ఆ నీరసం బిడ్డపై ప్రభావం చూపుతుందా?

Fundy health counseling - Sakshi

సందేహం

నా వయసు 26. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్‌. నాకు చాలా తరచుగా జలుబు చేస్తూ ఉంటుంది. ఈ సమయంలో జలుబు చేస్తే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? మందులు వాడవచ్చా? జలుబు వల్ల వచ్చే నీరసం పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపుతుందా? నాకు ఆందోళనగా ఉంది. దయచేసి వివరంగా తెలియజేయగలరు. – పి.హారిక, నంద్యాల
కొంతమందిలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటం వల్ల గానీ, లేక డస్ట్‌ అలర్జీ వల్ల గానీ మాటిమాటికి జలుబు చేస్తూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జలుబు ఎక్కువసార్లు వచ్చే అవకాశం ఉంటుంది. పక్కనవాళ్ల నుంచి కూడా తొందరగా సోకుతోంది. ఈ సమయంలో వీలైనంతవరకూ దుమ్ము ధూళికి దూరంగా ఉండటం మంచిది. అలాగే జనసంద్రం ఎక్కువగా ఉన్న చోటికి తక్కువగా వెళ్లడం మంచిది. ఈ సమయంలో మాటిమాటికి జలుబు చెయ్యడం వల్ల కొద్దిగా చిరాకుగా ఉండటం, కొన్నిసార్లు ముక్కురంధ్రాలు మూసుకొని ఊపిరి ఆడటం కష్టంగా ఉండటం, నోటితో గాలి తీసుకోవలసిరావటం, దానివల్ల నిద్రసరిగా పట్టకపోవడం, పగలంతా నిద్ర వచ్చేట్లుగా ఉండటం, తలనొప్పి వంటి ఇబ్బందులు ఉంటాయి. ఇలా మాటిమాటికి అవ్వడం వల్ల కొన్నిసార్లు బిడ్డకు కూడా ఆక్సిజన్‌ సరఫరా తగ్గి బిడ్డ బరువు తక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. జలుబుకి మందులు వాడే ముందు, గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకొని పుక్కిలించి ఊయడం, మరిగే నీటిలో అమృతాంజన్‌ వంటివి వేసుకుని ఆవిరి పట్టించుకొని చూడవచ్చు. దీనివల్ల కొద్దిగా ఉపశమనం ఉంటుంది. అలర్జీ వల్ల వచ్చే జలుబులో ముక్కు నుంచి నీరు కారిపోతూ ఉంటుంది. దానికి సగం సెట్రిజిన్‌ మాత్ర వేసుకుని చూడవచ్చు. ఎక్కువగా ఉంటే డాక్టర్‌ సలహా మేరకు జలుబు మాత్రలు వాడుకోవచ్చు.

నా వయస్సు 44. మెనోపాజ్‌ దశకు చేరువయ్యే మహిళలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఈ దశలో ఎలాంటి సమస్యలు ఎదురవుతుంటాయి? వాటి నివారణమార్గాలు తెలియజేయగలరు.
– యస్‌ఎన్, గోదావరిఖని

మెనోపాజ్‌ దశకు చేరువయ్యే మహిళల్లో అండాశయాల నుంచి విడుదలయ్యే ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ మెల్లగా తగ్గిపోతుంది. దీనివల్ల వీరిలో శారీరక, మానసిక మార్పులు, ఇబ్బందులు ఏర్పడతాయి. చల్లగా ఉన్నాగానీ చెమటలు పట్టడం, అంతలోనే శరీరంలో వేడిగా అనిపించడం (hot flashes), కాల్షియం తగ్గిపోయి ఎముకలు అరగడం, ఒళ్లు నొప్పులు, నడుమునొప్పి, కీళ్ల నొప్పులు, చర్మంలో మార్పులు, మూత్ర సమస్యలు, సెక్స్‌పై ఆసక్తి లేకపోవడం, ఇబ్బంది, యోనిలో మంట, చిరాకు, డిప్రెషన్, మతిమరుపు వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో వీరు ఆహారంలో కాల్షియం బాగా దొరికే పదార్థాలైన పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, కూరగాయలు పండ్లు వంటివి తీసుకోవడం మంచిది. అలాగే సోయాబీన్స్‌లో ఉండే ఫైటోఈస్ట్రోజన్‌ అనే పదార్థం, కొద్దిగా ఈస్ట్రోజన్‌ హార్మొన్‌లాగా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆహారంలో సోయాబీన్, వాటి ఉత్పత్తులయిన సోయాపాలు, సోయాపౌడర్‌ వంటివి ఆహారంలో తీసుకోవడం మంచిది. అలాగే నడక, వ్యాయామం వంటివి చెయ్యడం వల్ల మానసికంగా, శారీరకంగా దృఢత్వం ఏర్పడుతుంది. అవసరమైతే కాల్షియం, విటమిన్‌–డి, మల్టీ విటమిన్‌ మాత్రలు వేసుకోవచ్చు. లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు గైనకాలజిస్ట్‌ను సంప్రదించి అవసరాన్ని బట్టి, శరీరతత్వాన్ని బట్టి ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ను హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ చికిత్సగా తీసుకోవచ్చు.

నా వయసు 20.  నాకు రీసెంట్‌గా పెళ్లైంది. ప్రెగ్నెన్సీకి ప్లాన్‌ చేసుకుంటున్నాం. అయితే ప్రెగ్నెంట్‌ ఉమెన్స్‌ rubella  గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇటీవల ఓ పుస్తకంలో చదివాను. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదనే దాని గురించి కాస్త వివరంగా తెలియ జేయగలరు. – వి.జమున, వికారబాద్‌
రుబెల్లా వ్యాధి (german measles) రుబెల్లా అనే వైరస్‌ వల్ల సోకుతాయి. ఇందులో కొద్దిగా తలనొప్పి, జలుబు, శరీరం మీద red rashes వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు వాటంతట అవే నాలుగు నుంచి ఐదురోజులకు తగ్గుతాయి. దీనికి ఎటువంటి మందులు పనిచేయవు. లక్షణాల ఉపశమనానికి పారసెటిమా వంటి మాత్రలు వాడుకోవచ్చు. మామూలు వారికి రుబెల్లా రావడం వల్ల ఎటువంటి సమస్య లేదు. కానీ ప్రెగ్నెన్సీ సమయంలో రుబెల్లా వస్తే ఈ వైరస్‌ తల్లి నుంచి మాయ ద్వారా బిడ్డకు పాకే ప్రమాదం ఎక్కువ. దానివల్ల అబార్షన్లు, బిడ్డ కడుపులోనే చనిపోవడం, పుట్టుకతో రుబెల్లా సిండ్రోమ్‌ (చెవుడు, ఆటిజమ్, గుండె జబ్బులు, బరువు తక్కువగా పుట్టడం, బుద్ధిమాంద్యం వంటి లక్షణాలు) వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మొదటి మూడునెలల్లో ఈ వ్యాధి సంక్రమిస్తే మరిన్ని ప్రమాదాలు పొంచి ఉన్నట్లే. రుబెల్లా వ్యాధి వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవటానికి ఏమి ఉండదు. ప్రెగ్నెన్సీ రాకముందే.. మహిళలు రుబెల్లా IGG, IGM యాంటీబాడీ రక్తపరీక్ష చెయ్యించుకోవాలి. ఒకవేళ ఆ పరీక్షల్లో యాంటీబాడిస్‌ ఉన్నట్లు తేలితే వారికి ఇంతకు ముందే రుబెల్లా వచ్చిపోయినట్లు అర్థం. కాబట్టి వారికి మళ్లీ రుబెల్లా వచ్చే అవకాశాలు ఉండవు. యాంటీబాడీస్‌ లేవని వస్తే వీరికి రుబెల్లా వచ్చే అవకాశాలు ఉన్నాయని అర్థం. కాబట్టి వీరు డాక్టర్ల సలహా మేరకు ప్రెగ్నెన్సీ రాకముందే రుబెల్లా వ్యాక్సిన్‌ ఒక డోస్‌ తీసుకోవటం మంచిది. ఇది తీసుకున్నప్పుడు ఒక నెల వరకు ప్రెగ్నెన్సీ రాకుండా జాగ్రత్తపడాలి. 

డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో హైదర్‌నగర్‌
హైదరాబాద్‌

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top