రాముడు–భీముడు.. గంగ–మంగ

Warangal district has sixteen young twin couples - Sakshi

బింబం – ప్రతిబింబం

ఒకేలాంటి రూపురేఖలున్న మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారంటారు. అయితే, ఒకే ఇంట్లో అచ్చుగుద్దినట్లుగా ఇద్దరూ ఒకేలా ఉంటే? అలాంటి కవలలు జంటలు జంటలుగా ఒక ఊరంతా సందడి చేస్తే..? భలే గమ్మత్తుగా ఉంటుంది కదా. ఆ గమ్మత్తు చూడాలంటే వరంగల్‌ రూరల్‌ జిల్లా పెర్కవేడు వెళ్లాల్సిందే. ఈ గ్రామంలో మొత్తం పదహారుమంది కవల జంటలు కనువిందు చేస్తుంటారు.  

ఊళ్లో ఎక్కడైనా కనిపించవచ్చు
పెర్కవేడులో అడుగుపెట్టగానే కనిపించే ఓ మనిషి పోలిన వ్యక్తి మరికొంత దూరం వెళ్లగానే కనిపించవచ్చు. ఇలా ఎందరైనా కనిపించే వీలుంది. పెర్కవేడు గ్రామం 960 గడపలతో ఉంటుంది. ఆ గ్రామ జనాభా 3420 మంది.  కారణాలేమిటో తెలియకున్నా కొన్నేళ్లుగా ఇక్కడ కవలలు  జన్మించడం సాధారణ విషయంగా మారింది. గ్రామంలో ఇంతమంది కవలలు ఒకేవిధంగా ఉండటంతో ఆ గ్రామం వారు కవలలను పేరు పెట్టి పిలవడంలో చాలా తికమక అవుతుంటారు. గ్రామం తీరో, నీటితీరో మరి ఈ ఒక్క గ్రామంలో ఇంతమంది కవలల జంటలు ఉండడం అన్నది విశేషంగా మారింది.

పుల్లూరు పవన్‌కుమార్, ప్రవీణ్‌కుమార్‌; ఆకారపు లావణ్య, రామకృష్ణ; నిఖిత్, నిఖిల; దురిశెట్టి రామ్, లక్ష్మణ్‌; దొడ్డ మానస వీణ, వాణి; ఊగ రాము, లక్ష్మణ్‌; లక్కం అనిత, సునీత; ప్రవీణ్, ప్రదీప్‌; ప్రమోద్, వేదప్రకాశ్, వేదవిద్య (ముగ్గురు); నిమ్మల రాము, లక్ష్మణ్‌; పుల్లూరు వినయ్, శివ; అంగిరేకుల నరేష్, సురేష్‌; ఐత రాంబాబు, ఐత రమ; గొల్లపల్లి రామయ్య, లక్ష్మయ్య; గేర ఆశీర్వాదం, రాధిక; రాజు, సువార్త కవలల్ని కనిన దంపతులు.మొత్తానికి ఇదంతా చూస్తుంటే పాత సిని మాల్లో రాముడు–భీముడు; గంగ– మంగ; చిక్కడు– దొరకడు చూసినట్టు లేదూ..?
గజవెల్లి షణ్ముఖ రాజు,
సాక్షి, వరంగల్‌  ఫోటోలు: బిర్రు నాగరాజు, సాక్షి, రాయపర్తి

మమ్మల్ని చూస్తే అందరికీచిన్నప్పటినుంచీ తికమకే..
నేను హైద్రాబాద్‌లో ఓ ప్రైవేట్‌ చిట్‌ఫండ్‌ బ్రాంచ్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పని చేస్తున్నాను. మా తమ్ముడు ప్రవీణ్‌కుమార్‌ జాబ్‌సెర్చ్‌లో ఉన్నాడు. పాఠశాల, కళాశాల స్థాయిలోనూ మమ్మల్ని చూసి తికమక పడేవారు. కాకపోతే నేను లావుగా ప్రవీణ్‌ సన్నగా ఉండేది. ప్రస్తుతం ఇద్దరం ఒకేలా అయ్యాము. నేను మొదటిసారిగా పాస్‌పోర్ట్‌కు దరఖాస్తు చేసుకున్నాను. తర్వాత మా తమ్ముడు ప్రవీణ్‌కుమార్‌ దరఖాస్తు చేసుకున్నాడు. వెరిఫికేషన్‌కు వచ్చినప్పుడు నీకు ఆల్‌రెడీ వచ్చింది కదా అని కన్ఫ్యూజ్‌ అయ్యారు ఆఫీసర్లు. కానీ సర్టిఫికెట్‌ లను ఇద్దరివి చూపించడంతో ఇచ్చి వెళ్లారు. మమ్మల్ని గుర్తుపట్టాలంటే నా కంటిపై గాటు ఉంటుంది ప్రవీణ్‌కు ఉండదు అంతే. 


పుల్లూరు పవన్‌కుమార్, ప్రవీణ్‌ కుమార్‌

మా ఊరిలో ఇంతమంది కవలలు ఉండడం సంతోషం
మా ఊరిలో కవల జంటలు ఉండడంతో సంతోషంగా ఉంది. పండగ సమయాల్లో వీరు వచ్చినప్పుడు తికమకగా ఉంటుంది. వేరే ఊర్లలో ఒక్కరూ లేదా ఇద్దరు ఉంటారు. కానీ మా ఊరు కవలలకు స్పెషల్‌. 
చిన్నాల తారశ్రీ, గ్రామ సర్పంచ్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top