‘మక్క లద్దెపురుగు’ నోట్లో మట్టి!

సుడుల్లో మట్టి వేస్తే పురుగు అవుట్‌..!

మొక్కజొన్న పంటకు ముప్పుగా పరిణమించిన కొత్త రకం లద్దెపురుగు

ఆకు సుడుల్లో తిష్టవేసి ఆకులు తినేస్తున్న పురుగు

సుడుల్లో మట్టి వేసి.. పురుగు ఆటకట్టిస్తున్న శాస్త్రవేత్తలు

రెండో రోజుకు పురుగు లద్దెలు వేయడం ఆగిపోతుంది.. ఐదారు రోజుల్లో మృతి

మిత్రపురుగులకు హాని లేకుండా పురుగు నిర్మూలన

మెదక్‌ జిల్లా తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో అద్భుత పరిశోధన

మిత్రపురుగులే రైతు సైన్యం. మిత్రపురుగులకు హాని చేసే రసాయనిక పురుగుమందుల కంటే.. ప్రకృతికి అనుగుణమైన పద్ధతుల్లోనే చీడపీడలను అరికట్టడం అన్నివిధాలా మేలు. మొక్కజొన్న మొక్క ఆకు సుడుల్లో పొలంలోని మట్టిని వేస్తే చాలు, నూటికి నూరు శాతం దీన్ని అరికట్టగలమని మెదక్‌ జిల్లా తునికిలోని డా. రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్‌ కేవీకే తెలిపింది. మట్టిని సుడుల్లో వేసిన తెల్లారి నుంచే పురుగు చురుకుదనాన్ని, ఆకలిని కోల్పోయింది. పంటకు నష్టం జరగటం ఆగిపోతుంది.

నాలుగైదు రోజుల్లోనే పురుగు చనిపోయిందని కేవీకే అధిపతి, సీనియర్‌ శాస్త్రవేత్త డా. గున్నంరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి ‘సాగుబడి’కి వెల్లడించారు. మొక్కజొన్న రైతులు భయభ్రాంతులకు గురికావాల్సిన పని లేదని, రసాయనిక పురుగుమందుల ఖర్చు లేకుండానే రైతులు ఈ పురుగు బెడద నుంచి పంటను నిస్సందేహంగా కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మక్క లద్దెపురుగు తీరుతెన్నులు, నియంత్రణ మార్గాలపై ‘సాగుబడి’ ప్రత్యేక కథనం..

మక్క(మొక్కజొన్న) లద్దెపురుగు.. ఇటీవల కొత్తగా కనిపిస్తున్న విదేశీ జాతి విధ్వంసక లద్దెపురుగు ఇది. మొక్కజొన్న చేలల్లో లేత ఆకులను, మొవ్వు(ఆకు సుడు)లను, కండెలను ఆవురావురుమంటూ కరకరా నమిలేయడం, అత్యంత వేగంగా కొత్త ప్రాంతాలకు పాకటం దీనికున్న అత్యంత ప్రమాదకర లక్షణాలు. ఖరీఫ్‌ మొక్కజొన్న పంటను నమిలేస్తున్నది.

మూడు నెలల్లోనే..
మన దేశంలో తొలిసారి కర్ణాటకలో మేలో కనిపించి కలకలం రేపింది. ఆగస్టు తొలివారంలో తెలుగురాష్ట్రాల్లో వర్షాభావ వాతావరణ పరిస్థితుల్లో బయటపడింది. ఖరీఫ్‌ మొక్కజొన్న సాగవుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని చాలా జిల్లాల్లో మక్క లద్దెపురుగు పంటకు తీవ్ర నష్టం కలిగిస్తున్నట్లు రైతులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఆశించిన కొద్ది రోజుల్లోనే పంటకు తీవ్ర నష్టం కలిగిస్తున్న పురుగు కావడంతో భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి(ఐ.సి.ఎ.ఆర్‌.) అప్రమత్తమైంది. తక్కువ ప్రమాదకరమైన రసాయనిక పురుగుమందులు వాడమని సూచిస్తోంది.

ఏక పంటలకే ముప్పు ఎక్కువ!
రెక్కల పురుగు రోజుకు 100 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని, ఆడ రెక్కల పురుగు వెయ్యి వరకూ గుడ్లు పెట్టడం ద్వారా సంతతిని వ్యాపింపజేస్తుందని ఎఫ్‌.ఎ.ఓ. తెలిపింది. పొలం అంతా ఒక మొక్కజొన్న పంట(మోనోకల్చర్‌)ను మాత్రమే సాగు చేసే పొలాలకే ఇతర చీడపీడల మాదిరిగా మక్క లద్దెపురుగు బెడద కూడా ఎక్కువగా ఉంటుంది. మొక్కజొన్నతోపాటు (పప్పుధాన్యాలు, నూనెగింజ, చిరుధాన్యాల) ఇతర పంటలను కలిపి సాగు చేసే పొలాల్లో ఇది వేగంగా వ్యాప్తి చెందదని గుర్తించారు.  

రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో ఏక పంటల సాగుకు ప్రసిద్ధి పొందిన అమెరికా ఖండంలోని కెనడా(దక్షిణ ప్రాంతం), చిలి, అర్జెంటీనా వంటి వివిధ దేశాల్లో కొన్ని ఏళ్ల నుంచి ఇది వివిధ పంటలను ఆశిస్తూ నష్టపరుస్తున్నది. రెండేళ్ల క్రితం ఆఫ్రికా ఖండంలోకి పాకి చాలా దేశాలను చుట్టుముట్టింది. ఈ పురుగు మొక్కజొన్నతోపాటు వరి, జొన్న, చెరకు, గోధుమ, పత్తి, కొన్ని రకాల కూరగాయలు సహా 80 రకాల పంటలను ఆశించి ఆహార భద్రతకు ముప్పు తెచ్చే ప్రమాదం పొంచి ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఎ.ఓ.) ప్రపంచ దేశాలను హెచ్చరిస్తోంది.

మక్క లద్దెపురుగు గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల్లో మొక్కజొన్న పొలాలను గుల్ల చేస్తున్నది. అయితే, రైతుకు ఖర్చులేని, సులువైన, ప్రకృతికి అనుగుణమైన మట్టితో పురుగు నిర్మూలన పద్ధతులు ఉన్నాయి. మొక్కజొన్న రైతులు ఈ పురుగుకు భయపడాల్సిన పని లేదు. మా కృషి విజ్ఞాన కేంద్రంలో 5 రకాల పద్ధతుల్లో మక్క లద్దెపురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చని అనుభవపూర్వకంగా గుర్తించాం..

1.    మట్టి 100% అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది! మాది ఎర్రమట్టి పొలం. ఆ మట్టినే చేతితో తీసి లద్దెపురుగు ఉండే ఆకు సుడుల్లో వేశాం. మట్టి వేసిన తెల్లారికి మక్క లద్దెపురుగు ఆకులను తినటం, లద్దెలు(విసర్జితాలు) వేయటం ఆగిపోయింది. మూడో రోజుకు పురుగు నశించడం ప్రారంభమైంది. 4–5 రోజులకు పురుగు చనిపోయింది. వర్షం పడుతున్నందు వల్ల లొట్టపీచు కషాయాలు అంతగా పనిచేయలేదు. నేల మీద మట్టినే తీసి నేరుగా సుడుల్లో వేశాం. మట్టి పెళ్లలు సుడుల్లో వేసిన తర్వాత వర్షం కురవకపోతే, ఆ మట్టి పెళ్లలపై నీరు పిచికారీ చేశాం. దీన్ని బట్టి మాకు అర్థమైందేమిటంటే.. రైతు రూపాయి ఖర్చు పెట్టకుండా, ఏ పురుగుమందూ పిచికారీ చేయకుండా.. మట్టిని తీసుకొని సుడిలో వేస్తే చాలు. పురుగు ఆకలి తగ్గి, కృశించి 4–5 రోజుల్లో చనిపోతుంది.
2. మట్టి వేయకుండా.. రాతి పొడిని సుడుల్లో చల్లాం. ఇది 98% ఫలితం కనిపించింది.
3. బొగ్గు పొడిని సుడుల్లో చల్లాం. పురుగును అరికట్టడంలో దీని ప్రభావం 90% ఉంది.
4. కర్ర బూడిద చల్లాం. 86% ప్రభావం ఉంది.
5. లొట్టపీచు కషాయం(లీ. నీటికి 100 ఎం.ఎల్‌. కషాయం) పిచికారీ చేశాం. వర్షం లేనప్పుడు దీని ప్రభావం 80% ఉంది.

వీటన్నిటిలోకీ ఎర్రమట్టి అద్భుతమైన ప్రభావం చూపింది. నల్ల రేగడి లేదా బంకమన్ను ప్రభావం ఎలా ఉంటుందో పరీక్షించి చూడాల్సి ఉంది.
మక్క లద్దెపురుగును ప్రకృతిసిద్ధంగా అదుపు చేసే బదనికలు మన వాతావరణంలో అభివృద్ధి చెందేవరకు కొన్ని సీజన్లు గడుస్తాయి. ఈ లోగా రసాయనిక పురుగుమందులు వాడితే మిత్రపురుగులు చనిపోయే ప్రమాదం ఉంది. మేము అనుసరించిన పద్ధతుల వల్ల గండు చీమలు, సాలెపురుగులు, తూనీగలు వంటి మిత్రపురుగులకు హాని కలగదు. కాబట్టి, ఈ మిత్రపురుగుల సహాయం తీసుకొని పదింతలు శక్తితో కొత్త పురుగుపై పోరాడే శక్తి మనకు చేకూరుతుంది. ప్రకృతి సహకారం మనకు తోడవుతుంది. మట్టి సుడుల్లో వేసి ఎదిగిన లద్దెపురుగులను మొక్కజొన్న రైతులంతా నాశనం చేయగలిగితే.. ఈ పురుగు సంతతి వృద్ధిని సమర్థవంతంగా అరికట్టవచ్చన్న గట్టి విశ్వాసం మాకుంది. ఇతర దేశాల్లో రసాయనిక పురుగుమందులు వాడటం వల్ల దీని వ్యాప్తిని నిలువరించలేకపోయిన విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి.
– డా. జి. శ్యాంసుందర్‌ రెడ్డి (99082 24649), సీనియర్‌ శాస్త్రవేత్త, అధిపతి, డా. రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్‌ కేవీకే, తునికి, కౌడిపల్లి, మెదక్, తెలంగాణ–502316
వివరాలకు: శాస్త్రవేత్త నరేశ్‌ (9290615952)

‘కత్తెర పురుగు’ కాదు ‘మక్క లద్దెపురుగు’
అంతర్జాతీయంగా ఈ లద్దెపురుగు ఇంగ్లిష్‌ పేరు ‘ఫాల్‌ ఆర్మీవార్మ్‌’ (ఊఅఔఔ అఖM్గగిఅఖM   టఞౌఛీౌp్ట్ఛట్చ జటuజజీp్ఛటఛ్చీ). మొక్కజొన్న పంట అందుబాటులో ఉంటే ఇది ఇతర పంటల జోలికి పోదు. అందుకే దీన్ని ‘మక్క (మొక్కజొన్న) లద్దెపురుగు’ అని మనం పిలుచుకోవచ్చు. పొగాకు లద్దెపురుగు, రాగి లద్దెపురుగుల మాదిరిగా తొలుత ఏ పంట మీద కొత్త పురుగు కనిపిస్తే.. ఆ పంట పేరుతో పిలవటం ఆనవాయితీ. అందువల్ల మొక్కజొన్నను ఆశిస్తున్న ‘ఫాల్‌ ఆర్మీవార్మ్‌’ ను కొందరు పిలుస్తున్నట్లుగా ‘కత్తెర పురుగు’ అనటం కన్నా.. ‘మక్క లద్దెపురుగు’ అని పిలవటమే సులువు అని అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.  


సుడిలో మట్టి వేసిన ఐదవ రోజుకు చనిపోయిన మక్క లద్దె పురుగు

– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top