గడుసు దెయ్యం

గడుసు దెయ్యం


చేతబడి

సాధారణంగా... దెయ్యం మనిషిని పట్టుకుంటుంది.  

మరి, మనిషే దెయ్యాన్ని పట్టుకుంటే?

అక్కడో కథ ఉంటుంది. వ్యథ ఉంటుంది.

దెయ్యాలు ఉన్నాయా? లేవా? అన్నది వేరే టాపిక్.

ఈ కథలోని అమ్మాయి దెయ్యాన్ని పట్టుకుంది.

పట్టుకుని ఏం చేసింది? ఏం సాధించింది? చదవండి.


 

మాఘమాసం. ‘ఇదిగో.. వెళ్లిపోతున్నా’నన్న సంకేతాలిస్తూనే మధ్యరాత్రి రగ్గు వెతుక్కునేటట్లు చేస్తోంది చలి. పగలవగానే సూర్యుడూ బద్దకంగానే ఒళ్లు విరుచుకుంటున్నాడు. ఉండీలేనట్లున్న చలి; లేనట్లు, ఉన్నట్లున్న గోరువెచ్చని ఎండ. పెళ్లి పనులు చేసుకోవడానికి, పెళ్లికి హాజరయ్యే వారికి హాయైన వాతావరణం ఇది.

 

ఉదయం పది గంటలు. కల్యాణిని పెళ్లి కూతురిగా అలంకరిస్తున్నారు. ఇంటి ముందు పెళ్లిపందిరి. బంధువులు ఒక్కొక్కరే వస్తున్నారు. పట్టుచీర కట్టుకున్న వధువు మండపంలోకి అడుగుపెట్టింది. కొబ్బరికాయను పూజారి చేతిలో పెట్టి పీటల మీద కూర్చుంది. పూజారి ఇచ్చిన అక్షతలను గౌరీదేవి మీద వేయకుండా పూజారి ముఖం మీదకు చల్లింది! పూజారి ఖంగుతిన్నాడు. అంతలోనే సర్దుకుని ‘గౌరీదేవికి పూజ చేయమ్మా’ అన్నాడు అనునయంగా.



అమ్మాయి కళ్లెర్రబడ్డాయి. బాడీ లాంగ్వేజ్ మారింది. ‘ఎందుకు గౌరీ పూజ, ఎవరికి పెళ్లి చేస్తున్నావ్’ అంటూ పూజ సామగ్రిని చిందరవందర చేస్తోంది. వేదిక కింద కూర్చున్న వాళ్లకు పరిస్థితి అర్థంకావడం లేదు.

 

‘పెళ్లి కూతురికి దెయ్యం పట్టినట్లుంది’... గుసగుసలాడుతున్నారు వేదిక మీదున్న మహిళలు. ‘ఆ...’ అంటూ కంగారుపడ్డారు పెళ్లికొడుకు బంధువులు. వెంటనే వేదిక దిగి ఓ పక్కగా గుమిగూడి... ‘పెళ్లిచూపులప్పుడు బాగానే ఉందా, అప్పుడెవరెవరెళ్లారు, వాళ్లింట్లో ఇంకెవరికైనా గాలి పట్టిందా...’ ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఆరా తీస్తున్నారు. ఈ మాటలన్నీ పెళ్లికూతురి బంధువుల చెవిన కూడా పడుతున్నాయి. ‘లక్షణంగా చదువుకుంటున్న పిల్ల.



ఎప్పుడూ ఇలాంటిది లేదు. శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఇప్పుడు దెయ్యం పట్టడమేంటి?’ ఆందోళన మొదలవుతోంది వారి గుండెల్లో. అబ్బాయి వాళ్లు ఏమనుకుంటారో ఏమో... పెళ్లి ఆగకుండా మూడుముళ్లు పడితే చాలు’ ఆని మనసులోనే దేవుళ్లకు మొక్కుకుంటోంది అమ్మాయి తల్లి రాణెమ్మ. తండ్రి ‘బాణు’ ముఖం ఎర్రగా కందగడ్డలా ఉంది. అమ్మాయి మేనమామలు చొరవ తీసుకుని పెళ్లికొడుకు అన్నావదినలకు నచ్చచెబుతున్నారు. ఎలా స్పందించాలో తెలియని అయోమయం వారిది!

 

నీ కోరికలు చెప్పమ్మా!


దెయ్యం... కోరిన కోరికలు తీరిస్తే వదులుతుందని నమ్మకం. ఇద్దరు మహిళలు ధైర్యం చేసి ‘నీకేం కావాలమ్మా’ అనగానే... రకరకాలుగా నోరంతా తెరిచి విచిత్రంగా అభినయిస్తూ ‘మాంసం, చేపలు, కోళ్లు...’ జాబితా చదువుతోంది. ‘అమ్మో! ఇది రాకాసి దెయ్యమే...’ నిర్ధారణకు వచ్చేశారు పెళ్లికొడుకు బంధువులు. మంచి దెయ్యమైతే పూలు, చీరలు, ఆకు, వక్క, తాంబూలం వంటివి అడుగుతుందని, అవి పెద్దగా హానికరం కాదని, మాంసం అడిగిన దెయ్యాలు భయంకరమైనవని, అవి ప్రాణాన్ని బలి తీసుకునే వరకు వదలవని నమ్ముతారు.



పెళ్లి కూతురు మాంసం అడగడంతో ... ‘అసలే పెద్ద దిక్కు లేని కుటుంబం మాది. అమ్మానాన్నలు లేని వాడిని అన్నావదినలు పట్టించుకోకుండా వదిలేశారంటారని బాధ్యతగా పెళ్లి చేస్తున్నాం. ఈ దెయ్యాన్ని ఇంటికి తీసుకెళ్తే మాలో ఎవర్ని మింగుతుందో ఏమో’ అని మనసులో ఉన్న భయాన్ని కక్కేసింది పెళ్లికొడుకు వదిన. అంతే... అబ్బాయి వాళ్లంతా ఒక్కొక్కరుగా మాయమయ్యారు.

 

గతం మెదిలింది!

ఇంతలో అమ్మాయి పీటల మీద నుంచి లేచి నిలబడింది. తండ్రిని ‘ఏరా’ అని సంబోధిస్తోంది. బాణు పరుగెత్తుకుంటూ వెళ్లి కూతురి ఎదురుగా నిలబడ్డాడు. కూతురి మాటల్ని బట్టి ఆమెను పూనింది తన తండ్రని భావించాడతడు. ‘పిల్లకు ఇష్టం లేని పెళ్లి చేస్తావురా, నేన్నీకు అట్లనే చేసిన్నా’ అంటూ రంకెలు వేస్తోంది. నిలువునా కూలబడిపోయాడతడు. బంధువులు ధైర్యం చెబుతున్నారు. ఆడవాళ్లు పెళ్లికూతురిని శాంత పరుస్తున్నారు. బంధువుల్లో ఓ పెద్దాయన చొరవగా బాణుతో ఓ మాటన్నాడు.

 

ఆ మాటతో బాణు కళ్ల ముందు ‘నాగు’ మెదిలాడు. అతడి కొడుకులు సునంద్, ప్రమోద్‌లకైతే గతంలో.. కల్యాణి జోలికి రావద్దని నాగును  మందలించిన సంఘటన కూడా కళ్ల ముందు మెదిలింది. సందేహంగా తండ్రి వైపు చూశారు. ‘మేము మాట్లాడతాం’ అంటూ మరికొందరు ఆత్మీయులు ముందుకొచ్చారు. నాగు కూడా ఆ పెళ్లికి వచ్చాడు! అయితే పెళ్లి ఆగిపోయింది. ఇంకా అక్కడే ఉంటే ఏం బావుంటుందని వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు నాగు, అతడి అన్నలు.



‘కల్యాణిని పెళ్లి చేసుకుంటావా’ అని నాగును అడగ్గానే... ‘నాకిస్తారా’ అంటూ బదులు ప్రశ్నించాడు నాగు. ‘మేమిప్పుడే వస్తా’మని వధువు గదిలోకి వెళ్లారు పెద్దలు. ‘నాగును పెళ్లి చేసుకోవడానికే ఇదంతా’ అనేసిందా అమ్మాయి. ఆ ఒక్క సందర్భం మినహా అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఆ అమ్మాయికి దెయ్యం పట్టనేలేదు.

 

పెద్దవాళ్లకు పెద్ద మనసుండాలి


పెద్దవాళ్లు... పెద్దవాళ్లమనే మొండితనంతో ఇష్టంలేని పెళ్లిని పీటల వరకు తీసుకురాకపోయి ఉంటే ఆ అమ్మాయికి అసలు దెయ్యమే పట్టేది కాదు. ఒక మూర్ఖత్వం నుంచి తప్పించుకోవడానికి ఈ మూఢత్వాన్ని ఒంటబట్టించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పుకోవడానికి సరదాగానే ఉంటుంది. కానీ అప్పటి వరకు ఒక అమ్మాయి పడిన ఆవేదనను వివరించడానికి మాటలు చాలవు. కల్యాణి ధైర్యం ఉన్న అమ్మాయి. దెయ్యం డ్రామాతో కథను సుఖాంతం చేసుకుంది. కానీ చాలా మంది అమ్మాయిలు ఇష్టం లేని పెళ్లి చేసుకుని మౌనంగా రోదిస్తూ జీవిస్తుంటారు. మరికొంత మంది జీవితాన్ని అంతం చేసుకుంటారు. అందుకే...

 

తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవాలి. వాళ్లను ప్రేమించినంతగా వాళ్ల ఇష్టాల్నీ ప్రేమించగలగాలి. పిల్లల ప్రేమలో ఆకర్షణ తప్ప జీవితానికి బంధం ఏర్పడే భరోసా లేదనిపించినప్పుడు ఆ విషయాన్ని వారితోనే మాట్లాడాలి. వారిని మాట్లాడనివ్వాలి. పిల్లల్ని కన్విన్స్ చేయాలి. తల్లిదండ్రులు ఏది చెప్పినా పిల్లల పట్ల ప్రేమతోనే చెబుతారనే నమ్మకం పిల్లల్లో కలిగించాలి. పిల్లల ఎంపిక బావుందనే భరోసా కలిగితే పెద్దలూ ఒప్పుకోవాలి. అలాగే పేరెంట్స్ చెప్పిన విషయాన్ని ఓ క్షణం పాటు వాళ్ల స్థానంలో నిలబడి ఆలోచిద్దాం అని పిల్లలూ అనుకోవాలి. వాళ్లనుకోకపోతే తల్లిదండ్రులే ‘మా స్థానంలో నిలబడి ఆలోచించ’మని ఓ రిక్వెస్ట్ చేస్తే పోయేదేమీ ఉండదు.

 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

 గమనిక: వ్యక్తుల పేర్లు మార్చాం.


 

నాగు ఎవరు?

అనంతపురం జిల్లా, ముదిగుబ్బ గ్రామంలో బాణు పొలాన్ని కౌలు చేసేవాళ్లు నాగు అన్నలు. ఆ కుటుంబంతోదూరపు బంధుత్వం కూడా ఉంది. ముగ్గురన్నలు కష్టపడుతూ చిన్నవాడిని చదివించారు. అనంతపురం కాలేజీలో నాగు డిగ్రీ చదివేటప్పుడు కల్యాణి ఇంటర్ చదివేది. ఒక ఊరి వాళ్లు, తెలిసిన వాళ్లు కావడంతో కలిసి ప్రయాణించేవారు. సాన్నిహిత్యం పెరుగుతుందేమోనని సందేహ పడిన కల్యాణి అన్నదమ్ములు నాగును మందలించారోసారి. అప్పటి నుంచి కల్యాణి, నాగుల సాన్నిహిత్యం పెరిగింది.

 

 

ప్లాన్ లేదు కానీ... ప్రేమ ఉంది

నాగుతో ‘కల్యాణికి దెయ్యం ప్లాన్ ఇచ్చింది నువ్వేనా’ అంటే ‘అదేమీ లేదబ్బా’ అన్నాడు కంగారుగా. ‘ప్రేమించిన అమ్మాయికి పెళ్లవుతుంటే బాధతో ఆ పరిసరాల్లోకి రాకుండా దూరంగా ఉంటారు ఎవరైనా. మరి నువ్వు పెళ్లి పందిట్లో ఎందుకున్నావు’ అని అడగ్గానే... నవ్వుతూ ‘పోనివ్వకూడదూ’ అని... ‘ఆ అమ్మాయి ఎప్పుడైనా ప్రేమిస్తున్నానని నాతో చెప్పిందా, లోపలే దాచుకుంది. నాకు మాత్రం చెప్పాలని ఉండేది. వాళ్ల డబ్బు చూసి భయమేసేది’ అన్నాడు. వాళ్లిద్దరూ పెళ్లయ్యాక ఎం.ఎ, బిఈడీ చేసి, ఇప్పుడు బెంగళూరులో టీచర్లుగా ఉద్యోగం చేసుకుంటున్నారు. నాలుగేళ్ల కొడుకుతో ఆనందంగా జీవిస్తున్నారు.

- ఎస్. శంకర శివరావు,

కన్వీనర్, జెవివి నేషనల్ మేజిక్ కమిటీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top