యద్భావం తద్భవతి

Funday Sai Patham antarvedam 19 - Sakshi

సాయిపథం – అంతర్వేదం 19

భగవద్గీతలో ఓ శ్లోకం ఉంది.‘‘యే యథా మాం ప్రపద్యంతే తాం స్తధైవ భజామ్యహమ్‌!మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ! సర్వశః’’ అని.ఎవరు తననెలా అనుకుంటే తాను వాళ్లకి అలాగే కనిపిస్తాననీ, ఎవరు ఏం అనుకున్నప్పటికీ తాను అనుకున్నది మాత్రమే జరిగేలా చేస్తాననీ, చేసుకుంటాననీ కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడనేది పై శ్లోక సారాంశం.అందుకే తనని దైవంగా భావించిన దేవకీ వసుదేవులకి అలాగే కన్పించాడు. తనని వివాహమాడే పతిగా భావించిన రుక్మిణిని అదే విధంగా అనుగ్రహించాడు. తమ జన్మని ధన్యం చేయవచ్చినవానిగా భావించిన భీష్మ–విదురులకి అలాగే మోక్షాన్ని ఇచ్చాడు. తనని చంపవచ్చినవాడని భావించిన కంసునికీ, శిశుపాలునికీ అలాగే చావునిచ్చాడు.వాస్తవాన్ని పరిశీలించి చూస్తే సాయి కూడా అదే తీరులో కనిపించాడు ఎందరికో. కనిపించలేదని ఎవరూ అనుకోకుండా ఉండేలా తనని నిజమైన భక్తితో సేవిస్తే ఏ రూపంతో దర్శించదలిస్తే అలానే కనిపిస్తానంటాడు సాయి. అలా కనిపించిన తీరు తెన్నుల్ని ఎందరో చెప్పారు కూడా.ఈ క్రమంలో జరిగిన ఓ చరిత్రని తెలుసుకుని తీరాల్సిందే! నాసికాత్య్రంబకమనే పుణ్యక్షేత్రం ఒకటుంది షిర్డీకి కొంత దూరంలో. దాన్నే నాసిక్‌ అని పిలుస్తూ ఉంటారు. గోదావరి పుట్టిన కొండలకి దిగువ ఉంటుంది ఈ క్షేత్రం. ఆలయం లోపల శివలింగం చిన్న పరిమాణంలో ఉంటుంది. ఆ లింగానికి కింద మూడు వైపుల నుంచి చిన్న తూముల వంటి మార్గాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ మూడింటి నుంచీ నిరంతరం జలం ప్రవహిస్తూ ఈ శివలింగాన్ని తాకుతూ ఉంటాయి. ఒకటి పవిత్ర గంగాజలం, రెండవది ఆ కొండల మీద నుంచి వచ్చే గోదావరి జలం, ఇక మూడవది ఎక్కడి నుండి వస్తోందో తెలియని పర్వత జలమునూ. ఈ మూడు జలాలనీ స్వయంగా సేకరించుకుని ఏ రోజుకారోజు శివలింగానికి మహాద్భుతంగా అభిషేకాన్ని చేస్తే గానీ, ఆ మీదట అగ్నిహోత్రాన్ని వేదమంత్రపూర్వకంగా నిర్వహిస్తే గానీ ఏనాడూ పచ్చిగంగని కూడా ముట్టనంత నిష్టాగరిష్ఠుడైన ములేశాస్త్రీ(మూళే శాస్త్రీ–శాస్త్రీ–మూలే–పండితుడు) అనే బ్రాహ్మణుడు ఉంటూండేవాడు నాసిక్‌లో.

తన వద్దకొచ్చిన ఆధ్యాత్మికపరులైన వాళ్ల చేతుల్ని చూసి హస్తసాముద్రిక విశేషాలనీ, జాతకచక్రాలనీ చూసి భూతభవిష్యత్‌ వర్తమానాలనీ, అంతే కాక ఇళ్లకి సంబంధించిన వాస్తు బాగోగులనీ కూడా ఆయన చూస్తూ ఉండేవాడు. దాంతో ఆయన ఇల్లు సందర్శకులతో నిత్యం కిటకిటలాడుతూ ఉంటూండేది. ఎందరు వచ్చినా ఆయన అనుష్టానం పూర్తయ్యాక మాత్రమే మాట్లాడటం తప్ప ఏనాడూ ఆ నియమాన్ని తప్పనివాడాయన.ఆయన చెప్పిన అన్ని కూడా స్పష్టంగా జరుగుతుండే కారణంగా అందరికీ ఆయన మీద పూజ్యభావం ఉంటూ ఉండేది. ఆయన్ని ఎవరైనా ‘ఎంతగొప్పవాడో’ అంటూ ప్రశంసిస్తే ‘అదంతా మా గురువు ఘోలవ్‌ స్వామి గారి చలవ’ అంటూ తన అహంకారం లేని తనాన్ని తెలియజేస్తుండేవాడు.ఆయన తన గురువైన ఘోలవ్‌ స్వామివారి వద్ద నాలుగు వేదాలనీ ఆ వేదానికి అంగాలుగా ఉండే 6 శాస్త్రాలనీ కూడా గట్టిగానే అభ్యసించి ఉండటంతో ఇటు జ్యోతిషం, అటు వాస్తు మరోౖవైపు సాముద్రిక శాస్త్ర పండితులూ ఇంకోవైపు వ్యాకరణం మొదలైన శాస్త్రాల్లో పండితులు కూడా ఏమేమో సందేహాలని తీర్చుకోవడానికి స్వయంగా విచ్చేస్తూ ఉండటంతో ఆయనకి తీరుబడి అనేది దాదాపుగా ఉండేదే కాదు.ఇలాంటి ఈయనకి – సాయికి అత్యంత ప్రేమాస్పదభక్తుడైన బూటి (బాబు సాహెబ్‌ బూటీ)తో మంచి సంబంధం ఈ తీరు రాకపోకలతో ఏర్పడింది. నాగపూర్‌ వాస్తవ్యుడూ కోటి కోటీశ్వరుడూ అయిన బూటీ సాయి ఆజ్ఞ ప్రకారం ఆయనకి ఓ సుందర విశాలమందిరాన్ని శోభాయమానంగా నిర్మించి ఇచ్చాడు కూడా. అంతటి బూటితో ఓ సారి ములేశాస్త్రి పండితునికి పనిపడింది. బూటీ ఎప్పుడూ షిర్డీలోని ద్వారకామయి (సాయి ఉండే మసీదు)లోనే ఉంటాడు కాబట్టి ములేశాస్త్రి అక్కడికే వెళ్లాడు.వేదాలని చదివినవాడూ, శాస్త్రాల్లో దిట్టా, నిత్యం అగ్నిహోత్రాన్ని చేసేవాడూ, అందరితో గౌరవాభిమాన పరిచయాలున్నవాడూ, సంప్రదాయపరుడూ అయిన ఆయనకి షిర్డీ వెళ్లినప్పటికీ కూడా ఒక సాయేబు (ఆయన దృష్టిలో సాయి)ని.. అందునా ఆయన మసీదులో.. అది కూడా 4 రోజులపాటైనా స్నానం కూడా (అప్పుడప్పుడు వీలు కుదరక) చేయని పండితుడు కానీ వ్యక్తి (శాస్త్రి దృష్టిలో)ని స్వయంగా వెళ్లి దర్శించడమా? అనే అభిప్రాయంతో తానున్న ఓ ప్రదేశంలోనే మూడురోజుల పాటు ఉండిపోయాడు. అంతా నిర్విరామంగా ఉండే తనకి ఇలా రోజులు గడిచిపోతున్నాయనే ఆలోచనతో... ఎలాగో అక్కడికి వెళ్లి బూటీని ఎలాగో ఒకలా ఆ మసీదు ఇవతలనుండే కలిసి, మాట్లాడి వచ్చేద్దామనే నిర్ణయానికొచ్చాడు నాల్గవ రోజున.

సరిగ్గా అదే రోజున బూటీ బాబా దర్శనానికి రావలసిందనగానే అయిష్టంగా సాయి దర్శనానికి వెళ్లాడు. తనకొచ్చిన భక్తుల దక్షిణలతో పళ్లని కొని, తనని చూడవచ్చిన భక్తులకి ఇస్తూ ఉండటం సాయికి అలవాటు. ముఖ్యంగా మామిడిపళ్లనైతే రెండు అరచేతుల మధ్య పెట్టి ముందుకి వెనక్కి నలిపి పిసికి నోట్లో పెట్టుకోగానే రసమంతా వచ్చేలా మామిడిపండుని చేసి భక్తులకియ్యడం, అలాగే అరటిపండునైతే తొక్కని తొలగించి గుజ్జునిస్తూ తొక్కల్ని తన వద్ద ఉంచడం... వంటివి ఆయన నిత్యకృత్యాలు. శాస్త్రి వెళ్లేసరికి ఇలాగే జరుగుతోంది. ఆ పళ్లని తాను తీసుకోవడం ఏ మాత్రం ఇష్టమనిపించలేదు శాస్త్రికి.తన వంతు రాగానే శాస్త్రి తన చేతిని చాచి సాయిని తమ చేతిని చూపించినట్లయితే సాముద్రికవిశేషాలని చెప్తాననే అభిప్రాయంతో చూశాడు. శాస్త్రి అభిప్రాయాన్ని గమనించి కూడా సాయి తన చేతిని చూపించనే లేదు, ఎందరో తన వద్దకి చేయి చూపించుకోవడానికి వచ్చి తమ వంతు కోసం ఎదురుచూస్తూ ఉంటూంటే, సాయివద్దకి తాను వెళ్తే చేతిని చూపించడేమిటి సాయి? అనుకుని అలాగే ఉండిపోయాడు. అందరికీ ఇచ్చినట్లే శాస్త్రికి కూడా నాలుగు అరటిపళ్లని చేతిలో పెట్టాడు సాయి. అయితే సాయి పాదాలని గమనించి, పాదాల్లోని రేఖలని గమనించి, సాయిలోకోత్తర పురుషుడేనని మాత్రం లోపల అనుకున్నప్పటికీ, ఈ మహమ్మదీయునికి ఇంత గొప్పదనమా? అనే ఊహ శాస్త్రిని బాధించసాగింది. గొప్పదనాన్ని ఒప్పుకోనీయలేదు. అనంతరం శాస్త్రి బూటీతో సహా మరో ప్రదేశానికి వెళ్లిపోయారు.సాయి లెండీతోట (తాను స్వయంగా పచ్చికుండలతో నీళ్లని తెచ్చి పోసి పెంచే తోట)కి బయలుదేరి వెళ్తూ ‘ఈ రోజు కాషాయవస్త్రాలని నాకు తెప్పించండి. ధరిస్తా’ అన్నాడు భక్తులతో. ఎవరికీ అంతరార్థం బోధపడలేదు. బూటీ శాస్త్రి వద్దకి మళ్లీ వచ్చి మధ్యాహ్నహారతి సమయమైంది. ‘వస్తారా సాయి దర్శనానికీ – హారతికీ?’ అని అడిగాడు.

శాస్త్రి అయిష్టంగా ‘సాయి దర్శనానికి సాయంత్రం వస్తాను. ఇప్పుడింకా దేవతా అనుష్టానం కాలే’ అన్నాడు. ఈ సమాధానంలో రెండున్నాయి. మొదటిది – ‘ఉదయం తనని అందరితో సమానంగా, అందరిలో ఒకడుగా సాయి లెక్కించాడనీ, చేయి చాపి సాముద్రికాన్ని చెప్తానని నోరు తెరిచి అడక్కపోయినా మౌనంగా తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించినా తిరస్కరించాడనీ’. ఇక రెండవది – ‘తాను స్నానానికి అత్యంత శుచిగా చేసి, పట్టుబట్ట కట్టుకుని, వెంటతెచ్చుకున్న గంగాజలాన్ని కలిపిన జలంతో శివాభిషేకాన్ని చేసుకుని, ఓ మసీదులోనికి వెళ్లి ఆయన ఈయబోయే ప్రసాదాన్ని తీసుకుని రావడమా?’ అనేదీనూ. ఈ రెండాలోచనలతోనూ సాయంత్రం వస్తానని ముక్తసరిగా చెప్పాడు శాస్త్రి.మధ్యాహ్నహారతి ప్రారంభం కాగానే బూటీని పిలిచి సాయి.. ‘బూటీ! నాసిక్‌ నుండి వచ్చిన ఆ బ్రాహ్మణపండితుడి వద్దకెళ్లి దక్షిణని సాయి అడిగాడంటూ పట్రా!’ అన్నాడు. అది దైవాజ్ఞతో సమానం బూటీకి. వెంటనే శాస్త్రి వద్దకొచ్చి చెప్పి దక్షిణని యాచించాడు కోటి కోట్లకి అధిపతి అయిన బూటీ.శాస్త్రి ఈ మాటని వింటూనే.. ‘ఆ సాయి ఎంత తనదైన మహిమల్లో గొప్పవాడో నేనూ అంతే నాదైన శాస్త్రంలో గొప్పవాడిని. సరే! ఆ మాటని అలా ఉంచితే నేనేమిటి? ఆయనకి దక్షిణ ఇయ్యడమేమిటి? అయినా ఎవరికైనా ఎవరైనా గొప్పవారని తోస్తే దక్షిణనిస్తారేమో గానీ, ఈ దక్షిణకోసం దబాయింపు ఏమి?’ అని ఆలోచిస్తూ.. అడిగింది బూటీ కాబట్టి ‘సరే!’ అంటూ దర్శనానికి బయలుదేరాడు శాస్త్రి అర్ధాంగీకారంతో.అనుష్టానం దాదాపు ముగియవచ్చిన సందర్భంలో తాను మసీదులోనికి పోవడం సుతరామూ ఇష్టం లేని శాస్త్రి, మసీదు బయటి నుండే సాయిని దర్శించాడు. ఆ పక్కనే బుట్టలో ఉన్న పుష్పాలని దోసిలి నిండుగా తీసుకుని మసీదు గుమ్మం బయటి నుండే సాయి మీద పడేలా భక్తితోనే విసిరాడు.

అంతే! క్షణంలో సింహాసనం లాంటి ఆసనంలో కూర్చున్న సాయి రూపం మొత్తం అదృశ్యమైపోయింది. పరీక్షగా చూశాడు శాస్త్రి. నిజమే. అది కలకానే కాదు. నిజమే. వాస్తవమే. సాయి కనపడటం లేదు. ‘ఇదేమిటి?’ అనుకునేంతలోనే తనకి సంపూర్ణంగా వేదాలనీ, శాస్త్రాలనీ బోధించిన తన గురువు ఘోలవ్‌ స్వామి ఆ ఆసనంలో కూచుని చిరునవ్వు నవ్వుతూ కన్పిస్తున్నాడు శాస్త్రికి.గురువుగారు శివైక్యం చెంది ఎన్నో సంవత్సరాలు గడిచిపోతే ఆయన ఇక్కడెలా ఉన్నాడు? అదీ సజీవంగా చిరునవ్వు నవ్వుతూ కన్పిస్తుండటమా? అది కూడా ఎవరికో కాకుండా శిష్యుడైన తనకే కూడనా? మళ్లీ ఓ సారి పరీక్షగా చూసి ఆశ్చర్యపడ్డాడు – నివ్వెరపోయాడు శాస్త్రి.తనకి తెలియకుండానే.. అందరు భక్తులూ తనని చూస్తుండగానే.. ముందుకి నడిచాడు. సాయి కూచున్న ఆసనం ఉన్న వేదికకున్న మెట్లని ఎక్కి వెళ్లాడు. మనసు నిండుగా కనిపిస్తున్న భక్తితో, బుద్ధి నిండుగా ఉన్న శ్రద్ధతో, శరీరం నిండుగా ఉన్న విశ్వాసంతో సాయి పాదాల మీద పశ్చాత్తాపబుద్ధితో తలని పెట్టి, వెంటనే సాష్టాంగపడి నమస్కరించాడు అప్రయత్నంగా.అందరూ గొంతెత్తి హారతి పాటని పాడుతుంటే శాస్త్రి మాత్రం తన గురువు ఘోలవ్‌ స్వామి నామాన్ని పెద్దగా ఉచ్చరిస్తూ ఎదురుగా సాయి పాదాలని పట్టి నమస్కరిస్తూనే ఉన్నాడు. ‘తన పట్టుబట్ట – అగ్నిహోత్రం – అపవిత్రతాభావం – అది ఓ మసీదు’ అనే ఆలోచన పూర్తిగా స్ఫురణలోనే లేకపోయాయి. భక్తి పారవశ్యంతో కళ్లు మూసుకుని ఆ నాటి గురువు ఈనాడు సజీవంగా దర్శనమిచ్చాడనుకుని కళ్లు తెరిచి చూశాడు.అంతే! మళ్లీ వెనుకటి సాయి కాషాయరంగు వస్త్రాల్లో కన్పించాడు. ఘోలవ్‌ స్వామి ఏమయ్యాడో తెలియదు. ‘ఈ వింత మరెవరికైనా కూడా కనిపించిందా?’ అనుకుంటూ శాస్త్రి భక్తజనం అందరినీ చూస్తుంటే.. అందరూ ఎవరి ధ్యాసలో వాళ్లున్నారు తప్ప తనవైపు చూస్తున్నట్లే కనిపించలేదు. అప్పటికర్థమైంది. బూటీ ఎందుకిలా సాయికి అంకితమైపోయాడో.. సాయికి తన జీవితాన్ని సర్వసమర్పణాన్ని చేసేసాడో!ఈ విశేషాన్ని పూసగుచ్చినట్లు భక్తులందరికీ శాస్త్రి చెప్పడమే కాక అప్పటి నుంచి సాయికి  పరమసన్నిహిత భక్తుడయ్యాడు. మరో సంఘటనషిర్డీలో ఓ రెవెన్యూ ఉద్యోగి ఉంటూ ఉండేవాడు. ఆయన పరమభక్తుడు సాయికి. అయితే తన భక్తి ధోరణి ఏదో తనదే తప్ప మరెవరినీ సాయిదర్శనానికి రావలసిందని గానీ, వచ్చి దర్శిస్తే ఈ తీరూ ఆ తీరూ అద్భుతాలు జరుగుతాయని గానీ చెప్పి ప్రచారాన్ని చేసే సాయి భక్తుడు కాడు.

సహజంగా ఒక సంప్రదాయాన్ని ఎన్నుకుని ఆ మార్గంలో వెళ్తూ ఉండే భక్తులు మూడు తీరులుగా కన్పిస్తూ ఉంటారు. మొదటి జాతివాళ్లు కేవలం తన భక్తీ తన పూజా ఏదో దాన్ని మాత్రమే చేసేసుకుంటూ నిరంతర భక్తి భావంతో వెళ్లిపోతూ ఉంటారు. వాళ్లకి తమకంటూ జరిగిన అద్భుతాలని చెప్పుకోవాలనే ధ్యాసే ఉండదు.రెండవజాతివాళ్లు తమకి జరిగిన అనుభవాలని వివరిస్తూ ప్రోత్సహించి ఆ దైవదర్శనానికో లేక తాము నమ్మి ఆనందాన్ని పొందిన ఆ మహనీయుని దర్శనానికో ఒకరినో ఇద్దరినో నిస్వార్థంగా తీసుకువెళ్లి తాముపొందిన ఆ ఆనందాన్ని వాళ్లకి కూడా కలిగించేవాళ్లు. కేవలం దైవసేవాభావం ఇతరులకి ఆనందాన్ని పంచాలనే ధ్యేయమే వీళ్లది.ఇక మూడవజాతి వాళ్లుంటారు. దైవం మీద వ్యతిరేకతా నాస్తికభావాలూ అంటూ ఏవైనా ఏ కొందరికైనా అబ్బుతున్నాయంటే దానికి వీరే కారణం. దైవం గురించో లేక సాయి వంటి మహనీయుని గురించో ఎదుటివారిలో తీవ్రమైన నమ్మకాన్ని కుదిర్చి దాన్ని దృఢం చేయాలనే అభిప్రాయంతో ఉన్నదానికి మరికొంతని కలిపి తీవ్రంగా దాన్ని ప్రచారంలోకి తెచ్చేయడం వీరి లక్షణం. వాళ్లు చెప్తున్నదాన్ని ఏ మాత్రపు బుర్ర పెట్టి విన్నా అదంతా అబద్ధమే అని స్పష్టంగా అర్థమైపోతూ ఉంటుంది. అలా ఎదుటివాళ్లు అనుకుంటారనే ధ్యాస కూడా లేకుండా చెప్పుకుంటూ వెళ్లిపోతుంటారు ఉన్నవీ లేనివీ కలగలిపి.ఇదే పద్ధతిలో పైన అనుకున్న రెవెన్యూ ఉద్యోగి ఒక డాక్టరుతో ‘షిర్డీ వెళ్దాం. వస్తావా?’ అని అడిగాడు. ఈ రెవెన్యూ ఉద్యోగి కేవలం తనకి సహాయంగా ఈ డాక్టరుని రావలసిందిగా పిలిచాడు తప్ప ఆయన్ని సాయిభక్తునిగా చేయాలనే తపనతో మాత్రం కాదు.

దానికి డాక్టర్‌ సమాధానమిస్తూ.. ‘నేను షిర్డీకి సరదాగా వస్తా! అక్కడికొచ్చి సాయి దర్శనానికి రావలసిందని గానీ, ఇంతదూరం వచ్చాక ఓసారి దర్శిస్తే పోలేదా? అయినా దర్శిస్తే వచ్చే నష్టమేముంది? అని గానీ నన్ను బలవంతపెట్టనంటే వస్తా!’ అని కరాఖండీగా చెప్పాడు. అసలు ఆ ఉద్దేశమే లేని రెవెన్యూ ఉద్యోగి ‘అక్కడికొచ్చాక అది నీ ఇష్టం! బలవంతపెట్టడం నేనుగానీ నాకెరుగున్న మరెవరి ద్వారానైనా గానీ ఉండనే ఉండదు’ అని సహృదయతతో చెప్పాడు. దాంతో ఆ ఇద్దరూ షిర్డీకి వెళ్లారు.రెవెన్యూ ఉద్యోగి బాబా దర్శనానికి వెళ్తుంటే డాక్టర్‌ అతనితో ‘నువ్వేమీ అనుకోకు! నేను రామభక్తుడ్ని. ఏ రోజూ రామునికి సంబంధించిన వృత్తాంతాన్ని చదవడమో ఆయన శ్లోకాలని పఠించడమో లేక ఆంజనేయుని ధ్యాన శ్లోకాలని మనసులో అనుకోవడమో చేస్తూనే ఉంటాను. రామాయణం చెప్పిన అన్నింటి మీద సద్భావంతో ఉంటాను. ఏదో ఒక సంప్రదాయ రహస్యాలని తెలుసుకుని ఆచరించదలచడం పొరపాటున ఇది నచ్చకపోతే మరో వైపు అడుగులు వేయడం.. అనే ఇదంతా నాకు నచ్చని పని’ అంటూ చెప్పి ‘నువ్వొక్కడివే ఆ సాయి దర్శనానికి వెళ్లిరా!’ అన్నాడు.ముందునుంచి డాక్టర్‌ అదేమాటల్ని చెప్తుండటం బట్టి రెవెన్యూ ఉద్యోగి మారు మాట్లాడకుండా సాయి దర్శనానికి వెళ్లాడు. మార్గమధ్యంలో ఓ చిన్నపని చూసుకుని దర్శనానికి వెళ్లాడు. అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు.తాను వెళ్లేసరికి ఇన్ని మాటల్ని మాట్లాడిన డాక్టర్‌ ఆ సాయిపాదాలని గట్టిగా పట్టుకుని ఆయన ముఖంలోనికే తన దృష్టిని నిలిపి ఆర్ద్రంగా చూస్తూ ఆనందబాష్పాలని విడుస్తూ కనిపించాడు. సాయి సేవ పూర్తయ్యాక రెవెన్యూ ఉద్యోగి ‘దానికి కారణం ఏమిటి?’ అని అడగకుండానే డాక్టర్‌ చెప్పడం ప్రారంభించాడు.‘ఓసారి సాయిని సందర్శించే భక్తుల్ని చూస్తూ సాయి తన దర్శనాన్నిచ్చే చోటుని చూశాను. ప్రశాంతంగా కూర్చున్న సాయి నాకు ప్రత్యక్షంగా రామచంద్రునిలానే కనిపించాడు. తరచి తరచి పరిశీలించి చూసినా రాముడే ఉన్నాడు ఆ ఆసనంలో. అందుకే ఆనందంతో సాష్టాంగపడ్డాను. నన్ను ఈ దర్శనానికి వచ్చేలా చేసినందుకు జీవితాంతం ఋణగ్రస్తుడ్ని’ అన్నాడు డాక్టర్‌. అదీ సాయి గొప్పదనం.
‘ద్వారకామయి అన్ని కోరికలనీ తీరుస్తుంది’ అని సాయే చెప్పాడు. ఎప్పుడు? ఎందుకు? ఎలా? గమనిద్దాం!
(సశేషం)
- డా. మైలవరపు శ్రీనివాసరావు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top