పలకరింపు | Sakshi
Sakshi News home page

పలకరింపు

Published Sun, Aug 5 2018 1:50 AM

Funday horror story - Sakshi

‘‘ఇరవై ఆరేళ్ల వయసులో పదమూడు ఉద్యోగాలను వద్దనుకుని, లక్షల జీతాలను పరిత్యజించి, ఇక్కడికి ఎందుకు వచ్చారు మిస్టర్‌ నెరూడా..!’’.. ఇంటర్వ్యూ చేస్తున్న ముగ్గురిలో మొదట్నుంచీ కాస్త భిన్నంగా ప్రశ్నలు వేస్తున్న వ్యక్తి అడిగాడు. ‘‘మీ కంపెనీలో ఉమెన్‌ ఎంప్లాయీస్‌ ఉండరని తెలుసుకునే సీవీ పంపాను సర్‌’’ అన్నాడు నెరూడా.  ‘‘ఉండకపోవడం కాదు, లేకపోవడం’’ అన్నాడు ఆ భిన్నంగా మాట్లాడే వ్యక్తి. వెంటనే రెండో వ్యక్తి అందుకున్నాడు.  ‘‘మాదేం నాన్‌–ఉమెన్‌ ఆఫీస్‌ కాదు మిస్టర్‌ నెరూడా. వస్తే తీసుకునేవాళ్లమే. కానీ అది ఒకప్పుడు. ఇప్పుడు వచ్చినా తీసుకునే ఉద్దేశం లేదు. అలాగని పేపర్‌లో బహిరంగంగా ప్రకటన ఇవ్వలేం కదా.. ‘మహిళలు దరఖాస్తు చెయ్యనవసరం లేదు’ అని! చట్టం ఒప్పుకోదు. ఉమెన్‌ క్యాండిడేట్స్‌ అసలే ఒప్పుకోరు.’’ వింటున్నాడు నెరూడా. మీరొచ్చి జాయిన్‌ అయిపోవచ్చు అనే మాట కోసం చూస్తున్నాడతను. పేపర్‌ లెస్‌ ఆఫీస్‌లా, ఉమన్‌ లెస్‌ ఆఫీస్‌లో పని చేయాలని ఉందతడికి. ‘‘ఇంత చిన్న వయసులో అన్ని ఉద్యోగాలు మారారంటే రెండు కారణాలు ఉంటాయి నెరూడా. ఒకటి.. మీలో స్థిరత్వం లేకపోవడం. రెండు.. కంపెనీకి స్థిరమైన ఎదుగుదల లేకపోవడం’’ అన్నాడు భిన్నంగా మాట్లాడే వ్యక్తి. 

‘‘నేను ఉద్యోగాలు మారలేదు సర్‌. ఆఫీసులు మారాను. స్థిరత్వం అంటారా! స్థిరత్వం నాకూ ఉందీ, నేను పని చేసిన కంపెనీలకూ ఉంది. నా సీవీలో చూసే ఉంటారు. అన్నీ పెద్ద పెద్ద కంపెనీలు. అవేవీ నన్ను తీసేయలేదు. నేనే వద్దనుకుని బయటికి వచ్చేశాను. అలా రావడానికి కారణం.. అక్కడ పని చేసే ఉమెన్‌ ఎంప్లాయీస్‌’’.. చెప్పాడు నెరూడా! ‘‘ఇలాంటి కారణమేదో ఉంటుందని నేను ఊహించాను మిస్టర్‌ నెరూడా. బై ద వే. మీకు నెరూడా అని పేరు పెట్టింది మీ నాన్నగారే కనుకైతే ఆయన చిలీ దేశపు మహాకవి పాబ్లో నెరూడా పేరునే మీకు పెట్టి ఉంటారని అనుకుంటున్నాను. యామై రైట్‌?’’ అన్నాడు భిన్నంగా మాట్లాడే వ్యక్తి.  నెరూడా నవ్వాడు. ‘‘మీరు రైట్‌ కాదు సర్‌’’ అన్నాడు. ‘‘ఆ పేరు నాకు మా అమ్మ పెట్టింది. నెరూడా ప్రేమ కవితల్లోని తాత్వికతకు ఆమె అభిమానురాలు..’’ ‘‘కానీ మిస్టర్‌ నెరూడా. నేనూ చదివాను అతడిని. నలుగుర్ని ప్రేమించి, ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఆడవాళ్లెవరికీ అతడంటే ఇష్టం ఉండదని అంటారు. స్ట్రేంజ్‌ ఏమిటంటే.. అందుకు రివర్స్‌గా ఇప్పుడు నా ఎదురుగా ఉన్న నెరూడాకు ఆడవాళ్లంటే ఇష్టం లేదు’’ అని పెద్దగా నవ్వాడు భి.వ్య. (భిన్నంగా మాట్లాడే వ్యక్తి).  ‘‘నో.. నో.. సర్‌. నాకు ఆడవాళ్లంటే ఇష్టం లేకపోవడమో, పడకపోవడమో కాదు. ఆడవాళ్లు ఉన్నచోట ప్రేమలు అవీ ఉంటాయి. అవి ఇష్టం ఉండదు నాకు’’ అన్నాడు నెరూడా.  ‘‘ఏ! మగవాళ్లు ఉన్నచోట్ల ప్రేమలు ఉండవా?’’ అని ఒకాయన అంటుండగానే.. ‘‘అంటే.. ఈ పదమూడు ఉద్యోగాలూ ఆ ఆడవాళ్ల ప్రేమలు పడలేకే మీరు మానేశారా మిస్టర్‌ నెరూడా..’’ అని ఇంకొకాయన అడిగాడు. 

‘‘నో.. నో.. సర్‌’’ అన్నాడు నెరూడా మళ్లీ.  ఇంటర్వ్యూయర్‌లు అతడి వైపే చూస్తున్నారు.  ‘‘సర్‌. నన్నెవరూ ప్రేమించలేదు. నేనెవర్నీ ప్రేమించలేదు. ప్రేమ పర్యవసానాల్ని చూళ్లేక మానేశాను! ‘నాకే ఇలా ఎందుకు జరిగింది.. నెరూ..’ అని నా మేల్‌ కొలీగ్‌ నాతో అన్న రోజు రాత్రే సూసైడ్‌ చేసుకున్నాడు. అతడికి జరిగిందేమిటంటే.. నా ఫిమేల్‌ కొలీగ్‌ అతడి ప్రేమను తిరస్కరించడం! తిరస్కరించడం ఆమె తప్పేమీ కాదు. కానీ అతను అలా అనుకోలేకపోయాడు. ప్రతి ఆఫీస్‌లోనూ ఏదో ఒకటి నాకు ఇలాగే అనుభవం అయింది సర్‌. సూసైడ్‌ చేసుకున్నవాళ్లు, సూసైడ్‌ అటెంప్ట్‌ చేసినవాళ్లు.. అందరూ మగవాళ్లే’’ అని చెప్పి, ఆగాడు నెరూడా. ‘‘మీరేమంటున్నారు నెరూడా. ఆఫీసుల్లో  మగవాళ్ల వల్ల సూసైడ్‌ చేసుకున్న ఆడవాళ్లు లేరా?!’’ అన్నాడు భి.వ్య. ‘‘అలా అనట్లేదు సర్‌. నాకెందుకో అంతా మగవాళ్లే ఉండే ఆఫీస్‌లో పని చేయాలని ఉంది’’ అన్నాడు.  ‘‘కె.. నెరూడా, మీరు వెళ్లొచ్చు’ అన్న తర్వాత,  ఆ సాయంత్రం అతడికి మెయిల్‌ వచ్చింది.. జాయిన్‌ అవ్వొచ్చని!

ఆఫీసంతా మగవాళ్లతో కళకళలాడుతూ కనిపించింది నెరూడాకి. నెరూడా పోస్ట్‌ పెద్దది. ఆఫీస్‌లో అతడికో క్యాబిన్‌ ఉంది. ఒక్కొక్కళ్లూ లోపలికి వచ్చి విష్‌ చేసి వెళుతున్నారు. అందరితో నవ్వుతూ మాట్లాడాడు. వచ్చిన రోజే చాలా పని చేశాడు. చాలా పని చేస్తే అలసటగా ఉండాలి. కానీ ఉత్సాహంగా ఉంది. అందుకు కారణం ఆడవాళ్లే లేని ఆఫీసులో పని చేస్తున్నానన్న భావనే.ఐదో అంతస్తులో ఉన్న విశాలమైన ఆఫీస్‌ అది. ఈవెనింగ్‌.. స్టాఫ్‌ అంతా వెళ్లిపోగానే ఇంకా విశాలంగా కనిపించింది. కాసేపు స్టాఫ్‌ ఉండే వరుసల్లో తిరిగి, అద్దాల్లోంచి రోడ్డు బయటికి చూసి మళ్లీ వచ్చి తన క్యాబిన్‌లో కూర్చున్నాడు నెరూడా. క్యాబిన్‌లోకి వచ్చే ముందు, ఇంకా ఎవరో కీ బోర్డ్‌పై టైప్‌ చేస్తున్నట్లనిపిస్తే వెనక్కు తిరిగి చూశాడు. ఎవరూ లేరు! క్యాబిన్‌లోకి వచ్చాక టైమ్‌ చూసుకున్నాడు. ఎనిమిదిన్నర! ‘అప్పుడే ఎనిమిదిన్నరా!’ అనుకున్నాడు. కూర్చున్న వెంటనే, మళ్లీ వాష్‌రూమ్‌కని లేచాడు. అతడి క్యాబిన్‌లోనే వెనుక వైపు అటాచ్డ్‌గా వాష్‌రూమ్‌ ఉంటుంది. లోపలికి వెళ్లాడు. లోపల అద్దం ఉంది. ముఖం చూసుకున్నాడు. ఫ్రెష్‌గా ఉంది. అయినా కొంచెం చన్నీళ్లు చిలకరించుకుని కర్చీఫ్‌తో తుడుచుకున్నాడు. తుడుచుకుంటున్నప్పుడు అతడు అద్దం చూసుకోలేదు. తుడుచుకున్నాక అద్దంలోకి చూస్తే అద్దంలో ఎవరో కనిపించి మాయమైనట్లనిపించింది అతడికి! ఉలిక్కిపడి, వెంటనే నవ్వుకున్నాడు. భ్రమ!అయితే ఆ నవ్వు ఎన్నో క్షణాలు అతడి ముఖంపై లేదు! వాష్‌రూమ్‌ తలుపు తోసుకుని క్యాబిన్‌లోకి రాగానే, తన సీటు ఎదురుగా ఉన్న సీట్లో ఎవరో అటువైపు తిరిగి కూర్చొని ఉన్నారు!నెరూడా భయస్తుడు కాదు. కానీ ఒక్కసారిగా భయపడ్డాడు. ‘‘హాయ్‌.. నా పేరు అనుమిత! ఈ రోజే జాయిన్‌ అయ్యాను..’’ చెయిర్‌లోని మనిషి ఇటువైపు తిరిగి, పలకరింపుగా నవ్వి చెప్పింది. 

రెండో రోజు ఆఫీస్‌కి వచ్చాక భిన్నంగా మాట్లాడే వ్యక్తిని కలిసి అనుమిత గురించి అడిగాడు నెరూడా. ‘‘చెప్పడానికేం లేదు. ఒకప్పుడు తను మా స్టాఫ్‌. కొలీగ్‌ని ప్రేమించి, అతడు మోసం చేస్తే.. సూసైడ్‌ చేసుకుంది. అతణ్ణి ఉద్యోగంలోంచి తీసేశాం. అనుమితను మాత్రం అతడి ప్రేమలోంచి తీసేయలేకపోయాం’’...  చెప్పాడు ఆయన. ఇంటికొచ్చాక తల్లిని అడిగాడు నెరూడా. ‘‘అమ్మా.. అనుమిత అంటే అర్థం ఏమిటి?’’‘ప్రేమ’’ చెప్పిందావిడ. 
∙మాధవ్‌ శింగరాజు 

Advertisement
Advertisement