
మన జెండాను గౌరవిద్దాం...
స్వాతంత్య్రం... ఎందరో వీరుల త్యాగఫలం. స్వాతంత్య్రం... మరెందరో మహానుభావుల సేవాతత్పరత. స్వాతంత్య్రం... ఎందరో దేశభక్తుల నిస్వార్థసేవ...
స్వాతంత్య్రం... ఎందరో వీరుల త్యాగఫలం. స్వాతంత్య్రం... మరెందరో మహానుభావుల సేవాతత్పరత. స్వాతంత్య్రం... ఎందరో దేశభక్తుల నిస్వార్థసేవ... మువ్వన్నెల జెండా రెపరెపలాడాలన్న కొన్ని కోట్ల భారతీయుల ఆకాంక్ష... ఇవన్నీ నెరవేరిన పండుగరోజు... బానిసత్వాన్ని పరుగులెత్తించి స్వేచ్ఛావాయువులు పీల్చిన రోజు... స్వాతంత్య్రం... కులమతాలకు అతీతంగా...యావద్దేశానికి పండుగరోజు... ఈ పండుగను ప్రతిబింబించే జెండాను గౌరవించాలంటున్నాడు కృష్ణశంకర్ అనిశెట్టి ‘ఇండిపెండెన్స్‌డే’ లఘుచిత్రంలో.
డెరైక్టర్స్ వాయిస్: నేను బి.కామ్ ఫైనలియర్ చదువుతూ ఉద్యోగం చేస్తున్నాను. నాకు ఫిల్మ్ మేకింగ్ అంటే ఇష్టం. మా ఫ్రెండ్‌తో కలిసి ‘రాంగ్ డెస్టినీ’ అనే లఘుచిత్రం తీశాను. నా రెండవ చిత్రం ‘ఇండిపెండెన్స్‌డే’. ప్రతి సంవత్సరం, ఆగస్టు పదిహేనవ తేదీన స్వాతంత్య్ర దినోత్సవంనాడు మొక్కుబడిగా జెండా ఎగరేయడం, మళ్లీ మర్చిపోవడం. ఇలా కాకుండా నిత్యం గుర్తుంచుకునేలా ఏదైనా చెయ్యాలనిపించింది. ఆలోచన వచ్చినదే తడవుగా స్నేహితులతో కలిసి ఈ చిత్రం తీశాను. కేవలం నాలుగుగంటల్లో ఈ చిత్రం పూర్తి చేశాను. ఇందులో నాతో పాటు నా స్నేహితులు నటించారు. రాగద్వేషాలకు అతీతంగా, పచ్చనిపొలాలతో, స్వచ్ఛమైన హృదయాలతో నిండిన భారతదేశానికి ప్రతీకగా పింగళి వెంకయ్య త్రివర్ణపతాకం రూపొందించారు. ఆ జాతీయ పతాకం భారతీయ సంస్కృతికి చక్కని చిరునామా. అది కాపాడుకోవడం మన సంస్కారం... ఆ బాధ్యతను భారతీయులెవరూ భారంగా భావించరని ఆశిస్తున్నాను.
షార్ట్ స్టోరీ: ఇద్దరు పిల్లలు టై మీద జెండాతో ఆడుకుంటూ ఉన్నప్పుడు జెండా గాలికి ఎగిరిపోతుంది. అప్పుడు ఇద్దరు యువకులు ఆ జెండాని కింద పడకుండా పట్టుకుని ఆ బాలలకు ఇస్తారు. వారు చిరునవ్వుతో, ఆనందంతో యువకులకు కృతజ్ఞతలు చెప్పి, స్వాతంత్య్రదిన శుభాకాంక్షలు తెలియచేస్తారు.
కామెంట్: ఎంతో చక్కటి చిత్రం. యువతరానికి దేశం పట్ల ఎప్పుడూ కృతజ్ఞత ఉంటుంది. చలనచిత్రాలలో మువ్వన్నెల జెండా కనిపిస్తే చాలు యువతీయువకులు ఈలలు, చప్పట్లు కొడతారు. వారిలో మాతృభక్తి చాలా ఎక్కువ. ఆ భక్తిని ఎంతో చక్కగా కేవలం రెండు నిముషాల నిడివి గల లఘుచిత్రంలో చాలా చక్కగా చూపాడు కృష్ణశంకర్.
- డా.వైజయంతి