ఇప్పటికీ అవే అసైన్‌మెంట్‌లు! | Special Story About Barkha Dutt | Sakshi
Sakshi News home page

ఇప్పటికీ అవే అసైన్‌మెంట్‌లు!

Feb 7 2020 12:26 AM | Updated on Feb 7 2020 5:04 AM

Special Story About Barkha Dutt - Sakshi

‘మహానటి’ చిత్రంలో సమంత యువ జర్నలిస్టు. వాళ్ల ఎడిటర్‌ ఆమెకు ఎప్పుడూ అంతగా శ్రమ అవసరం లేని అసైన్‌మెంట్‌లు ఇస్తుంటారు. సమంతకు మాత్రం ఏదైనా డైనమిక్‌గా చేయాలని ఉంటుంది. ‘‘ఆ వెధవ శేఖర్‌కి చీఫ్‌ మినిస్టర్‌..  నాకేమో.. కోమా పేషెంట్‌’’ అని బాధపడుతుంది ఓ సీన్‌లో. మంగళవారం  (ఫిబ్రవరి 4) హైదరాబాద్‌లో ఫిక్కీ లేడీస్‌ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో  ‘చేంజింగ్‌ నేచర్‌ ఆఫ్‌ ఇండియన్‌ మీడియా’ అనే అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్‌  బర్ఖాదత్‌ ప్రసంగిస్తూ.. ‘‘మహిళా రిపోర్టర్‌లకు ఇప్పటికీ అవే అసైన్‌మెంట్‌లు’’ అంటూ తన అనుభవాలు పంచుకున్నప్పుడు ఆమెలోనూ ఒక సమంత కనిపించారు!

జర్నలిజంలో మహిళలకు కేటాయించే అసైన్‌మెంట్‌ల విషయంలో తన తల్లి ప్రభాదత్‌ తరానికి, తన తరానికి, ఇప్పటి కొత్త తరానికి పెద్ద తేడా లేదంటారు బర్ఖాదత్‌. ‘‘మా అమ్మ అరవైలలోనే జర్నలిజంలోకి వచ్చింది. అప్పటికి ఈ రంగంలో ఆడవాళ్లు అసలు లేరనే చెప్పాలి. సమాజంలో ఉన్న అవినీతిని ఎండగట్టాలని, మహిళల సమస్యల మీద కథనాలు రాయాలని, రాజకీయ విశ్లేషణలు చేయాలని ఎంతో ఉత్సాహంగా ఈ రంగంలోకి వచ్చిన మా అమ్మకు ఫ్లవర్‌ షో అసైన్‌మెంట్‌ ఇచ్చారట! ‘ఇది కాదు, నేను చేయాలనుకుంటున్నది’ అన్నప్పుడు మా అమ్మకు వచ్చిన సమాధానం ‘అమ్మాయివి కదా’ అని.

ఇండో పాక్‌ యుద్ధం జరుగుతున్నప్పుడు తనకు వార్‌ ఫీల్డ్‌ నుంచి రిపోర్ట్‌ చేసే అవకాశం ఇమ్మని అమ్మ అడిగిందట. అప్పుడూ అదే సమాధానం. ఇరవై ఏళ్ల ఆడపిల్లను యుద్ధక్షేత్రానికి పంపించడానికి ఎడిటర్‌ సిద్ధంగా లేరు. కానీ సరిహద్దులో యుద్ధం జరుగుతుంటే ఢిల్లీలో ఉండడం ఆమె వల్ల కాలేదు. ఐదు రోజులు సెలవు పెట్టి మరీ పంజాబ్‌ సరిహద్దుకు వెళ్లింది. ఢిల్లీకి వచ్చి యుద్ధ సమయంలో తాను చూసిన విషయాలను రాసింది. నాకు పదమూడేళ్లున్నప్పుడే అమ్మ బ్రెయిన్‌ హెమరేజ్‌తో మాకు దూరమైంది. ఆమె జీవించింది నలభై ఏళ్లే. కానీ నాలో వందేళ్ల స్ఫూర్తిని నింపింది. అదే స్ఫూర్తితో జర్నలిజంలో కొనసాగాను.

నాకూ అదే ఎదురైంది
కార్గిల్‌ యుద్ధ సమయంలో అసైన్‌మెంట్‌ వేయమని అడిగినప్పుడు నాకు కూడా మా అమ్మకు ఎదురైనట్లే ‘యుద్ధం క్షేత్రంలోకి అమ్మాయిలెందుకు? అనే ప్రశ్న ఎదురైంది. తరం మారినా ఏమీ మారలేదని తెలిసింది. ఆ రిపోర్టింగ్‌కి అవకాశం వచ్చిందనడం కంటే తెచ్చుకున్నానని చెప్పడమే కరెక్ట్‌. తీరా అక్కడికి వెళ్లిన తరవాత సైనికాధికారులు కూడా ‘ఇది అమ్మాయిలు పని చేసే ప్రదేశం కాదు’ అన్నారు. నాకు భయం లేదన్నాను. వాళ్లు చెప్పిన కారణం ఏమిటంటే... అక్కడ సమయానికి ఆహారం ఉండదు, బస వసతి ఉండదు, కనీసం బాత్‌రూమ్‌లు కూడా ఉండవు. అందుకే వద్దంటున్నాం అని. అన్నింటికీ సిద్ధపడి, బాత్‌రూమ్‌ అవసరాలకు చెట్ల మాటును, రాళ్ల గుట్టలను ఆశ్రయిస్తూ పని చేశాను. కార్గిల్‌ యుద్ధంలో హీరో.. కెప్టెన్‌ విక్రమ్‌ బత్రాను ఇంటర్వూ్య చేయగలిగాను. 1999లో ఇప్పటిలాగా స్మార్ట్‌ఫోన్‌లు లేవు. ఇంటర్నెట్‌ సౌకర్యం విస్తృతంగా లేదు. రిపోర్ట్‌ చేసిన కథనాలను, ఫొటోలను ఢిల్లీకి చేర్చాలంటే దగ్గరలోని పట్టణాలకు వెళ్లాలి.

మిలటరీ వాళ్లను బతిమలాడి వాళ్లతోపాటు వాళ్ల వాహనంలో ప్రయాణించాను. నేను చెప్పేదేమిటంటే.. ఎవరైనా తాము ఒకటి చేయాలనుకుంటే చేసి తీరాలి. ఇప్పటి రిపోర్టర్‌కు తాను చూసిన, విశ్వసించిన విషయాన్ని యథాతథంగా రిపోర్ట్‌ చేసే అవకాశం తగ్గిపోయింది. అయితే పని చేయాలనుకుంటే సంకెళ్లు మాత్రం ఎప్పుడూ ఉండవు. గ్రామాలకు వెళ్లండి. అక్కడి సమస్యలను కెమెరాలో చిత్రీకరించండి. వాటిని యథాతథంగా రిపోర్ట్‌ చేయండి. వార్తలు మన దగ్గరకు రావు. వార్తల దగ్గరకు మనమే వెళ్లాలి. మీడియాలో వచ్చిన మార్పుల్లో టెక్నాలజీ విప్లవం కూడా ఒకటి. ఇప్పుడు సాంకేతికత విస్తృతమైంది. చేతిలో స్మార్ట్‌ ఫోన్, మొబైల్‌లో డాటా ఉంటే చాలు. చూసింది చూసినట్లు చెప్పడం వస్తే చాలు.. జర్నలిస్టు అయిపోవచ్చు. సంఘటనను మీదైన కోణంలో విశ్లేషిస్తూ ప్రజెంట్‌ చేయవచ్చు’’ అన్నారు బర్ఖాదత్‌.

పెళ్లే కాలేదు.. ముగ్గురు భర్తలా!
వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో సగానికి సగం తప్పుడు కథనాలు చెలామణిలోకి రావడం మీద బదులిస్తూ వికీపీడియా కూడా ఇందుకు పెద్దగా మినహాయింపు కాదన్నారు బర్ఖాదత్‌. పెళ్లి చేసుకోని తనకు ముగ్గురు భర్తలున్నట్లు వికీపీడియా రాసిన విషయాన్ని గుర్తు చేశారామె. టీవీలు రేటింగ్‌ పరుగులో కొట్టుకుపోవడాన్ని కూడా ఆక్షేపించారు. ఏదైనా ఒక మీడియా సంస్థ తాను ప్రచురించే లేదా ప్రసారం చేసే కథనాల విషయంలో... నిజం మీద కట్టుబడితేనే ఆ సంస్థకు విశ్వసనీయత ఉంటుంది అన్నారు. ఒక ప్రశ్నకు సమాధానంగా   ‘‘అవాస్తవాలతో కథనాలను వండి వారుస్తుంటే వచ్చే చెడ్డపేరు ఆ మీడియా సంస్థకు మాత్రమే కాదు. జర్నలిజం వృత్తి మీదనే గౌరవం తగ్గిపోతుంది’’ అన్నారు బర్ఖాదత్‌. – వాకా మంజులారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement