అన్నదమ్ములు 

funday new story special - Sakshi

కథా ప్రపంచం

స్కూలు టీచర్‌ బార్డ్‌. అతని తమ్ముడు ఆండర్స్‌. ఒకరంటే ఒకరికి ప్రాణం. పుట్టినప్పటి నుంచి అన్ని పనులూ కలిసే చేశారు. ఒక్కరోజు కూడా దూరంగా ఉండలేదు. ఇద్దరూ ఒకేరోజు సైన్యంలో చేరారు. ఒకే కంపెనీలో ఉద్యోగం చేశారు. ఇద్దరికీ ఒకేరోజు కార్పొరల్‌గా ప్రమోషన్‌ వచ్చింది. ఒకేరోజు రిటైరయ్యారు. ఇంతవరకు వాళ్లనెవరూ విడివిడిగా చూడలేదు.     కొంతకాలానికి వాళ్ల తండ్రి కాలం చేశాడు. ఆస్తి బాగానే సంక్రమించింది సోదరులకు. కానీ అది పంచుకుని విడిపోవడం వాళ్లకిష్టం లేదు. అందువల్ల ఉన్నదంతా వేలం వేసి ఎవరిక్కావల్సింది వాళ్లు కొనుక్కోవడం మేలనుకున్నారు. అలాగే చేశారు. అయితే, తండ్రికో ఖరీదైన గోల్డ్‌ వాచ్‌ ఉంది. ఆ రోజుల్లో అలాంటి వాచ్‌ ఆ ప్రాంతంలో మరెవరి దగ్గరా లేదు. అది వేలానికి వచ్చినప్పుడు చాలామంది ధనికులు పాట పాడటానికి ముందుకువచ్చారు. అయితే సోదరులిద్దరూ పోటీ పడి పాట పెంచటంతో మిగతావాళ్లు వెనక్కు తగ్గారు. తమ్ముడు తనకు వదిలేస్తాడని అన్నా, అన్న తనకు వదిలేస్తాడని తమ్ముడూ ఆశించారు. కానీ అది జరగకపోగా పాటలో ఎవరూ ఆగలేదు. ధర అనూహ్యంగా పెరిగింది. ఒకరివైపొకరు చిరాకుగా, కోపంగా చూసుకున్నారు. చివరికి ఇరవై డాలర్లకు చేరుకుంది పాట. తమ్ముడలా పట్టుపడతాడని అనుకోలేదు బార్డ్‌. ఇంక వెనక్కు తగ్గడమెందుకనుకుంటూ ముప్ఫై డాలర్లకు పెంచాడు. అయినా ఆండర్స్‌ ఆగలేదు. ‘తను చూపిన ప్రేమ, ఆప్యాయత, అనురాగమంతా మరచిపోయాడా తమ్ముడు?’ అనుకున్నాడు బార్డ్‌. పైగా తను పెద్దవాడు. పాట నలభైకి చేరుకుంది. ఇప్పుడొకరినొకరు చూస్కోడానికి కూడా ఇష్టపడలేదిద్దరూ. ఆక్షన్‌ హాల్‌లో టెన్షన్‌ పెరిగింది. ‘అన్న ఎందుకిలా పట్టుపడుతున్నాడు, అడిగితే తను నామమాత్రపు ధరకే వదులుకునేవాడే. అతని కోరికను తిరస్కరించటం, ఆజ్ఞను ధిక్కరించటం ఇంతవరకూ జరగలేదే’ అనుకున్నాడు ఆండర్స్‌. అవును మరి పెంచక తప్పదు. ఓడిపోతే అందరి ముందరా తనకెంత అవమానం? ధర మరింత పెరిగింది. బార్డ్‌కు వశం తప్పింది.

‘‘వంద డాలర్లు. మన సంబంధానిక్కూడా ఇదే చివరిరోజు’’ అన్నాడు ఉద్రేకంతో ఊగిపోతూ. హాలు నిండా నిశ్శబ్దం. ఇక అక్కడ నిల్చోలేక గుర్రమెక్కి ఇంటికి ప్రయాణమయ్యాడు. వెనక నుంచి ఆక్షన్‌ డీలర్‌ వచ్చి ‘‘ఆండర్స్‌ పాట నీకే వదిలేశాడు. వాచీ నువ్వు కొనుక్కో’’ అన్నాడు. అప్పుడు కానీ అతడిలో పశ్చాత్తాపం ప్రారంభం కాలేదు. తమ్ముడి మీద ప్రేమ పొంగి పొర్లింది. తనెంత మూర్ఖంగా ప్రవర్తించాడు. ఒక వాచీ కోసం తన ప్రాణంలో ప్రాణమైన తమ్ముణ్ని వదులుకోవటమా? హాలు నుండి జనమంతా వెలుపలికొచ్చారు. ఆ గుంపులో ఆండర్స్‌ కూడా ఉన్నాడు. అన్న మనసులో ఘర్షణ అతడికి తెలియదు.‘‘నీ ప్రేమకు చాలా థ్యాంక్యూ అన్నయ్యా. నువ్వన్నట్టు మన సంబంధానికిదే చివరి రోజు. ఇక నీ ఇంటి గడప తొక్కితే ఒట్టు’’ అన్నాడు నిష్టూరంగా. ‘‘ఈ ఊరికారు అంతే దూరం. గుడ్‌బై’’ అన్నాడు బార్డ్‌ రుద్దకంఠంతో, ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకోవడానికి విఫలయత్నం చేస్తూ. ఆనాటి నుండి పుట్టిపెరిగిన ఇంటికి ఇద్దరూ దూరమయ్యారు. కొన్నాళ్లకు ఆండర్స్‌ పెళ్లి చేసుకున్నాడు. కానీ అన్నను రమ్మని కూడా పిలవలేదు. ఎంత తమ్ముడైనా ఆహ్వానించకపోతే బార్డ్‌ మాత్రం ఎందుకు పోతాడు. ఆండర్స్‌ పెంచుకున్న ఆవు చచ్చిపోయింది. కారణం ఎవరూ చెప్పలేకపోయారు. రోజులు బాగా లేనట్టుంది. కష్టాలు కట్టకట్టుకుని వచ్చాయి. అతడి పరిస్థితి దిగజారిపోయింది. ఒకనాడు ఇల్లు కూడా కాలి బూడిదైంది.

‘‘ఎవరో నామీద చేతబడి చేసుంటారు. నేను చావాలని కోరుకుంటున్నారు’’ అంటూ భోరున ఏడ్చాడు ఆండర్స్‌. ఉన్నదంతా పోయింది. బికారిగా మారాడు. పని చేసి సంపాదించాలనే కోరిక కూడా లేదు. అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి రోజు బార్డ్‌ తమ్ముణ్ని పరామర్శించటానికి వచ్చాడు. అప్పటిదాకా మంచం మీద ముడుచుకుని పడుకున్న ఆండర్స్‌ దిగ్గున లేచి కూర్చున్నాడు.‘‘ఎందుకొచ్చినట్టు? ఇక్కడ నీకేం పని!’’ అంటూ కటువుగా ప్రశ్నించాడు.‘‘నీకు సహాయం చెయ్యడానికి వచ్చాను ఆండర్స్‌’’ అన్నాడు బార్డ్‌ అనునయంగా.‘‘నా కష్టాలతో నీకేం పని? ఇంకా ఎందుకు చావలేదా అని చూడ్డానికొచ్చావా? నా తిప్పలు నేను పడతానులే, వెళ్లు వెళ్లు!’’‘‘నువ్వు అపార్థం చేసుకున్నావు’’‘‘వెళ్లు ముందు’’ అంటూ ఉరిమాడు ఆండర్స్‌. బార్డ్‌ ఒకడుగు వెనక్కు వేశాడు.‘‘వాచ్‌ కావాలంటే నువ్వే తీసుకో’’ అన్నాడు బార్డ్, తమ్ముణ్ని సముదాయించటానికి.‘‘వెళ్తావా? వెళ్లవా??’’ అంటూ ముందుకడుగు వేశాడు ఆండర్స్‌ ఆగ్రహంగా. బాధను అణుచుకుంటూ బార్డ్‌ వెనుదిరిగాడు. తమ్ముణ్ని ఎలాగైనా ఆదుకోవాలని మనసు పీకుతోంది. జరిగిందేదో జరిగింది. క్షణిక కోపంలో చేసిన పొరపాటుకు ఎన్నాళ్లు కుమిలిపోవటం? వాడన్ని కష్టాల్లో కూరుకుపోయుంటే తనకు మనశ్శాంతి ఎలా ఉంటుంది? కానీ తనకై తాను మళ్లీ వెళ్లాలంటే అభిమానం అడ్డు వచ్చింది. పైగా పెద్దవాణ్ని అనైనా చూడకుండా తనను అవమానించి పంపాడు. తను స్నేహ హస్తం చాచినా జనం తననే చులకనగా చూస్తారు. ఆదివారం నాడు చర్చ్‌కి వెళ్లినప్పుడు అక్కడ ఆండర్స్‌ కనిపించాడు. మరింత చిక్కిపోయాడు. ఎముకలు తేలాయి. మొహం పీక్కుపోయింది. ఒంటిమీద చిరిగిన దుస్తులు మాటువేసి తొడుక్కున్నాడు. బార్డ్‌ ఉనికినైనా గమనించలేదు. శిలువ మీది ప్రభువువైపే భక్తి పారవశ్యంతో చూస్తూ మోకరిల్లాడు. బార్డ్‌కు బాల్యం జ్ఞాపకం వచ్చింది. ‘చిన్నప్పుడు ఆండర్స్‌ ఎంత చురుగ్గా ఉండేవాడు..? తమ్ముణ్ని వదిలి ఉండలేనిక, పాత రోజులు మళ్లీ రావాల’ని దేవుణ్ని మనసారా ప్రార్థించాడు. ఆ కోరిక రావడమేమిటి, తక్షణమే వెళ్లి ఆండర్స్‌ పక్కన కూర్చోవాలనుకున్నాడు. కానీ ఎవరో అడ్డొచ్చారు. పైగా వాడు తనవైపు చూడ్డానికి కూడా ఇష్టపడటంలేదు. పక్కన వాడి భార్య కూడా ఉంది. ఇక్కడెందుకు ఇంటికెళ్లడమే శ్రేయస్కరం అనుకున్నాడు. సాయంత్రమైంది. తమ్ముడి ఇంటిముందు నిలిచాడు. తలుపు తట్టడానికి భయంగా ఉంది. లోపల భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు.

‘‘చర్చిలో మీ అన్నగారు కనిపించారు. నీ గురించే ఆలోచిస్తున్నాడేమో!’’‘‘లేదులే. అతడిది మరొకరి గురించి ఆలోచించే స్వభావం కాదు. ఎంతసేపూ తన గొడవే’’తమ్ముడి మాటలకు బార్డుకు చెమట పట్టింది. చలిగా ఉంది. అయినా చాలాసేపు అక్కడే నిలుచున్నాడు. లోపల కెటిల్‌లో నీళ్లు మరుగుతున్నట్టుంది. ఆవిరి చప్పుడు వినిపిస్తోంది. చిన్నపిల్ల ఏడ్చింది.‘‘ఒప్పుకోవుగానీ నువ్వు కూడా అస్తమానూ మీ అన్నగారి గురించే ఆలోచిస్తుంటావులే. నాకు తెలియవా మీ స్వభావాలు’’ అంది భార్య.‘‘ఇంకేదన్నా మాట్లాడు’’ అంటూ విసుక్కున్నాడు ఆండర్స్‌.బార్డ్‌ ఇంక తిరిగి పోదామనుకున్నాడు. కానీ అంతలోనే తలుపు తెరుచుకుంది. చలి మంటకు కట్టెల కోసం ఆండర్స్‌ కొట్టం వైపుకు వచ్చాడు. ఇంట్లో వేసుకునే పైజమా, షర్ట్‌కు బదులు సైనిక యూనిఫాం వేసుకున్నాడు. ‘‘ఇది ఇక తొడుక్కోవద్దు. పిల్లలకు జ్ఞాపకంగా దాచిపెట్టాలి’’ అని సైన్యం నుంచి బయటకు వచ్చిన రోజున వాగ్ధానం చేసుకున్న మాటలు గుర్తుకొచ్చాయి బార్డ్‌కి. పైగా ఆండర్స్‌ దానిని రోజూ వాడటం వల్ల చిరిగినట్టుంది. అదే సమయంలో బార్డ్‌ జేబులోని గోల్డ్‌ వాచ్‌ టిక్‌టిక్‌మంటూ శబ్దం చేసింది. ఆండర్స్‌ కట్టెలు తీసుకుని వెళ్లటానికి బదులు ఆకాశం వైపు దీనంగా చూస్తూ ‘‘ఇంకెన్నాళ్లు ప్రభూ ఈ కష్టాలు’’ అంటూ చేతులెత్తి ప్రార్థించాడు. ఆ మాటల్ని చివరి రోజుదాకా మర్చిపోలేడు బార్డ్‌. ఆ క్షణానే వెళ్లి తమ్ముణ్ని గుండెలకు హత్తుకోవాలనుకున్నాడు. కానీ ధైర్యం చాలలేదు. జబ్బు మనిషిలాగా దగ్గుతూ ఆండర్స్‌ కట్టెలు తీసుకుని వెళ్లాడు. మరో పది నిమిషాలదాకా అక్కణ్నుంచి కదల్లేదు బార్డ్‌. బహుశా రాత్రంతా అక్కడే ఉండేవాడేమో. కానీ చలి తీవ్రమైంది. అలా ఆరుబైట నిల్చుంటే మంచులో కూరుకుపోయేవాడే. తమ్ముణ్ని ఆ పరిస్థితిలో చూడటం కలచివేస్తోంది. చివరికి కట్టెల కొట్టంలో లాంతరు వెలిగించి కొక్కానికి తన గోల్డ్‌ వాచ్‌ తగిలించి, తన బాధ్యత నిర్వర్తించానన్న తృప్తితో చిన్నపిల్లాడిలా ఇంటికి పరిగెత్తాడు. ఆ రాత్రి కొట్టానికి నిప్పంటుకుంది. లాంతరు నుంచి నిప్పు రవ్వలు లేచి ఉంటాయి. పైనున్న గడ్డికప్పు కూడా కాలింది. బార్డ్‌ కుమిలి కుమిలి ఏడ్చాడు. ఈ ఘోర పాపానికి నిష్మృతి లేదు అనుకుంటూ రోజంతా మోకరిల్లి, ప్రార్థనా గ్రంథాలు చదువుతూ దైవస్మరణలో గడిపాడు. తెలియక చేసినా నేరం నేరమే. ఆ రాత్రి మసక వెన్నెల వెలుగులో తమ్ముడింటి పాక దగ్గరకెళ్లి వాచ్‌ కోసం వెతికాడు. గోళికాయంత బంగారం ముద్ద దొరికింది. కరిగి మిగిలిందదే. అది పట్టుకుని వెళ్లి తమ్ముడికి జరిగిందంతా చెప్పి గుండె బరువు దించుకుందామనుకున్నాడు. కానీ మొహమాటం, బెరుకు, భయం. బార్డ్‌ బూడిదలో వెతుకుతున్నప్పుడు ఓ చిన్న పిల్ల చూసింది. క్రితం రోజు కూడా అతడక్కడికి రావటం చూశారు అక్కడే ఆడుకుంటున్న మరికొంత మంది పిల్లలు. అన్నదమ్ములిద్దరూ బద్ధశత్రువులని ఊరంతా తెలుసు. ఇరుగుపొరుగు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభమైంది. ఎవరూ ఏం నిరూపించలేదు. కానీ అందరి అనుమానం బార్డ్‌ మీదే. ఏ ముఖం పెట్టుకుని పలకరించగలడిప్పుడు? అన్న దొంగ చాటుగా తనింటికి వచ్చాడని ఆండర్స్‌కి తెలిసింది. కానీ అతడు నోరు మెదపలేదు. ఇంటిని తగలపెట్టినందుకు పశ్చాత్తాపంతో ఏడ్చాడని కూడా చెప్పారు జనం. కానీ ఇంత నీచమైన పనికి దేవుడు కూడా క్షమించడు. నేరం రుజువు కాలేదు కానీ ఇంత దారుణానికి ఒడిగట్టింది బార్డేనని ఊరంతా అనుకుంది. దర్యాప్తు సందర్భంగా అన్నదమ్ములిద్దరూ ఎదురుపడ్డారు. ఖరీదైన కొత్త దుస్తుల్లో బార్డ్, చింకిపోయిన పాత దుస్తుల్లో ఆండర్స్‌. అన్న మొహంలోని దైన్యం ఆండర్స్‌ గమనించకపోలేదు. ‘‘బహుశా తనకు వ్యతిరేకంగా చెప్పవద్దని వేడుకుంటున్నట్టుంది’’ అనుకున్నాడు. అందువల్ల దర్యాప్తు అధికారి ‘‘మీ అన్నమీద నీకు అనుమానముందా?’’ అని అడిగినప్పుడు లేదన్నాడు ఆండర్స్‌.

మిగిలిన ఒకే ఒక్క పాక కూడా అగ్నికి ఆహుతి కావటంతో ఆండర్స్‌కు నిలువ నీడ లేకుండా పోయింది. అన్నీ ఉన్నా బార్డ్‌ పరిస్థితి అంతకన్నా అధ్వాన్నంగా మారింది.     పశ్చాత్తాపాగ్ని అతణ్ని ప్రతిక్షణం దహించివేస్తోంది. నిద్రాహారాలు మాని నిరంతర దుఃఖంలో మునిగిపోయాడు.ఇప్పుడతణ్ని ఎవరూ గుర్తుపట్టలేరు. ఒక సాయంత్రం పేదరాలెవరో వచ్చి వెంటరమ్మంది. కాసేపటికి కానీ పోల్చుకోలేకపోయాడు. ఆవిడ ఆండర్స్‌ భార్య అని. సిగ్గుతో, అవమానంతో మరింత కుంగిపోయాడు. ఆమె ఎందుకు పిలిచిందో కూడా గ్రహించగలడు. ఆండర్స్‌ పూరిపాకలో దీపం వెలుగు కనిపించింది. అంతా ముళ్ల బాట. ఆ వెలుగే లేకపోతే అక్కడ నడవటం అసాధ్యం. చాలాసార్లు మంచులో దిగబడిపోయాయి కాళ్లు. పాక తలుపు వద్ద ఏదో వాసనేసింది. కడుపులో తిప్పినటై్టంది. లోపల పసి పిల్లాడు బొగ్గు తింటున్నాడు. మొహం కూడా నల్లబారింది. పళ్లు మాత్రం తెల్లగా మెరిశాయి. వాడు ఆండర్స్‌ కొడుకు. కుక్కి మంచం మీద ముడుచుకుని పడుకున్నాడు ఆండర్స్‌. చిరుగుపాత బొంతలు కప్పుకున్నాడు. కళ్లు పీక్కుపోయాయి. ఆస్తిపంజ రాన్ని చూసినట్టుగా ఉంది. తమ్ముడి మంచం మీద పడి వెక్కివెక్కి ఏడ్చాడు బార్డ్‌. కాసేపటికి బైటికి పొమ్మని భార్యకు సైగ చేశాడు ఆండర్స్‌. బార్డ్‌ ఆమెను ఉండమని అర్థించాడు. అన్నదమ్ముల మధ్య జరిగిన విషయాలన్నీ వివరంగా మాట్లాడుకున్నారు. వేలంపాట నుంచి ఆనాటి దాకా. బార్డ్‌ జేబులోంచి బంగారు ముద్ద బైటికి తీసి చూపించాడు. తాము విడిపోయిన నాటి నుంచి ఏ ఒక్కరూ ఏ ఒక్క రోజు కూడా సుఖంగా గడపలేదు. ఆండర్స్‌ బాగా బలహీనంగా ఉన్నాడు. తమ్ముడి ఆరోగ్యం కుదుట పడిందాకా మంచం పక్కనుంచి కదల్లేదు బార్డ్‌.

‘‘ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఇంక మనమెప్పుడూ విడిపోకూడదు అన్నయ్యా!’’ అంటూ కౌగిలించుకున్నాడు ఆండర్స్‌. కానీ ఆ రోజే అతడు మరణించాడు. అతడి భార్యనూ, కొడుకునూ వెంట తీసుకెళ్లాడు బార్డ్‌. వాళ్ల సంరక్షణ, పోషణ బాధ్యత తనే తీసుకున్నాడు. ఆనాడు అన్నదమ్ములు మాట్లాడుకున్న విషయాలు క్రమంగా ఊరంతా తెలిశాయి. నిప్పుల్లో కాలిన బంగారం లాంటిదే బార్డ్‌ మనసు. అన్నదమ్ముల బంధమంటే అలాగే ఉండాలనుకున్నారందరూ. అందరి గౌరవాన్ని, ప్రేమాభిమానాల్ని అందుకున్న బార్డ్‌ స్కూల్‌ టీచర్‌గా మారి పిల్లలకు పాఠాలు చెబుతూ చిరకాలం జీవించాడు. అతడు నిజంగా అందరికీ బోధించింది సాటి మనుషుల పట్ల ప్రేమ చూపటం గురించి... సర్వ మానవ సౌభ్రాతృత్వమే నిజమైన నాగరికత అని. పిల్లలకు అతడు టీచర్‌ కాడు, తమలో ఒకడు. వృద్ధబాలుడు.

నార్వేజియన్‌ మూలం : బ్యోర్న్‌స్టెర్న్‌ బ్యోర్న్‌సన్‌
అనువాదం : ముక్తవరం పార్థసారథి

  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top