి. గ్రామ వయో వృద్ధుడైన అంజప్పకు ఈ విషయం తెలిసి రంగప్పను  అభినందించి  కొన్ని బుద్ధిమాటలు  చెప్పాలని రంగప్ప  ఇంటికి  వెళ్ళాడు. అంజప్పను చూసి రంగప్ప  ‘‘రా అంజప్ప, వచ్చి కూర్చో’’ అని చెప్పాడు.
అంజప్ప: నీకు తాలూకా న్యాయాధికారి  పదవి  వచ్చిందట కదా! చాలా సంతోషం!
రంగప్ప: సంతోషమేగాని దాని నుండి నయ్యా  పైసా  ఆదాయం కానీ జీతం  కానీ లేదు.
అంజప్ప: జీతం లేదా! ఎందుకు లేదు?
రంగప్ప: ఇది  గౌరవానికి  ఇచ్చే పదవి మాత్రమే. ప్రభుత్వం  జీతము  ఇవ్వదు.

అంజప్ప: జీతము లేకపోతేనేమి? జీతం తీసుకోనివాళ్లు  జీతం కంటే ఎక్కువ సంపాదించుకోవడం లేదా! జీతం ఒకటైతే, సంపాదన పదిరెట్లు.
రంగప్ప: అదంతా ఆ కాలము. ఇప్పుడు లంచం గించం జరగదు.
అంజప్ప: జరిగే వాళ్లకు జరుగుతుంది. జరగదు అంటే లేదు, అంతే. పోనీ ఇప్పుడు నీవు తలుచుకుంటే  సుబేదారునే  నిలబెట్టి  జరిమానా  వెయ్యవచ్చా లేదా?
రంగప్ప: బెంచి మేజిస్ట్రేట్‌ అయితే అలానే  చేయచ్చు. నేను కరణంకు, సుబేదార్‌కు జరిమానా  విధిస్తే పన్నులు వసూలు కాలేదని  పని నుండి  పీకేస్తారు.
నిజమే కదా అనుకొన్నాడు అంజప్ప. ఓస్‌! అవును కదా అంటూ తన  సంచిలోని తమలపాకులు, వక్కలు తీసుకొంటున్నాడు. తమలపాకులు, వక్కలు అతనిలాగానే మూడు నాలుగు రోజులు వాడిన పాతవి. అప్పుడప్పుడు తమలపాకులు కొనుక్కొంటున్నప్పటికీ, అయ్యో ఇది వృథా అయిపోతుందే అని ఆ వాడిన తమలపాకులే  వేసుకొనేవాడు. వాటిని  పారవేయడానికి  ఇష్టపడేవాడు కాదు. వాడిన తమలపాకులు ఖాళీ అయ్యేసరికి కొత్తగా  కొన్నవి కూడా వాడిపోయేవి. ఆ సంచిలో నాలుగు, ఐదు పచ్చ ఆకులు ఉన్నప్పటికినీ వాడిపోయినవే  వేసుకొనేవాడు. ఆ సంచిలోని  వక్కలు  కూడా  ప్రత్యేకమే. వక్కలు తమలపాకులతో నమిలి మ్రింగే పదార్థమని అందరి భావన. వక్కలు ముఖ్యోద్దేశం నోటిలో నీరూరేటట్టు చేయటమేగాని తాను నీరవ్వదు. చాలా సమయాల్లో నోట్లో ఉంచుకొని నీరూరిన పిదప, నానిన తర్వాతా ఆకుతో చూర్ణమవుతుంది. నోట్లో వేసుకోగానే మెత్తగా అయిపోతే ఎన్ని వక్కలయితే సరిపోతాయి? అంజప్ప తన సంచిలో నుండి వాడిన ఆకు తీసుకొని, కొంచెం  రాసుకొని నోట్లో వేసుకొంటూ ‘‘అదట్లా ఉండనీ! నేను, నీకొక  మాట  చెప్పాలని  వచ్చాను’’ అన్నాడు.

రంగప్ప: ఏ విషయం అంజప్ప? నీవు  అనుభవజ్ఞుడవు. నావంటి  వాళ్లకు తెలియనివి, నీకు  తెలిసినవి  నూరుంటాయి చెప్పు.
అంజప్ప: దానికోసమే నేనొచ్చినది. నీవు బెంచి మేజిస్ట్రేట్‌ అయినావు కదా! ఎదురున్న మనిషి  సత్యవంతుడా కాదా! అని తెలుసుకొని శిక్ష వేయాలి. ఈ పోలీసులు, లాయర్లు  చెప్పిన మాటలు  విని శిక్ష వేయకూడదు. ఆ విషయం నీకు  చెప్పాలనే వచ్చాను.
రంగన్న: అది సరే. అయినా సత్యవంతుడా! కాదా! అనేది వాళ్లు, వీళ్లు  చెప్పిన మాటలనుండే  తెలియాలి. న్యాయాధికారి  ఇంకేం  చెయ్యగలడు?
అంజప్ప: న్యాయాధికారి అన్నాక సత్యం ఎట్లుండవచ్చు? అని యోచన చేయాలి. ఎదురున్న వ్యక్తిని  ఏమిటని విచారించాలి. 
రంగప్ప: అంజప్ప! నీవు  కోపగించుకోనంటే ఒకమాట అడగనా?
అంజప్ప: ఏమిటో అడుగు, కోపమెందుకు! 
రంగప్ప: నీ పైన ఎప్పుడైనా న్యాయాధికారికి  ఫిర్యాదు జరిగిందా?

అంజప్ప: అవును. నేను భాదించబడ్డాను. ఆ విషయాన్నే నీకు చెప్పడానికే వచ్చింది. ఒక కోడి  దొంగలించబడినది అని  ఫిర్యాదు చేశారు. ఆ దొంగిలించిన వ్యక్తి నేనేనని. దొంగిలించలేదని నేను,  కాదు నువ్వే  దొంగిలించావని వాళ్ళ వాదన. చివరికి నన్ను నేరస్తుడిని చేశారు. ఇరవై రూపాయాలు జరిమానా కడితే వదులుతామన్నారు! లేకపోతే  జైలు అని తీర్పు. జరిమానా కట్టి మానం  కాపాడుకొని వచ్చినాను.
రంగప్ప: నీవు కోడిని దొంగిలించావని వాళ్లెలా అన్నారు. కోడి నీ దగ్గర  ఉన్నదా  ఏమి?
అంజప్ప: ఉండినది. నా గాచారం. ఆ ముండ  కోడి నా దగ్గర ఉన్నందుకే  కదా నేను  ఇరుక్కున్నది.
రంగప్ప: ఇంకా నీవు  దొంగతనము చేయలేదంటావా!
అంజప్ప: అదే నేను చెపుతున్నది. కోడి నా దగ్గర  ఉంది. కానీ దానిని నేను దొంగలించలేదు.
రంగప్ప : అలా అయితే విషయము వివరంగా  చెప్పవచ్చు కదా...
అంజప్ప అప్పుడు చెప్పిన కథ ఇలా ఉంది...

ఈ సంఘటన సుమారు నలభై సంవత్సరాల మునుపు జరిగి ఉంటుంది. అప్పుడు అంజప్ప నడి  వయస్సు మనిషి. ఆ రోజుల్లో తన కులవృత్తి  కోసం ఊరూరూ తిరుగుతూ ఉండేవాడు. అతనిది  దాసర జోగి వృత్తి. అంటే అందంగా వేషము వేసుకొని, ఎడమ భుజానికి జోలీ,కుడి భుజానికి ‘తంబుర’ వేసుకొని ముత్తాతల కాలంనాటి నుండి ఉన్న పాటలను పాడుకొంటూ ఊరంతా  భిక్ష  చేయడం. దాసర జోగి వృత్తి వాళ్లు ముత్తాతల కాలంలో భిక్ష చేసేవారే తప్ప వ్యవసాయం చేసేవారు కాదు. కాలం చెడి ఈ రోజుల్లో దాసర వాళ్ళు కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నారు. భిక్ష చేయడమనేది నీచవృత్తి అని మనం అనుకోవచ్చు. కానీ ఈ మాటను అంజప్ప ఒప్పుకోడు. 

‘‘జోగి అంటే ఏమనుకొన్నావ్‌? ఊరికే అవుతారా? ఇరవై  సంవత్సరాలు తండ్రి  జతలోనో, మామ  జతలోనో  ‘తంబుర’ ఎత్తుకొని తిరిగి, పాడుతూ, పాటల జతకు ఆడుతూ వృత్తి  నేర్చుకోవడం అంటే సామాన్యమైన పనా? వ్యవసాయం చేసేటప్పుడు మడక వెనుక నిలబడి జాటి కోలతో ‘చో చో’ అంటే చాలు.
పాటలు నేర్చుకోవాలంటే నాలుక అవసరం లేదా? తెలివి ఉండనక్కర లేదా? జ్ఞాపకశక్తి ఉండనక్కర లేదా!  ‘ఊ ఊ’ అంటే వచ్చేస్తాయా! లక్ష్మీ అనాలంటే అందరికి  నోరు తిరుగుతుందా! దానిని పలకమంటే ‘లక్స్‌ మీ  లక్స్‌ మీ’ అని  వదరుతారు. ద్రౌపది దేవి అనాలంటే నోరు తిరగడం అంత సులభమా! ‘వృత్తి  నేర్చుకున్నావు. ఇంక ఫర్వాలేదు. నీ ఒక్కడివే పోయి రావచ్చు’ అని నాన్న చెప్పడానికి నాకు 25 ఏళ్ళు వచ్చినాయి తెలుసా!’’ అంటాడు అంజప్ప.
 

జోగి కావడానికి డిగ్రీ  తీసుకోవాలంటే ఎంత కష్టమో అంత కష్టము అని అంజప్ప భావన. అంజప్ప, చుట్టూ ఉన్న అరవై, డెబ్భై గ్రామాలు తిరిగేవాడని తెలుస్తున్నది. జోగి అయినవాడు ఇంటి నుండి బయటకు రావాలంటే అందరి భిక్షువుల్లాగా  రావడానికి కుదరదు. నాటకంలో రాజు పాత్ర  చేసే వ్యక్తి  ఏ విధంగానైతే ముఖానికి రంగు, చెంపకు మీసాలు, నడుముకు రంగులు వేసుకొని వస్తాడో ఆ విధంగా పాడటానికి వెళ్లే  జోగి కూడా సంప్రదాయం ప్రకారం అలంకారము  చేసుకోవాలి. జోగి  వంశస్థులు  శైవులు కాదు, వైష్ణవులు కాదు. క్షుద్ర దేవతలను  పూజించేవారూ కాదు. వీటిలో దేన్నీ వదిలే వారు కాదు. దానివల్ల అతని ముఖం మీద  విభూతి, కుంకుమ, పసుపు మూడూ రాసుకొంటారు. దానితో పాటు జోగి కన్నులు చాలా క్రూరంగా ఉంటాయి. అంతేకాకుండా కన్నులు తీక్షణంగా కనపడాలని కాటుక కూడా పెట్టుకునేవారు.  భీముడు, హనుమంతుడి పాత్రలలో మాటలు, పద్యాలు  చెప్పేటప్పుడు కన్నులకు కాటుక లేని యెడల, ఆ తీక్షణ దృష్టిగాని జనాలకు తగిలితే అక్కడే మూర్ఛపోతారు. ముఖం అలంకరించుకొన్నట్టే, మూడు రంగులకు తక్కువ లేకుండా చుక్కలు కలిగిన తల రుమాలు పెట్టుకోవాలి. అంజప్ప వయస్సులో చూడటానికి చాలా అందంగా ఉండేవాడు. ఈ వేషం వేసుకొని పల్లె పదాలు చెపుతూ ఉంటే ఆడవాళ్లు తన చుట్టూ మూగేవారు. రెడ్డి ఇంటి ముందు కూర్చొని పద్యాలూ చెప్పేవాడు.
నలభై  సంవత్త్సరముల మునుపు  ఇతని  జోగి వృత్తి  చాలా ఉచ్చస్థితిలో ఉండేది. అంజప్ప  ప్రజలకు  చాలా అవసరమైన మనిషి. ఇతను  వెళ్లే  ఊళ్లల్లో  కాళాపుర ఒకటి.  కాళాపురము దానికి  

తగినట్లుగానే అతి పెద్ద ఊరే. అందువల్ల అంజప్ప అక్కడికి  వెళ్ళినప్పుడు, రెండు మూడు రోజులు ఉండి వచ్చేవాడు. అంజప్ప బాగా సొగసుగా ఉండేవాడని  చెప్పిన మాట గుర్తుపెట్టుకోవాలి. మధ్య వయస్సులో ఉన్న  స్త్రీలతో  మాటలాడానికి అంజప్ప  వెనుకేసేవాడు కాదు.  వీళ్లతో మాట్లాడినందుకు అంజప్పను కోప్పడేవారు ఎవరూ ఉండేవారు  కాదు. కానీ  చిన్న వయస్సులో ఉన్న స్త్రీలతో మాట్లాడడానికి అంజప్ప కొంచెం వెనుకేసేవాడు. ఇంటి యజమాని  చూస్తే–
 ‘‘ఏమయ్యా జోగి! భిక్షం తీసుకొని పోకుండా ఇంటి ఆడవాళ్ళతో సరసాలాడుతున్నావా! పద బయటకు’’ అనేవారు.
 తెలిసినవాళ్లు చూస్తే  ‘‘ఏమి జోగప్ప పర్వాలేదే!’’ అని నవ్వేవారు. భిక్షతో జీవించే మనిషికి ఈ రెండు మూడు మాటలు కూడా బాధించేవే.  కాళాపురము ఒకసారి  వెళ్ళినప్పుడు, ఆ ఊరి రెడ్డి భార్య  అంజప్పను కూర్చోబెట్టుకొని పద్యాలు చెప్పమని అడిగిందట. రెడ్డిగారికి ఆమె మూడవ భార్య. పద్యాలు  చెప్పిన తర్వాత  అంజప్పకు ఆకు,వక్కలు ఇచ్చినదట. ఆకు,వక్క వేసుకోవాడానికని కొంచెం  సమయం అక్కడనే  కూర్చొన్నాడట. మధ్యలో రెడ్డి వచ్చి అంజప్పపై చాలా కోప్పడ్డాట. అంజప్ప  తిరిగి బదులు చెప్పేరకం కాదు. రెడ్డి  కొన్ని తప్పుడు  మాటలు  వాడినందువల్ల అంజప్పకు కోపం వచ్చింది.
 ‘‘నీవు మాన,మర్యాద ఉన్న మనిషి అయితే  నీ భార్యకు మంచీచెడ్డ చెప్పుకో, అంతేగాని నన్నెందుకు తిడుతారు!’’ అన్నాడట. 
‘‘జాగ్రత్తగా ఉండు జోగి. ఏదో ఒకరోజు  బలైపోతావ్‌’’ అన్నాడట రెడ్డి. అంజప్ప కూడా తిరిగి రెండు మాటలు  అనేసి, అక్కడి నుండి లేచి బయలుదేరి వెళ్లిపోయాడట.

ఇది జరిగిన తర్వాత  కూడా ఒకటి  రెండుసార్లు  కాళాపురం వెళ్ళాడు. కానీ  విశేషమేమియు  జరగలేదు. మూడోసారి వెళ్ళినప్పుడు ఆ ఊరి రచ్చబండ దగ్గర కూర్చొని ఏవో చాటు పద్యాలు  చెబుతుండగా ప్రక్కనున్న ఇంట్లోని ఒక యువతి ఇంటి ముంగిట్లో నిలబడుకొని పద్యాలు వింటూ ఉన్నది. పద్యాలు చెప్పడం ముగిసి బయలుదేరే స్థితిలో ఉండగా అప్పుడు అంజప్పని పిలిచి కొంచెం భిక్షమేసింది. మరురోజు అంజప్ప ఆ ఇంటి దగ్గరికి వెళ్లి పద్యాలు చెప్పడం ప్రారంభించాడు. ఆ యువతి అంజప్పను పిలిచి తన ఇంటిదగ్గర  కూర్చోబెట్టుకొని పద్యాలు చెప్పించుకొని భిక్ష  ఇచ్చింది. అది ఆ ఊరిలో కలిగి ఉన్న పెద్దఇల్లు. ఆ యిల్లు ఎవరది? ఆ యువతి ఎవరు? ఎవరి బిడ్డ? అని విచారించాడు. ఎవరిదో ఇల్లు! ఆ ఇంటిపేరు గుర్తులేదు. వాళ్ళు పుణ్యవంతులు. ఆ యువతి  భర్త  పనీ పాటా లేకుండా ఊర్లు తిరిగే రకం అట. ఆ యువతి  అంత మంచిదేమీ కాదట. అది అంజప్పకు అప్పుడు తెలియదు. ఆ ఇంటిలో ఆ యువతి, ఆమె భర్త, అత్తా  ముగ్గురే ముగ్గురు. వాళ్ళు కోళ్లు పెంచుకొంటూ ఉండేవారు. కోళ్ల వ్యాపారం చేసేవారట. ఆ తర్వాత అంజప్ప కాళాపురానికి వెళ్ళినప్పుడు మరలా ఆ యువతి ఇంటికే వెళ్ళాడు. ఆమె చాలా అందమైనది. అంజప్పకి  ఏ చెడు  ఉద్దేశ్యమూ లేదు. కాని తన పద్యాలను బాగా  మెచ్చుకొనటం చేత, తనకు  మరలా పద్యాలు చెప్పి, తను సంతోషపడితే చూడాలనేది ఇతని కోరిక. చుట్టూ చేరిన ప్రజలందరికి పద్యాలు, పాటలు చెప్పిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ వెళ్లిన తరువాత అంజప్ప ఆ యువతి ఇంటి దగ్గర ఆకు వక్క వేసుకొంటూ కూర్చొన్నాడు. కొంతసేపటికి ఆ యువతి  ద్వారం  వైపు  వచ్చి– ‘‘జోగప్ప, నీవు ఈ ఊరి నుంచి వెళ్ళేటప్పుడు ఇట్లా వచ్చిపో’’  అనింది. 
 

‘‘ఎందుకమ్మా? నేను ఇప్పుడే  బయలుదేరుతున్నాను’’ అన్నాడు అంజప్ప.
‘‘నీ పద్యాలు విని  చాలా సంతోషమయినది. నీకేమైనా ఇవ్వాలని చాలాసార్లు అనుకొన్నాను. అయితే  తీసుకొన్న వెంటనే వెళ్లిపోవాలి. మా అత్తకు తెలిస్తే  జగడం  చేస్తుంది’’ అనింది.
అంజప్పకి తీసుకొనేదానికి భయం.వద్దు అనే దానికి ఇష్టంలేదు. కానీ ఇతను ఏదోఒకటి చెప్పే లోపలే ఆ యువతి ఇంట్లోకి వెళ్లి ‘‘జోగప్ప! ఇక్కడకు రా!’’  అన్నది. 
అంజప్ప లోపలికెళ్ళాడు. ఆ యువతి ఒక  కోడిని తన జోలె లోపల వేసి ‘‘వెళ్ళు! వెళ్ళు!’’ అన్నది. 
ఎందుకు? ఏమి? అని ఏమీ ఆలోచన చేయకుండా బయటకు వచ్చాడు. ఇప్పుడెవరైనా పట్టుకొంటే తన గతి ఏమి? అని అంజప్పకు గుండె దడదడ  కొట్టుకొన్నది. 
ఆ యువతి లోపలినుంచి  ‘‘భద్రం!  జోగప్ప! నేను ఇచ్చినట్లు ఎవ్వరికి చెప్పకు సుమా’’ అని చెప్పినది.

అంజప్ప ఊరు దాటుకొని మైలు దూరంలో ఉన్న ఒక బావి వరకు జోరుగా నడచి వచ్చి అక్కడి  చెట్టు నీడలో కూర్చొని జరిగిన  సంఘటనని  గుర్తు  చేసుకొంటూ ఆకు వక్క వేసుకొంటున్నాడు. దానిమ్మపండు లాంటి భార్యను  ఇంట్లో పెట్టుకొని, ఆ యువతి  భర్త  పనీ పాటా లేకుండా సోమరిపోతులాగా ఊళ్లు  తిరుగుతున్నాడు అని అతనికి ఆలోచన వచ్చింది.
అంజప్ప ఈ విషయమంతా  మనస్సులోనే  తలచుకొంటూ  అక్కడ  ఉండటం  క్షేమం కాదనే  విషయాన్నే  మరిచాడు. కొంచెం సమయం అయిన తర్వాత ఎవరో ఒకతను  ఊరి  ప్రక్కనుండి  వచ్చి ఇతని దగ్గర∙నిలబడి ‘‘ఏమి  జోగిప్పా కూర్చున్నావు?’’ అన్నాడు. 
అంజప్ప ‘‘ఆ! కూర్చున్నాను స్వామీ’’ అన్నాడు. 
ఊరతను ‘‘జోలీ నిండినదా’’ అని  అడిగాడు. అంజప్ప ‘‘సాధారణమే’’ అన్నాడు. 
ఊరతను ‘‘ఇవి రాగులా ఏమి?’’  అని జోలె తెరిచి  చూచాడు. దానిలో కోడి ఉంది. ఊరతను– ‘‘ఇదేమిటి కోడి ఉందే!’’ అన్నాడు. 

జోగికి గుండె  ఝల్లుమంది. ‘‘అవునయ్యా! ఏదో ఒక ఇంటిలో ఇచ్చారు’’ అన్నాడు. ఇంకా మాట్లాడుతూ కూర్చొంటే ఏమేమి చర్చకు వస్తాయోమోనని లేచి  జోలిని భుజానికి  తగిలించుకొని  బయలుదేరడానికి  సిద్ధం అయ్యాడు. ఈలోగా ఊరి  ప్రక్క నుండి ఒక  వయస్సైన  స్త్రీ జతగా ఎవరినో ఒకరిని  తీసుకొని  జోరుజోరుగా  ఇతనికి దగ్గరగా రావడం గమనించాడు. వారికి కొంచెం దూరంలో ఇతనికి కోడిని ఇచ్చిన యువతి  కూడా వస్తున్నది. అంజప్పకు కాళ్ళు కట్టిపడేసినట్లై ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. దేనికోసం వస్తుందో తనకు అర్థమైనది. నిలబడి  ఆ యువతి వస్తున్న  వైపే  చూస్తూ ఉండగా ‘కోడి ఇచ్చిన సంగతి  చెప్పవద్దు’ అని దూరం నుండే  చేత్తో  సైగ  చేసింది.

ఆ ముదుసలి దగ్గరకు వచ్చి ‘‘ఇతనేనా ఆ జోగి?’’ అని అడిగింది. ఆమె జతలో వస్తున్న మనిషి, ఆ ఊరి తలారి అవునని చెప్పాడు. ఆ ముదుసలి  ఇతనిని ‘‘మా కోడిని  ఏమైనా చూసావా?’’ అని  అడిగింది. 
అంజప్ప ‘‘అదేదో పాడుకోడి నాకు తెలియకుండానే నా జోలీలోకి వచ్చియున్నది. ఇప్పుడే ఈ     మనిషి చెప్పాడు’’ అన్నాడు.
మొదట వచ్చిన వ్యక్తి  ‘‘ఎవరో  ఇచ్చారన్నారంటివే?’’ అన్నాడు.
 ‘‘అయ్యో రామా! నా జోలీలో పిడికెడు బియ్యం వేసేదే గొప్ప, అటువంటిది కోడినిస్తారా!’’ అన్నాడు  అంజప్ప.
వచ్చిన తలారి జోలెను తీసిచూసాడు. లోపల కోడి మూర్ఛపడి ఉన్నది. ముసల్ది ‘‘పర్వాలేదే! ఏదో పద్యాలు చెపుతున్నాడులే అని ఇంటి ముందు ఉండనిస్తే కోళ్లను ఎత్తుకుపోయే పని కూడా మొదలపెట్టావా!’’ అన్నది.

‘‘పద ఊళ్లోకి, రెడ్డికి  చెపుతా. భలే ఉంది జోగివృత్తి’’  అంటూ అంజప్ప బాగా తిట్టి పోసింది. 
‘‘నేను కోడిని దొంగిలించ లేదు. మీ కోడి అయితే నీవు తీసుకొనిపో! నాతో రచ్చకు రావద్దు’’ అన్నాడు అంజప్ప.
‘‘ఏమయ్యా! కోటేశ్వరుడిలా మాట్లాడుతున్నావు. దొంగిలించకుంటే కోడి నీ దగ్గరకు ఎలా వచ్చింది?’’ అని అడిగింది ముసల్ది.
ఆమె యువతి వైపుకి తిరిగి ‘‘ఇది మన కోడి కదా’’ అనింది. యువతి మనది కాదనీ కానీ, అవుననీ కానీ చెప్పకుండా జోగప్ప ఎక్కడైనా కొనుక్కొని ఉండవచ్చు అన్నది. 
తలారి ‘‘ఈ మాటలన్నీ ఎందుకులే! ఊరి రెడ్డి దగ్గరకు పోదాము. విషయం అంతా చెపుదాము. అతను న్యాయం తేలుస్తాడు’’ అన్నాడు. 
రెడ్డికి తన మీద కోపం ఉంది! అనే  విషయం అంజప్పకు తెలుసు కదా ‘ఇదేమి  కర్మరా!’ అనుకొంటూ వారితో వెళ్ళాడు. 

అక్కడ జరిగినదంతా చెప్పి ప్రయోజనము లేదు. ఎందుకంటే ఊరిలో ముందు కోళ్లు  పోగొట్టుకొన్న వాళ్ళు, పోగొట్టుకోని వాళ్ళు అందరూ జోగప్ప పోయిన సారి వచ్చినప్పుడు  ‘‘మాది  కూడా ఒక  కోడి  కనపడకుండా పోయింది’’ అని  చెప్పుకొంటున్నారు. 
రెడ్డి గారు వచ్చారు.
 ‘‘ఏమి! జోగి, ఇన్నిరోజులు చెప్పింది కాదు పద్యాలు. ఇప్పుడు జైలుకు  పంపుతాను. అక్కడ  చెప్పుకో పద్యాలు’’ అన్నాడు. 
పోలీస్‌స్టేషన్‌ చాలా దూరమేమీ లేదు. ‘దొంగతనం చేశాడు’ అని పత్రం రాసి కోడితో సహా  పంపాడు. అక్కడ ప్రశ్న, సమాధానాలన్నీ జరిగాయి. అంజప్ప విచారణరోజు కోర్టుకు  హాజరవుతానని చెప్పి జామీను మీద  ఊరికి వచ్చేశాడు. విచారణ జరిగింది. విచారణ చేయడానికి ఏముంది? ముసలమ్మ ఇంట్లో కోడి పోయిందనేది  వాస్తవం. ఆ కోడిని తను కనుక్కొన్నది. అది జోగప్ప దగ్గర దొరకడం నిజం. దానికి ముగ్గురు మనుషులు  సాక్షులుగానూ ఉన్నారు. 
మేజిస్ట్రేట్‌  ‘‘నీవు  చెప్పేదేమైనా ఉంటే  చెప్పవచ్చు ’’ అన్నారు.

అంజప్ప: ఎక్కడో పద్యాలు చెప్పుకొంటుండగా వెచ్చగా ఉంటుందని కోడి జోలీ లోపలకు వచ్చి ఉండవచ్చు. ఆ విషయం నాకు తెలియదు. తెలియకుండా  తెచ్చాను.
మేజిస్ట్రేట్‌: ఏమి కథలు చెపుతున్నావా!  కోడి వచ్చి తనకు తానే  నీ  జోలె సంచిలో  కూర్చోగలుగుతుందా! నిజం చెప్పు?
అంజప్ప: స్వామీ! నేను సత్యమునే చెపుతున్నాను. మీరు  చెప్పిన ఏ దేవుని మీదైనా  ప్రమాణం  చేస్తాను. నేను కోడిని దొంగిలించలేదు.
మేజిస్ట్రేట్‌: నీవు కోడిని దొంగిలించలేదంటున్నావు. కోడి దానికదే  జోలీలోనికి  రావడానికి వీలు కాదు. ఎవరైనా ఇచ్చారా?

‘‘ఆ యువతి ఇచ్చింది’’ అని చెప్పాలని నోటి దాకా వచ్చింది. కానీ ఆమె ‘ఎవ్వరికీ చెప్పొద్దూ’ అని  చెప్పి ఉన్నది. ఆ తరవాత నాకు సైగనూ చేసి ఉంది. అంతా జ్ఞప్తికి వచ్చిందో! ఏమో పాపం. ఏదో  మోహములో ఒక కోడిని ఇచ్చింది. ఆమెను ఎందుకు పట్టు పట్టించాలనే యోచన వచ్చి ఆ మాట  చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. 
‘‘ఏదైనా  చెప్పుకోవలసినది ఉందా?’’  అని మేజిస్ట్రేట్‌ అడిగాడు.
అంజప్ప: ఏమి చెప్పలేదు. బుద్ధి కర్మానుసారిణి. నిజమేమిటో మీకు ఆ దేవుడే తెలియజేయాలి. నేను  దొంగిలించలేదు.
మేజిస్ట్రేట్‌: నీకు సాక్షులెవరైనా ఉన్నారా? అంజప్ప: అయ్యో స్వామీ! నా కెవ్వరు సాక్షి! దేవుడే  సాక్షి.
మేజిస్ట్రేట్‌ ‘‘దొంగిలించినప్పటికి ఎంత అమాయకంగా మాటలాడుతున్నావో’’ అని చెప్పి ఇరవై రూపాయలు జరిమానా లేదంటే పదిహేను రోజులు జైలు శిక్ష అని తీర్పు చెప్పాడు. 
అంజప్ప జరిమానా కట్టి చింతా వదనంతో ఊరికి వచ్చాడు.
ఇది జరిగి నేను చెప్పినట్లే నలభై  సంవత్సరముల పైనే అయింది. అంజప్ప ఇది చెప్పి ‘‘మెజిస్ట్రేట్‌ పదవి అంటే ఏమనుకొంటున్నావ్‌? నేరస్తులను శిక్షించటం, సత్యవంతులను కాపాడటం దేవుని పని. ఆ పని, మనిషి చేతికి వచ్చినప్పుడు మనిషి దేవుడి లాగా నడుచుకోవాలి. పెద్దా చిన్నా అంటే ఎంతో భయంగా ఉండాలి. ఆ మేజిస్ట్రేట్‌ నాకు బేడీలు  వేయమనడం మాత్రం  అన్యాయం’’ అని  అన్నాడు.
∙∙ 
రంగప్ప: నీవు చెప్పివుంటే సరే! ఏమి జరిగినదని నీవు చెప్పకుండా పోతే! మేజిస్ట్రేటుకు ఎట్లా  తెలుస్తుంది?
అంజప్ప: చెప్పిన దాని బట్టే న్యాయం చెప్పడానికైతే, మీ అంత బుద్ధిమంతులు ఎందుకు? సత్యం ఏదీ అని తెలుసుకోవటం మేజిస్ట్రేట్‌ పని.
రంగప్ప: ఆ యువతి మర్యాద కాపాడాలనే ఉద్దేశ్యంలో జరిమానా కట్టాల్సివచ్చినది. సర్లే, ఏదో జరిగింది వదిలేయ్‌.
అంజప్ప: అయ్యో! అదెందుకు అడుగుతావ్‌? తాను ఎవరనితోనో స్నేహంగా ఉండేదట. మునుపు రెండు మూడుసార్లు  అతనికి  కోడి ఇచ్చిందట. దాని అత్తా, కోడి ఏమైంది, కోడి ఏమైంది! అని అడుగుతూ ఉండేదట.ఎవరో దొంగలించింయుడవచ్చు అని ఆ ముసలిదానికి చెపుతోందట. ఆ అత్తా నమ్మిందట. బహుశా ఫలానా మనిషి దగ్గర ఉండవచ్చని చెపితే తన తప్పు బయట పడకపోవడమే కాకుండా తన మీద అత్తకు నమ్మకం కుదురుతుంది కదా అని, ఇదంతా ఆ యువతే  చేసిందని తర్వాత  నాకు  తెలిసింది.
రంగప్ప: ఏమీ! ఆ యువతి  నీకు కోడినిచ్చి, తానే అత్తకు  చెప్పిందా!
అంజప్ప: ఓస్‌! అలానే జరిగినది. అత్త వచ్చి, కోడి ఎక్కడ అనింది. కోడలు నాకు  తెలియదు అన్నది. అట్లాఅయితే ఏమైయుండవచ్చు. ఇక్కడకు ఎవరైనా వచ్చినారా! అని అడిగిందట. కోడలు నాకు తెలియదన్నది. ఆ తర్వాత ఎవరో  జోగప్ప వచ్చి పోయినాడు అనింది. ప్రక్కింటి వాళ్ళు ‘అవును జోగి ఇప్పుడే  చాలా  జోరుగా  పోతూ ఉన్నాడు’  అన్నారట. కాలమహిమ నేను  దొరికి  పోయాను.

రంగప్ప: ఈ విధంగా  చేయవచ్చా అని  ఆ యువతిని అడగలేదా! 
అంజప్ప: అప్పుడు మీరంతా చిన్నపిల్లలు. నేను వయస్సులో ఉన్నవాడిని. ఆ ప్రాయంలో జరిగినవి ఇప్పుడు ఎందుకు లే! పోవడం, అడగడం అన్నీ జరిగినవి... 
రంగప్ప: సరే వదిలేయ్‌. నా దగ్గరేమైనా తప్పున్నట్లు అనిపిస్తే చెప్పు. నిజమేమిటో సరిగా  తెలుసుకొంటాను.
అంజప్ప: ఇప్పుడు నా న్యాయాధిపతి, నా తండ్రి తిరుపతి వెంకటరమణస్వామి. తిరుపతి పోవాలి. తన ముందు నిలబడి ఏదో తప్పు జరిగిందని కాళ్ళావ్రేళ్ళా పడాలి. ఆ దేవుడే నన్ను కాపాడుతాడు!  అంజప్ప ఇంకొంత సేపు కూర్చొని ‘‘ఏమయ్యా! నీవు మేజిస్ట్రేట్‌  అయినదానికీ ఒక  ఆకు వక్క అయినా ఇవ్వచ్చుగా?’’ అన్నాడు.  
రంగప్ప పిల్లలతో తెప్పించి అతనికి కొంచెం ఆకులు, వక్కలు ఇప్పించాడు. అంజప్ప దానిని తీసుకొని ‘‘ఆ! నేను చెప్పినదంతా గుర్తు పెట్టుకో! ఇంక బయలుదేరుతాను’’ అని  చెప్పి వెళ్ళాడు.
కన్నడ కథ: మాస్తి వెంకటేష్‌ అయ్యంగార్‌
అనువాదం: పి.వెంకటరెడ్డి 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top