మదర్‌ హ్యాపీనెస్‌

Vasanthi is the mother we see now Atmanandamayi - Sakshi

పరిచయం మాతా ఆత్మానందమయి

వాసంతి అని పేరు పెట్టేటప్పుడు ఆమెకు భగవంతుడు మరో పేరు నిర్ధారించి ఉన్నాడని ఆమె తల్లిదండ్రులకు తెలియదు. వాసంతి తమ బిడ్డ అనుకున్నారు తప్ప ఆమె వేలాది మందికి తల్లి అవుతుందని ఊహించను కూడా లేదు. ‘మనిషి పుట్టేది సంతోషంగా జీవించడానికే, ప్రతి నిమిషాన్నీ సంతోషంగా ఆస్వాదించడం మనిషి జన్మహక్కు. ఆహక్కును ప్రతి ఒక్కరికీ దగ్గర చేయాలి. అందుకోసమే భగవంతునిచే నియమితమయ్యాను’ అంటారు మాతా ఆత్మానందమయి. నిజమే.. ఆ అమ్మానాన్నల వాసంతి ఇప్పుడు మనం చూస్తున్న అమ్మ ఆత్మానందమయి.

తెలుగు రాష్ట్రాలతోపాటు, దేశంలోని అనేక నగరాలు, అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ దేశాల్లో పర్యటిస్తూ ‘సుషుమ్న’ క్రియా యోగ ధ్యాన సాధన చేయిస్తున్నారు ఆత్మానందమయి. ‘‘ప్రపంచంలోని ప్రతి ఒక్కరినీ ఆనందంగా జీవించేలా చేయడానికి భగవంతుడు తనకు చూపించిన సాధనమే సుషుమ్న క్రియా యోగం. మనిషికి సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే ఈ సాధనంతో పరిపూర్ణమైన సమాజాన్ని నిర్మించవచ్చు’ అని అంటూ.. తాను ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టడానికి దారి తీసిన అనేక సంఘటనలను సాక్షితో పంచుకు న్నారు అమ్మ ఆత్మానందమయి.

‘‘మా ఊరు తాళవాకం. ఆంధ్రప్రదేశ్‌ తమిళనాడు బోర్డరులో ఉంది. పిల్లలం ఉదయం నిద్రలేచేసరికే అమ్మ పూజ చేస్తూ చదివే మంత్రాలు చెవిన పడేవి. రోజూ మధ్యాహ్నం సత్సంగం ఉండేది. ఆ సమయంలో ఎండలో తిరగనివ్వకుండా నాలుగు గంటల వరకు పడుకోవాలని పిల్లలందరికీ ఆదేశం ఉండేది. తమ్ముడు, చెల్లి పడుకున్న తర్వాత నిద్రలోకి జారుకునే వాళ్లు. నేను మాత్రం నిద్రపోతున్నట్లు కళ్లు మూసుకుని సత్సంగంలో చెప్పే సంగతులను వింటూ ఉండేదాన్ని. అన్ని రోజులపాటు విన్న అన్ని సంగతుల్లో నాలో నాటుకుపోయిన పదాలు మూడే మూడు. అవి.. ‘నాకు, నేను, నాది’ అనేవి. మనిషికి దుఃఖ కారకాలు ఇవేనని చెప్పేవాళ్లు పండితులు. ఆ పదాలకు అర్థం తెలియలేదప్పట్లో. పెద్దయ్యే కొద్దీ ఆ సందేహం కూడా పెద్దదవుతూనే వచ్చింది.

‘ఖేచరీ’ అని తెలియదు!
విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే జరిగింది. ఎప్పుడూ పరధ్యానంగా ఉండేదాన్ని. నాలుక మడత పెట్టుకుని ఖేచరీ ముద్రలోనే ఉండేదాన్ని. అది ఒక «ధ్యాన ముద్ర అని తెలియదు. బెంటిక్‌ గర్ల్స్‌ హైస్కూల్‌లో చదువుతున్నప్పుడు ఇంగ్లిష్‌ టీచర్‌ ప్రశ్న అడిగినప్పుడు నేను స్పందించడానికి సమయం పట్టింది. నాలుక మడత తీసి మాట్లాడేలోపు కోప్పడ్డారు టీచర్‌. ఆ తర్వాత సాధన చేసి నాలుక సాఫీగా పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాను. ఎం.ఎ సైకాలజీ పూర్తయిన తర్వాత పెళ్లయింది. ఆయన ఆంధ్రా బ్యాంకులో మేనేజర్, మదనపల్లెలో పోస్టింగ్‌. నా ఆధ్యాత్మిక మార్గానికి తొలి అడుగు పడిన ప్రదేశం కూడా అదే.

దైవం నాకు దూరమైంది!
మేము మదనపల్లెలో ఉన్నప్పుడు స్వామి చిన్మయానంద పద్నాలుగు రోజుల పాటు గీతాసారం క్లాసులు చెప్పారు. ధ్యానయోగం ప్రధానంగా ఉండేది. క్లాసులు పూర్తయిన తర్వాత భగవద్గీత పుస్తకం కొన్నాను. చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుండేదాన్ని. అర్థమయ్యి కానట్లుగా ఉండేది. ఇదంతా జరిగిన తర్వాత దాదాపుగా ఓ దశాబ్దకాలానికి.. అంటే 1992లో నేను పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. అందుకు కారణం అమ్మ దూరం కావడమే. మా అమ్మ నడుస్తున్న దేవతలా అనిపించేది. నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మరే మూర్తిలోనూ చూడని దైవత్వాన్ని మా అమ్మలో చూశాను. అలాంటి అమ్మ దూరం కావడాన్ని తట్టుకోలేకపోయాను.

నన్ను నేను సాంత్వన పరుచుకోవడానికి చిన్మయానంద స్వామీజీ భగవద్గీత గొప్ప సాధనం అయింది. కష్టంలో ఉండి చదవడం వల్లనో ఏమో అప్పుడు గీతలోని సారం అర్థమైంది. ఆత్మకు మరణం లేదనే ఒకే ఒక వాక్యం నన్ను నడిపించింది. అమ్మ ఆత్మతో కనెక్ట్‌ కావడానికి ప్రయత్నించాను. ‘భ్రూ’ మధ్య (కనుబొమల మధ్య) స్థానంలో దృష్టిని కేంద్రీకరించి రోజుకు ఎనిమిది గంటల పాటు ధ్యానంలో గడిపాను. చిన్నప్పటి నుంచి నాతోపాటు పెరిగి పెద్దవుతూ వచ్చిన అనేక ధర్మ సందేహాలకు సమాధానాలు ధ్యానంలో దొరికాయి. అప్పటి నుంచి మెలకువగా ఉన్నప్పుడే కాకుండా గాఢనిద్రలో ఉన్నప్పుడు కూడా ఒక గొంతు వినిపించేది. ఆ గొంతు నా చెవిలో ‘నువ్వు యోగివి కా’ అని చెబుతూ ఉండేది. 

‘సుషుమ్న’ దగ్గరకు తీసుకుంది
ఏటా తిరుమల వెళ్లి శ్రీవేంకటేశ్వరుని సన్నిధిలో మూడు రాత్రులు బస చేయడం మా కుటుంబంలో ఆనవాయితీ.  దర్శనం తర్వాత ఆలయ ప్రాంగణంలో గర్భాలయానికి వెనుకగా కూర్చుని ధ్యానంలో ఉన్నప్పుడు కోటిసూర్యులు ఒక్కసారిగా వెలిగినంత కాంతి మనోనేత్రం ముందు ఆవిష్కారమైనట్లయింది. ఆ కాంతిలో భగవంతుని దర్శనం ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఆయన ఆనంద స్వరూపుడు.

ఆ మూర్తి దర్శనం మనిషికి అంతర్యాన దర్శనం చేయిస్తుంది. వీటితోపాటు 2005లో తమిళనాడులోని పళని క్షేత్రం నన్ను భగవంతుడు ఆదేశించిన మార్గంలోకి మలుపు తిప్పింది. పళనిలో ‘ఒక యోగి ఆత్మకథ’ చదివాను. మహావతార్‌ బాబాజీ సుషుమ్న క్రియా యోగ సాధన దిశగా నడిపించి, నేర్పించేందుకు నన్ను నియమించారు. మితభాషినైన నా మీద ఈ బాధ్యత పెట్టడం నాకే ఆశ్చర్యంగా అనిపించింది. కానీ మానవాళి పరిపూర్ణ ఆరోగ్య సాధన కోసం భగవంతుడు నడిపించినట్లు నడుస్తున్నానంతే.

సమాజంతో కలిపేదే ధ్యానం
ధ్యానం అంటే మోక్షసాధనకు మార్గం అని విశ్వసిస్తారు. కానీ అది అపోహ మాత్రమే. ఆధ్యాత్మిక మార్గంలో జీవించడం అంటే గృహస్థ జీవనాన్ని వదిలిపెట్టి సర్వసంగ పరిత్యాగులుగా మారటం కాదు. ధ్యానం మనిషిని సామాజిక జీవిగా మారుస్తుంది. సమాజంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే సమర్థతనిస్తుంది. మెదడు కణాలు ఉత్తేజితమవుతాయి కాబట్టి గ్రహించే శక్తి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే నైపుణ్యం పెరుగుతాయి. రోజూ ఉదయం పది, సాయంత్రం పది నిమిషాల ధ్యానంతో మానసిక రుగ్మతలకు శాశ్వతంగా దూరంగా ఉంటారు. నిత్యం నేరాలు, నేరస్థుల మధ్య గడిపే పోలీసులు, అనారోగ్యాలు, రోగుల మధ్య గడిపే డాక్టర్లు, వృద్ధాశ్రమాల్లో కాలం గడుపుతున్న వాళ్లు, కార్పొరేట్‌ ఉద్యోగాల్లో పని ఒత్తిడి కారణంగా మానవసంబంధాలు దెబ్బతింటున్న వాళ్లు, డిఆర్‌డివో వంటి దేశభద్రత రంగంలో సేవలందిస్తున్న ఉద్యోగులు సుషుమ్న క్రియతో ఉత్తేజితులయ్యారు.

డిఆర్‌డివోలో హైదరాబాద్‌తో పాటు ముస్సోరి, డెహ్రాడూన్‌లలోని ఉద్యోగుల చేత కూడా సాధన చేయించాను. సుషుమ్న క్రియ సాధన తర్వాత మనిషిలో ఉదాసీనత పోయి.. చేస్తున్న పనిని మనసా... వాచా... కర్మణా... ఇష్టపడుతూ చేయడం అలవాటవుతుంది. అల్పాదాయ వర్గాల నివాస ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు సుషుమ్న క్రియ సాధన చేయించిన తర్వాత వారిలో మెదడు చురుకుదనం పెరిగినట్లు స్పష్టంగా నిర్ధారణ అయింది. ఇవన్నీ సుషుమ్న క్రియతో సాధిస్తున్న సేవల్లో కొన్ని మాత్రమే. అసలైన మేలు, అత్యవసరమైన మేలు మహిళలకు కలుగుతోంది.

మహిళలకు ఎక్కువ మేలు
మన సమాజంలో మహిళలు అనేక విషయాల్లో సర్దుకుపోవాల్సిన పరిస్థితులే ఉంటాయి. చిన్నప్పటి నుంచి తమలోని ఆలోచనలను, అభిప్రాయాలను వ్యక్తం చేయలేక మనసులో అదిమిపెట్టుకుని కాలం గడిపేస్తుంటారు. అలా గూడుకట్టుకున్న ఆవేదన వ్యధగా మారి మధ్య వయసుకి చేరే నాటికి డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారు. అలాంటి మానసిక రుగ్మతలను నిశ్వాసతో వదిలేయడం సుషుమ్న క్రియలో సాధ్యమవుతుంది. జీవిత పరమార్థాన్ని తెలుసుకుని జీవితేచ్ఛతో జీవించగలుగుతారు. నా జీవితాన్ని ఈ సేవకే అంకితం చేశాను’’ అని ముగించారు అమ్మ ఆత్మానందమయి. 

బెంగుళూరులో ఉన్న దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్‌ ద్వారా తమ దగ్గరకు వచ్చిన వాళ్లు సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యే వరకు వారికి ఉచిత సేవలందిస్తున్న అమ్మ.. యువతలో కృతజ్ఞతాభావం పెంపొందించడానికి ఓ వినూత్నమైన కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు అమ్మ. ఈ నెల 23వ తేదీన(తన తల్లి జయంతి) హైదరాబాద్‌ శిల్పకళావేదికలో తల్లులకు పిల్లల చేత సన్మానం చేయించాలనేది అమ్మ ఆలోచన.  
వాకా మంజులారెడ్డి

సుషుమ్న క్రియాయోగం
హిమాలయాల్లో ఆవిర్భవించిన దివ్య విద్య ఇది. సుషుమ్న క్రియాయోగ సాధనకు కఠినమైన నియమనిష్ఠలేవీ పాటించాల్సిన అవసరం లేదు. సాధారణ దైనందిన జీవితాన్ని గడుపుతూ కూడా సాధించగలిగేటట్లు సిద్ధ గురువులు రూపొందించిన ప్రక్రియ సుషుమ్న క్రియాయోగం. మనదేహంలో 72 వేల నాడులుంటాయి. ఈ నాడులను కలిపే కూడళ్లు ఉంటాయి. ఆ కూడళ్లనే చక్రాలు అంటారు. దేహం లోపల అంతర్లీనంగా అవయవాలన్నింటికీ శక్తిని ప్రసారం చేసేది ఈ చక్రాలే.

నాడులకు శక్తి ప్రసారం తగ్గినప్పుడు అనారోగ్యం, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ నాడులలో అత్యంత ముఖ్యమైనవి ఇడా, పింగళ, సుషుమ్న నాడులు. ఇడా నాడి దేహంలో ఎడమ భాగంలో, పింగళ నాడి కుడి భాగంలో ఉంటాయి. ఈ రెండింటి మధ్య వర్తించే అత్యంత సూక్ష్మమైన నాడి సుషుమ్న నాడి. ఈ నాడి చైతన్యవంతం కావడానికి ఉపయోగపడుతుంది సుషుమ్న క్రియాయోగ సాధన.

‘సుషుమ్న’ సాధన విధానం
నేల మీద కానీ, కుర్చీలో కానీ వెన్నెముకను నిటారుగా ఉంచి కూర్చోవాలి. కళ్లుమూసుకుని యోగముద్రలోకి వెళ్లాలి. చూపుడు వేళ్లు, బొటన వేళ్లు కలిపి మిగిలిన వేళ్లను ఒకదానితో ఒకటి ఇంటర్‌లాక్‌ చేయడమే  యోగముద్ర. ఈ స్థితిలో 21 సార్లు ఓంకారాన్ని సాధన చేయాలి. 14 సార్లు దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి. శ్వాస తీసుకునేటప్పుడు మంచిని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని తీసుకుంటున్నట్లు భావించాలి.

శ్వాస వదిలేటప్పుడు అనారోగ్యం, కోపం, బాధ, ద్వేషం వంటి మనిషి ఎదుగుదలకు అవరోధాలైన వాటిని వదిలేస్తున్న భావనలో ఉండాలి. ఈ సాధన చేస్తున్నప్పుడు మన ఎరుకను భ్రూ మధ్యం(రెండు కనుబొమల మధ్య)లో నిలపాలి. ఈ సాధన వల్ల కణాల్లో శక్తి ప్రసారమై సోమరితనం, నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన తగ్గిపోతాయి. మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయి. ఫీల్‌గుడ్‌ భావనలో రోజు గడుస్తుంది.

పరిపూర్ణ ఆరోగ్యం అంటే... 
భౌతిక ఆరోగ్యంతోపాటు మానసికంగా ఆరోగ్యంగా ఉండటం, వీటికి ఆధ్యాత్మిక ఆరోగ్యం, సామాజిక ఆరోగ్యం తోడయితే అదే పరిపూర్ణ ఆరోగ్యం. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top