తెల్లరక్తకణాలు  అపరిమితంగా  పెరిగాయి...  సమస్య ఏమిటి? 

Today is International Childhood Cancer Day - Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

నేడు ఇంటర్నేషనల్‌ ఛైల్డ్‌హుడ్‌ క్యాన్సర్‌ డే

పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్స్‌

మా అబ్బాయి వయసు ఆరున్నర ఏళ్లు. మాది హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్న ఒక చిన్న టౌన్‌. ఈమధ్య వాడికి తరచూ జ్వరం వస్తూ ఉంది. పిల్లాడు కూడా చాలా పాలిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. ఇలా రెండుమూడుసార్లు యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేశాక... ఒకసారి మా ఫ్యామిలీ డాక్టర్‌ గారు అబ్బాయికి రక్తపరీక్ష చేయించారు. దాంతో అతడి బ్లడ్‌కౌంట్‌ పరీక్షలో తెల్ల రక్తకణాలు అపరిమితంగా కనిపించాయి.  పైగా డాక్టర్‌ పరీక్ష చేసే సమయంలో స్పీ›్లన్‌ ఉబ్బినట్లుగా ఉందని చెబుతూ అది లుకేమియా కావచ్చనీ, వీలైనంత త్వరగా పిల్లవాడిని సిటీలో క్యాన్సర్‌ స్పెషలిస్ట్‌కు చూపించమని అన్నారు. మావాడి సమస్య ఏమిటి? దయచేసి వివరించండి. – ఎల్‌. రామ్‌ప్రసాద్, చిట్యాల 
మనకు ఉండే రక్తకణాల్లో ప్రధానమైనవి తెల్లరక్తకణాలు, ఎర్రరక్తకణాలు, ప్లేట్‌లెట్స్‌ ముఖ్యమైనవి. మన రోగనిరోధక శక్తి ప్రధానంగా తెల్లరక్తకణాల వల్ల కలుగుతుంది. ఈ  రక్తకణాలన్నీ మన ఎముక లోపల డొల్లగా ఉండే భాగంలోని ఎముకమజ్జ లేదా మూలుగ అని మనం పిలుచుకునే బోన్‌ మ్యారోలో అనునిత్యం తయారవుతుంటాయి. అక్కడి మూలకణాల్లో వృద్ధిచెందిన తొలి కణాలు ఎర్ర, తెల్ల కణాలుగానూ, ప్లేట్‌లెట్స్‌గా రూపొందుతుంటాయి. సాధారణంగా ప్రతి రక్తకణానికీ కొంత జీవన వ్యవధి ఉంటుంది, కొత్త కణాలు పాత కణాల స్థానంలోకి వచ్చి చేరుతుంటాయి.  అయితే కొన్ని సందర్భాల్లో మనకు తెలియని కారణాలతో తెల్లరక్తకణాలు నియంత్రణ లేకుండా అమాంతం పెరిగిపోతాయి. దాంతో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది. ఇలా అనియంత్రితంగా రక్తకణాలు పెరగడాన్ని బ్లడ్‌క్యాన్సర్‌ అని చెప్పవచ్చు. అయితే అక్కడ జరిగే ప్రక్రియకు ఇది స్థూలంగా చెప్పగలిగే వివరణ మాత్రమే. ఈ తరహా బ్లడ్‌ క్యాన్సర్లలోనూ అనేక రకాలు ఉన్నాయి. అపరిమితంగా పెరిగిపోయిన తెల్లరక్తకణాల వల్ల ఎర్రరక్తకణాల కౌంట్‌కు కూడా తగ్గి పిల్లలు పాలిపోయినట్లుగా కనిపిస్తారు. తరచూ జ్వరం అన్నది ప్రధాన లక్షణంగా ఉంటుంది. ఇక మరికొందరిలో రక్తాన్ని గడ్డకట్టించడానికి అవసరమైన ప్లేట్‌లెట్స్‌ కూడా తగ్గుతాయి. ఫలితంగా క్యాన్సర్‌ రోగులలో అధిక రక్తస్రావం, శరీరం కమిలినట్లుగా కనపడటం, చర్మం మీద ఎర్రగా బ్లీడింగ్‌ స్పాట్స్‌ కనిపిస్తుంటాయి. ఇక మరికొందరు పిల్లల్లో ఎముకల కీళ్ల దగ్గర నొప్పులు, చిగుర్లలోంచి రక్తస్రావం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. మీరు మీ టౌన్‌లోని డాక్టర్‌ చెప్పినట్లుగా వీలైనంత త్వరగా మీ సమీపంలోని పెద్దనగరానికి వెళ్లి హిమటోఆంకాలజిస్ట్‌కు చూపించండి. వారు ఎముకమూలుగను పరీక్షించే ‘బోన్‌మ్యారో టెస్ట్‌’ చేసి మీ పిల్లవాడికి ఉన్న వ్యాధిని బట్టి చికిత్స మొదలుపెడతారు. 

బ్లడ్‌ క్యాన్సర్‌కు చికిత్స  ఉందా?
మా అబ్బాయి వయసు ఏడేళ్లు. ఈమధ్య మావాడికి చేయించిన ఒక రక్తపరీక్షలో అబ్బాయికి లుకేమియా అని ప్రాథమిక రిపోర్టు వచ్చింది. దాంతో బోన్‌మ్యారో పరీక్ష చేయించమని మా డాక్టర్‌ చెప్పారు. బోన్‌మ్యారో పరీక్ష అంటే ఏమిటి? ఆ తర్వాత కూడా ఏమైనా పరీక్షలు అవసరమవుతాయా? లుకేమియా అంటే బ్లడ్‌ క్యాన్సర్‌ అని తెలిశాక మాకు చాలా ఆందోళనగా ఉంది. బ్లడ్‌ క్యాన్సర్లకు చికిత్స ఉంటుందా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి. – బి. మాలతి, నెల్లూరు 
మీవాడికి చేసిన రక్తపరీక్షల్లో బ్లడ్‌క్యాన్సర్‌ ఉన్నట్లు ప్రాథమికంగా తేలడంతో దాన్ని పూర్తిగా నిర్ధారణ చేయడం కోసం బోన్‌మ్యారో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో చిన్నారికి తాత్కాలికంగా కొద్దిగా మత్తు కలిగేలా చేసి, ఎముక మూల నుంచి, కాస్తంత ఎముక మూలుగను సేకరిస్తారు. ఆ తర్వాత ఆ నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించి బ్లడ్‌క్యాన్సర్‌ను నిర్ధారణ చేస్తారు. దీనితర్వాత కూడా నిర్దిష్టంగా అది ఏ తరహా క్యాన్సర్‌ అన్నది కచ్చితంగా నిర్ధారణ చేయడానికి ఫ్లోసైటోమెట్రీతోపాటు మరికొన్ని క్రోమోజోము పరీక్షలు అవసరమవుతాయి. అయితే ఇక్కడ మీరు ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు. ఎందుకంటే గతంతో పోలిస్తే ఇప్పుడు చాలారకాల బ్లడ్‌ క్యాన్సర్లకు ఆధునిక కీమోథెరపీతోపాటు ఇంకొన్ని సపోర్ట్‌ థెరపీల వంటి చాలా మంచి చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల కొత్త చికిత్సా మార్గాలతో బ్లడ్‌ క్యాన్సర్‌ను ఇంకా సమర్థంగా చికిత్స చేయవచ్చు. కొన్ని హైరిస్క్‌ క్యాన్సర్లకు ‘బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌’ అనే చికిత్స కూడా అదించవచ్చు. అంటే... బ్లడ్‌క్యాన్సర్‌కు ఎముక లోపల ఉండే లోపభూయిష్టమైన మూలుగను పూర్తిగా అణచివేసి, ఆరోగ్యకరమైన వ్యక్తి నుంచి సేకరించిన మంచి మూలుగను ప్రవేశపెడతారు. ఈ చికిత్స తర్వాత బ్లడ్‌క్యాన్సర్‌ వచ్చిన వారు పూర్తిగా ఆరోగ్యకరమైన సాధారణమైన వ్యక్తిగా మారిపోతారు. 
డాక్టర్‌ శిరీషరాణి ,పీడియాట్రిక్‌ హిమటోఆంకాలజిస్ట్, 
రెయిన్‌బో చిల్డ్రెన్స్‌ హాస్పిటల్, హైదరాబాద్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top