అడ్డంకికి ఆవల...

women empowerment :Succes Story - Sakshi

మహిళాసాధికారత బయట దొరికే వస్తువు కాదు.  అది మహిళ మనసులో అంతరాంతరాల్లో ఉండాలి. బయటి నుంచి లభించేది ప్రోత్సాహం మాత్రమే... అంటారు వనితా దాట్ల.  అనుకున్నది అందకపోతే మరోదాని కోసం ప్రయత్నించాలి... అంటారామె. డాక్టర్‌ కావాలనుకున్న వనిత... పారిశ్రామికవేత్త అయిన వైనమే అందుకు నిదర్శనం.

నాకు పర్యటనలంటే చాలా ఇష్టం. 50 దేశాలు చూశాను. ట్రెకింగ్, సైక్లింగ్, మారథాన్‌ పరుగుల్లో పాల్గొంటాను. మానస సరోవరం, ఎవరెస్టు బేస్‌ క్యాంపు, ఆఫ్రికాలోని కిలిమంజరో పర్వతాలను అధిరోహించాను. ప్రతిరోజూ ఏదో ఒకటి నేర్చుకోవడమే నా విజయరహస్యం. ఒక పుస్తకం చదవడం, ఒక సెమినార్‌లో పాల్గొనడం, నిపుణుల ప్రసంగాన్ని వినడం... ఇలా ఏదో ఓ మార్గంలో ప్రతిరోజూ నేర్చుకుంటూనే ఉంటాను.
– వనిత దాట్ల, వైస్‌ చైర్‌పర్సన్, ఎలికో లిమిటెడ్, రీజనల్‌ చైర్‌ఉమన్‌ సిఐఐ– ఐడబ్లు్యఎన్‌ సదరన్‌ రీజియన్‌

వనితాదాట్ల... కన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ తెలంగాణ రాష్ట్ర విభాగానికి మాజీ చైర్‌పర్సన్‌. ప్రస్తుతం ఎలికో లిమిటెడ్‌ కంపెనీకి వైస్‌ చైర్‌పర్సన్‌తోపాటు ఇండియన్‌ ఉమెన్‌ నెట్‌వర్క్‌కి రీజనల్‌ చైర్‌ఉమన్‌ కూడా. ఈ శిఖరాలను చేరడానికి మొదలు పెట్టిన ప్రయాణంలో తొలి అడుగులను ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.‘‘నేను 22 ఏళ్లుగా పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్నాను. మా తాతగారు పద్మభూషణ్‌ బి.వి.రాజు. ఆయన మనదేశంలో తొలితరం పారిశ్రామికవేత్త. ఆయన నుంచి నేను పరిశ్రమ నిర్వహణ, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నిబ్బరంగా పరిశ్రమను నడిపించడం నేర్చుకున్నాను. బాల్యంలో నా మీద మా నాన్నగారి ప్రభావమే ఎక్కువ. ఆయనలా డాక్టర్‌ కావాలనుకున్నాను. మెడిసిన్‌లో సీటు రాలేదు. దాంతో బి.ఎలో చేర్చి ఫస్ట్‌ ఇయర్‌ అయిపోగానే పెళ్లి చేసేశారు. మా వారితో అమెరికా వెళ్లిన తర్వాత అక్కడి సమాజం నా మీద చాలా ప్రభావాన్ని చూపించింది. అక్కడ ఎవరూ మరొకరి మీద ఆధారపడి జీవించరు. ఎవరికి వారే స్వతంత్రంగా జీవిస్తుంటారు. నాకేమో గ్రాడ్యుయేషన్‌ కూడా లేదప్పటికి. ఇక అప్పుడు అక్కడి విద్యాసంస్థల్లో చేరాను. అలా చదువుతూ ఉండగానే అక్కడ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఏజెంటుకు సహాయకారిగా పనిచేసే అవకాశం వచ్చింది. అప్పటి నా సంపాదన నాకెంతటి ఉత్సాహాన్నిచ్చిందంటే... ‘ఇది నా సొంత సంపాదన’ అనే భావనే మాటల్లో చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది. ఎలాగైనా సరే గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయాలనే ఆకాంక్ష కూడా ఎక్కువైంది. ఇంతలో బాబు పుట్టడంతో ఆ ఉద్యోగాన్ని మానేశాను. చదువుకి మరోసారి అంతరాయం. ఆ తర్వాత పాప పుట్టింది. చదువుని మళ్లీ కొనసాగిద్దామనుకునే లోపు ఇండియాకి వచ్చేశాం. 

ఎం. బి.ఎ కోసం...
డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌లో బిఎ పూర్తి చేసి, తాతగారి ఫైనాన్స్‌ సంస్థలోనే ఉద్యోగంలో చేరాను. కంపెనీలో నేను నిర్వహిస్తున్న బాధ్యతలకు ఎంబిఎ కూడా ఉంటే బావుంటుందనిపించింది. ఆ నిర్ణయం నా జీవితంలో మరో మైలురాయి. ఇక్‌ఫయ్‌ యూనివర్శిటీలో ఎంబిఎలో చేరిన నాటికి నేనేమో ఇద్దరు పిల్లల తల్లిని. నా క్లాస్‌మేట్స్‌ అంతా చిన్నవాళ్లు. పైగా ఒక్కొక్కరు ఇంజనీరింగ్, ఐఐటి గ్రాడ్యుయేట్లు. వీరితో చదివి రాణించగలనా అనే భయం ఉండేది. ఆ భయం తోనే అసైన్‌మెంట్‌లను గడువు లోపలే పూర్తి చేసేదాన్ని. నేను ఉద్యోగం చేస్తుండడం, విశాలమైన ప్రపంచాన్ని చూసి ఉండడం వల్ల యూనివర్శిటీ సిల్వర్‌ మెడల్‌ తెచ్చుకోగలిగాను. ఉద్యోగం చేస్తూ ఎంబిఎ చేశాను.

మగవారి ఆధిపత్యరంగంలోకి...
తాతగారి రాశి ఫైనాన్స్‌ తర్వాత మా అన్నయ్య టేకోవర్‌ చేసిన అంజని సిమెంట్‌ కంపెనీలో చేరాను. సిక్‌ కంపెనీని పైకి లేపడానికి చేసిన కసరత్తే నాకు పరిశ్రమ నిర్వహణ, బ్యాంకు లావాదేవీలనూ నేర్పించింది. మగవారి ఆధిపత్యం ఉండే రంగంలో నేనొక్కదాన్నే మహిళని. నల్గొండ ప్లాంటుకు కూడా క్రమం తప్పకుండా వెళ్లేదాన్ని. అప్పుడు నా కెరీర్‌లో మరో విరామం. పిల్లలు స్కూలు ఫైనల్‌ దశలో తల్లి పాత్ర చాలా ఎక్కువ. అందుకే రెండేళ్లపాటు పిల్లల కోసమే స్పెండ్‌ చేశాను. పిల్లలు కాలేజ్‌కొచ్చిన తర్వాత మా వారు ఓ రోజు ‘పార్ట్‌టైమ్‌గానైనా కంపెనీకి రావచ్చు కదా’ అన్నారు. అలా ఎలికో కంపెనీలో చేరాను. అప్పటి నుంచి అదే నా పూర్తి వ్యాపకమైంది.   

నిత్య చైతన్యమే పురోగతి...
ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకునే మహిళల కోసం ఓ వేదిక ఏర్పాటు చేయడంలో నా ప్రధాన ఉద్దేశం వారిని నిత్యం చైతన్యవంతంగా ఉంచడమే. ఎక్కడికక్కడ పరిధి విధించుకోవడం, క్రమేణా ఆ పరిధిని కుదించుకోవడం వంటి నిరాసక్త లక్షణాలను వదలాలని చెప్పడమే. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఇస్తున్న సూచనలన్నీ మహిళల శక్తియుక్తులను పూర్తి స్థాయిలో వినియోగించుకునే అవకాశం కల్పించమనే. సాధికారత సాధించాలనే తపన మహిళల్లో ఉంటే అవకాశాలు కొల్లలు. సక్సెస్‌ను అందుకోవాలంటే ఒక్కో మెట్టునూ స్వయంగా ఎక్కాల్సిందే. దీనికి షార్ట్‌కట్‌లు ఉండవు.ఇల్లు, ఆఫీసు, వ్యాపారం... అన్నింట్లోనూ ఒడిదొడుకులుంటాయి. ప్రతికూల పరిస్థితులూ ఉంటాయి. ‘పరిస్థితులు అనుకూలంగా లేవు’ అనుకుంటే ఏదీ సానుకూలం కాదు. దేనినీ సాధించలేరు. ఒక దారి మూసుకుపోతే మరో దారి కోసం ప్రయత్నించాల్సిందే. అందుకు నేనే ఉదాహరణ. మెడిసిన్‌లో సీటు రాలేదు. డొనేషన్‌ సీటులోనైనా చదివించాలంటే పొరుగు రాష్ట్రాలకు పంపించాలి. ‘ఆడపిల్లను అంతదూరం పంపడమా’ అనే సందేహమే పెద్ద అడ్డంకి అయింది. అయితే మెడిసిన్‌ చదవలేకపోవడం ద్వారా అన్నింటినీ కోల్పోయినట్లు దిగాలు పడలేదు. దిగులు పడి అక్కడే ఆగిపోతే ఇప్పుడీ స్థానాన్ని అందుకోగలిగేదాన్నే కాదు. తెలియని రంగంలో అడుగుపెట్టి ప్రతిదీ నేర్చుకుంటూ ఎదిగాను. ఎక్కడా ఆగిపోలేదు’’

యాభై శాతం ఉన్నాం! ఐదు శాతమే కనిపిస్తున్నాం!!
వనిత ఎలికో పరిశ్రమను నడుపుతూ సిఐఐలో చురుగ్గా పాల్గొంటున్నారు. సిఐఐలో ఔత్సాహిక మహిళాపారిశ్రామిక వేత్తలకో వేదిక కోసం కృషి చేశారామె. వారికి పరిశ్రమ నిర్వహించే నైపుణ్యాలను పెంచడానికి అవసరమైన సూచనలు, వర్క్‌ ప్లేస్‌లో భద్రత కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించారు. మహిళలకు భవిష్యత్తు పట్ల భరోసా కల్పించాలంటారు వనిత.సమాన అవకాశాల కోసం చేసే ఈ పోరాటం కొనసాగాలి. జెండర్‌ ఈక్వాలిటీ విషయంలో మనదేశం 87వ స్థానంలో ఉంది. మొదటి పది స్థానాల్లోకి ఎదిగినప్పుడు మాత్రమే ఈక్వల్‌ ఆపర్చునిటీస్‌ మనకు అందేటంత దగ్గరకు వచ్చినట్లు. అవకాశాలు దూరంగా ఉన్నాయని పోరాటాన్ని ఆపకూడదు. ప్రస్తుతం విద్యాసంస్థల నుంచి బయటికొస్తున్న గ్రాడ్యుయేట్లలో 50 శాతం మహిళలు ఉంటున్నారు. కానీ ఉద్యోగవ్యాపారాలలో అడుగుపెట్టిన తర్వాత కలకాలం కొనసాగుతున్న వాళ్లు ఐదు శాతానికి మించడం లేదు. అలాంటి వారిలో చైతన్యం తీసుకురావడం, స్ఫూర్తి కలిగించడం, కొత్తగా పరిశ్రమలు పెట్టేవారికి, ఇప్పటికే ఈ రంగంలో ఉన్న వారికి మెంటార్‌షిప్‌ కల్పించడమే ఆ వేదిక ఉద్దేశం. 
ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top