breaking news
Leo talstayi
-
యుద్ధము – శాంతి
మానవ చరిత్రలోనే ఉత్తమ కళాఖండాలుగా వర్ణింపబడిన లియో టాల్‌స్టాయ్(1828–1910) రచనలు తిరిగి తిరిగి ముద్రణ పొందుతూనే ఉన్నాయి. ఎప్పటికీ నిలిచిపోయే పది గొప్ప పుస్తకాలలో ‘యుద్ధము–శాంతి’ ఒకటి అనిపించుకుంది. రెంటాల గోపాలకృష్ణ, బెల్లంకొండ రామదాసు తెలుగులోకి అనువదించిన ఈ నవల, టాల్‌స్టాయ్ 190వ జయంతి (సెప్టెంబర్ 9) సందర్భంగా ‘సాహితి ప్రచురణలు’(ఫోన్: 0866–2436642) ద్వారా మరోమారు అందుబాటులోకి వచ్చింది. పేజీలు: 960; వెల: 600. అనువాదకులు పుస్తకానికి రాసిన అవతారిక సంక్షిప్తంగా. యుద్ధము–శాంతి రాసేనాటికి టాల్‌స్టాయ్‌కి 36 సంవత్సరాల వయస్సు. అనగా ఒక రచయిత సృజనాత్మక శక్తి పరిపక్వత పొందివుండే వయస్సు. ఆ తరువాత ఆరు సంవత్సరాలకు కాని అతనీ నవల పూర్తి చేయలేకపోయాడు. ఈ నవలకు అతను ఎన్నుకున్న కాలం నెపోలియానిక్ యుద్ధాలు జరిగిన కాలం. నెపోలియన్ రష్యాపై దండయాత్ర చేయడం, మాస్కో నగరాన్ని మంటల్లో ముంచెత్తి తుదకు సేనంతా మంచులో పూడుకుని నాశనమైపోగా, పరాజితుడై పలాయనం చేయడం ఈ నవలలో ఉత్కర్ష. ఈ నవలను ప్రారంభించే సమయంలో టాల్‌స్టాయ్ ఉద్దేశం ఆనాటి అభిజాత కుటుంబాల జీవితాన్ని చిత్రించడమే. దానికి చారిత్రక సంఘటనలను ఒక రంగస్థలంగా మాత్రమే వినియోగించుకున్నాడు. ఈ నవలలో ఇంచుమించు అయిదువందలకు పైగా పాత్రలున్నాయి. ప్రతి పాత్రకూ రచయిత ఒక స్పష్టమైన వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు. ఇది సాధించడం సామాన్యమైన పని కాదు. అనేక నవలల్లోవలె ఇతివృత్తం ఇరువురు, ముగ్గురు వ్యక్తుల మీదనో, ఏ ఒక కుటుంబంపైననో ఆధారపడి ఉండదు. అభిజాత వర్గానికి సంబంధించిన నాలుగు కుటుంబాలపై ఆధారపడివుంది– వారు బోల్కోనిస్కీలు, రోస్టోవ్‌లు, కారగైన్లు, బెష్కోవులు. ఇలాంటి ఇతివృత్తాన్ని చిత్రించడంలో ఉన్న నేర్పు, ఒక కుటుంబం నుంచి మరో కుటుంబం కథవైపు పాఠకుని సులువుగా లాక్కొని వెళ్లగలగడమే. అనేక నవలా రచయితల్లాగానే టాల్‌స్టాయ్ తన పాత్రలను తన పరిచితుల నుంచి ఎన్నుకున్నాడు. కానీ ఆయన భావనలో ఆ పాత్రలు ఆయన కనిపెట్టినట్లు ఒక కొత్త స్వరూపాన్ని పొందాయి. కౌంట్ రోస్టోవ్ ఆయన తాతగారనీ, నికోలస్ రోస్టోవ్ ఆయన తండ్రిగారనీ, మేరియా రాకుమారి ఆయన తల్లిని పోలినదనీ అనుకుంటారు. ఈ నవలకు నాయకులుగా కనిపించే ఆండ్రూ రాకుమారుడు, పీటర్– ఈ ఇరువురినీ చిత్రించే సందర్భంలో టాల్‌స్టాయ్ తనను తానే మనస్సులో పెట్టుకున్నాడని అనుకుంటారు. ఇలా పరస్పర వైరుధ్యం కల రెండు పాత్రలను చిత్రించడం ద్వారా టాల్‌స్టాయ్ తనను తానే అర్థం చేసుకోగలిగాడు. ఈ ఇరువురికీ ఒక్క విషయంలో మాత్రమే సామ్యం ఉన్నది. ఇరువురూ మనశ్శాంతినీ, జీవన్మరణ రహస్యాన్నీ అన్వేషిస్తారు. కానీ అది ఇరువురికీ దొరకదు. వీరిరువురూ నటాషాను ప్రేమిస్తారు. ఈ నవల అంతటిలోకీ నటాషా ఎంతో ముచ్చటైన పాత్ర. ఈ నవల కడపట టాల్‌స్టాయ్‌కి తన పాత్రలలో కొంతవరకు శ్రద్ధ సన్నగిల్లినట్లు మనకు కనిపిస్తుంది. చరిత్రను గురించి ఒక తత్వదృష్టిని ఆయన కనిపెట్టాడు. చరిత్రను నడిపింది మహాపురుషులు కాదనీ, సాధారణ ప్రజలను జయాపజయాల వైపునకు నడిపిన ఒక అవ్యక్త శక్తి అనీ ఆయన ఊహించాడు. సిద్ధాంతాలన్నిట్లో వలెనే ఇందులో కూడా కొంత సత్యమూ, కొంత అసత్యమూ లేకపోలేదు. పాశ్చాత్య సాహిత్యంలో మహాభారతాన్ని పోలిన ఈ నవలను చదివినప్పుడు ఒక వైపున సమరము– మరోవైపున శాంతి. ఈ రెంటికీ మధ్య అనేక ఉత్తమ కుటుంబాలు, ఆ కుటుంబాలకు చెందిన మానవ మర్యాదలు ఏ విధంగా ఊగిసలాడినవో మనకు గోచరిస్తుంది. యుద్ధకారణంగా పరస్పర మానవ సంబంధాలు ఏ విధంగా తెగిపోవడము, మరల చిత్రమైన పరిణామము చెంది సమ్మేళనము పొందడము మనకు ద్యోతకమవుతుంది. ఈ సందర్భంలో జీవితం నుంచి దూరమైపోవడం వల్ల కాక, జీవితాన్ని అవగతం చేసుకోవడం వల్లనే మనం సత్యం దర్శించినవారమవుతామని ఆండ్రూ రాకుమారుని ద్వారా టాల్‌స్టాయ్ చెప్పించిన మాటలు నవలకు సందేశంగానూ, పరమార్థంగానూ కనిపిస్తాయి. -
అప్పుడే జీవితాలకు అర్థం... పరమార్థం
ప్రతి మనిషీ తన జీవితానికి అర్థం తెలుసుకోవాలని తపన పడుతున్నాడు. అది తెలియనినాడు విసిగిపోతున్నాడు. మనం చేసే ప్రతి పనికీ అర్థం ఉన్నప్పుడు... మన జీవితానికి మాత్రం అర్థం లేకుండా ఎలా పోతుంది?! ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్ ఏమంటాడంటే.... ‘జీవితం దేనికోసం? మరణించడం కోసమా? కాదు. మరణం నన్ను చేరేవరకూ ఎదురు చూడటానికి నాకు భయం, అది నన్ను మరింత భయపెడుతోంది. అందుకే నేను జీవించాలి. జీవితానికి అర్థం లేదని అనిపించినప్పుడు జీవించడం కంటే మరణించడమే మంచిదా? కానీ మనకు తెలుసు... ప్రతి ఒక్కరూ జీవించాలనే కోరుకుంటారు. జీవించడం కంటే మరణించడమే మేలని భావించినప్పుడు ప్రాణాలు తీసే హంతకులను శిక్షించకూడదు, సత్కరించాలి. ఆస్పత్రులను మూసేయాలి. మందులను నిషేధించాలి. చికిత్స లేని వ్యాధులను మరింత ప్రబలేలా చేయాలి. యుద్ధాలు పెరగాలి. దేశాలు కొట్టుకు చావాలి. అంతే కదా? దీనికి ఒప్పుకుంటారా? లేదు. దీనికి ఎవ్వరూ ఒప్పుకోరు. మరణం కంటే జీవితం మీదే ఇష్టం ఎక్కువ మనకు. కాకపోతే ప్రశాంతంగా అర్థవంతమైన జీవితాన్ని జీవించాలన్నదే ఆశ. మన జీవితానికి అర్థం తెలుసుకోవడం మన చేతుల్లోనే ఉంది. అది మనం దేవుడి దరికి చేరినప్పుడే సాధ్యపడుతుంది. దేవుడి దరి చేరడమంటే.. పరమాత్ముడికి పరమ ఆప్తుడిగా జీవించడం. అంటే జీవితాన్ని అర్థవంతంగా జీవించడం. -
నిజంగా అవసరమా?
లోచూపు మనిషి... మనసుకి బందీ. అతను తనపై తానే బలవంతంగా కొన్నింటిని రుద్దుకుంటాడు. అది ఆత్మహత్యా సదృశం. వద్దనుకుంటూనే తనను ఇబ్బందిపెట్టే వాటినే చేస్తూ ఉంటాడు. నలిగిపోతుంటాడు. అతను గొప్ప రచయిత. పేరు - లియో టాల్‌స్టాయి (1828 -1910). నవలా రచయితగా సుప్రసిద్ధుడు. రష్యాలోని ధనికుల్లో ఒకడు. ఈ రష్యన్ రచయిత ఆరోజు షాపింగ్ కి వెళ్ళాడు. మార్గమధ్యంలో ఆయన అంతరంగంలోకి తొంగిచూశాడు. అప్పుడు ఆయనకు ఓ విషయం తెలిసింది. తనకు ఏ మాత్రం అవసరం లేని ఓ వస్తువు కొనడానికి పోతున్నట్టు అవగతమైంది. మరి అతనెందుకు కొనాలనుకుంటున్నాడు. పొరుగింట్లో ఉంది కాబట్టి, తానూ కొనాలని అనుకున్నాడు. అంతే తప్ప, అది తనకెంత మాత్రమూ అవసరం లేదు. ఈ విషయం అర్థమయ్యాక, ఆయన దాన్ని కొనుక్కోవాలన్న ఆలోచనను మానుకుని ఇంటికి తిరిగొచ్చేశాడు. ఇంటికి వచ్చాక పెద్దగా నవ్వుకున్నాడు. ఆయన భార్య ఆ నవ్వు చూసింది. ‘ఎందుకు నవ్వుతున్నారు?’ అని అడిగింది. అప్పుడు ఆయన ఇలా అన్నాడు - ‘ఏమీ లేదే! ఒకటి కొనడం కోసం బయలుదేరాను కదా! ఇంతలో నాలోకి నేను చూసుకొనేసరికి నాకో విషయం తెలిసింది. నాకు అనవసరమైనది కొనడం దేనికీ అనిపించింది. అయితే నేను కొనడానికి వెళ్ళింది- ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు అలా వెళ్లి కొన్నాను. చివరకు ఈరోజు జ్ఞానోదయమైంది. నేనేమిటీ... ఇలా మిగిలినవారిని అనుకరిస్తున్నాను?’ అని అనుకునేసరికి ఒక ముందు ఇలా చేయకూడదని నవ్వొచ్చింది.’ ఈ విషయం ఆయనలో పెనుమార్పే తీసుకొచ్చింది. అది చిన్న విషయమే కావచ్చు. కానీ ఆ క్షణం నుంచీ ఆయన ప్రతి విషయాన్నీ, చేసే ప్రతి పనినీ నిశితంగా చూశాడు. ప్రతిదీ తానెందుకు చేస్తున్నానో ఆలోచించాడు. అందుకే ఆయన ఎప్పుడూ అనేది ఒకటే - మనం చేసే పనిలో దాదాపు తొంభై శాతం అవసరం లేనివే! - యామిజాల జగదీశ్