అంత్యక్రియల నిర్వాహకుడు

Funday story of the world 17-03-2019 - Sakshi

కథా ప్రపంచం

ఇల్లు మార్చిన అంత్యక్రియల నిర్వాహకుడు ఏడ్రియన్‌ పాత ఇంట్లో ఇంకా మిగిలిన శవపేటికలు తీసుకెళ్లి తన బండికెక్కించాడు. బండికి కట్టిన బక్కగుర్రాలు బస్బనయా వీధి నుండి ఏడ్రియన్‌ కొత్త ఇల్లుండే నికిట్స్‌కయా వీధికి కాళ్ళీడ్చుకుంటూ  బయలుదేరాయి.ఏడ్రియన్‌ కొట్టుకు తాళం వేసి ‘ఇల్లు అద్దెకైనా ఖరీదుకైనా  ఇవ్వబడుతుంది’ అని రాసిన ఒక బోర్డును తలుపుపై మేకులతో బిగించి కొత్తింటికి నడుచుకుంటూ వెళ్లాడు. ఆ ఇల్లు కొనాలని అతనికి చాలా ఉంది. చివరకు ఈనాటికా కోరిక తీరింది. అందుకతను చెల్లించిన మొత్తం చిన్నదేం కాదు. కాని ఏడ్రియన్‌ తన కొత్త ఇంటి పసుపు పచ్చని గోడలను సమీపించే సరికి తనకు కొంచెం కూడా సంతోషం కలగనందుకు ఆశ్చర్యమయింది. తనకింకా కొత్తగా ఉన్న గడపదాటి ఇంట్లోకి వెళ్లాడు. సామానింకా సర్దలేదు. ఇల్లంతా గందరగోళంగా ఉంది. 18 ఏండ్లుగా పూచిక పుల్లతో కూడా, ఎక్కడ ఉండవలసిన సామాను అక్కడ ఉంటూ ఉండిన తన పాత మట్టికొంప జ్ఞాపకం వచ్చి దీర్ఘంగా నిట్టూర్చాడు.

‘‘ఏమింత నిదానంగా పనిచేస్తున్నారు’’ అని పనిమనిషిని కూతుళ్ళనిద్దరినీ కసరుకొని సామాను సర్దడంలో  వారికి తోడ్పడ్డాడు.ఇల్లు చక్కపెట్టడం త్వరగా పూర్తి అయింది. దేవుని మందసం, పింగాణీ సామానూ, బీరువా, బల్ల, పడకకుర్చీ, మంచాలు, ఇవన్నీ వెనకగదిలో ఏ మూల  ఏది ఎలా ఉండాలో అలా సర్దాడు.ఇక ఇంటియజమాని ముఖ్యమైన ఆస్తి–రంగురంగుల శవపేటికలు, అంత్యక్రియల సందర్భంలో ఉపయోగించే నల్లహాట్లు, అంగవస్త్రాలూ, దివిటీలు–ఇవన్నీ వంట ఇంట్లోనూ, ముందర గదిలోను పేర్చి పెట్టారు. దివిటీని తలక్రిందుగా పట్టుకొన్న ఒక మన్మథుని బొమ్మగల బోర్డును ఇంటిముందు గేటుకు తగిలించారు. ఆ బొమ్మకింద ‘శవపేటికలు, మామూలువి, రంగువేసినవి, ముసుగు వస్త్రాలతో సహా  ఇక్కడ అద్దెకుగాని, ఖరీదుకుగానీ దొరుకుతాయి. పాత శవపేటికలు రిపేరు కూడాచేయబడతాయి’ అని రాసి ఉంది.పనంతా ముగిసిన తరువాత,  ఏడ్రియన్‌ కూతుళ్ళిద్దరూ తమ గదిలోకి  వెళ్లిపోయారు. ఏడ్రియన్‌ ఇంటినొకసారి తనిఖీ చేసివచ్చి కిటికీ వద్ద కుర్చీలో కూర్చొనిసిమోవార్‌ వేడి చేయమని పనిమనిషికి చెప్పాడు.కాటికాపరులు చీకూ చింతలేని కబుర్లరాయుళ్ళుగా షేక్‌స్పియర్, సర్‌వాల్టర్‌ స్కాట్‌ తమ రచనల్లో చిత్రించారు. వారి వృత్తికి, వారి ప్రవృత్తికి మధ్యగల వైపరీత్యంతో రసపోషణ చేసి పాఠకులను ఉర్రూతలూగించాలని వారలా చిత్రించారు. కాని, సత్యాన్ని పోషించదలచుకొన్న మేము, ఈ సందర్భంలో వీరిని అనుకరించలేక పోతున్నాము.  మేము పేర్కొంటున్న అపరక్రియల నిర్వాహకుని స్వభావం అతని వృత్తికి అనుగుణంగానే ఉందని మేము అంగీకరించక తప్పదు.

ఏడ్రియన్‌ ఎప్పుడూ ముఖం వేలాడేసుకొని విచారంగా ఉంటాడు. అతను మాట్లాడడమే అరుదు. తన కూతుళ్లు దోవన పొయ్యేవాళ్లను కిటికీ గుండా చూసుకుంటూ  ఊరకే నిల్చొని ఉండడానికలవాటు పడితే వాళ్లను మందలించడానికో లేక తన కొట్టులోని వస్తువులు కావలసి వచ్చిన దురదృష్టవంతుల నుండి (సందర్భాన్ని బట్టి వాళ్లు అదృష్టవంతులైనా కావచ్చు) ఇంకా నాలుగు డబ్బులు గుంజడానికో తప్ప ఇతరత్రా అతను నోరు తెరిచేవాడే కాదు.ఏడ్రియన్‌ టీ తాగుతూ మామూలులాగే ఏదో చింత చేస్తూ కూర్చున్నాడు. ఆరవకప్పు అయిపోయింది. ఏడోది తాగుతున్నాడు. రిటైరైన  బ్రిగేడియర్‌ శవాన్ని గడిచినవారం తీసుకొనిపోతుంటే, ఊరేగింపు సరిగ్గా టోల్‌గేట్‌ దగ్గరకు వచ్చినప్పుడు కుండపోతగా వర్షం ప్రారంభమయిన సంగతెందుకో అతనికి జ్ఞాపకానికి వచ్చింది.శవపేటిక వెంట వస్తున్న వాళ్లందరి అంగవస్త్రాలు తడిసి ముద్దయ్యాయి. చాలామంది హాట్ల అంచులు వంకరలు పోయినాయి. బ్రిగేడియర్‌ అంత్యక్రియలకు తాను సప్లై చేసిన హాట్లు, అంగవస్త్రాలు పాతసరుకయినందువల్ల వర్షంలో బాగా దెబ్బతిన్నాయి. వాటి రిపేరుకు చేతి నుంచి కొంతడబ్బు వదులుతుందని ఏడ్రియన్‌ అనుకున్నాడు. ఒక్క సంవత్సరం నుంచి కాటికి కాలు చాచుకొని ఉన్న ముసల్ది ట్రుఖినా చస్తే ఈ నష్టం పూడ్చుకోవచ్చు. అయితే ట్రుఖినా రజ్‌గుల్యా వద్ద మంచంలో పడిఉంది. ఆ ముసలిదాని వారసులు అంతదూరం నుంచి తన కోసం చెప్పి పంపారేమో అనే భయం ఏడ్రియన్‌కు పట్టుకొంది. బహుశా వాళ్లు దగ్గరున్న మరే కాంట్రాక్టరుతోనో ఒప్పందం చేసుకోవచ్చు.

ఎవరో వీధి తలుపు మూడుసార్లు తట్టడంతో ఏడ్రియన్‌ ఆలోచనలు మధ్యలో ఆగిపోయాయి. ‘ఎవరది?’ అని అరిచాడు. తలుపు తెరచుకొని ఒక కొత్త మనిషి లోపల ప్రవేశించాడు. అతనొక జర్మన్‌ వృత్తికారుడని చూస్తూనే చెప్పవచ్చు. వచ్చీరాని రష్యన్‌ భాషలో ఇలా అన్నాడతను:‘‘క్షమించండి. మీ పనికి అంతరాయం కలిగిస్తున్నానేమో. మీ పరిచయం చేసుకోవాలని వచ్చాను. నేను జోళ్లు కుట్టేవాణ్ణి. నా పేరు గొట్టియబ్‌ స్కూల్‌ట్‌జ్‌. మీ కిటికీ నుంచి కనబడే ఆ ఎదురింట్లోనే నా కాపురం. నా పెళ్లై రేపటికి ఇరవైఅయిదు సంవత్సరాలు. మా వివాహరజతోత్సవం జరుపుకుంటున్నాం. మీరూ, మీ కుమార్తెలు రేపు మా ఇంటికి భోజనానికి రావాలి’’సరే తప్పక వస్తానని ఏడ్రియన్‌ అతణ్ణి కూర్చోబెట్టి కప్పు టీ పుచ్చుకొమ్మని బలవంతం చేశాడు. గొట్టియబ్‌ స్కూల్‌ట్‌జ్‌ కలుపుగోలుతనం వల్ల, ఇద్దరూ చిరకాల మిత్రుల్లా మాట్లాడుకోసాగారు.‘‘మీ వ్యాపారం ఎలా ఉంది?’’ అని ఏడ్రియన్‌ ప్రశ్నించాడు.‘‘ఎలా ఉందని చెప్పను! ఈరోజు గిరాకీ అయితే రేపు మందం. ఒకేరకంగా ఉండి చావదు. మొత్తంపైన ఫరవాలేదు లెండి. కాని మావి మీ సరుకుల్లాంటివి కాదుగా, బతికి ఉన్న వాళ్లు జోళ్లు లేకపోయినా జరుపుకొంటారు. చచ్చినవాళ్లు శవపేటికలు లేకుండా క్షణముండలేరు కదూ!’’ఇలా నడిచింది సంభాషణ. కొంతసేపటికి స్కూల్‌ట్‌జ్‌ లేచి సెలవు తీసుకొంటూ తాను వచ్చిన పని మరొకసారి ఏడ్రియన్‌కు జ్ఞాపకం చేసి వెళ్లిపోయాడు.మరుసటిరోజు మధ్యాహ్నానికి ఏడ్రియన్, అతని కూతుళ్లిద్దరూ, తాము కొత్తగా కొన్న ఇంటి గేటు దాటిస్కూల్‌ట్‌జ్‌ ఇంటికి బయలుదేరారు. ఏడ్రియన్‌ ప్రొకోరస్‌ ధరించిన రష్యాదేశపు దుస్తుల్ని కులినా, కార్యాలిద్దరూ యూరోపియన్‌ పద్ధతిలో ముస్తాబైన వైనం నేనిక్కడ వర్ణించడం లేదు, ఆధునిక నవలాకారుల్లా.అయితే ఆ యువతులిద్దరూ ఇలాంటి ప్రత్యేక సమయాల్లో ధరించే పసుపువన్నె హేట్లని, ఎర్రని స్లిప్పర్లను పేర్కొనడం అసందర్భం కాదంటాను.గొట్టియబ్‌ స్కూల్‌ట్‌జ్‌ ఇంట్లోని చిన్నగదిఅతిథులతో నిండిపోయింది. వారిలో ఎక్కువమంది జర్మన్‌ కారువులు, వారి భార్యలూ, వారి వద్ద వృత్తి నేర్చుకునే యువకులూ, విందుకు వచ్చినవారిలో ఒక్క రష్యన్‌ ఉద్యోగి కూడా ఉన్నాడు. అతను పోలిస్‌ కానిస్టేబుల్‌ అయినప్పటికీ ఇంటియజమాని అతడిని ప్రత్యేకంగా ఆదరించాడు. యుర్కోపెగోరెన్‌స్కీ చిత్రించిన పోస్టుమాస్టరులాగా ఇరవై అయిదు ఏళ్లుగా భయభక్తులతో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ పురాతన రాజధాని నగరం 1812లో అగ్నికి ఆహుతి అయినప్పుడు అతని పసుపుపచ్చని కాపలాబడ్డీ బూడిద అయిపోయింది. కాని శత్రుసైన్యాలను దేశం నుంచి తరిమివేసిన తరువాత, దాని స్థానే, తెల్లని డోలిక్‌ స్థంభాలతో బూడిదరంగు వేసిన కొత్త బడ్డీ తలెత్తింది. యుర్కో దాని ముందు మళ్లీ మునపటిలా సాయుధుడై పారా ప్రారంభించాడు.

నికిట్స్‌ గేట్‌కు చుట్టుపట్ల కాపురముండే చాలామంది జర్మనులు అతనికి తెలుసు. వాళ్లలో కొందరు తప్పతాగి ఆదివారాల్లో రాత్రిపూట ఆ బడ్డీలోనే గడపవలసి వచ్చేది కూడా. అతనితో తనకు ఏనాడైనా పనిపడక తప్పదని గ్రహించిన ఏడ్రియన్, అక్కడికి వచ్చిన వెన్వెంటనే అతన్ని పరిచయం చేసుకున్నాడు.టేబుల్‌ ముందు అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు, ఏడ్రియన్, యుర్కోలు ఎదురుబొదురుగా కూర్చున్నారు. స్కూల్‌ట్‌జ్‌ దంపతులు, వాళ్ల పదిహేనేళ్ల కూతురు లాట్‌చెన్, అతిథులతో కలసి భోజనం చేస్తూ మధ్యమధ్య అతిథులకు వడ్డిస్తున్నారు. బీర్‌ మంచినీళ్లలా ప్రవహిస్తోంది. యుర్కో నలుగురు తినేంత తిన్నాడు. ఏడ్రియన్‌ కూడా అతనికేమీ తీసిపోలేదు. అతిథులంతా జర్మన్‌ భాషలో మాట్లాడుకొంటున్నారు.రాను రాను మాటల సందడి హెచ్చింది.హఠాత్తుగా స్కూల్‌ట్‌జ్‌ ‘‘ఒక్కమాట! ఇలా వినండి!’’ అని బిగ్గరగా అంటూ తారు పూసిన ఒక సీసా బిరడా తీసి ‘‘యోగ్యురాలు, నా లూయిసా ఆయురారోగ్యానికి!’’ అని అన్నాడు.షాంపెన్‌ బుసబుసమని నురగలు కక్కుతోంది.స్కూల్‌ట్‌జ్‌ లేచి ఉన్న తన అర్థాంగి ముఖం ముద్దు పెట్టుకున్నాడు. అతిథులు యోగ్యురాలయిన లూయిసా ఆయురారోగ్యానికై గ్లాసులెత్తి ఖాళీ చేశారు.‘‘నా అతిథుల ఆరోగ్యానికి’’ అంటూ గృహస్తు ఇంకొక సీసా బిరడా తీశాడు. అతిథులు గ్లాసులు నింపి ఖాళీ చేశారు. ఈ ధోరణిలో సీసాలు సీసాలు ఎగిరిపొయ్యాయి. అక్కడ చేరిన ప్రతి ఒక్కరి ఆయురారోగ్యానికని, మాస్కో నగరానికని, జర్మనీలోని ఒక డజన్‌ మారుమూల పట్టణానికని, అన్నివృత్తులకని, తరువాత ఫలానాఫలానా వృత్తికని, వృత్తికారుల ఆరోగ్యానికని, వారి కింద శిక్షణ పొందే వారి ఆరోగ్యానికని తాగారు. ఏడ్రియన్‌ ఒక్క టోస్టు కూడా విడిచి పెట్టకుండా బహు శ్రద్ధగా తాగాడు. తుదకు ఉత్సాహం పట్టలేక తనూ ఒక విచిత్రమైన టోస్టు ప్రతిపాదించాడు. అనంతరం ఒక స్థూలకాయుడైన రొట్టెల వ్యాపారి లేచి తన గ్లాసునెత్తి ‘‘మనమెవరి కోసమని పనిచేస్తున్నామో వారి కోసం’’ అని అన్నాడు.

ఈ టోస్టు అంతమంది సంతోషంగా తాగారు. తరువాత అతిథులు ఒకరికొకరు తలవంచి నమస్కరించుకోవడం ప్రారంభించారు. దర్జీ చర్మకారునికి నమస్కరించాడు. చర్మకారుడు దర్జీకి ప్రతి సమస్కారం చేశాడు. రొట్టెలతను ఇద్దరికీ నమస్కరించాడు. అతిథులంతా కలిసి రొట్టెలతనికి నమస్కరించారు. ఇలాసాగిపోయింది.ఈ నమస్కార కార్యక్రమ సందర్భంలో యుర్కో ఏడ్రియన్‌ వైపు తిరిగి ఇలా అన్నాడు:‘‘నీవు సాగనంపిన మృతుల ఆయురారోగ్యానికై తాగుదాం!’’ అందరూ విరగబడి నవ్వారు.ఏడ్రియన్‌ మాత్రం కోపంతో ముఖం చిట్లించాడు. కాని ఇదెవ్వరూ గమనించలేదు.గ్లాసులు నింపడం, ఖాళీ చేయడం నిరాటంకంగా సాగిపోయింది. అతిథులు టేబుల్‌ నుంచి లేచేటప్పటికి సాయంత్రం ప్రార్థనలకు చర్చి గంటలు మోగుతున్నాయి.అతిథులు వారివారి ఇళ్లకు వెళ్లిపోయారు. చాలామంది పూర్తి నిషాలో ఉన్నారు. రొట్టెలతన్ని, బుక్‌బైండరూ పోలీసు కానిన్టేబులును చేరి ఒక వైపు చంకల కింద చేయివేసి మెల్లగా అతని బడ్డీకి నడిపించుకొని పొయ్యారు., తమ బాకీ చెల్లించివేశామనుకొంటూ.ఏడ్రియన్‌ సగం మత్తులో, సగం కోపంతో ఇంటికి తిరిగి వచ్చాడు.‘‘నా వృత్తి ఇతర వృత్తులంత గౌరవమయింది కాక పోయిందా? నేను ఉరి తీసేవాడితో సమానమా? నన్ను చూసి నవ్వడానికి ఈ విదేశీయులకేమి కనబడింది! నా గృహప్రవేశసందర్భంలో  వీళ్లందరినీ పిలిచి విందు చేయాలనుకున్నాను. ఛీ! ఛీ! ఈ వెధవల్నా పిలవడం? నేను ఎవరి కోసం పని చేస్తున్నానో ఆ ప్రేతాలనే ఆహ్వానిస్తున్నాను’’‘‘అయ్యో! ఇదేమిటి బాబూ’’ అని ఏడ్రియన్‌ బూట్లు విప్పుతూ అంది పనిమనిషి ఆశ్చర్యంతో.‘‘మీరు తెలిసే మాట్లాడుతున్నారా? చెంపలు వేసుకోండి! గృహప్రవేశానికి చచ్చినవాళ్లను పిలవటమా? ఇంతకంటే ఘోరముందా?’’‘‘దేవుని సాక్షిగా చెబుతున్నాను నేను. ఆ పని చేసి తీరుతాను’’ అని ఏడ్రియన్‌ అన్నాడు. ‘‘రేపే ఆ పని చేస్తాను. నా శ్రేయోభిలాషులారా! రేపు రాత్రి నాతో విందారగించి నన్ను ధన్యుణ్ణి చేయండి! ఈ బీదవానికుండే సర్వస్వంమీదే’’  ఈ మాటలని ఏడ్రియన్‌ మేను వాల్చడో లేదో కొన్ని నిమిషాల్లో గురకలు పెట్టనారంభించాడు.ఏడ్రియన్‌కు మెలకువ వచ్చేసరికి ఇంకా చీకటి విచ్చలేదు. ఆ వ్యాపారస్తుని భార్య, ట్రియుఖీనా రాత్రి మరణించింది. ఆమె నౌకరొకడు వచ్చి ఈ వార్త ఏడ్రియన్‌కు తెలియజేశాడు. ఏడ్రియన్‌ వోడ్కాకని పది కొపెక్కులు వాడి చేతిలో పెట్టి, తొందరగా బట్టలు వేసుకొని ఒక గుర్రపుబండి అద్దెకు తీసుకొని రజ్‌గుల్యాకు వెళ్లాడు. పోలీసువాళ్లను గేటు దగ్గర కాపలా ఉంచారు. పీనుగ కోసం కాచుకొన్న రాబందుల్లా ఇటూ అటూ పచార్లు చేస్తున్నారు వ్యాపారస్తులు.

శవాన్ని బల్లపై పడుకోబెట్టారు. ముఖం నల్లబడిపోయింది. అయితే గుర్తుపట్టడానికి వీలులేనంత వికృతవికారం కాలేదు. బంధువులు, ఇరుగుపొరుగువారు, నౌకర్లు చుట్టూ చేరారు. కిటికీలన్ని తెరిచి ఉన్నాయి. గదిలో కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. మతగురువులు విగతజీవుల ఆత్మశాంతికై  చేసే ప్రార్థనలు పఠిస్తున్నారు.ఏడ్రియన్, చనిపోయిన ముసలిదాని మరిది కొడుకు పరధ్యానంతో సరే మంచిదన్నాడు. డబ్బు విషయంలో బేరమాడదలచుకోలేదనీ, ఎందులోనూ లోపం చేయడనే నమ్మకంతో అన్ని ఏర్పాట్లు అతనికే వదలి వేస్తున్నాననీ అన్నాడు.ఏడ్రియన్‌ తన అలవాటు ప్రకారం ఒక్క చిల్లిగవ్వ కూడా ఎక్కువ పుచ్చుకోనని ప్రమాణం చేసి ముసలిదాని మరణవార్త తెలియజేసి నౌకరు వైపు సాభిప్రాయంగా చూచి, అపరక్రియలకు అవసరమైన ఏర్పాట్లు చేయడానికి వెళ్లిపోయాడు.ఆ పగలంతా రజ్‌గుల్యా వనికట్‌స్కీ గేటు మధ్య గుర్రపుబండిలో ఎన్నిసార్లు తిరిగాడో లెక్కలేదు. సాయంత్రానికి పని పూర్తయింది. బండివాడికి అద్దె ఇచ్చి పంపించివేసి కాలినడకన ఇంటికి బయలుదేరాడు.అది వెన్నెలరాత్రి. ఏడ్రియన్‌ నికిట్‌స్కీ గేటు సురక్షితంగా చేరుకున్నారు. చర్చి దాటి వెడుతుండే సమయంలో పారా కాస్తున్న యుర్కో ‘ఎవరది’ అని కేక వేసి, వెంటనే ఏడ్రియన్‌ను గుర్తించి ‘మీరా? గుడ్‌నైట్‌’ అన్నాడు. అప్పటికి చాలా పొద్దుపోయింది. ఏడ్రియన్‌ ఇంటి దగ్గరకు వస్తున్నాడు. హఠాత్తుగా వీధిలో నుంచి ఎవరో, తన ఇంటి గేటు తీసుకొని లోపలికి వెళ్లినట్లు అతనికి తోచింది.ఎవరతను? ఈ అగాథవేళలో నాతో ఎవరికి పని ఉంటుంది? రాత్రిల్లు, ఎవరైనా కుర్రకుంకలు నా మతిమాలిన పిల్లల దగ్గరకు వచ్చిపోతున్నారా ఏమిటి కొంపదీసి? తన స్నేహితుడు యుర్కోను సహాయానికి రమ్మని పిలుద్దామా అని కూడా అనుకున్నాడు. ఆ క్షణంలో ఇంకొకరు గేటు తీసుకొని లోపలికి అడుగు పెట్టబోతూ, హడావిడిగా వస్తున్న ఏడ్రియన్‌ను చూచి హాటు పైకెత్తి నమస్కరించాడు. ఏడ్రియన్‌ తొందరలో అతని ముఖం పరీక్షగా చూడలేదు. అతన్ని తానెక్కడనో చూశానని అనుకొన్నాడు.

‘‘మీరు నా కోసం వచ్చారా? లోపలికి దయచేయండి’’ అని ఎగపోసుకుంటూ అన్నాడు.‘‘మర్యాదపట్టింపులెందుకు? మీరు మొదట వెళ్లండి. అతిథులకు దారి చూపించండి’’ ఏడ్రియన్‌ తానుండే హడావుడిలో  మర్యాదలను గూర్చి ఆలోచించే స్థితిలో లేడు.గేటు గడియా తీసేవుంది. మెట్లెక్కి తలవాకిలి సమీపించాడు. అతిథి వెనుకనే వస్తున్నాడు, ఇంట్లో చాలామంది ఇటూ అటు తిరుగుతున్నట్లు ఏడ్రియన్‌కు అనిపించింది.‘‘ఏమిటిదంతా?’’ అని అనుకుంటూ తలుపు తీసుకొని లోపలకడుగు పెట్టాడు...కాళ్లు గడగడ వణికాయి. గది నిండా ప్రేతలు తిరుగుతున్నాయి. కిటికీ గుండా లోపల పడుతున్న వెన్నెల వెలుగులో ప్రేతల పాలిపోయిన ముఖాలు, దిగజారిన నోళ్లూ, కాంతిహీనమైన అరమోడ్పు కళ్లూ, ఎత్తయిన ముక్కులూ కనబడుతున్నాయి...గతంలో తాను ఎవరెవరిని పాతి పెట్టడానికి తోడ్పడ్డాడో వాళ్లందరిని ఏడ్రియన్‌ గుర్తించాడు. అతని గుండెలు గుభేలుమన్నాయి. తనతో ఇంట్లోకి వచ్చినతను కుండపోతగా వర్షం కురుస్తుంటే, పాతిపెట్టిన బ్రిగేడియర్‌ అని ఏడ్రియన్‌ గుర్తించాడు.ఏడ్రియన్‌ లోపలికి రాగానే, గదిలో చేరినవారంతా స్త్రీలూ, పురుషులూ–ఏడ్రియన్‌ చుట్టూ చేరి నమస్కారం చేసి పలుకరించారు. ఒక పేదవాడు మాత్రం నమ్రతతో గదిలో దూరంగా ఒక మూల నిల్చున్నాడు తన చిరిగిన దుస్తులు చూసుకొని సిగ్గుపడుతున్న వానిలా. కొద్దిరోజుల క్రితం ఏడ్రియన్‌ ఇతని శవాన్ని ఉచితంగా పాతి పెట్టవలసి వచ్చింది. ఇతనొకడు తప్ప ఇతరులంతా మంచి దుస్తులు వేసుకున్నారు. అధికారులు యూనిఫారాలు ధరించారు. కాని వారి గడ్డాలు మాశాయి. వర్తకులు ఖరీదైన దుస్తులు వేసుకున్నారు. అక్కడ చేరిన వాళ్లందరి తరపున బ్రిగేడియర్‌ ఇలా అన్నారు:

‘‘ప్రొఖరొన్‌గారూ, మీ ఆహ్వానం అంగీకరించి మేమంతా లేచి వచ్చాము. పూర్తిగా శిథిలమై, వట్టి అస్థిపంజరాలుగా మిగిలిపోయి, నిస్సహాయస్థితిలో ఉన్న వారు మాత్రేమే వెనుక నిల్చిపోయారు. కాని వారిలో ఒక్కతను మాత్రం మిమ్మల్ని చూసి రావాలనే ఆదుర్దా కొద్ది రాకుండా ఉండలేకపొయ్యాడు...’’ఇలా అంటూ ఉండగానే, ఒక చిన్న అస్థిపంజరం గుంపును ఇటూ అటూ తోసుకుంటూ ఏడ్రియన్‌ను సమీపించింది. చర్మ మాంసాలు లేని అతని ముఖం ఆప్యాయతతో పళ్లికిలించింది. పచ్చని, ఎర్రని పేలికలూ, పట్టుచొక్కా, వెదురుబొంగుకు తగిలించినట్లుగా, ఆ ఎముకలగూడుకు అతుక్కొని ఉన్నాయి. దానిముంగలి ఎముకలు, ఎల్తైన గుర్రపు రౌతు బూట్లతో పళపళమని శబ్దం చేస్తున్నాయి రోల్లో రోకలిబండలా.‘‘ప్రొఖోరొవ్‌! నన్ను గుర్తించలేదూ! గార్డు దళంలో రిటైర్డు సార్జంట్‌పై తొర్‌పెచ్‌కురిల్కిన్‌ని. జ్ఞాపకం లేదూ? నీ మొట్ట మొదటి శవపేటిక అమ్మింది నాకే.1799లో(అది ఓక్‌ కర్రతో చేసిందన్నావు కాని డీల్‌ కర్రతో చేసిందిలే)’’ ఇలా అంటూ ఆ అస్థిపంజరం ఏడ్రియన్‌ను కౌగిలించుకోవడానికి తన చేతిఎముకలెత్తింది. భయవిహ్వలుడైన ఏడ్రియన్, తన బలమంతా కూడదీసుకొని గట్టిగా అరుస్తూ అతన్ని వెనుక్కు తోశాడు. పైటొర్‌ పెట్రోవిచ్‌ తూలి, కీళ్లు వదిలి విడిపోయిన ఎముకలపోగైకిందపడ్డాడు.ప్రేతాలు ఆ...ఆ...అన్నాయి కోపోద్రేకంతో.పళ్లు కొరుకుతూ, తిడుతూ, నిన్నేం చేస్తానో చూడమని బెదిరిస్తూ, తమ సహచరుని గౌరవం నిలబెట్టడానికై, ఏడ్రియన్‌ పైకి లేచాయి.చెవులు తూట్లు పడుతున్న వాటి అరుపులకు, ధాటికీ గుండె చెదిరి ఏడ్రియన్‌కు తెలివి తప్పి సార్జెంట్‌ ఎముకల పై దభాలుమని పడిపోయాడు.ఏడ్రియన్‌ మంచం పైన సూర్యకిరణాలు .ఏడ్రియన్‌కళ్లు తెరచి చూచేటప్పటికి పనిమనిషి. సామొవార్‌లో నిప్పులు రాజుకోడానికి ఊదుతోంది. రాత్రి జరిగిన సంఘటనలు ఏడ్రియన్‌కు గుర్తుకొచ్చి గుండె జలదరించింది.ట్రియుకినా, బ్రిగేడియర్‌ సార్జెంట్‌కురిల్కిన్‌ అతని హృదయాంతరాళంలో తారాడుతున్నారు. రాత్రి జరిగిన సంఘటన పరిణామం పనిమనిషినే చెప్పనిమ్మని ఏడ్రియన్‌ మౌనంగా ఉన్నాడు.‘‘ఎంతసేపు నిద్రపోయారు బాబూ!’’ అనిఅక్సిన్యా ఏడ్రియన్‌కు ఉదయం చొక్కా అందిస్తూ అన్నది.‘‘పక్కింటి దర్జీ మిమ్మల్ని చూడటానికి వచ్చారు. కాని మీరు గాఢనిద్రలో ఉన్నందువల్ల మేము మిమ్మల్ని లేపలేదు’’‘‘చనిపోయినట్టి ట్రియుకినాఇంటి నుంచి ఎవరైనా నా కోసం వచ్చారా?’’‘‘ట్రియుకినా? ఎందుకు? ఆమె పోయిందా?’’‘‘ఒట్టి  మతిలేని మనిషివి నీవు. ఆమె అపరక్రియలకు అన్నీ సిద్ధం చేయడానికి నిన్న నీవే నాకు ?’’‘‘అయ్యో, బాబూ! మీకేమైనా మతిపోయిందా ఏమిటి? లేక నిన్న పగలంతా కూర్చొని తాగిన మత్తు వదల్లేదా? నిన్న ఎవరి అంత్యక్రియలూ జరగలేదు. నిన్న మీరు ఆ జర్మన్‌ వాళ్లింట్లో జరిగిన విందుకువెళ్లిపూర్తి నిషాతో వచ్చారు. వచ్చీ రావడంతో మంచం పైన పడి తెలివి లేకుండా నిద్రపోయారు. చర్చిగంటలు మోగడం ఇప్పుడే ఆగిపోయింది’’‘‘అట్లనా?’’ అన్నాడు ఏడ్రియన్‌ గుండె తేలికై.‘‘మరేమిటి?’’ అంది పనిమనిషి.‘‘అయితే వెళ్లి టీ కాచి, పిల్లల్ని పిలు’’
రష్యన్‌ మూలం : పుష్కిన్‌
తెలుగు: బి.రామచంద్రారావు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top