యోగ యోగి యోగాంతం

There Are Many Steps We Can Experience In Practicing Yoga - Sakshi

 క్రియాయోగ

సాధారణంగా యోగ ప్రధానలక్ష్యం భగవంతుని ఉనికిని అనుభవించడం, అదీ అంతిమంగా సమాధిస్థితిలో. భగవంతుడు అంటే మన ఊహకి గాని, ఆలోచనకి గాని అందనివాడు అని పెద్దలు చెబుతుంటారు. అయితే ఊహకే అందని ఆ భగవంతుడిని యోగా ద్వారా అర్థం చేసుకోవడం ఎలా? ఆయనను చేరుకోవడం ఎలా? అన్న ప్రశ్నలకు సమాధానమే క్రియాయోగ. మన మేధస్సుకు అసాధ్యంగా భావించే ఈ స్థితిని  క్రియా యోగ ద్వారా ఎలా సుసాధ్యం చేయవచ్చో చూద్దాం.

యోగసాధనలో మనకు అనేక దశలు అనుభవంలోకి వస్తాయి. మొదటి దశ శరీరంలో అనుభూతి తో మొదలవుతుంది. అదెలాగంటే యోగసాధన చేస్తున్నప్పుడు శరీరం క్రమేణా ఆరోగ్యవంతమవుతుంది. శారీరక బాధలు, నొప్పులు తగ్గిపోతాయి. జీర్ణశక్తి మెరుగవుతుంది. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఉచ్ఛ్వాసనిశ్వాసాలు క్రమపద్ధతిలో జరుగుతాయి. నాడీవ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఇదంతా యోగాసనాల సాధన ద్వారా తొలిదశలో సాధ్యం అవుతుంది. యోగసాధకుల శరీరంలో జరిగే ఈ ఆరోగ్య ప్రక్రియే భగవంతుని శక్తి. ఇక భగవంతుని ఉనికి తెలుసుకోవడంలో తదుపరిదశ మానసికమైనది. భావోద్వేగాలు, విపరీత ధోరణులు సద్దుమణిగి పోతాయి. ఆందోళనలు, కోపతాపాల స్థానంలో భక్తి, ప్రేమ, వాత్సల్యం చోటు చేసుకుంటాయి.

కుటుంబీకులు, బంధుమిత్రుల ద్వారా సంభవించిన అవమానాలు, కష్టనష్టాల తాలూకు భావనలన్నీ కుండలినీ ప్రాణాయామం ద్వారా సమసిపోతాయి. ఉఛ్వాస నిశ్వాసాలను క్రమబద్ధీకరించే ఈ మానసిక ప్రక్రియ ప్రాణాయామం ద్వారా మానసిక రుగ్మతలే కాకుండా, కడుపులో పుండ్లు, ఉబ్బసం వంటివి కూడా తగ్గిపోతాయి. ఇక తరవాతిదశలోకి వద్దాం. ఈ దశలో భావోద్వేగాలన్నీ భక్తిభావమయం అయి భగవంతునివైపు సాగిపోయే భక్తిప్రవాహంలా జీవితం మారిపోతుంది. భజనలు, కీర్తనల ద్వారా భగవదారాధన నిత్యకృత్య మవుతుంది. యోగాప్రక్రియ నిరంతర సాధన ద్వారానే ఇది సాధ్యమవుతుంది. క్రమేణా యోగిలో ఏకాగ్రత (ధారణ), ధ్యానం అలవడతాయి. మనసు నిశ్చలస్థితికి చేరుకుంటుంది. ఎటువంటి అలజడులు లేని ఈ మానసిక స్థితి అద్భుతమైనది.

ఈ స్థితినుంచి జీవనయానం క్రమేణా సమాధిస్థితి వైపు సాగిపోతుంది. ఎటువంటి ఆలోచనలు లేని నిశ్చలస్థితికి యోగి మనసు చేరుకుంటుంది. సద్గురు ఇచ్చే ప్రత్యేకమైన, విశేషమైన సూచనల ద్వారా మనసు క్రమేణా అంతర్ముఖమవుతుంది, అంతరంగం ప్రకాశవంత మవుతుంది. అంతమాత్రాన భగవంతుని ఉనికిని అర్థం చేసుకునే స్థితికి మనసు చేరుకున్నట్టు కాదు. నిరంతర యోగసాధన ద్వారా మాత్రమే యోగి క్రమేణా ఈ స్థాయికి చేరువ అవుతాడు. ఆ తర్వాత మరింత యోగసాధన ద్వారా యోగి తనను తాను అర్పించుకునే స్థితికి చేరుకుంటాడు.

మనసంతా ఆధ్యాత్మిక వెలుగుతో తేజో మయమవుతుంది. ఆ తేజస్సులో లీనమైన అనుభూతిని పొందుతుంది. క్రమేణా యోగి తానే తేజస్సుగా మారిపోతుంటాడు. మానసిక పరిపక్వత పరిఢవిల్లుతుంది. చైతన్యం, చురుకుతనం వికసిస్తాయి. దేవీదేవతలు, సాధు పుంగవుల సాక్షాత్కారం అనుభవంలోకి వస్తుంది. యోగి తను భక్తుడిననే స్పృహ æకోల్పోయే సర్వికల్ప సమాధిస్థితికి చేరతాడు. అనంతరం యోగితేజస్సులో లీనమయ్యే స్థితికి చేరువవుతాడు. ఆ తేజస్సులో తాదాత్మ్యం చెందుతాడు. బ్రహ్మానందభరితుడవుతాడు.   యోగమార్తాండ యోగి రాజ సిద్ధనాథ్‌  ఒక హిమాలయ యోగి. క్రియాయోగ సాధనపై శిక్షణ ఇస్తారు. హైదరాబాద్, విశాఖపట్నంలో త్వరలో జరగబోయే కార్యక్రమాల వివరాలకు www.hamsakriya.org చూడచ్చు.
– సిద్ధనాథ్‌ హంస యోగ్‌ సంఘ్‌

►నిరంతర యోగసాధన ద్వారా ఇలా శారీరక రుగ్మతలు, బాధలను అధిగమించే స్థితినుంచి నిర్వికల్ప సమాధిస్థితికి చేరుకోగలుగుతాడు. సృష్టి, స్థితి, లయకారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఉనికిని అనుభవించగలుగుతాడు, క్రమేణా మహావతార బాబాజీ అధ్యాత్మ స్థితికి చేరుకుంటాడు. అంతిమంగా తేజస్సులో లీనమైపోతాడు. ఆది, అంతం లేని విశ్వవ్యాపమైన నిరంజన, నిర్వాణ, కైవల్యస్థితిలో ముక్తి పొందుతాడు. భగవంతునిలో లీనమైపోతాడు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top