గుండెల్లో ‘కోట’ కట్టుకున్నా

Sakshi Special Interview With Kota Srinivasa Rao

ఇల్లు వదిలి రచ్చ గెలిచేవాడు కళాకారుడు.
రంగస్థలాన్ని నివాసం 
చేసుకునేవాడు కళాకారుడు.
పూటకొక వేషం కట్టి, 
రోజుకొక ఊరు చేరి
జనాన్ని రంజింప చేసేందుకు 
పరిశ్రమ చేసేవాడు కళాకారుడు.
సంపాదించినదానితో 
అతడు తన కుటుంబం కోసం 
ప్రేమగా కోట కట్టించవచ్చు.
కాని అతడు ఉండేది మాత్రం 
జనం గుండెల్లోనే.
ఉండిపోయేది అక్కడి కోటలోనే.

ఈ నెల 10న మీ పుట్టినరోజు. నటుడిగా దాదాపు 40 ఏళ్ల కెరీర్‌. మీ ఏజ్‌ ఎంత?
75 నిండి 76వ ఏట అడుగు పెడతాను.

ఆరోగ్యం ఎలా ఉంది? 
బాగుంది. కొంచెం మోకాళ్ల నొప్పులు... అంతే. వయసును బట్టి వస్తాయని డాక్టర్లు చెబుతుంటారు. ఇక మనం చేసే శ్రమని బట్టి కూడా ఉంటాయి. నడవడానికి ఇబ్బంది లేదు కానీ మెట్లెక్కేటప్పుడు, దిగేటప్పుడు కొంచెం కష్టం. వయసు పెరుగుతోంది కదా.. ఇలాంటివన్నీ సాధారణమే. లైఫ్‌ అంటే ఏంటి? ఎంట్రీ అయింతర్వాత ఎగ్జిట్‌ కూడా కామనే కదా (నవ్వుతూ).

750 సినిమాల వరకూ చేశారు? శరీరానికి ఎక్కువ శ్రమ ఇచ్చామనే ఆలోచన ఉందా?
ఆ ఆలోచన ఎప్పుడూ రాలేదు కానీ శరీరానికి ఎక్కువ శ్రమ ఇచ్చానని ఇప్పుడిప్పుడు తెలుస్తోంది. ఎవరికైనా సరే ‘టైమ్‌ వస్తే టైమ్‌ ఉండదు’. కనీసం భోజనం చేయడానికి కూడా టైమ్‌ ఉండదు. దానికి తోడు మన లైఫ్‌ మన చేతుల్లో ఉండదు. దాదాపు 38 ఏళ్లు రోజుకు 20 గంటలు పనిచేశా. నెలకి, రెండు నెలలకోసారి భార్యాపిల్లల్ని చూసేవాడ్ని. ఫ్యామిలీ లైఫ్‌ని మిస్సయ్యాం అని ఇప్పుడు బాధగా ఉంది.  

ఇప్పుడు సినిమాలు తగ్గించాక ఎలా ఉంది?
నాకు పని తగ్గించుకోవాలని ఎప్పుడూ లేదు. ఇప్పుడూ ఎవరైనా కనిపిస్తే ‘నాయనా ఓ వేషం ఇవ్వరా.. ఇంట్లో కూర్చొని పిచ్చెక్కిపోతోంది’ అంటుంటా. ఎందుకంటే గడిచిన 40ఏళ్లల్లో రేయింబవళ్లు దాదాపు 100–150 మంది మధ్యలో జీవితం గడిపా. పొద్దునే 7 గంటలకు ముఖానికి రంగు వేసుకుంటే రాత్రి మినిమం రెండు గంటలయ్యేది. అప్పుడొచ్చి ఏదో రెండు మెతుకులు తిని పడుకుంటే పొద్దున్నే మళ్లీ 5:30 గంటలకు లేవాలి. అప్పుడన్నీ రైళ్లే కదా. ఇప్పుడైతే విమానంలో వెళ్లిపోతాం. అప్పట్లో జర్నీలోనే సగం గంటలు పోయేవి. అయినా ఎక్కువ పని చేశాననే పశ్చాత్తాపం లేదు. ఎందుకంటే ప్రజల్లో నటుడిగా నాకు మంచి గుర్తింపు ఉంది. నాకు ఆరేళ్ల కుర్రాళ్ల నుంచి 60 ఏళ్ల ముసలోళ్లవరకూ అభిమానులున్నారు. నాకు ఏ కష్టమొచ్చినా, సుఖమొచ్చినా వాళ్ల సొంత మనిషిలా భావిస్తారు. ఫ్యామిలీ లైఫ్‌ని మిస్‌ కావడంతో పాటు నేను కోల్పోయిన ఇంకో విషయం ప్రపంచ జ్ఞానం. బయట ఏం జరుగుతోందో తెలిసేది కాదు. ఇప్పటిలాగా ఫోన్లు, సౌకర్యాలు అప్పుడు లేవు కదా. అటు కుటుంబంతో గడపకపోవడం ఇటు బయటి ప్రపంచ జ్ఞానం తెలుసుకోకపోవడం నేను కోల్పోయాను. సినిమా రంగమే కాదు.. ఏ రంగంలోనైనా బిజీగా ఉన్నవారందరికీ అలాగే ఉంటుందనుకోండి. 

తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’ చాన్స్‌ గురించి? 
‘ప్రాణం ఖరీదు’ (1978) సినిమాలో రావు గోపాలరావుగారు ప్రధాన పాత్ర. ‘ప్రాణం ఖరీదు’ నాటకంలో ఆ పాత్రను నేను స్టేజ్‌పై వేసేవాణ్ణి. ఆ నాటకాన్ని నిర్మాత వాసుగారు, దర్శకుడు క్రాంతి కుమార్‌గారు చూసి సినిమా తీయాలనుకున్నారు. ఆ నాటిక రాసిన సీ.ఎస్‌.రావుగారే సినిమాకి కూడా రచయిత. ఆయన సెంటిమెంట్‌గా చిన్న వేషం ఉంది.. చేయాలని నన్ను తీసుకెళ్లడం, ఓ చిన్న పాత్ర చేయడంతో నా సినీ ప్రయాణం మొదలైంది.  

ఆ తర్వాత ఓ ఐదేళ్లు మీరు సినిమాలు చేయలేదేం?
జంధ్యాలగారితో పరిచయం ఉండటం వల్ల, ఆయనెప్పుడైనా హైదరాబాద్‌లో షూటింగ్‌ చేస్తుంటే సరదాగా వెళ్లి రెండు మూడు సీన్లు చేసేవాణ్ణి. అలా దాదాపు ఎనిమిది సినిమాలు చేశాను. నిజం చెబుతున్నా.. నేనెప్పుడూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించలేదు. నాకెప్పుడూ నాటకాల గోలే. అయితే సినిమా అవకాశం వస్తే చేయకుండా ఎవరూ ఉండరు కదా? కానీ, చాన్స్‌ల కోసం ప్రయత్నించలేదు. ఎందుకంటే అప్పుడు సినిమా యాక్టర్‌ అంటే ఒడ్డూ పొడుగు ఉండాలి, ఎర్రగా, అందంగా ఉండాలనుకునేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అప్పుడు నేను బాగా నల్లగా ఉండేవాణ్ణి. అవకాశం అడిగితే, ‘నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావేంట్రా?’ అంటారేమో అని భయం. పైగా స్టేట్‌బ్యాంకులో మంచి ఉద్యోగం ఉంది. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎందుకు రిస్క్‌ తీసుకోవడం అనే భయం ఉండేది. ఆ తర్వాత అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను, ఆ జర్నీ ఇంతదాకా వచ్చింది.

నటుడిగా ‘ప్రతిఘటన’ మీ కెరీర్‌కి మంచి టర్నింగ్‌ పాయింట్‌ అయింది కదా?
అవును. ఆ సినిమా 1985లో విడుదలైంది. ఆ రాత్రికి రాత్రి స్టార్‌ అయిపోయాను. అప్పుడు మా బ్యాంక్‌ హైదరాబాద్‌లోని నారాయణగూడ బ్రాంచ్‌లో ఉండేది. బయటకు వస్తే జనం గోల. నన్ను చూడ్డానికి ఉత్సాహంగా వచ్చేవారు. దాంతో మా బ్రాంచ్‌ మ్యానేజర్‌ ఇలా ముందు గదిలో వద్దు... లోపల కూర్చోండి అన్నారు.

మరి.. ఉద్యోగం ఎప్పుడు మానేశారు?
సినిమాల్లో యాక్ట్‌ చేయడానికి మా బ్యాంక్‌ వాళ్లు పర్మిషన్‌ ఇవ్వలేదు. అప్పుడు చాలా రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ ఉండేవి. ‘ప్రతిఘటన’ తర్వాత చాన్సులు వచ్చినా సర్వీస్‌లో ఎన్ని సెలవులుంటాయో అవే వాడుకోవాలి. అయితే నటుడిగా బాగా క్రేజ్‌ రావడంతో ఐదువేలు, పదివేలు.. ఇలా నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చారు. ఇండస్ట్రీలో టైమ్‌ వస్తే టైమ్‌ ఉండదు. ఇక, 86 ఎండింగ్‌లో రిజైన్‌ లెటర్‌ ఇచ్చాను. అసలు అంతకుముందే ఫలానా డేట్‌లో చేరాలి. లేకపోతే ఈ ఉద్యోగం మీద మీకు ఆసక్తి లేదని అనుకుంటాం అని ఫైనల్‌ లెటర్‌ పంపారు. అది నా చేతికి వచ్చేసరికి ఆ డేట్‌ దాటి 7–8 రోజులు అయిపోయింది. బెంగుళూరులో ఎక్కడో ఉన్నాను. ఉద్యోగం పోయింది.

రంగస్థలం నుంచి సినిమాలకు వచ్చారు... ఇప్పుడు నాటక రంగం కనుమరుగవడం గురించి?
నాటకం వల్ల మనకో కాన్ఫిడెన్స్‌ వస్తుంది. డిక్షన్‌ అన్నీ తెలుస్తాయి. ఎక్కడ కామా ఉండాలి ఫుల్‌స్టాప్‌ పెట్టాలో తెలుస్తుంది. అది ఎప్పుడు ఉపయోగపడుతుందంటే సినిమాలో పెద్ద పెద్ద వాళ్లతో యాక్ట్‌ చేసే సమయంలో బెరుకు ఉండదు. నేను అమితాబ్‌గారితో యాక్ట్‌ చేశాను. అమితాబ్‌ అంటే ప్రపంచంలో గుర్తింపబడ్డ నటుడు. అతనితో నటించేటప్పుడు ఎలా ఉంటుంది? అదేమీ లేకుండా నేను చేయగలిగానంటే అది నాకు నాటకాల వల్ల వచ్చింది. ఇప్పుడు నాటకాలు వేస్తే ఎవరు చూస్తారు? అంటున్నారు. ఓ పది మంది కలసి నాటకం వేసి, చూపించండి. మీకూ (నటీనటులు) ప్రాక్టీస్‌ అవుతుంది. 

మీ నాన్నగారు మిమ్మల్ని డాక్టర్‌ చేయాలనుకున్నారట?
మేం ముగ్గురు అన్నదమ్ములం. అన్నయ్య, నేను, తమ్ముడు శంకర్రావు. అన్నయ్యను డాక్టర్‌ చేయాలనుకున్నారు. శంకర్రావు కూడా మంచి నటుడే. సినిమాలు, సీరియల్స్‌ చేస్తున్నాడు. నాకు చదువుపై ఆసక్తి లేదని అన్నయ్యగారు నాన్నగారికి చెప్పారు. ‘ఏం డాక్టరుగారూ.. మీ తర్వాత మీ అబ్బాయిలు ఎవరూ లేరా?’ అనే ఊళ్లో అడిగేవారు. అందుకని డాక్టర్‌ చదివించాలనుకున్నారు. మెడికల్‌ సీటు కోసం ఏడాది పాటు బాగా ట్రై చేశాను. అప్పుడప్పుడే డొనేషన్‌ పద్ధతి ప్రారంభమైంది. నాకు ఫస్ట్‌క్లాస్‌కి కెమిస్ట్రీలో ఒక శాతం తక్కువ వచ్చింది. మద్రాసు వెళ్లాను. మాకు తెలిసిన డాక్టరుగారు వైద్యసీటు కోసం ప్రయత్నించగా డొనేషన్‌ పద్ధతిలో ఇస్తామన్నారు. అప్పుడు ఐదు వేలు కడితే చాలు. అయితే నువ్వు ప్రపంచంలో ఎక్కడైనా చదువు.. చదివిస్తాను కానీ డొనేషన్‌ మాత్రం కట్టను అన్నారు నాన్నగారు. దాంతో సీటుకోసం ఓ ఏడాది వృథా చేశాను. ఏదీ కుదరక బీఎస్సీలో చేరాను.  

మొదటి నుంచి మీది బాగా ఉన్న కుటుంబమేనా? 
మా నాన్నగారు డాక్టర్‌ అని చెప్పాను కదా. ఆయన ప్రాక్టీస్‌ చాలా బాగుండేది. ఆ రోజుల్లోనే రోజుకు 200–300 మంది రోగులు వచ్చేవారు. మా నాన్నగారి గురించి గొప్పగా చెప్పటం కాదు కానీ, రోగులు డబ్బులిస్తుంటే తన చేత్తో తీసుకునేవారు కాదు.. ఈ రోజు కలెక్షన్‌ ఇది అని కాంపౌండర్‌ ఇచ్చేవారు. ఆ రోజుల్లో నాన్నగారు రెండు నెలలకోసారి 100, 115 రూపాయలు ఆంధ్రాబ్యాంకులో డిపాజిట్‌ చేసేవారు. 74 ఏళ్ల క్రితం 100 రూపాయలంటే చాలా ఎక్కువ.  త్వరగానే ఇల్లు కట్టుకున్నాం. మా తల్లిదండ్రులకు మేం 12మంది సంతానం.. ముగ్గురు అబ్బాయిలు, 9 మంది అమ్మాయిలు. ఇప్పుడు ఏడుగురు ఉన్నాం.

సీరియస్‌ విలన్, కామెడీ విలన్, కమెడియన్, సపోర్టింగ్‌ ఆర్టిస్ట్, స్త్రీ పాత్రలు కూడా చేశారు. బాగా హోమ్‌వర్క్‌ చేసేవారా?
గొప్ప విశేషం ఏంటంటే.. నేను చేసిన ఏ పాత్ర కూడా నాకు ముందు చెప్పింది కాదు. షూటింగ్‌ స్పాట్‌కి వెళ్లినప్పుడు ‘మీ పాత్ర ఇది’ అని డైరెక్టర్‌ చెప్పేవారు. ముందు చెప్పడం , హోమ్‌ వర్క్‌ చేయడం లాంటివి ఏమీ లేదు. ఒకవేళ ఏదైనా ప్రత్యేకమైన గెటప్‌ అనుకోండి.. అంటే బట్టతల, బోడిగుండు.. వంటి వాటికి మాత్రం ముందు వర్క్‌ చేసేవాళ్లు. ఇలా చేయాలనుకుంటున్నాం చేతిలో ఉన్న సినిమాలకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? అని అడిగేవారు. నేను బాగా నమ్మేది.. అందరికీ చెప్పేది కూడా  ఒక్కటే. మనకు పెద్ద గుమ్మడికాయ అంత ప్రతిభ ఉంటే సరిపోదు. చిన్న ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ఆ రెండూ ఉన్నవాడే కోట శ్రీనివాసరావు. 

మీరెక్కువగా నెగటివ్‌ రోల్స్‌ చేశారు. పాత్ర తాలూకు ప్రభావం ఆర్టిస్టుల మీద పడుతుందా? మీరు కొంచెం కటువుగా, ముక్కుసూటితనంగా మాట్లాడినట్లు అనిపిస్తుంది? 
ఏమో.. ఆ ప్రభావం ఉందేమో. ఎప్పుడైనా అరవడం, టక్కున  తిట్టడం వంటివి చేశానేమో? ఏదైనా సహించలేనిది జరిగినప్పుడే అలా రియాక్ట్‌ అయ్యుంటాను తప్ప కారణం లేకుండా ఎవర్నీ ఏమీ అనలేదు. నాకు ముక్కుసూటిగా మాట్లాడటమే వచ్చు. వెనక మాట్లాడటం కన్నా ముఖం మీద అనడం కరెక్ట్‌ అనుకుంటాను. 

దానివల్ల మిమ్మల్ని నిందించేవారు ఎక్కువ ఉంటారేమో?
ఉండొచ్చేమో. నాలుగు మంచి మాటలు చెప్పాలను కున్నప్పుడు నిందల గురించి పట్టించుకోకూడదు. ఇప్పుడున్నవాళ్ల పరిస్థితి ఎలా ఉందంటే సాధన తక్కువ వాదన ఎక్కువ.. టెక్నాలజీ పెరుగుతోంది. పెరగాలి కూడా. దాంతో ఇవాళ  వయసుకి మించిన విజ్ఞానం అయిపోయింది. అది పెద్ద ప్రమాదం. వయసుతో పాటే తెలివి కూడా పెరగాలి. మనకు ‘ఏ వయసులో జరగాల్సినది ఆ వయసులో జరగాలి’ అనే సామెత ఉంది. మన చదువును కూడా మన జీవితంతో జోడించి సృష్టించారు. జీవితంలో నాలుగు స్టేజీలు. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం. చదువు కూడా ఎలిమెంటరీ, హై స్కూల్, కాలేజ్, యూనివర్శిటీ. ఈ నాలుగింటినీ జీవితంతో లింక్‌ చేశారు. ఓ పాతిక మంది పిల్లల్ని ఒకేచోట ఓ గంటసేపు కూర్చోబెట్టడం కష్టం. అది ఎలిమెంటరీ స్కూల్‌. ఆ తర్వాత హైస్కూల్‌. పద్యాలు నేర్పుతారు. పదోతరగతి రాయాలంటే 16 ఏళ్లు కంపల్సరీగా ఉండాలి. అప్పుడు అంతకుముందు క్లాసుల్లో చెప్పిన పద్యాలకు తాత్పర్యం చెబుతారు. అప్పుడు అర్థం చేసుకోవడం అలవడుతుంది. కాలేజీలు ఇప్పటిలాగా గల్లీగల్లీకి లేవు. డిస్ట్రిక్ట్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో మాత్రమే ఉండేవి. వేరే ఊరు వెళ్లి చదవాలి. అప్పుడు నీకు ఎవరూ తోడు రారు. సొంతంగా నేర్చుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పంపేవారు. లైఫ్‌ని డీల్‌ చేయడం అలవాటు అవుతుంది. మన జీవితాలతో లింక్‌ చేసిన చదువుని విస్మరించేశాం. కార్పొరేట్‌ స్కూల్‌లో చేరతారు. 3 లక్షలు అంటారు. అంతా అంటే? ఫారిన్‌ నుంచి వచ్చారు టీచర్లు అంటారు. పీజీ వాడు కేజీకి చెప్పాలి. పీజీ వాడు కేజీకి దిగలేడు, కేజీ వాడు పీజీకి ఎదగలేడు. మరి వీళ్లు చెప్పేది ఎవరికి చెప్పండి?

మాతృభాషను ఖూనీ చేయడం, పెద్దలను ఎదిరించడం.. ఇలా ఇప్పటి తరంలో ఎక్కువ శాతం మంది ఉన్నారు.. దాని మీద మీ అభిప్రాయం?
బిడ్డ ఎదుగుదలకు మాతృ స్తన్యం ఎంత అవసరమో... పిల్లాడి మానసిక ఎదుగుదలకు మాతృభాష అంతే అవసరం. పుట్టిన బిడ్డకు అన్ని ‘ఇంగ్స్‌’ నేర్పేది తల్లే. టాకింగ్, వాకింగ్, ఈటింగ్, రీడింగ్, రైటింగ్‌.. ఇలా  అన్నీ నేర్పుతుంది. తల్లిలో అంత ఇది ఉంది. పై చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు అంటూ ఫారిన్‌ పోవడం, అక్కడే స్థిరపడిపోవడం, తల్లిదండ్రులను ఇక్కడే వదిలేయడం. అప్పట్లో పిల్లలకు క్రమశిక్షణ ఉండేది. ‘మీ అబ్బాయి సిగిరెట్‌ తాగుతున్నాడు’ అని ఎవరైనా ఇంట్లో చెబితే ఇంటికి వెళ్లిన తర్వాత మన పరిస్థితి ఏంటి? కొడితే చర్మం ఊడిపోయేది. అదే ఇప్పటి పిల్లలైతే ‘ఏం నువ్వు తాగడంలేదా?’ అని తండ్రిని నిలదీస్తారు. అయితే పెద్దవాళ్ల ఉద్దేశం ఏంటంటే ‘నీ వయసు ఏంటి? నువ్వు చేసే పనేంటి’ అని. ఇప్పుడు పాఠం చెప్పే సమయంలో సరిగ్గా వినడం లేదనో, సరిగ్గా చదవడం లేదనో టీచర్‌ ఓ దెబ్బ వేస్తారు. దాన్ని కొట్టడం అనుకుంటే ఎలా? కొందరు డాక్టర్లు పిల్లల్ని కొడితే వాళ్ల తెలివితేటలు పోతాయి అంటారు. అదో బిజినెస్‌. ఆ విషయం గురించి పెద్ద చర్చ. వీటికి చర్చ ఎందుకు? 

కోటగారు నీతులు చెబుతున్నారు? అని ఎవరైనా అంటే?
ఈ మాట డైరెక్ట్‌గా నాతో ఒకరు అన్నారు. నాది మార్పు రావాలని చెప్పే వయసు. ఈ మధ్య కోటగారు నీతులు చెబుతున్నారు అని ఎవరో అంటే... నాకు చెడు ఎక్కువగా తెలుసయ్యా... అందుకే మంచి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాను అన్నాను. మరి.. తెలియనివాడు ఏం మాట్లాడతాడు? ఏదో నా అనుభవంతో నలుగురికీ ఉపయోగపడే నాలుగు మంచి మాటలు చెప్పాలనిపించింది. చెప్పాను. అయితే ఎవరినీ బాధపెట్టాలన్నది నా ఉద్దేశం కాదు.

 ఫైనల్లీ... ఇంతకు ముందున్నంత ఉత్సాహంగా సినిమాలు చేయగలరా?
చేయలేను అనుకోవడం తప్పు. దర్శకులకు కావాల్సింది వారికి ఇవ్వడమే కదా. అయితే ‘బాబూ కాస్త మెట్లు ఎక్కలేను. దిగలేను. ఆలోచించి వేషం ఇవ్వండి’ అంటాను. అలా చెబితే తప్పేంటి? నాకున్న అనుభవానికి, నాకున్న వయసుకి చెప్పాలి కూడా. ఎందుకంటే షూటింగ్‌ లొకేషన్‌కి వెళ్లాక ‘చేయలేను’  అన్నాననుకోండి.. ఈ కుర్రాళ్లు ఒక మాట అంటే సిగ్గుగా ఉంటుంది. నేను మాట పడలేను.
– డి.జి. భవాని

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top