హోమ్‌లీ హోమ్‌

Spiritual invitation with homely home - Sakshi

ఆశ్రయం

నలభై ఏళ్లుగా అనాథ బాలలు, వృద్ధులు, వికలాంగులకు ఆశ్రయం ఇస్తున్న డాక్టర్‌ గీత దంపతులు.. ఇప్పుడు మరొక హోమ్‌లీ హోమ్‌తో ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నారు.

ఓ పదమూడేళ్ల అమ్మాయి. తమ ఊరికి వచ్చిన డాక్టర్ల బృందాన్ని ఆశ్చర్యంగా చూసింది. ఆ మెడికల్‌ టీమ్‌ ఆ ఊరి వాడల్లో పర్యటిస్తోంది. ఒక్కొక్కరు వచ్చి తమ అనారోగ్యం గురించి చెబుతున్నారు. డాక్టర్లు మందులు ఇచ్చి ఎలా వాడాలో చెబుతున్నారు. అప్పుడే టీనేజ్‌లోకొచ్చిన ఆ అమ్మాయికి ఆ సన్నివేశం అద్భుతంగా అనిపిస్తోంది. మెడికల్‌ టీమ్‌ పని పూర్తి చేసుకుని తిరిగి పట్నం పోవడానికి సిద్ధమైంది. వాళ్ల వెంటే వెళ్తున్న అమ్మాయికి ఓ గుడిసెలో నుంచి మూలుగు వినిపించింది.

లోపలికి వెళ్లి చూస్తే మంచం మీద ముడుచుకుని పడుకుని ఉన్న ఒక అమ్మాయి కనిపించింది. ‘‘డాక్టర్లొచ్చారు చూపించుకుందువు గాని రా’’ అని ఆ అమ్మాయిని లేపింది. లేచే పరిస్థితిలో లేదా అమ్మాయి. ఆమెను లేపి తీసుకెళ్లడానికి ప్రయత్నించింది కానీ సాధ్యం కాలేదు. గుడిసె బయటకు వచ్చి చూస్తే మెడికల్‌ టీమ్‌ ముందుకు వెళ్లిపోయింది.  పరుగెత్తుకుంటూ వెళ్లి ‘‘ఓ అమ్మాయి మంచం మీద నుంచి లేవలేకపోతోంది.

వైద్యం చేద్దురు రండి’’ అని చెప్పి, మెడికల్‌ టీమ్‌ను వెనక్కు తీసుకు వచ్చి, జ్వరంతో బాధపడుతున్న అమ్మాయికి వైద్యం చేయించింది. ఇది జరిగి యాభై ఏళ్లవుతోంది. ఆ రోజే నిర్ణయించుకుంది ఆ అమ్మాయి తాను డాక్టర్‌ని కావాలని, వైద్యం అందని వాళ్లకు వైద్యం చేయాలని. అనుకున్నట్లే డాక్టర్‌ అయ్యి, దేశం నలుమూలలా పర్యటిస్తూ ప్రభుత్వ వైద్యం అందని, ప్రైవేట్‌ వైద్యం చేయించుకోలేని పేదలకు వైద్యం చేస్తోంది. ఆమే.. డాక్టర్‌ గీతా ఏరువ. గీత.. ఆధ్యాత్మిక సేవామార్గం పట్టడానికి ప్రేరేపించిన సందర్భం అది. 

ఏదీ వృథా కాకూడదు
డాక్టర్‌ గీత సొంతూరు కర్నూలు జిల్లా కౌలూరు. ఆమె పెరిగింది అనంతపురం జిల్లా తాడిపత్రిలో. తండ్రి బాలిరెడ్డి మిలటరీ ఆఫీసర్‌. ఆయన పెంపకం తనకు ‘ఇవ్వడాన్ని’ నేర్పిందని అంటారు గీత. ‘‘నేనీ గౌను వేసుకోను అంటే మా నాన్న వెంటనే ‘మరి దీనిని ఏం చేద్దాం’ అని అడిగేవారు. ఈ గౌనులో పత్తి పండించిన రైతు శ్రమ ఉంది, రంగులద్దిన కార్మికుని శ్రమ ఉంది. కుట్టిన టైలర్‌ పని ఉంది. ఇంతమంది పని ఉంది ఈ గౌను వెనుక.

అలాగే నేను పడిన శ్రమతో సంపాదించిన డబ్బుతో కొన్నాను. అంతకంటే ఎక్కువగా... ప్రకృతి నుంచి మనం తీసుకున్న వనరు. దీనిని ఉపయోగించకపోవడం తప్పు. నువ్వు వేసుకోకపోతే మరొకరికి ఇవ్వు. వనరులను వృథా చేయకూడదు’ అని చెప్పారు. మిలటరీలో పనిచేయడం వల్ల ఆయనలో వెల్లివిరిసిన సేవాభావం అది. మాకూ అవే నేర్పించారు. ఇప్పటికీ మాకెంతవరకు అవసరమో అంతవరకు ఉంచుకుని మిగిలినది లేని వాళ్లకు ఇవ్వడం అలవాటైంది. టామ్‌ (భర్త థామస్‌ రెడ్డి)  క్రైస్తవ మిషనరీ నేర్పించిన కరుణ, సేవా ప్రభావంతో పెరిగిన వారు కావడంతో మా ఇద్దరికీ సేవ చేయడమే జీవితం అయింది’’ అన్నారు డాక్టర్‌ గీత.

మా తర్వాత కూడా 
పిల్లల్లేని దంపతులు తమకు పిల్లల్లేని కారణంగా అనాథాశ్రమాలకు వెళ్లి ఒక బిడ్డను దత్తత తీసుకుని పెంచుకుంటారు. టామ్‌– గీత దంపతులు ఏకంగా అనాథాశ్రమాలనే దత్తత తీసుకున్నారు. స్వయంగా ‘ఫౌండేషన్‌ ఫర్‌ చిల్డ్రన్‌ ఇన్‌ నీడ్‌ (ఎఫ్‌సీఎన్‌)’ను స్థాపించి అనాథ, పేద పిల్లల కోసం స్కూళ్లు, కాలేజీలు పెట్టారు. తల్లిదండ్రులు ఉండి పై చదువులకు ఫీజు కట్టుకోలేని పిల్లలకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండువేల ఐదు వందల మంది విద్యార్థులు వీళ్ల సంస్థల ద్వారా జీవితాలను నిలబెట్టుకున్నారు. ఇంత విస్తృతమైన సర్వీస్‌ చేయాలంటే డబ్బవసరం పెద్ద మొత్తంలోనే ఉంటుంది.

అందుకు ఈ దంపతులు ఇక్కడి పిల్లలను అమెరికా నుంచి దాతలతో అనుసంధానం చేశారు. ‘‘మాకు విరాళాలిస్తున్న వాళ్లలో ఎక్కువ మంది మేము అమెరికాలో ఉద్యోగం చేసినప్పటి మా ఫ్రెండ్సే. ఫండ్‌ రైజింగ్‌ కోసం ఏటా ఆరు నెలలు అమెరికాలో ఉంటున్నాం. మాకు వయసై పోయిన తర్వాత ఈ సర్వీస్‌ ఆగిపోకుండా కొనసాగేటట్లు సిస్టమ్‌ను డెవలప్‌ చేయడమే ఇప్పుడు మా ముందున్న ఆలోచన. అందుకే అవకతవకలకు అవకాశం లేని విధంగా ఒక సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం’’ అన్నారు డాక్టర్‌ గీత.   
– వాకా మంజులారెడ్డి

రెండు వందల మందికి
మా అమ్మానాన్నలు ఆంతోనమ్మ, శౌరిరెడ్డిల జ్ఞాపకార్థం పోరుమామిళ్ల, ధర్మవరం, గుంటూరు, జడ్చర్ల, నంద్యాల, మైదుకూరు, స్టేషన్‌ఘన్‌పూర్, కడప, హైదరాబాద్‌లలో విద్యాసంస్థలు, హోమ్‌లను స్థాపించాం. ఇప్పుడు షాద్‌ నగర్‌లో నిర్మించిన హోమ్‌లో ఒక్కో గదికి ఒక్కో దాత పేరు ఉంటుంది. ఇందులో ఆశ్రయం పొందుతున్న వాళ్లు తాము ఉంటున్న గదికి ఆర్థిక సహాయం చేసిన వాళ్ల పేరును రోజూ గుర్తు చేసుకుంటారు. అలా పెరిగిన పిల్లలు పెద్దయిన తర్వాత ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు వస్తారని మా విశ్వాసం. సేవాశ్రమంలో రెండు వందల మందికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. ఆశ్రయం అవసరమైన వాళ్లకు ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంటాయి.
– థామస్‌రెడ్డి, ఎఫ్‌సీఎన్‌ నిర్వాహకులు

పిల్లలకు అందరూ ఉండాలి
హైదరాబాద్‌కు సమీపంలోని షాద్‌నగర్‌లో స్థాపించిన మా ‘సేవాశ్రమం’ జనవరి 23న ప్రారంభం అవుతోంది. మా ముఖ్య ఉద్దేశం ఉమ్మడి కుటుంబంలో ఉండే బంధాలను పిల్లలకు అనుభవంలోకి తేవడమే. పిల్లలు తమకు ఎవరూ లేరనే నిస్పృహలో పెరగకూడదు. వృద్ధులు కూడా మరణం కోసం ఎదురు చూస్తూ రోజులు గడపకూడదు. జీవించి ఉన్నన్ని రోజులూ సంతోషంగా గడపాలి. అలాగే దివ్యాంగులు కూడా ఏదో బతుకీడుస్తున్నాం అనే నిర్వేదంలో మునిగిపోకుండా తాము చేయగలిగిన సర్వీస్‌ ఇతరులకు చేయగలుగుతున్నామనే మానసికానందంతో జీవించాలి. అందుకోసం పిల్లలకు, వృద్ధులకు, దివ్యాంగులకు హోమ్‌లను ఒకే ప్రాంగణంలో నిర్మించాం. 
– డాక్టర్‌ గీత, ఎఫ్‌సీఎన్‌ నిర్వాహకురాలు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top