అతిధి

One is riding a horse and another person walking - Sakshi

కథా ప్రపంచం

ఇద్దరు వ్యక్తులు కొండెక్కి రావడం గమనించాడు టీచర్‌ దారూ. ఒకడు గుర్రం మీదా, మరొకడు నడిచి వస్తున్నారు. మంచులో ప్రయాణం కష్టమే. అతికష్టం మీద ఒక్కొక్క అడుగేస్తూ రొప్పుతూ నెమ్మదిగా కదులుతున్నారు. వాళ్లిక్కడికి చేరటానికి కనీసం మరో అరగంటైనా పడుతుంది. ఎముకలు కొరికేస్తున్న చలి. స్వెట్టర్‌ కోసం వెనక గదిలోకెళ్లాడు.ఎనిమిది నెలల తర్వాత వర్షానికి కూడా తెరిపివ్వకుండా అక్టోబర్‌లో మంచు కురిసింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ఇరవైమంది పిల్లలు రావటం లేదు. ఆ బిల్డింగ్‌లోని ఒక్క గదిని మాత్రమే హీట్‌ చేశాడు దారూ. కొండవైపు కిటికీ ఉన్న క్లాస్‌రూం బాగా చల్లగానే ఉంది.తిరిగివచ్చి చూస్తే వాళ్లు కనిపించలేదు. అంటే కొండ శిఖరానికి దిగువన ఉన్నారన్నమాట. మసక చీకటిగా ఉంది. మిట్ట మధ్యాహ్నమైనా నల్లటి మేఘాలింకా తొలగిపోలేదు.మంచు, చలిగాలితో శరీరం గడ్డకట్టుకుపోయింది. అదృష్టవశాత్తూ తాడ్జిడ్‌ నుంచి వచ్చిన డెలివరీ ట్రక్కు తనకు రెండు రోజుల రేషన్‌ దినుసులు సరఫరా చేసిపోయింది. స్కూలుకొచ్చిన పేదపిల్లల కుటుంబాలకు పంచటానికి గోధుమ బస్తాలు ఒక గదిలో పేర్చి ఉన్నాయి. ఏ ఉపద్రవం సంభవించినా నష్టపోయేది పేదలే. వచ్చిన వాళ్లందరికీ రోజూ ధాన్యం పంచాడు. గత మూడు రోజుల స్టాకు నిల్వ ఉంది. మంచు కాస్త తెరిపిచ్చింది గనక, తమ కోటా ఇవ్వమని ఈరోజు ఎవరో వస్తారు, మళ్లీ కోతల దాకా ఇదే ధాన్యంతో సరిపెట్టుకోవాలి. ఫ్రాన్సు నుంచి ఓడలు వస్తూనే ఉన్నాయి. ఆకలి చావులు ఉండకపోవచ్చు. కానీ పేదల మొహాల్లోని దైన్యాన్ని మరచిపోవడం కష్టం.

ఇంతటి దుర్భర దారిద్య్రం మధ్య తను స్కూల్లో ఇంచుమించు సుఖంగా బతికినట్లే. సన్యాసి లాగ ఒంటరి జీవితం అయితేనేం.. శుభ్రమైన ఇల్లు. దారూ ఇక్కడ పుట్టి పెరిగిన మనిషి.స్కూలు డాబా పైకెక్కి చూశాడు. ఆ ఇద్దరూ సమీపిస్తున్నారు. గుర్రం మీదున్న వాడు పోలీస్‌ కానిస్టేబుల్‌ బాల్డచ్చి. తాడుతో బంధించి ఒక అరబ్బువాణ్ణి లాక్కొస్తున్నాడు. దగ్గ్గరగా వచ్చేశారు.‘‘మూడు కిలోమీటర్లు రావడానికి గంటపట్టింది’’ అంటూ అరిచాడు బాల్డచ్చి.‘‘లోపలకి వచ్చి ఒళ్లు కాచుకోండి’’ అంటూ ఆహ్వానించాడు దారూ. కళ్లెం తీసుకుని గుర్రాన్ని వెనక కట్టేసి వచ్చి, ‘‘క్లాస్‌రూం కూడా హీట్‌ చేస్తాను ఇక్కడే కూర్చుందాం’’ అన్నాడు దారూ.బాల్డచ్చి చేతికి కట్టుకున్న తాడు విప్పి అరబ్బును తాత్కాలికంగా బంధ విముక్తుణ్ణి చేశాడు. ‘‘పక్కగదిలోకెళ్లు. నీకోసం పుదీనా టీ చేస్తాను’’ అన్నాడు దారూ. దారూ టీ తెచ్చేసరికే, బాల్డచ్చి పిల్లల డెస్కు మీదా, అరబ్బూ అతడి కాళ్ల దగ్గర కూర్చుని ఉన్నారు. అతడి చేతికున్న కట్లుచూస్తూ ‘‘కాసేపు విప్పొచ్చేమో!’’ అన్నాడు దారూ సందేహంగా. ‘‘ఆ.. ఇప్పుడేమీ భయం లేదు. ప్రయాణంలో మాత్రమే చేతులు కట్టెయ్యాలి’’ అన్నాడు బాల్డచ్చి. టీ గ్లాసు పక్కన పెట్టి దారూ కట్లు విప్పగానే మొదట రెండు చేతులూ రుద్దుకుని, టీ గ్లాసు పెదాలకు ఆనించుకున్నాడు అరబ్బు.‘‘ఇంతకూ ఎక్కడికి ప్రయాణం?’’ దారు అడిగాడు. ‘‘ఇక్కడికే’’ అన్నాడు బాల్డచ్చి.

‘‘స్కూలుకొచ్చే పిల్లలు మీలాగా కూడా ఉంటారన్నమాట. ఇంతకూ రాత్రి ఇక్కడే గడుపుతారా ఏమిటి?’’ అంటూ నవ్వాడు దారూ.‘‘లేదు. నేను కాసేపట్లో ఎల్‌ అమీర్‌ వెళ్లి పోతాను. ఈ అరబ్బును మీరు టింగిట్‌ వద్ద అప్పజెప్పాలి. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి అధికారులు అక్కడికి వస్తారు’’. దారూకు ఈ కేసేమిటో అర్థం కాలేదు – ‘‘నాకేం సంబంధం?’’.‘‘నన్నేం చెయ్యమంటారు? అది పైనుంచి వచ్చిన ఆర్డర్‌’’ – ‘‘నేను టీచర్ని’’.‘అయితే ఏంటి? యుద్ధకాలంలో అందరూ అన్ని పనులూ చెయ్యాలి. నాకు వచ్చిన ఆర్డర్స్‌ గురించి చెప్పాను. శాంతిభద్రతల పరిస్థితులు మారుతున్నాయి. తిరుగుబాటు జరిగే అవకాశముందని సంకేతాలు వచ్చాయి..’’ఇదంతా నమ్మలేనట్టుగా చూశాడు దారూ.‘‘తొందర పడకు. అన్నీ నెమ్మదిగా అర్థం చేసుకో. గస్తీ తిరగటానికి ఎల్‌ అమీర్‌ వద్దకు డజను మందిమి మాత్రమే ఉన్నాం. నేను త్వరగా వెళ్లాలి. వీణ్ని నీకప్పజెప్పి వెంటనే తిరిగి రావాలని ఆర్డర్స్‌. అసలు ఇక్కడికెందుకు తెచ్చాననుకుంటున్నారు? ఊళ్లో కాస్త ఉద్రిక్తంగా ఉంది. బందీని విడిచిపెట్టాలని గోల చేస్తున్నారు. ఇక్కణ్నించి టింగిట్‌ ఇరవై కిలోమీటర్లే గదా. మీ వంటి వస్తాదు ఆ మాత్రం నడవలేడూ!’’.పెరట్లో గుర్రం సకిలించింది. కిటికీలోంచి చూశాడు దారూ. కాస్త వెలుగొచ్చింది. తర్వలో మంచు కరుగుతుంది.  ‘‘ఏం చేశాడతడు? ఫ్రెంచివచ్చా?’’
‘‘ఒక్క ముక్క కూడా రాదు. నెల రోజులుగా వీడికోసం గాలించాం. మిత్రులూ, బంధువులూ దాచిపెట్టారు.

తన కజిన్‌ను చంపాడు’’‘‘ఇతడు మనకు శత్రువా?’’‘‘కాకపోవచ్చు. కానీ ఏమో ఎలా చెప్పగలం?’’‘‘ఎందుకు చంపాడు?’’‘‘కుటుంబ కలహం. ఒకడు మరొకడికి ధాన్యం బాకీ ఉన్నాడట. అసలు విషయమేమిటో స్పష్టంగా తెలియదు. గొర్రెల్ని కొక్కానికి వేళ్లాడదీస్తామే, దాంతో చంపాడు’’బాల్డచ్చి వైపు భయంగా చూశాడు అరబ్బు. దారూ అసహ్యంగా తలాడించాడు. ‘‘వెళ్లొస్తాను మరి’’ అంటూ బాల్డచ్చి లేచి, తాడు తీసుకుని అరబ్బువైపు నడిచాడు.‘‘ఎందుకది?’’‘‘మీ ఇష్టం. దగ్గిర రివాల్వరుందా?’’‘‘ఏదో ఒకటుందిలే’’– ‘‘ఎక్కడ?’’‘‘ట్రంకులో’’– ‘‘తీసి దగ్గిర పెట్టుకోవాలి’’‘‘భయపడాల్సిందేముంది?’’‘‘తిరుగుబాటే గనక జరిగితే ఎవరూ ఎవర్నీ రక్షించలేరు. ఆత్మరక్షణ ఒక్కటే మార్గం’’‘‘ఈ ఇల్లు కొండ మీదుందిగదా, వాళ్లు రావటం నాకు కనిపిస్తుందిలే’’ – ‘‘అది ఆత్మవిశ్వాసం కాదు. అతి నమ్మకం. నా దగ్గర రెండు రివాల్వర్లున్నాయి. ఒకటి తీసుకోండి’’ అన్నాడు బాల్డచ్చి. నల్లటి పెయింట్‌తో టేబుల్‌ మీద నిగనిగా మెరిసింది రివాల్వర్‌. ‘‘బాల్డచ్చీ, నా మాట విను. ఇతణ్ని చూస్తే నాకు అసహ్యమే. కానీ నా చేతుల్తో మళ్లీ పోలీసులకు మాత్రం అప్పగించను. యుద్ధం వస్తుందంటావా? అవసరమైతే నేనూ పోరాడుతాను. కానీ మనుషుల్ని పోలీసులకు పట్టివ్వడం పిరికిపంద లక్షణం’’‘‘నువ్వో మూర్ఖుడివి. మనుషుల్ని అదుపులో ఉంచటమే నేరమనుకుంటావు. కొందర్ని బంధించక తప్పదు. అందుకు మనం సిగ్గు పడాల్సిందేం లేదు’’‘‘నేను ఇతణ్ని ఎవరికీ అప్పగించే ప్రసక్తి లేదు’’‘‘దిసీజ్‌ ఏన్‌ ఆర్డర్‌. రిపీట్‌ చెయ్యమంటావా?’’‘‘నేను నీకు చెప్పిందాన్ని వాళ్లకు రిపీట్‌ చెయ్యి. మళ్లీ చెబుతున్నాను. ఇతణ్నెవరికీ అప్పగించను’’‘‘ఓకే, నేనెవరికీ ఏం చెప్పను. ఇతణ్ని నీకు హేండోపర్‌ చేశాను. ఈ కాగితం మీద సంతకం పెట్టు. ఆ తర్వాత నీ ఇష్టం’’‘‘అక్కర్లేదు. నువ్వు నాకప్పగించావని అవసరమైనప్పుడు వాంగ్మూలమిస్తాను. సరేనా?’’‘‘నీ నిజాయితీ గురించి సందేహం లేదు. కానీ సంతకం చెయ్యక తప్పదు. దటీజ్‌ ది రూల్‌’’ ‘‘ఇలా ఇవ్వు’’. దారూ సంతకం పెట్టిన రసీదు మడిచి జేబులో పెట్టుకున్నాడు బాల్డచ్చి.

అరబ్బు వైపు చూసి గుమ్మం దాటాడు బాల్డచ్చి. ముందుకు వెళ్లినవాడు కాస్తా, సడెన్‌గా వెనక్కు వచ్చి, కిటికీలోంచి చూసి వెళ్లాడు. మంచులో అడుగుల చప్పుడు కూడా వినిపించలేదు. గుర్రమెక్కి, కళ్లెం పట్టుకుని మరోసారి లోపలికి తొంగిచూశాడు. ఆ తర్వాత నెమ్మదిగా కొండదిగి అదృశ్యమయ్యాడు.మంచం మీద పడుకుని, నిశ్శబ్దాన్ని  వింటూ ఆలోచించాడు దారూ. యుద్ధం తర్వాత తానిక్కడికొచ్చిన కొత్తలో ఈ నిశ్శబ్దాన్ని భరించలేక గిలగిలా కొట్టుకున్న రోజులెన్నో! కొండ దిగువన, చిన్న గ్రామంలో ఏదైనా ఉద్యోగం కావాలని దరఖాస్తు పెట్టుకున్నాడు. మైదానానికీ, కొండ ప్రాంతానికీ ఉన్న సరిహద్దు అయింది. ఎటు చూసినా రాళ్లూ రప్పలు తప్ప మనుషుల జాడే లేదు. అక్కడక్కడా నాగటిచాళ్లు కనిపించాయి. కానీ, ఆ దున్నినవాళ్లు పంటలకోసం కాక, ఇల్లు కట్టడానికి అవసరమైన రాళ్ల కోసమే ఇంత కష్టపడినట్టుంది. ఇళ్లలో జనపదాలు వెలిశాయి. ఎక్కడినుండో మనుషులు గుంపులు గుంపులుగా వచ్చారు. సంసారాలు చేశారు. పిల్లల్ని కన్నారు. ఒకర్నొకరు చంపుకున్నారు. వేలాది మైళ్లు వ్యాపించిన ఈ ఏడాదిలో అందరూ ఇసుక రేణువుల్లాంటివారే. తనైనా తన అదుపులో ఉన్న ఈ అతిథైనా! కానీ.. ఇక్కడి పరిస్థితులకు అలవాటుపడిన మనుషులు మరోచోట బతకగలరా? లేచి కూర్చున్నాడు దారూ. పక్కగదిలో ఏ కదలికా లేదు. ఇదే అదనుగా అతడు పారిపోతే తన సమస్య తీరుతుంది. తొంగి చూశాడు. అక్కడే పడుకున్నాడు అరబ్బు. ‘‘ఇటురా, ఆకలిగా ఉందా?’’ అంటూ పిలిచాడు దారూ.ఆ ఆహ్వానం కోసమే నిరీక్షిస్తున్నట్లుగా గబుక్కున లేచాడు అరబ్బు.

టేబుల్‌ మీద ఇద్దరికోసం పళ్లాలు అమర్చి పిండిలో నూనె కలిపి, రొట్టె చేసి, గ్యాస్‌ స్టవ్‌ వెలిగించాడు దారూ. జున్ను, గుడ్లు, ఖర్జూరాలు, పాలూ తెచ్చాడు. అరబ్బు ఇదంతా ఆసక్తిగా గమనించాడు. ఆమ్లెట్‌ వేసి, తన అతిథిని ‘రా’ అంటూ ఆహ్వానించాడు. మర్యాదగా ఉంటుందనుకున్నాడేమో, రివాల్వర్‌ తీసి డ్రాయర్‌లో పెట్టాడు – ‘‘తిను’’.‘‘మీరూ తినండి’’ అన్నాడు అరబ్బు.‘‘తర్వాత’’. భయంగా, అనుమానంగా చూస్తూ, ‘‘కేసు విచారించే జడ్జ్‌ మీరేనా?’’ అడిగాడు అరబ్బు. ‘‘లేదు. రేపటిదాకా నిన్నిక్కడ ఉంచుకోవాలి. అంతే’’.ఒక ఫోల్డింగ్‌ కాట్‌ వేసి, దానిమీద రెండు బ్లాంకెట్లు పరిచాడు దారూ. పడుకుంటే, అతడికి కాపలా కాయడం తప్ప యింక చెయ్యాల్సిందేమీ లేదు. ‘‘ఎందుకు చంపావు?’’ అనడిగాడు దారూ.అరబ్బు ఉలిక్కిపడ్డాడు. ‘‘అతడు పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటాడి చంపక తప్పలేదు. నన్నేంచేస్తారు?’’‘‘భయపడుతున్నావా?’’అరబ్బు మాట్లాడలేదు.‘‘చేసిన పనికి విచారిస్తున్నావా?’’అరబిక్‌లోనే అడిగినా ఆ మాట అర్థం కానట్టుగా చూశాడు.‘‘ఇక్కడ పడుకో’’కాసేపాగి, ‘‘రేపు నా కోసం పోలీసులొస్తారా?’’ అని అడిగాడు అరబ్బు.‘‘తెలియదు’’‘‘నా వెంట మీరు కూడా వస్తారా?’’‘‘ఎందుకు?’’‘‘రండి’’∙∙ 

అర్ధరాత్రి దాటింది. దారూకు నిద్రపట్టలేదు. అరబ్బు పక్కకు ఒదిగి పడుకున్నాడు. నిలకడగా ఉన్న ఊపిరిని బట్టి అతడు నిద్రపోతున్నాడని తెలిసింది. దారూకు కొత్తగా ఉంది. ఏడాదిగా ఈ గదిలో తను ఒంటరిగా పడుకున్నాడు. ఈనాడు ఒక అనుకోని అతిథి తోడుగా ఉన్నాడు. తనూ ఇక్కడివాడే. అంటే తమిద్దరూ సోదరుల్లాంటి వాళ్లు. కానీ... సౌభ్రాతృత్వ భావనకది సమయం కాదు. అరబ్బు కదిలాడు. ఊపిరి బిగపట్టాడు దారూ. నిశ్శబ్దంగా లేచాడు. తలుపుతీసి అడుగులో అడుగు వేసుకుంటూ నిద్రలో నడుస్తున్నట్లు బయటికెళ్లాడు అరబ్బు. ‘పారిపోతున్నట్టున్నాడు. పీడ వదిలింది’ అనుకున్నాడు దారూ. పెరట్లో నీళ్ల చప్పుడు వినిపించింది. మరి కాసేపటికి ఖైదీ లోపలికి వచ్చి మంచం మీద వాలాడు.కలకూ, వాస్తవానికీ తేడా తెలియని స్థితిలో ఉన్నాడు దారూ. మెలకువ వచ్చేసరికి తెల్లవారింది. అరబ్బు గాఢ నిద్రలో ఉన్నాడు. నోరు తెరుచుకుని ఉంది. కాఫీ తాగే టైమైంది. నెమ్మదిగా అతిథిని తట్టి లేపాడు. ఉలిక్కి పడినట్లుగా లేచాడు అరబ్బు.‘‘భయపడకు. లే’’.కేకు తిని, కాఫీ తాగారిద్దరూ. కుళాయి దగ్గర కాళ్లూ, చేతులూ కడుక్కున్నాడు అరబ్బు. ఆ తర్వాత బ్లాంకెట్లు తీసి, మంచం మడిచి గోడకు పెట్టాడు. ఎండలో మంచు మెరుస్తోంది. డాబాపైకెక్కి ఎడారిని పరిశీలించి చూశాడు దారూ. బాల్డచ్చికి కోపం వచ్చినట్టే ఉంది అనుకున్నాడు. అరబ్బు దగ్గుతున్నాడు.

ఎంత ఆలోచించినా, తన ఖైదీ అంత మూర్ఖమైన నేరం ఎందుకు చేశాడో అంతుబట్టలేదు దారూకు. పైగా, అవకాశమిచ్చినా పారిపోడేం?కింద షెడ్డులో వంగి, వేళ్లతో పళ్లు తోముకుంటున్నాడు అరబ్బు. కిందికి దిగివచ్చి అతడు డ్రెస్సు వేసుకునే దాకా నిరీక్షించాడు దారూ. కాసిని రస్కులు, ఖర్జూరాలు, చక్కెర ఓ పాకెట్లో వేసుకుని తన అతిథిని తీసుకుని ‘పద’ అంటూ ముందుకు కదిలాడు.గంటసేపు నడిచి ఓ సున్నపురాయి పక్కన కూర్చున్నారిద్దరూ.ఎండ చిటపటలాడుతోంది. కరిగిన మంచు ఇట్టే ఆవిరైపోతోంది. కింద నేల రాయిలాగ గట్టిపడింది. కనుచూపుమేరలో మరో మనిషి జాడలేదు. ఒంటరిపక్షి ఆకాశంలో అరుస్తూ వలయాలు తిరిగింది. స్వచ్ఛమైన గాలిని గుండెలనిండా పీల్చుకున్నాడు దారూ. ఎంత అలవాటైనా, ఎడారిలో నడవడం ప్రతిసారీ ఒక వింత అనుభవమే. దక్షిణంగా మరో గంట నడిచారు.దూరంగా రాళ్లు గుట్టలు కనిపించాయి. వెంట తెచ్చిన ఖర్జూరాలు, బ్రెడ్డు, చక్కెర ప్యాకెట్టు ఇచ్చి ‘‘ఇంద, ఈ వెయ్యి ఫ్రాకులు కూడా తీసుకో, ఇలా నేరుగా రెండు గంటలు నడిస్తే టింగిట్‌ వస్తుంది. అక్కడ పోలీసులు నీ కోసం నిరీక్షిస్తున్నారు. వెళ్లు’’ అంటూ తన అతిథికి వీడ్కోలు చెప్పాడు దారూ. తిరిగి స్కూలు వైపు నడిచాడు దారూ. అరబ్బు కదలకుండా అక్కడే నిల్చున్నాడు. దిగులుగా తనవైపు చూస్తున్నాడు. గొంతులో ఏదో అడ్డు పడినట్లున్నది. మరోసారి వెనుతిరిగి చూశాడు. అరబ్బు కనిపించలేదు.నెమ్మదిగా కొండ ఎక్కి మరోసారి ఎడారినంతా గాలించి చూశాడు. దూరంగా కనిపించాడు అరబ్బు.దారూకు గుండె బరువెక్కింది. క్లాసురూంలో బోర్డు ముందర తలొంచుకుని నిల్చున్నాడు.ఫ్రెంచి నదులు మెలికలు తిరిగుతూ పరిగెత్తుతున్నాయి.అయితే అతను తిరిగి వచ్చేలోగా... ‘‘మా సోదరుణ్ని  శత్రువులకు అప్పచెప్పావు. నిన్ను వదిలిపెట్టం’’ అంటూ బోర్డు మీద రాశారెవరో.ఇది తన మాతృభూమి. ఇక్కడే పుట్టిపెరిగిన తను ఇప్పుడు ఏకాకి.
ఫ్రెంచి మూలం : ఆల్బర్ట్‌ కామూ 
 అనువాదం: ముక్తవరం పార్థసారథి 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top