
ప్రతి మనిషీ తన జీవితానికి అర్థం తెలుసుకోవాలని తపన పడుతున్నాడు. అది తెలియనినాడు విసిగిపోతున్నాడు. మనం చేసే ప్రతి పనికీ అర్థం ఉన్నప్పుడు... మన జీవితానికి మాత్రం అర్థం లేకుండా ఎలా పోతుంది?! ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్ ఏమంటాడంటే.... ‘జీవితం దేనికోసం? మరణించడం కోసమా? కాదు. మరణం నన్ను చేరేవరకూ ఎదురు చూడటానికి నాకు భయం, అది నన్ను మరింత భయపెడుతోంది. అందుకే నేను జీవించాలి.
జీవితానికి అర్థం లేదని అనిపించినప్పుడు జీవించడం కంటే మరణించడమే మంచిదా? కానీ మనకు తెలుసు... ప్రతి ఒక్కరూ జీవించాలనే కోరుకుంటారు. జీవించడం కంటే మరణించడమే మేలని భావించినప్పుడు ప్రాణాలు తీసే హంతకులను శిక్షించకూడదు, సత్కరించాలి. ఆస్పత్రులను మూసేయాలి. మందులను నిషేధించాలి. చికిత్స లేని వ్యాధులను మరింత ప్రబలేలా చేయాలి. యుద్ధాలు పెరగాలి. దేశాలు కొట్టుకు చావాలి.
అంతే కదా? దీనికి ఒప్పుకుంటారా? లేదు. దీనికి ఎవ్వరూ ఒప్పుకోరు. మరణం కంటే జీవితం మీదే ఇష్టం ఎక్కువ మనకు. కాకపోతే ప్రశాంతంగా అర్థవంతమైన జీవితాన్ని జీవించాలన్నదే ఆశ. మన జీవితానికి అర్థం తెలుసుకోవడం మన చేతుల్లోనే ఉంది. అది మనం దేవుడి దరికి చేరినప్పుడే సాధ్యపడుతుంది. దేవుడి దరి చేరడమంటే.. పరమాత్ముడికి పరమ ఆప్తుడిగా జీవించడం. అంటే జీవితాన్ని అర్థవంతంగా జీవించడం.