కఫన్‌

 family dried up, and the daughter of his niece, Shahina - Sakshi

కొత్త కథలోళ్లు

తెల్లవారుతూ ఉంది. అప్పుడే మర్కస్‌ మసీదు మీనారాల నుండి అల్లాహు అక్బర్‌ – అంటూ అజా రాగయుక్తంగా వినిపిస్తూ ఉంది. సకీనాబీ పరివారం అజా వినబడగానే నిదురనుండి లేచింది. సకీనాబీ, అత్త ఖాసింబీ, కూతురు షాహినాను ‘‘అజా ఇచ్చారు లేవండి’’ అని నిదుర లేపింది.  అందరూ లేచి వజూ చేసుకుని, రెండు రకాతులు సున్నత్‌ నమాజ్, రెండు రకాతులు ఫర్జ్‌నమాజులు చదివి చేతులు పైకెత్తి జబ్బుపడ్డ తమ ఇంటి పెద్దను ఆరోగ్యవంతునిగా చేయమని దీనంగా కన్నీళ్లు కారుస్తూ ప్రార్థించి, ఒక మూల మంచంపై అచేతనంగా పడివున్న హుసేన్‌ను శరీరంపై నిమిరి ఊదారు. 
ఇంటి యజమాని హుసేన్‌కు పక్షవాతము వచ్చి కుడికాలు, కుడిచేయి, నోరు పడిపోయి సరైన వైద్య సదుపాయం లేక రోజులు లెక్కిస్తున్నాడు. అత్త ఖాసింబీ.. కుమారుని దీనావస్థను చూసి, ‘‘బేటా ఎట్లా ఉంది?’’ అని అడిగింది. 

హుసేన్‌ కళ్లు తెరిచి చూశాడు. ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు. కళ్లవెంట కన్నీరు కారుతున్నాయి. భార్య సకీనాబీ భర్త కన్నీళ్లు తుడిచింది. ‘‘క్యాజీ నీళ్లు కావాలా?’’ అంటూ లేపి, నీళ్లు తాగించి మరలా పడుకోబెట్టింది. అత్తా కోడళ్లు హుసేన్‌ దీనావస్థను చూసి కన్నీరు కారుస్తూ కూచున్నారు. కూతురు షాహినా ఖురాన్‌ షరీఫ్‌ తీసి అందులోని యాసీన్‌ సూరాను ఎంతో భక్తి ప్రపృత్తులతో పఠించి తండ్రి ఆరోగ్యానికై చేతులెత్తి దీనంగా అల్లాహ్‌ను ప్రార్థించి, తన తండ్రి హుసేన్‌పై మూడు మార్లు ఊదింది. ఏమీ చేయలేని అసహాయస్థితిలో అచ్చటే ఒక మూల ఖురాన్‌ షరీఫ్‌ చదువుతూ కూర్చుంది.  తూర్పున ప్రభాకరుడు అరురారుణ కాంతులతో ఎర్రని పొత్తిళ్ల నుండి ప్రభవిస్తూ తన కాలగమన రహస్యాన్ని చాటుతూ వెలుగు చిమ్ముతున్నాడు. సకీనాబీ ఇళ్లలో పాచి పని చేయడానికి వెళ్లిపోయింది. అత్త ఖాసింబీ తజ్‌బీ తిప్పుతూ, కుమారుడు హుసేన్‌ మంచం దగ్గర కూచోని ఉంది. 

హుసేన్‌ కాస్తో కూస్తో సంపాదిస్తున్న రోజుల్లో షాహినాను శ్రద్ధగా చదివించాడు. పదవ తరగతిలో జిల్లా ప్రథమ స్థానంలో పాస్‌ అయింది. ఇంటర్మీడియట్‌ కార్పొరేట్‌ కాలేజ్‌ వాళ్లే తమ కాలేజీలో చదివించారు. రీయింబర్స్‌మెంటు పుణ్యమా అని, ఇప్పుడు బీఈ ఆఖరి సంవత్సరం చదువుతోంది. అప్పటివరకు ఎంతో కొంత సహాయం చేసే తండ్రి మంచం పట్టాడు. ఇప్పుడు పూట గడవడానికి ఇతర ఇళ్లలో ఏదో పని చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. షాహినా చినిగిపోయిన పంజాబీ డ్రస్సు కుట్టుకుంటోంది. అది చూసి దాది ఖాసింబీ, ‘‘షాహినా! ఏం చేస్తున్నావమ్మా’’ అని అడిగింది. ‘‘దాదీ! ఈరోజు పరీక్షలు. పరీక్షలకు వెళ్లడానికి ఈ చినిగిపోయిన పంజాబీ డ్రస్సును కుట్టుకుంటున్నా’’.ఆ మాటలకు దాది మనసు చివుక్కుమంది. మళ్లీ షాహినా దీనంగా అంది, ‘‘దాదీ! ఒక బురఖా అయినా కొనిస్తే, లోపల ఎట్లా ఉన్నా పైన అది వేసుకొని పోవచ్చు. ఒక బురఖా కొనివ్వు..’’. ‘‘అమ్మా! నీకు పంజాబీ డ్రెస్సే కొనివ్వలేకపోయాం. ఇంక ఐదారొందలు పెట్టి బురఖా ఏం కొనిస్తాను తల్లీ! మూడు నెలలనుండి పింఛను రాలేదు. అది వస్తే నీకు గుడ్డలు కొనిస్తా తల్లీ! చూస్తున్నావుగా మన పరిస్థితి. అబ్బాజాన్‌కు సరైన మందులు ఇప్పించలేక ఇబ్బందులు పడుతున్నాం..’’ అంటూ చెమ్మగిల్లిన కన్నీళ్లను తన చినిగిపోయిన చెంగుతో తుడుచుకుంది. 

సంభాషణ అంతా అచేతనంగా పడివున్న హుసేన్‌ వింటున్నాడేమో, తన కుటుంబం దీన స్థితి, తన ముద్దుల కూతురు షాహినా స్థితి చూసి కన్నీళ్లు ధారగా కారసాగాయి. అది చూసి షాహినా తన కుట్టడం ఆపివేసి తండ్రి దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లి బోరున విలపించింది. దాదీ షాహినాను ఓదార్చుతూ పక్కకు తీసుకొని పోయింది.  ఉదయం 9 గంటలకు అమ్మ సకీనాబీ ఇళ్లలో పాచి పనిచేసి మిగిలిన తినుబండారాలు తీసుకొనివచ్చి వారి ముందు పెట్టింది. ఆ పాచి అన్నం అందరూ తిన్నారు. షాహిని పంజాబీ డ్రస్సు వేసుకుని చినుగులు కనబడకుండా ఉండడానికి చుట్టూ ఓణి కప్పుకొని, పుస్తకాలు తీసుకొని తండ్రి దీవెనలకై హుసేన్‌ దగ్గరకు వెళ్లింది.  హుసేన్‌ కూతురుని చూశాడు. ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు. తన మనసులోని ఆవేదనకు గుర్తుగా కనుల చివర నుండి కన్నీళ్లు కారుతున్నాయి. ఇదే ఆఖరు చూపేమో అనుకున్నాడు హుసేన్‌. షాహినాను అదే పనిగా చూస్తున్నాడు. సైగలతో దగ్గరకు పిలిచాడు. ఎత్తలేక ఎత్తలేక ఎడమచెయ్యి ఎత్తి షాహినా తలపై పెట్టాడు.  ‘‘అమ్మా! బాగా చదివి కుటుంబాన్ని ఆదుకో తల్లి!’’ అని దీవించాడు. ఆరోజు తండ్రి ప్రవర్తన అదో రకంగా ఉండడం షాహినా గమనించింది. 

తండ్రి కన్నీరు తుడుస్తూ ‘‘అబ్బా జాన్‌! నేను విప్రో కంపెనీ వాళ్ల ఇంటర్వ్యూలో సెలెక్ట్‌ అయ్యాను. హైద్రాబాద్‌లో ఉద్యోగం. నెలకు నలభై వేలు ఇస్తారట. పరీక్షలు అయిపోయిన తర్వాత నేను ఉద్యోగంలో చేరి నీకు మంచి మంచి మందులు ఇప్పిస్తా. అమ్మా! దాదీని బాగా చూస్తా.  అధైర్యపడకు’’ అంటూ కన్నీళ్లు కారుస్తూ తండ్రి దగ్గర సెలవు తీసుకొని కాలేజీకి వెళ్లిపోయింది.  కొత్తగా డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ ప్రొబెషనరీగా షేక్‌ ఫజులుల్లా ఒంగోలు పట్టణానికి వచ్చాడు. ఆయన రోజూ తన సిబ్బందితో ఆ ఇంజనీరింగ్‌ కాలేజీ మార్గం గుండా వెళుతుంటే, ఆ దారిలో చుట్టూ ఓణి కప్పుకొని వెళుతున్న షాహినాను చాలాసార్లు చూశాడు. అతనికెందుకో అందరు అమ్మాయిలు రకరకాల దుస్తులు వేసుకుని, ఫ్యాషన్‌ వెళ్లబోస్తూ, నవ్వుతూ, కేరింతలు కొడుతూ, వెళ్తూ ఉంటే, ఏంది ఈ అమ్మాయి! వోణి కప్పుకొని కాలేజ్‌కు వెళ్తుందని ఆయన మనసులో ఒక రకమైన ఆలోచన కలిగింది. ఏదో ఉండి ఉంటుంది. అడిగి తెలుసుకుందామని అనుకున్నాడాయన.  వెంటనే ఆయన బండిని ఆపి కానిస్టేబుల్‌ను పంపి, ‘‘ఆ పోయే అమ్మాయిని పిలుచుకొనిరా!’’ అని పంపాడు. ఆ కానిస్టేబుల్‌ ఆ అమ్మాయిని, ‘‘మా దొరగారు పిలుస్తున్నారు’’ అని పిలుచుకొని వచ్చాడు. వాళ్ల సిబ్బందికి ఇదంతా అర్థం కావడం లేదు. ఎందుకు బండి ఆపారు, ఎందుకు ఆ అమ్మాయిని పిలుస్తున్నాడని.  షాహినా వచ్చి నిలబడింది. కమిషనరుగారు, ‘‘నీ పేరేంటి? నువ్వు ఎక్కడుంటున్నావ్‌? అందరి పిల్లల్లాగా కాకుండా ఎందుకు ఓణి చుట్టూ కప్పుకున్నావ్‌?’’ అడిగారు. 

ముందు షాహినా చెప్పడానికి జంకింది. తరువాత, ‘‘మాది కోటవీధి. నా పేరు షాహినా. మాది పేద కుటుంబం. మా నాన్న జబ్బు పడ్డాడు. నా పంజాబీ డ్రెస్‌ చినిగిపోతే అది కనబడుతుందని ఇలా ఓణి కప్పుకున్నాను’’ అని చెప్పింది. ఆమెకు తెలియకుండానే కళ్లవెంట కన్నీరు ఆమె లేత బుగ్గలను వొరుసుకుంటూ కారసాగాయి.  ఆ మాటలకు కమిషనరు గారికి కూడా చెప్పకుండా కళ్లు చెమ్మగిల్లాయి. ఆ అమ్మాయి చెప్పిన మాటలకు అక్కడి సిబ్బంది కూడా చలించిపోయారు. వెంటనే కమిషనరు వెయ్యి రూపాయలు తీసి షాహినాకు ఇచ్చి, ‘‘ఈ డబ్బులతో బట్టలు కుట్టించుకో’’ అని చేతిలో బలవంతంగా డబ్బులు పెట్టి వెళ్లిపోయారు.  షాహినా ఆ డబ్బులు తన పుస్తకంలో పెట్టుకొని పరీక్షలు రాసి తండ్రికి బాగా రాశానని చెప్పడానికి త్వరత్వరగా ఇంటికి బయలుదేరింది. ఇంటికి సమీపిస్తుండగానే ఇంటిముందు జనం గుమిగూడి ఉన్నారు. ఏదో జరిగిందని శంకిస్తూనే ఇంట్లోకి అడుగుపెట్టింది. హుసేన్‌ చుట్టూ, అమ్మా, దాదీ అందరూ చేరి ఏడుస్తున్నారు. షాహినా పుస్తకాలు అక్కడ పడేసి, ‘‘నాన్నా!’’ అంటూ నాన్న శరీరంపై పడిపోయింది. ఇల్లంతా రోదనలతో, విషాదంగా నిలబడిపోయింది. మయ్యత్‌ (ఖననము) చెయ్యడానికి డబ్బులు లేవు ఎట్లా అని తల్లి విలపిస్తూంటే, షాహినా తన దగ్గరున్న వెయ్యి రూపాయలు తీసి ఇచ్చి ఏడుస్తూ జరిగిన సంగతంతా చెప్పింది. తల్లీకూతుళ్లు ఒకరిని ఒకరు పట్టుకొని తనివితీరా విలపించారు. ఆ డబ్బులతో కఫన్‌ (శవానికి చుట్టే గుడ్డ), వగైరాలు తెప్పించి హుసేన్‌కు ఆచారం ప్రకారం ఖననం చేశారు. ఒక దీపం మలిగింది. మిగిలిన దీపాలకు అల్లాహ్‌నే నూనె పోస్తాడని ఆశిద్దాం.ఇంటికి సమీపిస్తుండగానే ఇంటిముందు జనం గుమిగూడి ఉన్నారు. ఏదో జరిగిందని శంకిస్తూనే ఇంట్లోకి అడుగుపెట్టింది. హుసేన్‌ చుట్టూ, అమ్మా, దాదీ అందరూ చేరి ఏడుస్తున్నారు. 
హాజీ షేక్‌ మహబూబ్‌ జాన్‌  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top