హుర్రే పోటర్

హుర్రే పోటర్


హ్యారీ పోటర్ సీరీస్ రాసిన జె.కె.రోలింగ్‌కి ప్రపంచం హిప్ హిప్ హుర్రే చెప్పింది. మళ్లీ ఇప్పుడు మరో పోటర్ పుస్తకం విడుదల కాబోతున్న సందర్భంలో... ‘జో’ జీవిత పుస్తకాన్ని మనం ఒకసారి ఆవిష్కరించుకుందాం. గెలుపు.. పాఠాలు మాత్రమే చెప్తుంది.  ఓటమి.. గుణపాఠాలు నేర్పుతుంది. ‘హ్యారీ పోటర్’ రచయిత్రి జె.కె.రోలింగ్ ఓటమి నుంచే పైకి వచ్చారు! కానీ ‘ఓటమి’ని ఓటమి అని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. ‘పైకి’ అన్న మాటను గెలుపు అని కూడా అనుకోలేదు. పాట్లు పడ్డప్పుడు పడ్డారు. ఆ పాట్లను తన రచనలకు ‘ప్లాట్’గా చేసుకున్నారు. విజయం సాధించారు. అయితే అది.. అనుకుని సాధించిన విజయం కాదు. నడుస్తూ నడుస్తూ మెట్లెక్కేశారు. ఎందుకో చూసుకుంటే పై మెట్టు మీద ఉన్నారు! మొదటి మెట్టు, చిట్ట చివరి మెట్టు రెండూ ఒకటే రోలింగ్‌కి! జీవితంలో రెండూ ఇంపార్టెంటే అంటారు.


 

‘ఐ కాంట్ స్టాప్ క్రయింగ్’


అమెరికాలోని ఆర్లెండో క్లబ్‌లో ఇటీవల ఒక ఉన్మాది కాల్పులు జరిపాడు. 50 మంది చనిపోయారు. వాళ్లలో ఒకరు లూయీ వియల్మా. 22 ఏళ్ల కుర్రాడు. అర్లెండోలోని హ్యారీ పోటర్ థీమ్ పార్క్‌లో అతడు రైడ్ అటెండెంట్.       ఆ వార్త విని బ్రిటన్‌లో ఉన్న రోలింగ్ షాక్ తిన్నారు.   ‘ఐ కాంట్ స్టాప్ క్రయింగ్’ అని ట్వీట్ చేశారు. రోలింగ్‌కి అతడు తెలుసు. హ్యారీ పోటర్‌పై అతడికి ఉన్న పిచ్చి అభిమానం గురించీ తెలుసు. అందుకే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.


 

కన్నీళ్లనే కాదు... ఏ ఉద్వేగాన్నీ ఆపులేరు రోలింగ్. ఆమె సున్నితమైన మనిషి. సృజనాత్మకత ఉన్న మనిషి. ఆ సున్నితత్వం, సృజనాత్మకత కలిసి ఆమె చేత పిల్లల కోసం హ్యారీ పోటర్‌ను రాయించాయి. తొమ్మిదేళ్ల విరామం తర్వాత (కథ పరంగా పందొమ్మిదేళ్ల తర్వాత) ఆ చిన్నపిల్లల గొలుసు నవలకు కొనసాగింపుగా హ్యారీ పోటర్ ఎనిమిదో పుస్తకం రాశారు. అది జూలై 31న విడుదలౌతోంది.


 


రోలింగ్ ఏంటి? రోలింగ్ పిన్‌లా?!

హ్యారీ పోటర్ సీరీస్‌తో పోల్చి చూస్తే జె.కె.రోలింగ్ జీవిత చరిత్ర చాలా చిన్న పారాగ్రాఫ్! రచయిత్రిగా పేరొచ్చాక రోలింగ్ పాత్ర చిన్నదైపోయి, పాత్రగా పోటర్ పెద్దవాడైపోయాడు. ఏ సృష్టికర్తకైనా ఇంతకు మించిన జన్మసార్థకత ఏముంటుంది?



రోలింగ్ పుట్టింది చిప్పింగ్ సాడ్బరీలో. ఇంగ్లండ్‌లోని సౌత్‌వెస్ట్ (ఆగ్నేయం) టౌన్ అది. ‘రోలింగ్ ఏంటి? రోలింగ్ పిన్‌లా’ అని చిన్నప్పుడు స్కూల్లో పిల్లలు ఏడిపించేవాళ్లు రోలింగ్‌ని. అదొక్కటే ఆమె బాల్యంలోని చేదుజ్ఞాపకం. మిగతాదంతా హ్యాపీ లైఫ్. ‘పోటర్’ అనే పేరు ఎందుకో అమెకు చిన్నప్పట్నుంచే ఇష్టమయ్యేది. రోలింగ్ తొమ్మిదో యేట సౌత్ వేల్స్ లోని చప్‌స్టో పట్టణానికి మారింది ఆ కుటుంబం. అప్పటివరకు గ్లౌస్టర్‌షైర్‌లోని సెయింట్ మైఖేల్స్ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంది రోలింగ్. అక్కడ చదువుతున్నప్పుడు చిన్నారి రోలింగ్ ‘రాబిట్’ అనే కథ రాసింది! అమ్మవారు పోసిన కుందేలు కథ అది. తల్లి ముగ్ధురాలైపోయింది. ‘భలే ఉందిరా జో’ అని కూతుర్ని ముద్దు పెట్టుకుంది. ‘అయితే ప్రింట్ ఎప్పుడు చేయిస్తావ్?’ అని అడి గేసింది రోలింగ్! అప్పుడే అనుకున్నారట యాన్.. తన కూతురు పెద్ద రచయిత్రి అవుతుందని. తల్లి తర్వాత రోలింగ్‌కి అంతటి కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఆమె ఫ్రెండు సీన్ హ్యారిస్. అప్పర్ సిక్స్త్‌లో క్లాస్‌మేట్. ‘జో.. నువ్వు చక్కగా రాస్తావ్’ అనేవాడట హ్యారిస్. అతడి దగ్గర పాత యాంగ్లియా ఫోర్డ్ కారు ఉండేది. తర్వాత అది హ్యారీ పోటర్ నవలల్లో ఫ్లయింగ్ కార్‌గా ప్రత్యక్షమైంది. అది ఒకటే కాదు, తన జీవితంలోని ఏ దశను, సందర్భాన్ని, అనుభవాన్ని, జ్ఞాపకాన్నీ వదలకుండా హ్యారీ పోటర్‌లో సీరీస్‌లో ఎక్కడో ఒక చోట నిక్షిప్తం చేశారు రోలింగ్. నిజ జీవితం నుంచి వచ్చిన కల్పన కాబట్టే పిల్లలకు హ్యారీ పోటర్ అంతగా కనెక్ట్ అయింది.


 


‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’లో ఉద్యోగం

రోలింగ్ తల్లిదండ్రులకు ఫ్రెంచ్ భాష మీద నమ్మకం. ఉద్యోగాలు తెచ్చి పడేస్తుందని. అందుకే రోలింగ్‌ని ఎక్సెటర్ యూనివర్శిటీలో ఫ్రెంచ్ లాంగ్వేజ్ చదవమన్నారు. రోలింగ్‌కి ఇంగ్లిష్ లాగ్వేజ్ ఇష్టం. అయినా సరే, అమ్మానాన్నల ఇష్టం ప్రకారం ఎక్సెటర్ తరఫున ప్యారిస్ వెళ్లి అక్కడ ఫ్రెంచ్‌లో గ్రాడ్యుయేట్ అయి లండన్ వచ్చారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషన్‌లో ద్విభాషా కార్యదర్శిగా, పరిశోధకురాలిగా చేరారు. ఆమ్నెస్టీ నుంచి బయటికి వచ్చి, రచయిత్రిగా బాగా డబ్బు సంపాదించాక ఆమ్నెస్టీకీ, ఇంకా అలాంటి ధార్మిక సంస్థలకు భారీగా విరాళాలు ఇచ్చారు రోలింగ్.


 


ట్రైన్ లేటైంది.. థాట్ తట్టేసింది!

ఆమ్నెస్టీలో ఉన్నప్పుడే మాంఛెస్టర్‌లోని చాంబర్ ఆఫ్ కామర్స్‌లో పని చేయడానికి రోలింగ్‌కి అవకాశం వచ్చింది. ఆమె వెంట ఆమె బాయ్‌ఫ్రెండ్ కూడా మాంఛెస్టర్ వెళ్లాడు. సెలవు దొరికినప్పుడు లండన్ వచ్చి వెళుతుండేవారు రోలింగ్. 1990లో ఓరోజు లండన్ వచ్చేందుకు ఆమె మాంఛెస్టర్‌లో రెలైక్కారు. మామూలుగా రెండు గంటల్లో గమ్యం చేరే ఆ లైన్‌లో ట్రైన్ నాలుగు గంటలు ఆలస్యంగా నడిచింది. ఆ ఆలస్యమే రోలింగ్ జీవితాన్ని వేగవంతం చేసింది! ప్రయాణంలోనే కథకు ప్లాట్ తయారుచేసుకున్నారు. ఒక కుర్రాడు ఉంటాడు. వాడు ‘స్కూల్ ఆఫ్ విజడ్రీ’కి వెళుతుంటాడు. మానవాతీత శక్తులు వాడి అనుభవంలోకి వస్తుంటాయి. ఇదీ సారాంశం. రైలు క్లాఫమ్ జంక్షన్‌కు చేరుకునే సమయానికి కథ రాయడం మొదలుపెట్టేశారు రోలింగ్. అయితే అది ముందుకు సాగలేదు!




ఆ డిసెంబర్‌లో రోలింగ్ తల్లి చనిపోయారు. మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే వ్యాధితో పదేళ్లు బాధపడి చివరిశ్వాస వదిలారు. తల్లి మరణం రోలింగ్‌ని కుంగదీసింది. రచన కుంటుపడింది. నవల పూర్తయ్యాక తల్లికి చెబుదామనుకున్నారు రోలింగ్. కానీ తన కూతురు ప్రపంచ బాలసాహిత్య చరిత్రలోనే ఒక సంచలనాత్మకమైన రచన చేస్తోందన్న సంగతి తెలియక ముందే యాన్ మరణించారు. ఈ బాధనంతా రోలింగ్ తన తొలి హ్యారీ పోటర్ నవలలో హ్యారీ ఫీలింగ్స్ ద్వారా వ్యక్తం చేసుకున్నారు.


 


‘పోర్టో’కి వెళితే.. పార్ట్‌నర్ దొరికాడు

రోలింగ్‌కి ఫ్రెంచ్‌తో పాటు ఇంగ్లిష్‌లోనూ ప్రావీణ్యం ఉంది. పోర్టోలోని (పోర్చుగల్) ఒక విద్యా సంస్థలో ఫారిన్ లాంగ్వేజ్‌గా ఇంగ్లిష్ నేర్పించడానికి అవకాశం వస్తే అక్కడ 18 నెలలు ఉన్నారు. రాత్రి ఉద్యోగం, ఉదయం నవల రాయడం. వయెలిన్ సంగీతాన్ని వింటూ నవల రాసేవారు రోలింగ్. ఆ సమయంలోనే ఒక బార్‌లో ఆమెకు పోర్చుగీసు టెలివిజన్ జర్నలిస్టు జార్జి ఆరెంచిస్ పరిచయం అయ్యాడు. ఇద్దరికీ జేన్ ఆస్టిన్ నవలలంటే ఇష్టం. అలా దగ్గరయ్యారు. పెళ్లి చేసుకున్నారు. అప్పటికి రోలింగ్ వయసు 27 ఏళ్లు. పెళ్లయిన ఏడాదికే రోలింగ్ తల్లి అయ్యారు. బిడ్డకు జెస్సికా అని పేరు పెట్టుకున్నారు. రోలింగ్ అభిమాన రచయిత్రి జెస్సికా మిట్‌ఫోర్డ్ పేరు అది. జెస్సికా పుట్టిన నాలుగు నెలల తర్వాత భార్యాభర్త విడిపోయారు. రోలింగ్ జీవిత చరిత్ర రాసిన గ్రంథకర్తలు చెప్పడం ఏమంటే - తరచు ఆమె కుటుంబ హింసకు గురయ్యేవారని! భర్తను వదిలేశాక నెలల బిడ్డను తీసుకుని ఎడిన్‌బరో (స్కాట్లాండ్)లోని తన చెల్లెలు ఇంటికి వెళ్లారు రోలింగ్. అప్పుడామె సూట్‌కేసులో ఉన్నది మూడు చాప్టర్ల హ్యారీ పోటర్ మాత్రమే.


 


డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారు!

వైఫల్యాలన్నీ ఒక్కసారిగా తనను చుట్టుముట్టినట్టు ఫీలయ్యారు రోలింగ్. గ్రాడ్యుయేషన్ అయి అప్పటికి ఏడేళ్లయినా జీవితంలో ఆమె స్థిరపడలేదు. తల్లి చనిపోయింది. భర్తను వదలి వచ్చేసింది. ఉద్యోగం లేదు. బిడ్డ తల్లిగా పోషణ, సంరక్షణ లేవు. ఓ రోజంతా కూర్చొని ఆమె ఆలోచించారు. పరిస్థితులు తనని ఒంటరిని చేయలేదు. స్వేచ్ఛను ప్రసాదించాయి. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకుని నవలను పూర్తి చేయాలి అని స్థిరంగా అనుకున్నారు రోలింగ్. అయితే అదంత సులభం కాలేదు!


 అకస్మాత్తుగా ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయేవారు. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు వచ్చేవి. ఈ మనోవేదనలోంచి పుట్టుకొచ్చిన ఆత్మలేని పాత్రలే డెమెంటర్స్. హ్యారీ పోటర్ మూడో పుస్తకంలోనివి. ఆర్థికంగా కూడా బాగా చితికిపోవ డంతో ప్రభుత్వం అందించే సంక్షేమ సహాయాలకు దరఖాస్తు చేసుకున్నారు రోలింగ్. సరిగ్గా అప్పుడే భర్త ఆమెను వెతుక్కుంటూ స్కాట్లండ్ వచ్చాడు! నా బిడ్డ నాకు కావాలి అన్నాడు. ఉంటే నువ్వు కూడా నాతో ఉండొచ్చు అన్నాడు. రోలింగ్ ఒప్పుకోలేదు. విడాకులతో అతడిని వదిలించుకున్నారు. నవల మీద సీరియస్‌గా కూర్చున్నారు. 1995 నాటికి నవల పూర్తయింది. కేఫ్‌లలో కూర్చొని ముక్కలు ముక్కలుగా ఆమె హ్యారీ పోటర్‌ని రాశారు. జెస్సికా నిద్రపోతున్న సమయమే ఆమె నవల చకచక సాగే సమయం. ఇంట్లో వె చ్చదనం లేకనే రోలింగ్ అలా కేఫ్‌లలో రాసేవారని వచ్చిన పుకార్లను ఓసారి బి.బి.సి. ఇంటర్వ్యూలో కొట్టిపడేశారు రోలింగ్. వాకింగ్ చేయిస్తే త్వరగా నిద్రపడుతుందని జెస్సికాను అమె బయటికి తీసుకొచ్చేవారు. ఎక్కడ తను నిద్రలోకి జారుకుంటే అక్కడి కేఫ్‌లో కూర్చొని రాయడం మొదలు పెట్టేవారట రోలింగ్.


 


పోటర్ ప్రసాదించిన జీవితం!

1997 నాటికి ఫస్ట్ కాపీ రెడీ! హ్యారీ పోటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్! రెమ్యూనరేషన్ 1500 పౌండ్లు. తొలి ప్రచురణలో 1000 కాపీలతోనే బుక్కు క్లిక్ అయింది. ఆ తర్వాత ఆరు పుస్తకాలు. చివరి పుస్తకం ‘హ్యారీ పోటర్ అండ్ ది డెత్‌లీ హాలోస్’ 2007లో వచ్చింది. నాలుగో పుస్తకానికి, ఐదో పుస్తకానికి మధ్య 2001లో రోలింగ్ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లకు కొడుకు పుట్టాడు. తర్వాత రెండేళ్లకు కూతురు. 2007 తర్వాత తిరిగి ఇన్నేళ్లకు మళ్లీ ఇంకో హ్యారీ పోటర్ రాబోతోంది.


 

అతీంద్రియ శక్తులతో హ్యారీ సీరీస్ రాసి పిల్లల్నీ పెద్దల్ని అలరించిన జె.కె.రోలింగ్ ఒక మాట మాత్రం కచ్చితంగా చెబుతారు. ‘‘ప్రపంచాన్ని మార్చడానికి మ్యాజిక్‌లు అవసరం లేదు. మనకు కావలసిన శక్తిని మన లోపల ఎప్పుడూ మనం మోస్తూనే ఉంటాం. ఆ శక్తి చాలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మించుకోడానికి’’.


 


 


 


జె.కె.రోలింగ్ కొన్ని విశేషాలు

రోలింగ్ తొలి హ్యారీ పోటర్ నవలను 12 మంది పబ్లిషర్లు తిరస్కరించారు. చివరికి బ్లూమ్స్‌బరీ పబ్లిషర్లు తీసుకున్నారు. అయితే బ్లూమ్స్‌బరీ వాళ్లు ఆమెను కలం పేరు పెట్టుకోవాలని కోరారు. జోయాన్ రోలింగ్ అంటే రచయిత్రి అని తెలిసిపోతుందనీ, కథలో అబ్బాయి హీరో కనుక, అబ్బాయిలు చదవాలంటే రాసింది రచయిత్రి కాకుండా, రచయిత అయితే బాగుంటుందని వాళ్ల ఉద్దేశం. దాంతో జోయాన్ రోలింగ్ తన పేరును జె.కె.రోలింగ్ అని మార్చుకున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు రోలింగ్‌ని ‘జో’ అని పిలుస్తారు.


     

పుస్తకాలు రాసి బిలియనీర్ అయిన తొలి రచయిత్రిగా ఫోర్బ్స్ మేగజైన్ రోలింగ్‌ను గుర్తించింది.  ఇప్పటి వరకు అమ్ముడైన హ్యారీ పోటర్ సీరీస్ ప్రతులు 40 కోట్లు. ట్విట్టర్‌లో రోలింగ్‌కు 50 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అనాథ బాలలను, బాలకార్మికులకు తిరిగి వాళ్ల తల్లిదండ్రుల దగ్గర చేర్చడం కోసం రోలింగ్ ‘ల్యూమస్’ అనే అంతర్జాతీయ సంస్థను స్థాపించారు.హ్యారీ పోటర్ పుస్తకాల్లోని ఊహాత్మకమైన ‘క్విడిచ్’ ఆటను అనేక యూనివర్శిటీలు నిజమైన ఆటగా స్వీకరించాయి!


 


జె.కె.రోలింగ్ (50)  ‘హ్యారీ పోటర్’ నవలా రచయిత్రి

అసలు పేరు  :     జోయాన్ ‘జో’ రోలింగ్

కలం పేర్లు     :     జె.కె.రోలింగ్, రాబర్ట్ గాల్‌బ్రెయిత్

జన్మ స్థలం    :     యేట్, (ఇంగ్లండ్)

జన్మ దినం    :     31 జూలై 1965

తల్లిదండ్రులు :     పీటర్ జేమ్స్ రోలింగ్ (ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీర్) యాన్ రోలింగ్ (సైన్స్ టెక్నీషియన్)

చదువు  :     బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్

రచనాప్రక్రియ :     ఫాంటసీ, డ్రామా, యంగ్ అడల్ట్ ఫిక్షన్ ట్రాజికామెడీ, క్రైమ్ ఫిక్షన్

భర్త :     జార్జ్ అరేంచిస్ (వివాహం: 1992-95) నీల్ ముర్రే (వివాహం: 2001)

పిల్లలు   :     జెస్సికా అరేంచిస్ (కూ), డేవిడ్ ముర్రే (కొ) మెకెన్జీ ముర్రే (కూ)

ప్రస్తుత నివాసం    :     ఎడిన్‌బరో (రెండో భర్త, పిల్లలతో కలిసి)

తొలి నవల    :     హ్యారీ పోటర్ అండ్ ది ఫిలాసఫర్స్ స్టోన్ (1997)

సీరీస్‌లో చివరి, ఏడవ నవల :     హ్యారీ పోటర్ అండ్ ది డెత్‌లీ హాలోస్ (2007)

తొమ్మిదేళ్ల విరామం తర్వాత :     హ్యారీ పోటర్ అండ్ ది కర్స్‌డ్ చైల్డ్ (విడుదల 31 జూలై 2016)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top