మనలో మననంలో

Funday cover story:October 2 Gandhi Jayanti - Sakshi

కవర్‌ స్టోరీ

అక్టోబర్‌ 2 గాంధీజయంతి

ఔను! గాంధీ ఉన్నాడు.చరిత్ర పుటల్లో ఎక్కడో చిక్కుకుపోయి లేడు.మనలో ఉన్నాడు, మననంలో ఉన్నాడు.ప్రతి విప్లవాత్మక ఆలోచనలోనూ మహాత్ముడు ఉన్నాడు.ప్రపంచంలో భారతావనికి ఉన్న కీర్తి ప్రతిష్ఠల్లో ఇప్పటికీ ఉన్నాడు.హింసను అహింసతో ఎదుర్కొన్న శౌర్యంలో ఉన్నాడు.మరి ఈ మహాత్ముడు రేపటి తరంలోనూ ఉండాలి.తరతరానికీ ఇంకా ఉండాలి. అందుకే ఈ ప్రయత్నం.

కత్తితో ఛేదించనిది కరుణతో సాధించాలి అనే అహింసా సూత్రాన్ని ఆచరణాత్మకంగా పాటించిన తొలి జాతీయ నాయకుడు ఆయన. అసలు పేరు మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ అయినా, ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో అహింసామార్గంలో పోరాటం సాగించి, మహాత్మాగాంధీగా ప్రసిద్ధుడయ్యాడు. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా జాతిని కూడగట్టి, ఏకతాటిపై నడిపించి, దేశ స్వాతంత్య్ర సముపార్జనలో కీలక పాత్ర పోషించి జాతిపితగా చరిత్రకెక్కాడు. గాంధీ మార్గం తర్వాతి కాలంలో ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో జరిగిన పోరాటాలకు స్ఫూర్తినిచ్చింది. అమెరికాలో నల్లజాతి వారి హక్కుల కోసం పౌరహక్కుల ఉద్యమాన్ని సాగించిన మార్టిన్‌ లూథర్‌ కింగ్, దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర పోరాటాన్ని సాగించిన నెల్సన్‌ మండేలా వంటి వారు గాంధీ స్ఫూర్తితోనే తమ ఉద్యమాలు సాగించారు. సమాజంలో హింస పెచ్చరిల్లుతున్న ప్రస్తుత తరుణంలో అహింసను బోధించిన మహాత్ముని ఒకసారి మననం చేసుకోవడం అవసరం. రేపటి తరాలకు వెలుగు బాటలు చూపగల మహాత్ముని మాటలు మీ కోసం...

►నా  జీవితమే  నా  సందేశం.

►పొరపాట్లు లేని స్వేచ్ఛే లేకుంటే  ఆ స్వేచ్ఛకు అర్థమే లేదు.

►ప్రపంచంలో  ఏ మార్పును చూడాలనుకుంటున్నారో మీరే ఆ మార్పుగా మారండి.

►సత్యం ఒక్కటే, దాని మార్గాలే అనేకం.

►అందరూ కంటికి కన్ను అనే సూత్రం పాటిస్తే, ప్రపంచమే గుడ్డిదైపోతుంది.

►సత్యాన్ని పలకాల్సిన సందర్భంలో, దానికి అనుగుణంగా ముందుకు కదలాల్సిన సందర్భంలో మౌనం పాటించడం పిరికితనమే  అవుతుంది.

►మనంతట మనమే ఇవ్వకుంటే ఎవరూ మన ఆత్మగౌరవాన్ని తీసుకుపోలేరు.

►సున్నితమైన మార్గంలో మీరు ప్రపంచాన్నే వణికించగలరు.

►నా బుద్ధి మేరకు ఒక గొర్రె ప్రాణం ఒక మనిషి ప్రాణం కంటే తక్కువ విలువైనదేమీ కాదు.

► ఏ పని చేసినా  ఆ పనిని ప్రేమతో చేయండి. లేకుంటే, ఆ పనిని చేయనే చేయవద్దు.

► వాళ్లు నా శరీరాన్ని హింసించవచ్చు, నా ఎముకలను విరిచేయవచ్చు, చివరకు వాళ్లు నన్ను చంపేయవచ్చు. వాళ్లు నా శవాన్ని పొందవచ్చు తప్ప నా లొంగుబాటును  కాదు.

► నా అనుమతి లేకుండా ఇతరులెవ్వరూ నన్ను గాయపరచలేరు.

►‘శాంతిమార్గం’ అంటూ ఏదీ ఉండదు. ‘శాంతి’ మాత్రమే ఏకైక మార్గం.

►మన చర్యల పర్యవసానాల నుంచి పారిపోవాలనుకోవడం పొరపాటు మాత్రమే కాదు, అనైతికం కూడా.

►అహింస దృఢమనస్కుల ఆయు«ధం.

►మీ ప్రత్యర్థి ఎప్పుడు మీకు తారసపడినా, అతడిని ప్రేమతోనే జయించండి.

►నిర్భీకతే ఆధ్యాత్మికతకు తొలిమెట్టు. పిరికితనం నైతికతకు అవరోధం.

►న్యాయమైన ప్రయోజనాన్ని సత్యం ఏనాడూ దెబ్బతీయదు.

►బలహీనులు ఇతరులను క్షమించలేరు. క్షమాగుణం బలవంతులకు మాత్రమే సాధ్యమైన సుగుణం.

►మీరు భయాన్ని నిరాకరిస్తే, ప్రపంచంలో మిమ్మల్ని భయపెట్టేది ఏదీ ఉండదు.

►నిజాయితీతో కూడిన అభిప్రాయభేదాలు ఆరోగ్యకరమైన అభివృద్ధికి సంకేతాలు.

►ప్రేమ ఎక్కడ ఉంటుందో, జీవం అక్కడే ఉంటుంది.

►కొండంత ప్రబోధం కంటే ఇసుమంత ఓరిమి చాలా విలువైనది.

►బలం అనేది  శారీరక సామర్థ్యం నుంచి వచ్చేది కాదు, చెక్కుచెదరని సంకల్పం నుంచి వచ్చేది.

►నాకే గనుక హాస్యస్ఫూర్తి లేకుంటే, ఏనాడో నేను ఆత్మహత్య చేసుకునేవాణ్ణి.

►పాపాన్ని ద్వేషించండి, పాపిని ప్రేమించండి.

►మీరు ఈ రోజు చేసే చర్యలపైనే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

►పిరికివాళ్లు ప్రేమను ప్రదర్శించలేరు, అది ధైర్యవంతుల లక్షణం.

►ఈ భూమి ప్రతి  మనిషి అవసరాలు తీర్చడానికి తగినంత ఇస్తుంది. కానీ, ప్రతి మనిషి లోభానికి తగినంత కాదు.

►ప్రార్థన అనేది ఉదయానికి తాళం చెవిలాంటిది, రాత్రికి గడియలాంటిది.

►ఏ రోజు ప్రేమకు గల శక్తి అధికారంపై గల ప్రేమను జయిస్తుందో ఆ రోజే ప్రపంచశాంతి సిద్ధిస్తుంది.

►మితభాషి అయిన మనిషి అనాలోచితంగా ఏదీ మాట్లాడడు.

►కర్మ మాత్రమే మనిషి నియంత్రణలో ఉంటుంది కానీ, దాని ఫలితం కాదు.

►సత్యాన్ని మించిన దైవం లేదు.

►పేదరికం అత్యంత  దారుణమైన హింసారూపం.

►మూసి ఉన్న పిడికిలితో కరచాలనం చేయలేం.

►ప్రేమ ఎక్కడ ఉంటుందో, దైవం అక్కడే ఉంటుంది.

►నీ పొరుగువానిలో దేవుడిని కనుగొనలేనప్పుడు, దేవుని గురించిన నీ అన్వేషణ వ్యర్థం.

►వినయంతో చేయని సేవ స్వార్థమూ, అహంభావమే అవుతుంది.

►మనం ఏమీ చేయలేని రోజులు రెండే రెండు. అవి: నిన్న, రేపు.

►భయమే శత్రువు. మనం దానిని ద్వేషం అనుకుంటాం. నిజానికది భయమే!

►ప్రవర్తన అద్దంలాంటిది. అందులో మనల్ని మనం స్పష్టంగా చూసుకోగలం.

►వ్యక్తుల మధ్య దృఢంగా గల ప్రేమ పునాదులపైనే దేశాల మధ్య శాంతి ఆధారపడి ఉండాలి.

►క్రోధం, అసహనం సరైన అవగాహనకు జంట శత్రువులు.

►భగవంతునికి మతం  లేదు.

►మనిషి తన ఆలోచనలకు తానే ప్రతిరూపం. మీరు మీ ఆలోచనలకు అనుగుణంగానే తయారవుతారు.

►ఎలాంటి కష్టం లేకుండా సిసలైన జీవితాన్ని గడపడం సాధ్యం కాదు.

►భౌతిక అనుబంధం కంటే ఆధ్యాత్మిక అనుబంధం గొప్పది. ఆధ్యాత్మికత లేని జీవితం ఆత్మ లేని శరీరంలాంటిది.

►మనం ఇతరులకు ఎంత సత్వరంగా న్యాయం చేయగలిగితే మనమూ అంతే సత్వరంగా న్యాయాన్ని పొందగలం.

►భగవంతుడు మనతో ప్రతిరోజూ మాట్లాడుతూనే ఉంటాడు. మనకే 
►ఆ మాటలను ఎలా వినాలో తెలియదు.

►150 దేశాల  తపాలా బిళ్లలపై గాంధీ బొమ్మ

మనదేశంలో తపాలా బిళ్లల మీద, కరెన్సీ నోట్ల మీద, నాణేల మీద మహాత్మాగాంధీ బొమ్మ ఉండటం విడ్డూరం కాదు గానీ, ఏకంగా 150 దేశాలు మహాత్ముని బొమ్మతో తపాలా బిళ్లలు ముద్రించడం మాత్రం నిజంగా విశేషం. మహాత్మాగాంధీకి ప్రపంచవ్యాప్తంగా గల ఆదరణకు ఇదొక నిదర్శనం.  దాదాపు రెండు దశాబ్దాలు మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్‌వారి నుంచి విముక్తి కోసం గాంధీజీ స్వాతంత్య్ర పోరాటం సాగించారు. తమ దేశానికి వ్యతిరేకంగా పోరాటం సాగించిన గాంధీజీ బొమ్మతో బ్రిటన్‌ కూడా తపాలా బిళ్లలు ముద్రించడం మరింత విశేషం. బ్రిటిష్‌ రాచ కుటుంబీకుల బొమ్మలు తప్ప ఇతరుల బొమ్మలతో తపాలా బిళ్లలు, కరెన్సీ ముద్రించని బ్రిటన్‌లో గాంధీజీకి మాత్రమే ఈ విషయంలో మినహాయింపు లభించింది. అలహాబాద్‌కు చెందిన పప్పుదినుసుల వ్యాపారి అనిల్‌ రస్తోగికి స్టాంపుల సేకరణ హాబీ. ఆయన ప్రపంచవ్యాప్తంగా మహాత్మాగాంధీ బొమ్మతో ముద్రితమైన 800 స్టాంపులను సేకరించి, తపాలాశాఖ ద్వారా సత్కారాన్ని పొందారు. రస్తోగీ సేకరణలో గాంధీజీ బొమ్మతో భూటాన్‌ ముద్రించిన ప్లాస్టిక్‌ స్టాంపు, ‘లీడర్‌ ఆఫ్‌ ట్వెంటీయత్‌ సెంచురీ’ పేరిట మైక్రోనేసియా ముద్రించిన అరుదైన స్టాంపులు కూడా ఉండటం విశేషం. దక్షిణాఫ్రికా, మాల్టా, సమోవా వంటి కొన్ని దేశాలు గాంధీజీ బొమ్మతో నాణేలు కూడా ముద్రించాయి.

ప్రపంచ దేశాల్లో గాంధీజీ
గాంధీజీ పుట్టి పెరిగిన భారత్‌లోను, ఉన్నత చదువులు చదువుకున్న ఇంగ్లండ్‌లోను, న్యాయవాదిగా పనిచేసిన దక్షిణాఫ్రికాలోను మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల్లో గాంధీజీ విగ్రహాలు, స్మారక చిహ్నాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి...
►భారత్‌కు ఇంకా స్వాతంత్య్రం రాకముందే అమెరికాలో స్థిరపడిన జర్మన్‌ కళాకారుడు ఫ్రిట్జ్‌ ఈషెన్‌బర్గ్‌ 1942లో ‘గాంధీ, ది గ్రేట్‌ సోల్‌’ పేరిట  కలపపై చెక్కిన శిల్పం అమెరికాలో ఇప్పటికీ నిలిచి ఉంది.
►ఫ్రెడ్డా బ్రిలియంట్‌ అనే శిల్పి రూపొందించిన గాంధీజీ శిల్పాన్ని 1968లో లండన్‌లో నెలకొల్పారు. అప్పటి బ్రిటిష్‌ ప్రధాని హెరాల్డ్‌ విల్సన్‌ దానిని ఆవిష్కరించారు.
► భారత దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 1984లో డెన్మార్క్‌కు బహూకరించిన గాంధీజీ విగ్రహాన్ని డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగన్‌ నడిబొడ్డున నెలకొల్పారు.
►న్యూయార్క్‌లోని యూనియన్‌ స్క్వేర్‌ పార్కులో 1986 అక్టోబర్‌ 2న గాంధీజీ జయంతి సందర్భంగా ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. భారతీయ శిల్పి కాంతిలాల్‌ పటేల్‌ ఈ శిల్పాన్ని తీర్చిదిద్దారు.

దక్షిణాఫ్రికాలోని పీటర్‌మారిట్జ్‌బర్గ్‌లో 1993 సంవత్సరంలో గాంధీ విగ్రహాన్ని నెలకొల్పారు. మొదటి తరగతి బోగీలో ప్రయాణిస్తున్న గాంధీని ఇదే చోట బలవంతంగా రైలు నుంచి తోసేసిన సంఘటనకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా నెలకొల్పిన ఈ విగ్రహాన్ని నోబెల్‌ బహుమతి గ్రహీత, దక్షిణాఫ్రికా క్రైస్తవ మతబోధకుడు డెస్మండ్‌ టుటు ఆవిష్కరించారు.ఇవి మాత్రమే కాదు, దాదాపు యాభైకి పైగా దేశాల్లో మహాత్మాగాంధీ విగ్రహాలు, స్మారక కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచంలో మరే నాయకుని పేరిటా ఇన్ని స్మారక చిహ్నాలు లేవు. అహింసామార్గంలో ఆయన సాగించిన పోరాటానికి ప్రపంచ దేశాలు పలికిన నీరాజనాలు ఈ స్మారక చిహ్నాలు.
  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top