చిట్‌ఫండ్ వ్యాపారం కూడా చేశారట

చిట్‌ఫండ్ వ్యాపారం కూడా చేశారట!


సినిమా అంటే ప్యాషన్...  ఫ్యాషన్ కాదు! అని ఉతికి ఆరేసిన డైలాగులు వినీవినీ చెవులు కాయలు కాశాయి. సినిమా అంటే లక్... గట్స్ కాదు! అన్న స్పీచ్‌లు అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులా వినీవినీ చెవుల తుప్పు వదిలింది. రాశి బాగుంటేనే రాసులు రాలతాయని ఇప్పటిదాకా ఉన్న నమ్మకం! సినిమాకు అసలు ఏం ఉండాలి? ‘రాశిలహరి’ ఉండాలి అని ఇండస్ట్రీ అంతా కోడై కూస్తోంది. రాజు, శిరీష్, లక్ష్మణ్, హర్షిత్‌ల కొత్త తరంగమే ఈ రాశిలహరి! ధైర్యం, సాహసం, తెగువే కాదు... నమ్మకం, పాజిటివ్ థింకింగ్, స్థితప్రజ్ఞత ఈ టీమ్ బలం! సాక్షితో మనసు విప్పి మాట్లాడారు... నిన్నటి జర్నీ గురించి, నేటి ఎచీవ్‌మెంట్స్ గురించి, రేపటి గోల్స్ గురించి! ఎంజాయ్!!

 

పన్నెండేళ్ళుగా ఫిల్మ్స్ తీస్తున్న మీ దోస్తీ మొదలైందెలా?

‘దిల్’ రాజు: ముగ్గురన్నదమ్ముల్లో మూడోవాణ్ణి. మా పెద్దన్నయ్య నరసింహారెడ్డి ఫ్రెండ్ - లక్ష్మణ్. ఇక, శిరీష్ మా సొంత పెదనాన్న కొడుకు. మేము ముగ్గురం బాల్య స్నేహితులం. ఊళ్ళో 16ఎం.ఎం సినిమాలేసేవాళ్ళం. అప్పటికి, సినిమాల్లోకి వద్దామనే ఆలోచన కూడా ఉండేది కాదు.



ఈ రంగంలోకి వచ్చిన ఆ తొలి రోజులు గుర్తున్నాయా?

 రాజు: సికింద్రాబాద్ ఆర్.పి. రోడ్‌లో మాకు ఆటోమొబైల్ పార్ట్స్ షాపుండేది. ఆ వీధంతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులే. వాళ్ళు ఫోన్ కోసం మా షాపుకొస్త్తుండేవాళ్ళు. ఆ సినీ వాతావరణం మమ్మల్ని మలిచింది. ఆ టైమ్‌లోనే మా బంధువు మహేందర్‌రెడ్డి అనే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. 1995లో ఆయన మరో కొత్త డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెడుతుంటే, ఏడుగురం భాగస్వాములుగా చేరాం. ‘పుట్టినిల్లా మెట్టినిల్లా’తో మా సినీ జర్నీ మొదలైంది. తరువాత విడిగా మరో డిస్ట్రిబ్యూషన్ పెట్టాం. ‘దిల్’తో నిర్మాతలయ్యాం.   



అంతకు ముందు చిట్‌ఫండ్ వ్యాపారం కూడా చేశారట!

రాజు: అవును. అది 1992 - 1995 మధ్య! ‘శ్రీవాస చిట్‌ఫండ్ గ్రూప్’ నడిపాం. డిస్ట్రిబ్యూషన్ మొదలెట్టినప్పుడు 1995 - 96 మధ్య ఎన్ని ఫెయిల్యూర్సొచ్చాయో! అయితే, కష్టసుఖాల్లో వీళ్ళిద్దరూ (శిరీష్, లక్ష్మణ్‌లను చూపిస్తూ) నా వెంటే ఉన్నారు. మాటకు నిలబడుతూ చాలా కష్టపడ్డాం.



లక్ష్మణ్: లాసొచ్చినా చెప్పిన డబ్బులిచ్చేసేవాళ్ళం.

కెరీర్ తొలి రోజుల్లో సినిమా ఫ్లాపైనా, నిర్మాత ‘కాస్ట్యూమ్స్’ కృష్ణకు ఒప్పుకున్న డబ్బులు వెతికి మరీ ఇచ్చారట!

రాజు: (నవ్వేస్తూ...) అవును. ఒక కన్నడ సూపర్‌హిట్‌ను ‘అరుంధతి’ పేరు మీద ‘కాస్ట్యూమ్స్’ కృష్ణ గారు రీమేక్ చేసినప్పుడు అది కొన్నాం. 36 లక్షలిస్తామన్నాం. కానీ, రూ. 34 లక్షలే కట్టగలిగాం. సినిమా ఫ్లాపైన నాలుగో రోజున మిగిలిన 2 లక్షలు ఆయనను వెతుక్కుంటూ వెళ్ళి మరీ ఇస్తే, మా కమిట్‌మెంట్‌కు ఆశ్చర్యపోయారు. తర్వాత తీసిన ‘పెళ్ళి పందిరి’కి అందరూ రెట్టింపు ఆఫర్ చేసినా, మాకే ఇచ్చారు. నిజాయతీగా ఉంటే మంచే జరుగుతుంది.



మొదట్లో సుధాకరరెడ్డి, కరుణాకరరెడ్డి, గిరి - ఇలా చాలామంది మీ పార్ట్‌నర్స్. వాళ్ళెవరూ ఇప్పుడు మీతో లేరేం?

 లక్ష్మణ్, శిరీష్: ‘ఎవరు వచ్చినా, వెళ్ళిపోయినా మనం విడిపోవడం జరగదు. కలిసే ఉంటాం’ అని రాజు ముందే హామీ ఇచ్చాడు. అప్పుడే పార్‌‌టనర్‌‌సని చేర్చుకున్నాం. చాలామంది వెళ్ళిపోయినా, మేము మటుకు కలిసే ఉన్నాం.

     

మీరంతా ఒకేచోట నుంచి రావడంతో అది సాధ్యమైందా?


 రాజు: అదేమీ లేదు. ఏడుగురం కలసి ట్రావెల్ చేశాం. ఇందులో లక్ష్మణ్‌గారిది కరీమ్‌నగర్, భిక్షం గారిది నల్గొండ, మాది నిజామాబాద్. ఇలా ఒక్కొక్కరిది ఒక్కోచోటు.

 లక్ష్మణ్: కాకపోతే, మేము ముగ్గురం పాజిటివ్. చేసిన తప్పుల్ని విశ్లేషించుకొంటాం. ఒప్పులే మాట్లాడుకుంటాం.  

 శిరీష్: సొంత పని ఉన్న రోజు మినహా కలిసే ఉంటాం.

 రాజు: కుటుంబ సభ్యులూ కలసి మెలిసి ఉంటారు. ఏటా మా మూడు ఫ్యామిలీలూ కలిసి ట్రిప్‌కు వెళతాం.

 

కానీ బిజినెస్‌లో పొరపొచ్చాలు రావడం కామన్ కదా...

శిరీష్: చేస్తున్నది స్నేహమనే తప్ప, బిజినెస్ అనుకోం.  

లక్ష్మణ్: ఓపెన్‌గా మాట్లాడుకుంటాం. డబ్బు దగ్గరే ఒకరిపైఒకరికి అనుమానాలొస్తాయి. మా మధ్య అవి లేవు.



అంటే మీ మధ్య అసలెప్పుడూ భేదాభిప్రాయాలే లేవా?

 రాజు: ఎవరితోనైనా నేను నిదానంగా డీల్ చేస్తా. శిరీష్ కొద్దిగా ఫాస్ట్‌గా డీల్ చేస్తాడు. లక్ష్మణ్ కూడా ఫాస్టే. మా మధ్యా చిన్న గ్యాప్స్ వస్తాయి. ఏ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినా, మూడోవాళ్ళు సర్దుబాటు చేస్తారు.  

 

మీకు లేకున్నా చుట్టుపక్కలవాళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళు...!

రాజు: ప్రెస్‌లో నా పేరే వినపడుతుంటుంది. ‘మీ ముగ్గురిలో రాజుకే పేరొస్తోంద’ని ఎక్కిస్తారు. కామెంట్స్ చేస్తారు. మేమవి పట్టించుకోం. నవ్వేసుకుంటాం. ఇంట్లో ఆడవాళ్ళంటారా! మా ఆఫీసు, సినీ వ్యవహారాలను ఇళ్ళకు తీసుకెళ్ళం. వాళ్ళతో చెప్పం. పిల్లలు పెద్దవుతున్నారు కనక, అవగాహన కోసం ఇప్పుడిప్పుడే కొద్దిగా చెబుతున్నాం.

 

మీ మధ్య పని విభజన ఎలా?     


శిరీష్: క్రియేటివ్‌సైడ్ రాజు చూస్తాడు. అకౌంట్స్, బిజినెస్ నా పని. ఫైనాన్స్, మిగతాది లక్ష్మణ్ చూస్తాడు.

రాజు: ముందుగా కథ వింటా. బావుందనుకుంటే, డెవలప్ చేసే పనిలో పడతా. స్క్రిప్ట్ డెవలప్ చేసిన తరువాత హీరోకు వినిపించే ముందు,

శిరీష్, లక్ష్మణ్‌లిద్దరికీ వినిపిస్తా. అభిప్రాయాలు తెలుసుకుంటా. డిస్కస్ చేస్తా. హీరో ఓ.కే అన్నాక ప్రొడక్షన్‌లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఎడిటింగ్ రూమ్‌లోనే వీళ్ళిద్దరూ సినిమా చూస్తారు. కథ విన్నప్పుడనుకున్నవి, వచ్చిందీ, లేనిదీ నిర్మొహమాటంగా చెప్పేస్తారు. అకౌంట్స్ శిరీష్ చూస్తే, ఫస్ట్‌కాపీ వచ్చాక సెటిల్‌మెంట్సంతా కూడా శిరీష్, లక్ష్మణ్‌ల పనే.  

లక్ష్మణ్: మా సినిమా అని మొహమాటం లేదు. డబుల్ పాజిటివ్ చూస్తున్నప్పుడు ఫ్లాప్ అని చాలాసార్లే చెప్పాం.

శిరీష్: అప్పుడు దాన్నెలా బెటర్ చేయాలో చూస్తాం.

రాజు: స్క్రిప్ట్ దశలో అనుకున్నట్లు అవుట్‌పుట్ లేదని ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’కి 17 రోజులు రీషూట్ చేశాం. ‘కేరింత’ 30 డేస్ షూటయ్యాక మార్చి తీశాం.

శిరీష్: సూపర్‌హిట్ అని నమ్మకంతో ఉన్నాం. తీరా రిలీజ్ డే ఓపెనింగ్స్ లేవు. అంతే అప్పటికప్పుడు కూర్చొని, సినిమాను నిలబెట్టడానికి ప్రమోషన్ మీద దృష్టి పెట్టాం.

రాజు: మూడు వారాలదే పని.

కొన్నిటికి ఏం చేసినా లాభం లేదని తెలిసిపోతుందిగా!

రాజు: నిజమే. ‘రామయ్యా వస్తావయ్యా’ ఫ్లాపని మార్నింగ్ షోకే అర్థమైంది.  

 

అంచనా దాటి ఆడిన సినిమా?


 శిరీష్: ప్రభాస్ నటించిన ‘మున్నా’. అనుకున్నట్లు తెరకెక్కించడంలో విఫలమయ్యామని రిలీజ్‌కు ముందే అర్థమైంది. ప్రసాద్ ల్యాబ్స్ నాగినీడు సహా అంతా డిస్కస్ చేశాం. ఫెయిల్‌కి ప్రిపేరయ్యాం.

రాజు: కానీ, చివరకు 9 కేంద్రాల్లో వందరోజులాడింది.

     

ఎంతైనా, జనం పల్స్ తెలుసుకోవడం కష్టం కదా!


రాజు: మొన్న రిలీజ్‌కు ముందే మా ఫ్యామిలీస్‌కు ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వేశా. అంతా మా వాళ్ళే! కానీ, ఒక పక్క నిల్చొని, ఆర్డినరీ ఆడియన్స్‌గా వాళ్ళ రియాక్షన్సేంటి, ఏ సీన్‌కు అనుకున్న రెస్పాన్స్ రాలేదు లాంటివి గమనించా. ఈ రంగంలో ఉండాలంటే అంత స్టడీ తప్పదు.

     

కెరీర్‌లో నిర్మాతలుగా మీరు గర్వంగా ఫీలైన సినిమా?

రాజు: మేము ముగ్గురం గర్వంగా ఫీలైన సినిమా కచ్చితంగా ‘బొమ్మరిల్లు’. తొలి చిత్రం ‘దిల్’తో హిట్ వచ్చింది. కొత్త తరహా ‘ఆర్య’తో పేరు - విజయం రెండూ దక్కాయి. తరువాత కష్టపడి చేసిన ‘భద్ర’తో హ్యాట్రిక్ వచ్చింది. వాటి తర్వాత నెక్స్ట్‌లెవల్‌కి తీసుకెళ్ళిన సినిమా ‘బొమ్మరిల్లు’.

     

కథల్ని మీరు బాగా జడ్జ్ చేస్తారట. అదెలా అబ్బింది?


 రాజు: చిన్నప్పట్నుంచి సినిమాలు చూస్తూ ఉండడంతో తెలియకుండానే అది వచ్చింది. ఇక, వినయ్ (వి.వి. వినాయక్)తో కలసి ప్రయాణించినప్పుడు కథకు లైన్ అనుకోవడం, వన్‌లైన్ ఆర్డర్ రాయడం లాంటివి అలవాటయ్యాయి.

 

ఆఫీసులో ఒక్కో రూమ్‌లో ఒక్కో టీమ్ కథలు చేస్తారట!

 రాజు: (నవ్వేస్తూ) స్క్రిప్ట్ కెక్కువ టైమ్ తీసుకుంటాం. స్క్రిప్టు పక్కాగా ఉండేందుకు కసరత్తులు తప్పవుగా!  

     

కొత్త దర్శకులను ఎక్కువ పరిచయం చేస్తుంటారు. కొత్తవాళ్ళయితే చెప్పుచేతల్లో ఉంటారనా?


 రాజు: రామానాయుడు గారి తర్వాత ఈ జనరేషన్‌లో అధిక సంఖ్యలో 8 మంది దర్శకుల్ని ఇంట్రడ్యూస్ చేసిన ఘనత మాదే. కొత్తవాళ్ళలో ప్రూవ్ చేసుకోవాలనే తపన, కసి ఉంటాయి. స్క్రిప్ట్ నచ్చేదాకా తీర్చిదిద్దే తీరిక, ఓపిక ఉంటాయి. పెద్ద దర్శకులకి అంత తీరిక ఉండకపోవచ్చు.   



అంతచేసినా, రొటీన్ కమర్షియల్ ఫిల్మ్స్ వస్తున్నాయిగా!  

రాజు: తప్పదు. ఒక పూర్తిస్థాయి కొత్త కథ అయితే, అది తీయడానికి రెండేళ్ళయినా వెయిట్ చేయవచ్చు. కానీ, ఒక చిన్న పాయింట్ మాత్రం కొత్తగా అనిపిస్తే, అట్టిపెట్టుకొని లేట్ చేసే కన్నా, వేడివేడిగా సినిమా తీసి వడ్డించడం బెస్ట్.

 

నిర్మాతగా ఆర్థికంగా భారీ నష్టం తెచ్చిన పెద్ద తప్పు?


 రాజు: ‘తూనీగ తూనీగ’. మేము అది చేపట్టడం పెద్ద తప్పయింది. కెరీర్‌లో అత్యధిక నష్టం తెచ్చిన సినిమా అదే.

 

ఎన్నో హిట్లిచ్చినా, రెండేళ్ళ క్రితం ఒకట్రెండు పెద్ద ఫ్లాపులతో ఆర్థికంగా తలకిందులయ్యారని వార్తలొచ్చాయి?

 రాజు: అది నిజం కాదు. 2009 -’10 టైమ్‌లో ‘రామ రామ కృష్ణ కృష్ణ’, మా కజిన్ కోసం తీసిన ‘మరో చరిత్ర’, అలాగే ‘జోష్’ - మూడూ దెబ్బతిన్నాయి. నిర్మాణం కన్నా డిస్ట్రిబ్యూషన్‌లో ఎక్కువసార్లు దెబ్బతిన్నాం.  

లక్ష్మణ్: సొసైటీలో మాత్రం మా పని అయిపోయిందనీ, రోడ్డు మీద పడ్డామనీ కామెంట్స్ వచ్చాయి.

రాజు: కానీ, దేవుడి దయ వల్ల ‘ఆర్య’ దగ్గర నుంచి ఇవాళ్టి వరకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎప్పుడూ లేవు.

 

 రాజులో మీకు కనిపించే పెద్ద ప్లస్ పాయింట్ ఏమిటి?

 లక్ష్మణ్, శిరీష్: నెగిటివ్‌గా ఏదీ మాట్లాడడు. రాజుకున్నంత సహనం లేకపోతే, ఇవాళింత ఎదిగేవాళ్ళం కాదు.



రాజు గారూ! మీరెవరి నుంచి ఎక్కువ నేర్చుకున్నారు?

రాజు: సెట్స్‌లో రామానాయుడు గారి లాంటి మునుపటి తరం నిర్మాతల పనితీరు, కమిట్‌మెంట్ అడిగి తెలుసుకొనేవాణ్ణి. ‘భద్ర’ సెట్స్‌లో మురళీమోహన్ గారిని అడిగి, చాలా తెలుసుకున్నా. ‘ఆర్య‘ సక్సెస్ తర్వాత అల్లు అరవింద్ గారితో ఎక్కువ ట్రావెల్ చేస్తున్నా.  

 

రాజు గారూ... మీరు ఒకసారి నటించినట్లున్నారు?

 రాజు: నటించలేదు. కొన్నేళ్ళ క్రితం డిస్ట్రిబ్యూటర్స్‌గా ఒక సినిమా కొన్నాం. అప్పుడా దర్శక, నిర్మాతలు క్యారెక్టర్ ఉంది. వేయమన్నారు. ఫోటోలతో ఫ్లెక్సీ పెట్టారు. వాళ్ళు ట్రాప్ చేస్తున్నారని సాయంత్రానికల్లా అర్థమైంది. ఇచ్చిన 3 లక్షల ఆరు వేలు వదిలేసి, సినిమా వద్దని నమస్కారం పెట్టేశా. వచ్చిన అనుభవం రేటు అదన్న మాట! (నవ్వులు...)

 

{పొఫెషన్‌లో మీ విస్తరణ, నెక్స్ట్ జనరేషన్ ప్రవేశం?

రాజు: (లోపలికొస్త్తున్న హర్షిత్‌ను చూపుతూ...) ఇదిగో వీళ్ళంతా మా నెక్స్ట్ జనరేషనే. మా అమ్మాయి మా కింద ఉన్న థియేటర్స్ చూస్తుంది. మా అన్న కొడుకు హర్షిత్ ప్రొడక్షన్ చూస్తాడు. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’కు ప్రొడక్షన్ డిజైనర్‌గా చేసింది వాడే! శిరీష్ వాళ్ళబ్బాయి, లక్ష్మణ్ వాళ్ళబ్బాయిలూ ఈ రంగంలోకి రావాలనుకుంటున్నారు.

     

సెట్స్‌లో, బయట హర్షిత్‌కు ట్రైనింగిస్తున్నట్లున్నారు?

రాజు: బయోటెక్ ఇంజనీరింగ్ చదివాడు. అమెరికాలో ఏడాదిన్నర సినిమా కోర్స్ చదివి, ప్రొడక్షన్ నేర్చుకొచ్చాడు.

 

హర్షిత్! ఫిల్మ్‌స్టడీ వల్ల ఉపయోగం ఉందా?

 హర్షిత్: (బిడియపడుతూనే) కచ్చితంగా ఉంది. కానీ, హాలీవుడ్‌కీ, మనకీ తేడా ఉంది. అక్కడ స్క్రిప్ట్ ఫైనలయ్యాక, ఎగ్రిమెంటయ్యాక మార్చకూడదు.

రాజు: మన దగ్గర రూల్సంటే కుదరదు. డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రాక్టికల్‌గా నేర్చుకుంటున్నాడు.

 

వీళ్ళ జనరేషన్ ఫిల్మెపు్పుడు? ఫ్రెష్‌గా ఉంటుందేమో?

రాజు: ఇండివిడ్యుయల్‌గా చిన్న సినిమా తీయమన్నాం. హర్షిత్ ఆ పనిలో ఉన్నాడు. ఈ ఏజ్‌లో మేము ట్రెండీ ఫిల్మ్స్ చేయాలంటే భయపడతాం. అదే హర్షిత్ ఏజ్ గ్రూప్ వాళ్ళయితే, యూత్‌ఫుల్ లవ్‌స్టోరీస్ బాగా డీల్ చేస్తారు.

నిర్మాతలుగా మీ డ్రీమ్ ప్రాజెక్ట్?

రాజు: ప్రత్యేకించి ఏమీ లేదు. మరిన్ని మంచి సినిమాలు తీయడమే! కానీ, మా లక్ష్మణ్‌కి ఒక కోరిక ఉంది.

లక్ష్మణ్: (నవ్వేస్తూ) అందరూ గొప్పగా చెప్పుకొనేలా, ‘బాహుబలి‘ లాంటి గ్రాండియర్ ఫిల్మ్ తీయాలి.

రాజు: అందరం 50 ఏళ్ళకు రీచ్ అవుతున్నాం. మహా అయితే మరో పదేళ్ళిందులో ఉంటాం. ఉన్నన్ని రోజులూ ఇలాగే అందరం కలిసి ఉండాలని మా కోరిక.

 - రెంటాల జయదేవ

 

అంటే మీ మధ్య అసలెప్పుడూ భేదాభిప్రాయాలే లేవా?

కానీ బిజినెస్‌లో పొరపొచ్చాలు రావడం కామన్ కదా...

శిరీష్: చేస్తున్నది స్నేహమనే తప్ప, బిజినెస్ అనుకోం.  

లక్ష్మణ్: ఓపెన్‌గా మాట్లాడుకుంటాం. డబ్బు దగ్గరే ఒకరిపైఒకరికి అనుమానాలొస్తాయి. మా మధ్య అవి లేవు.

రాజు: ఎవరితోనైనా నేను నిదానంగా డీల్ చేస్తా. శిరీష్ కొద్దిగా ఫాస్ట్‌గా డీల్ చేస్తాడు. లక్ష్మణ్ కూడా ఫాస్టే. మా మధ్యా చిన్న గ్యాప్స్ వస్తాయి. ఏ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినా, మూడోవాళ్ళు సర్దుబాటు చేస్తారు.  

 

 హర్షిత్! ఫిల్మ్‌స్టడీ వల్ల ఉపయోగం ఉందా?

హర్షిత్: (బిడియపడుతూనే) కచ్చితంగా ఉంది. కానీ, హాలీవుడ్‌కీ, మనకీ తేడా ఉంది. అక్కడ స్క్రిప్ట్ ఫైనలయ్యాక, ఎగ్రిమెంటయ్యాక మార్చకూడదు.

రాజు: మన దగ్గర రూల్సంటే కుదరదు. డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి. ప్రాక్టికల్‌గా నేర్చుకుంటున్నాడు.

 

రాజు గారూ... మీరు ఒకసారి నటించినట్లున్నారు?

రాజు: నటించలేదు. కొన్నేళ్ళ క్రితం డిస్ట్రిబ్యూటర్స్‌గా ఒక సినిమా కొన్నాం. అప్పుడా దర్శక, నిర్మాతలు క్యారెక్టర్ ఉంది. వేయమన్నారు. ఫోటోలతో ఫ్లెక్సీ పెట్టారు. వాళ్ళు ట్రాప్ చేస్తున్నారని సాయంత్రానికల్లా అర్థమైంది. ఇచ్చిన 3 లక్షల ఆరు వేలు వదిలేసి, సినిమా వద్దని నమస్కారం పెట్టేశా. వచ్చిన అనుభవం రేటు అదన్న మాట! (నవ్వులు...)

 

 

ఎన్నో హిట్లిచ్చినా, రెండేళ్ళ క్రితం ఒకట్రెండు పెద్ద ఫ్లాపులతో ఆర్థికంగా తలకిందులయ్యారని వార్తలొచ్చాయి?

రాజు: అది నిజం కాదు. 2009 -’10 టైమ్‌లో ‘రామ రామ కృష్ణ కృష్ణ’, మా కజిన్ కోసం తీసిన ‘మరో చరిత్ర’, అలాగే ‘జోష్’ - మూడూ దెబ్బతిన్నాయి. నిర్మాణం కన్నా డిస్ట్రిబ్యూషన్‌లో ఎక్కువసార్లు దెబ్బతిన్నాం.  

లక్ష్మణ్: సొసైటీలో మాత్రం మా పని అయిపోయిందనీ, రోడ్డు మీద పడ్డామనీ కామెంట్స్ వచ్చాయి.

రాజు: కానీ, దేవుడి దయ వల్ల ‘ఆర్య’ దగ్గర నుంచి ఇవాళ్టి వరకు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఎప్పుడూ లేవు.

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top