మట్టి నీడ

Software Engineers In Mangalore Built A House With Clay - Sakshi

‘‘మాది ఎప్పుడో మా తాత కట్టించిన పాత ఇల్లు. మట్టి గోడలు, మంగుళూరు పెంకుతో పై కప్పు కట్టించాడాయన. మాలాంటి సామాన్యులకు అప్పట్లో అందుబాటులో ఉన్న టెక్నాలజీ అంతవరకే మరి. మా అబ్బాయి ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. యుఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. వాడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. పెళ్లి కంటే ముందు ఈ ఇంటిని పడగొట్టి మోడరన్‌గా మంచి ఇల్లు కట్టాలి. బడ్జెట్‌ ఎంతయినా ఫర్వాలేదు. సిటీలో మంచి ఆర్కిటెక్ట్‌ పేరు చెప్పు..’’ అని పేరున్న ఆర్కిటెక్ట్‌ కోసం శోధించే వాళ్లు చాలా మందే ఉంటారు. అద్దంలా మెరిసిపోయే ఇంటి కోసం రకరకాల డిజైన్‌లతో మ్యాగజైన్‌లు కూడా ఉంటాయి. ఇక మహారాష్ట్రకు చెందిన ఆర్కిటెక్ట్‌ అనుజ్ఞ నూతన్‌ ధ్యానేశ్వర్‌ అయితే.. ఇళ్ల నిర్మాణం కోసం బురద మట్టి, మంగుళూరు ఎర్ర పెంకులను ముడిసరుకుగా మార్చుకున్నారు.

ఆమె రూపొందిస్తున్న ఎకో ఫ్రెండ్లీ హౌస్‌ డిజైన్‌లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పుణెకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌లు అన్విత్, నేహా పాఠక్‌ దంపతులు ఇప్పుడు అనుజ్ఞ డిజైన్‌ చేసిచ్చిన మడ్‌హౌస్‌లో గృహ ప్రవేశం చేయడానికి సిద్ధమవుతున్నారు.! ‘‘మేము రెండంతస్థుల మట్టి ఇంటిని కట్టించుకుంటున్నాం. మా కొత్త ఇంటిని చూడడానికి మా స్నేహితులు, బంధువులు వస్తున్నారు. ఆ వచ్చిన వాళ్లలో చాలామంది మమ్మల్ని పిచ్చివాళ్లను చూసినట్లు చూస్తున్నారు. నిజానికి మట్టి ఇల్లు ఎండాకాలం బయటి ఉష్ణోగ్రత కంటే 13–14 డిగ్రీల తక్కువగా ఉంటుంది. అలాగే శీతాకాలం చలి నుంచి వెచ్చదనాన్నిస్తుంది. పుణెలో చాలామంది వారాంతపు సెలవులను గడపడానికి నగర శివార్లలో ఇలాంటి ఇళ్లు కట్టించుకుంటున్నారు. మేము నగరంలోనే కట్టించుకుంటున్నాం’’ అంటున్నారు నేహ.

సహజ జీవనం
‘‘మట్టి ఇంటి నిర్మాణంలో వీలయినంత ఎక్కువగా ప్రకృతి సిద్ధమైన సహజ వస్తువులను ఉపయోగిస్తాం. ఆ మెటీరియల్‌ నుంచి వాటి సహజమైన వాసనే విడుదలవుతుంది. అవేవీ శ్వాసకోశ వ్యాధులకు కారణం కావు, పైగా మోడరన్‌ లైఫ్‌లో ఎదురయ్యే బ్రీతింగ్‌ సమస్యలను కూడా దూరం గా ఉంచుతుంది. సిమెంట్‌ ఇళ్ల నిర్మాణంతో పోలిస్తే ఈ ఇళ్ల నిర్మాణ వ్యయం కూడా తక్కువే. సిమెంట్‌ భవనం నిలిచినంత కాలం నిలిచి ఉండేటట్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అంటున్నారు అనుజ్ఞ.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top