జీవిత సత్యం

Three Friends Traveled Abroad For The Trip - Sakshi

ఇస్లాం వెలుగు

ఓ ముగ్గురు స్నేహితులు పర్యటన నిమిత్తం  విదేశాలకు వెళ్ళారు. అక్కడ ఒక పెద్దహోటల్‌ లో 75 వ అంతస్తులో రూమ్‌ బుక్‌ చేసుకున్నారు. ఆ హోటల్‌ నిబంధనల ప్రకారం రాత్రి పదకొండు గంటలకల్లా రూంకు చేరుకోవాలి. పదకొండు దాటితే లిఫ్ట్‌ పనిచేయదు. ఈవిషయం తన కష్టమర్లకు ముందుగానే చెప్పారు హోటల్‌ నిర్వాహకులు. ఆలస్యంగా వచ్చినవాళ్ళు పై అంతస్తులకు వెళ్ళాలంటే చుక్కలు చూడాల్సిందే. మొదటిరోజు ముగ్గురు స్నేహితులూ సమయానికే చేరుకున్నారు.కాని రెండవ రోజు కాస్తంత ఆలస్యమైంది. వచ్చేసరికి లిఫ్ట్‌ కు తాళంవేసి ఉంది. ఏంచెయ్యాలో అర్థం కాలేదు. 75 అంతస్తులంటే మాటలా? అయినా చేసేదేమీ లేదు. గదికి వెళ్ళాలంటే కాళ్ళకు బుధ్ధిచెప్పాల్సిందే.

అలసట తెలియకుండా ఉండడంకోసం ఒక స్నేహితుడు సరదాగా ముచ్చట్లు, కథలు చెప్పడం ప్రారంభించాడు. అలా సరదాగా ఆడుతూ పాడుతూ పాతిక అంతస్తులు సునాయాసంగా అధిగమించారు. తరువాత రెండవ స్నేహితుడు బంధాలు, బాధ్యతలకు సంబంధించిన వాస్తవగాథలు వినిపిస్తుండగా మరో పాతిక అంతస్తులు అధిగమించారు. ఇక చివరి పాతిక అంతస్తులు మిగిలాయి. మూడవ స్నేహితుడు బాధలు, కష్టాలు, కడగండ్లకు సంబంధించిన కథలు, జీవన సత్యాలను విడమరిచి చెబుతుంటే, వాటిని జీర్ణించుకోడానికి ప్రయత్నిస్తూ, పడుతూ లేస్తూ, ఆపసోపాలు పడుకుంటూ ఎలాగోలా తమ గదివరకూ చేరుకున్నారు. తీరా పైకి వెళ్ళిన తరువాత గదితాళాలు కింద వాహనంలోనే మరచి వచ్చామన్నసంగతి గుర్తొచ్చింది వారికి.

ఖచ్చితంగా ఇలానే ఉంది ఈనాటి మన పరిస్థితి. మన జీవితకాలంలోని మొదటి ఇరవై పాతిక సంవత్సరాలు బాల్యం, యవ్వనం, చదువు, ఆట పాటల్లోనే గడిచి పోతోంది. మిగతా పాతిక సంవత్సరాలు కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, బంధాలు, బాధ్యతలతో గడిచి పోతోంది. ఇక మిగిలిన పాతిక సంవత్సరాలు బాధలు, నొప్పులు, వృద్ధాçప్యం, ఆరోగ్య సమస్యలతో జీవితం  భారంగా గడుస్తోంది. చివరికి గమ్యానికి చేరుకునే సరికి ఏమీ మిగలడం లేదు. రిక్తహస్తాలతోనే సమాధికి చేరిపోతున్నాం. అప్పుడుగాని అసలు విషయం గుర్తుకు రావడం లేదు.

ప్రాపంచిక జీవనవ్యామోహంలో పడి సత్కర్మలు అనే తాళం చెవులు మరిచిపోయి వచ్చామని. అసలు వెంట తేవలసిన వాటినే తీసుకురాలేదని. మరలా  వెనక్కి వెళ్ళడానికి, వెళ్ళి తీసుకురావడానికి అవకాశమే ఉండదు.అయినప్పటికీ కొంతమంది అడుగుతారట.. ‘ప్రభూ.. మాకు మరొక్కసారి అవకాశాన్ని ప్రసాదించు. మమ్మల్ని ఇహలోకానికి పంపు. మేము ఎలాంటి తలబిరుసు తనానికి పాల్పడకుండా, నువ్వుచెప్పినట్లే నడుచుకుంటాము.’ అని మొరపెట్టుకుంటారట. కాని వారికి అలాంటి అవకాశమే ఇవ్వబడదు. అందుకని చావుపుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ జీవన వ్యవధిని సద్వినియోగం చేసుకుంటూ సత్కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి. సమాధికి చేరడానికి ముందే తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.
 – ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top