చేతికి రాని పెద్దకొడుకు

Parents Should Take Care Of The Childrens - Sakshi

అమ్మాయి ఉంటే పెళ్లయ్యిందా అని అడుగుతారు. అబ్బాయి ఉంటే ఏం చేస్తున్నాడు అని ఆరా తీస్తారు. సమాజ నిర్దేశాలను ఎవరూ తప్పించుకోలేరు. పుట్టిన కొడుకు ఎదగాలి. ఎదిగినవాడు తన కాళ్ల మీద తాను నిలబడాలి. పెళ్లి కాని అమ్మాయి గుండెల మీద కుంపటి అనే రోజులు పోయాయి. చేతికి రాని కొడుకు స్ట్రగుల్‌ అయ్యే రోజులు పెరిగాయి. అలా స్ట్రగులవుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఏం చేయాలి? ఆ కొడుకు ఏం తెలుసుకోవాలి?

చాలారోజుల తర్వాత ఫ్రెండ్స్‌ ఇంటికి వచ్చారు. టీలు, కాఫీలు అయ్యాయి. తండ్రి, తల్లి చాలా ఉత్సాహంగా వారికి మర్యాదలు చేశారు. ఇంట్లో చిన్నకొడుకు సోడా బుడ్డీ కళ్లద్దాలతో బి.టెక్‌ పుస్తకాలు చదువుతూ కనిపించడం ఫ్రెండ్స్‌కు నచ్చింది. ‘బి.టెక్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్నాడు మావాడు. మంచి మార్కులు తెస్తున్నాడు’ అని తండ్రి గర్వంగా చెప్పాడు. వాళ్లు మెచ్చుకున్నారు. ‘మీ పెద్దబ్బాయికి ఆల్రెడీ బి.టెక్‌ అయిపోయిందిగా. ఇప్పుడేం చేస్తున్నాడు?’ అడిగారు ఎవరో. తండ్రి, తల్లి కొంచెం తొట్రుపడ్డారు. ‘వాడా... వస్తాడుగా.. మీరే అడగండి. వాడిది కొంచెం సపరేట్‌ ట్రాక్‌ లేండి’ అనేసి టాపిక్‌ మార్చేసింది తల్లి. వాళ్లు ఉన్నంతసేపు పెద్దకొడుకు ఇంటికి రాడని ఆ తండ్రికీ తల్లికీ తెలుసు. పెళ్లి జరుగుతోంది బంధువుల ఇంట. తండ్రి, తల్లి, చిన్నకొడుకు వచ్చారు.

‘మీ పెద్దాడు రాలేదా? వాడిదసలే తాత పోలిక. వాణ్ణి చూస్తే వాళ్ల తాతను చూసినట్టే ఉంటుంది. వాడు రాకపోతే ఎలారా? అంత కొంపలు మునిగే పని ఏం చేస్తున్నాడు వాడు’ ఎవరో ముసలామె నిలదీసింది. ‘నువ్విలా అడుగుతావనే వాడు రావడం లేదు’ విసుక్కున్నాడు తండ్రి. ముసలామె అయోమయంగా చూసింది. వాళ్లు ముగ్గురూ అక్కడి నుంచి తప్పించుకుని భోజనాల వైపు అడుగులు వేశారు. బి.టెక్‌లో పెద్దకొడుక్కు మంచి మార్కులే వచ్చాయి. ‘ఏం చేస్తావు?’ అని అడిగారు తండ్రి, తల్లి. ‘బిజినెస్‌ చేస్తా. చదివింది చాలు’ అన్నాడు పెద్ద కొడుకు. ‘ఏ బిజినెస్సు’ అడిగారు. ‘ఆలోచించి చెప్తా’ అన్నాడు పెద్ద కొడుకు. వాళ్లది ఎగువ మధ్యతరగతి కుటుంబం. ఓ మోస్తరు బిజినెస్‌ ఉంది. అందరు డైరెక్టర్ల ముందు ఏదో సినిమాలోలా సూటేసుకుని ఉన్న కొడుకును చైర్మన్‌ సీట్‌లో కూచోబెట్టేంత స్థాయి వ్యాపారం కాదు అది.

తండ్రికే అది చాలా తక్కువ. సరే, కొడుకు ఆలోచనలు ఎలా ఉన్నాయో ఏదో ఒకటి చేస్తాడులే అని  ఊరుకున్నారు. మూడు నెలలు గడిచిపోయాయి. ఆరునెలలు గడిచిపోయాయి. సంవత్సరం గడిచిపోయింది. తండ్రికీ తల్లికీ మెల్లగా టెన్షన్‌ మొదలైంది. వీడు ఏం చేద్దామని? కొడుకును అడిగితే ట్రై చేస్తున్నానుగా అంటాడు. రోజూ ఉదయాన్నే లేస్తాడు. కొంతమంది ఫ్రెండ్స్‌కు ఫోన్‌ చేస్తాడు. ఖర్చులకు డబ్బులు అడుగుతాడు. అవి తీసుకుని బయటకు వెళ్లి రాత్రికి తిరిగి వస్తాడు. అలాగని దుర్వ్యసనాలు ఉన్నాయా అంటే లేవు. తిరిగే వాళ్లు కూడా తనలా చదువుకున్నవాళ్లే. మంచి స్నేహితులే. కాని ఏదీ జరగడం లేదు. ‘ఇలా ఎన్నాళ్లు. ఏదో ఒకటి త్వరగా మొదలెట్టాలి నువ్వు’ అన్నాడు తండ్రి ఒకరోజు. కొడుక్కు చాలా కోపం వచ్చింది. ‘ఏం నేను తెస్తేనే తినాలా? నేను మీకు బరువైపోయానా? ఏదైనా సంపాదించి తేవడానికే నన్ను కన్నారా? బయట ఎలా ఉందో మీకేం తెలుసు.

నేనేమీ తాగి తందనాలు ఆడటం లేదు. మీకిష్టం లేకపోతే చెప్పండి ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్లిపోతా’ అన్నాడు. తల్లిదండ్రులు హడలిపోయారు. ‘ఇప్పుడు మేమన్నామనిరా’ అంది తల్లి. ‘నాకంతా తెలుసు. మీ దృష్టిలో కొడుకంటే ఏ.టి.ఎం మిషన్‌. కనేది అందుకే. పెంచేది అందుకే. చదువు చెప్పించేది అందుకే. వాడు ఎంత త్వరగా సంపాదించి తెస్తాడా అని కాచుకుని ఉంటారు మీరు. మీ సుఖాల కోసం మీరు కన్న మేము భస్మమైపోయినా మీకు బాధ లేదు’ అన్నాడు. వాళ్లు మరి మాట్లాడలేదు. ఎటుపోయి ఎటు వస్తుందో అనుకున్నారు. అలాగని ఊరికే కూడా ఉండలేకపోయారు. కొడుక్కు కౌన్సెలింగ్‌ అవసరమని సైకియాట్రిస్ట్‌ దగ్గరకు సలహాకు వచ్చారు.‘వాడికి ఎలా చెప్పాలో తెలియడం లేదు డాక్టర్‌. వాడు సంపాదించి తేవాల్సిందిపోయి ఎదురు ఖర్చు పెట్టిస్తున్నాడు. ఏం చేయాలనేది క్లారిటీ లేదు.

అసలు వాడు బిజినెస్‌కు పనికొస్తాడో రాడో కూడా తెలియడం లేదు. ఏమన్నా అంటే అలగడమో ఇంట్లోనుంచి వెళ్లిపోవడమో లేదా మరో అఘాయిత్యం చేస్తాడనో భయపడి చస్తున్నాం’ అన్నారు వాళ్లు లేడీ సైకియాట్రిస్ట్‌తో. ఆ మరుసటి రోజు ఆ అబ్బాయితో ఆమె మాట్లాడింది. దాని వల్ల ఆమెకు అర్థమైనది ఇది: తల్లి, తండ్రి మంచివాళ్లు. ఇద్దరు కొడుకులను మంచిగా పెంచారు. మంచి స్కూళ్లలో చదివించారు. కాని వారికి కష్టం అంటే తెలియనివ్వలేదు. దగ్గరగా ఉండే స్కూల్లో వేశారు. స్పోర్ట్స్‌లో దెబ్బలు తగులుతాయని కల్చరల్‌ యాక్టివిటీస్‌ని ప్రిఫరెన్స్‌గా పెట్టారు. టీచర్‌ ఏదైనా అంటే వెంటనే వెళ్లి పోట్లాట పెట్టుకునేవారు. ర్యాష్‌గా ఉండే ఫ్రెండ్స్‌తో కలవనిచ్చేవారు కాదు. తాము పడ్డ కష్టాలు పిల్లలు అసలు పడకూడదు అన్నట్టు ఎండ తగలకుండా పెంచారు.

పెద్దకొడుక్కు బిజినెస్‌ చేయాలని గట్టిగా ఉంది. కాని రంగంలో దిగాక అందులోని సవాళ్లు, ప్రతిబంధకాలు, ఎదురు దెబ్బలు తెలిసొచ్చి హడలిపోయి ప్రయత్నమే చేయడం లేదు. బ్యాంక్‌ లోన్లు, పర్మిషన్లు, ఆఫీసర్ల చుట్టూ తిరగడాలు, ఎస్టాబ్లిష్‌మెంట్‌... ఇవన్నీ గుర్తుకొచ్చి హడలిపోతున్నారు. బుర్ర ఉన్నా ధైర్యం లేక బెంబేలెత్తుతున్నాడు. ఆ గిల్ట్‌ని దాచుకోవడానికి ఎదురు తిరుగుతున్నాడు. అందరి నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. ఇది అతడికి కష్టంగా ఉంది. కన్నవారికి నొప్పిగా ఉంది. దీనిని మార్చాల్సిన బాధ్యత సైకియాట్రిస్ట్‌ మీద పడింది. ‘చూడు బాబూ. ప్రస్తుతం నీ మానసిక స్థితి తొలి రోజు స్కూలుకెళ్లే పిల్లాడిలా ఉంది. స్కూలుకెళ్లడానికి ఆ రోజు భయంతో ఏడ్చిన నువ్వు ఆ తర్వాత స్కూల్‌ని ఎంజాయ్‌ చేసి ఉంటావ్‌. ఇప్పుడు నీ నిర్ణయం అమలుకు భయపడే నువ్వు రేపు ఆ పనిని ఎంజాయ్‌ చేయడం మొదలెడతావ్‌.

దానిని ఎదుర్కొనే శక్తి నీకు వస్తుంది. ఆ సామర్థ్యాలకు సరిపడా చదువు చదివావు. మీ కుటుంబంలో వ్యాపారం ఉంది కాబట్టి కొద్దోగొప్పో మెళకువలు నీకు తెలిసే ఉంటాయి. ముందు ప్రయత్నం మొదలుపెట్టు. ఫెయిల్‌ అయితే అవుతావు. కాని నెక్ట్స్‌దాంట్లో సక్సెస్‌ అవుతావు. అదీ ఫెయిలయ్యిందనుకో. ఏదో ఒక ఉద్యోగంలో చేరుతావు. అలా అని అడుగు వేయాలి. తల్లిదండ్రుల దగ్గర రోజూ ఖర్చులకు డబ్బు అడగడానికి నువ్వు చిన్నపిల్లాడివి కాదు. నీ కోసం నీ తమ్ముడి కోసం వాళ్లు ఖర్చు చేయాల్సింది చేసేశారు. ఇక వాళ్లకంటూ ఏదైనా దాచుకోని. లేదా మీకోసం దాచి పెట్టని. రేపు నీకు పెళ్లయితే నువ్వు ఒక కుటుంబాన్ని లీడ్‌ చేయాలి. అప్పుడు ఎవరిని డబ్బు అడుగుతావు? నీ తల్లిదండ్రులో భార్యో ఇవ్వాలా నీకు? పని చేసేది డబ్బు సంపాదించడానికి మాత్రమే కాదు.మనకు మనం ఒక అర్థవంతమైన జీవితం ఇచ్చుకోవడానికి. తప్పించుకుంటూ ఉంటే ఇంటి గడప దాటలేవు. ధైర్యం చేస్తే ప్రపంచం చుట్టి రావచ్చు’ అంది.

కొడుక్కు కొంచెం కొంచెం తన పరిస్థితి అర్థమయ్యింది. సైకియాట్రిస్ట్‌ తల్లిదండ్రులను పిలిచి వారికీ చెప్పింది. ‘చూడండీ... పిల్లలని డేంజర్‌లో పడేయడం వేరు. రిస్క్‌కు దూరంగా ఉంచడం వేరు. రిస్క్‌ లేకుండా లైఫ్‌ లేదు. పిల్లల్ని కనడంలోనే తల్లికి చాలా రిస్క్‌ ఉంది. అలాగని తల్లి ఆ రిస్క్‌ను తప్పించుకుంటోందా? ట్రాఫిక్‌లో సైకిల్‌ నడపొద్దు, లైసెన్స్‌ ఉన్నా హైవే మీద కారు నడపొద్దు, చెల్లించే స్తోమత ఉన్నా లోన్‌ తీసుకోవద్దు, చేయగలిగే సత్తా ఉన్నా ఫలానా పని చేయొద్దు అని పిల్లల్ని వెనక్కు లాగితే పిల్లలు ఇలాగే తయారవుతారు.వారిని రిస్క్‌ తీసుకోనివ్వాలి. ఆ సమయంలో మీరు వారికి సపోర్ట్‌గా నిలవాలి. మీవాడు మొదలెట్టాలనుకుంటున్న బిజినెస్‌లో మీరూ సపోర్ట్‌గా నిలబడండి. మేమున్నాం అన్న ధైర్యం ఇవ్వండి. కిందా మీదా పడనివ్వండి. ఓవర్‌ కాన్షియస్‌గా ఉండొద్దు’ అంది. కొడుకు కొంత మారాడు. తల్లిదండ్రులూ మారారు. కొన్నాళ్లకు స్ట్రగుల్‌ ముగిసింది. పెద్దకొడుకు ఇప్పుడు ఆ ఇంటికి ఇరుభుజాలు ఇచ్చేంత బరువు మోయగలిగేలా ఎదిగాడు.
– కథనం: సాక్షి ఫీచర్స్‌ డెస్క్‌
ఇన్‌పుట్స్‌: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్‌

►‘నాకంతా తెలుసు. మీ దృష్టిలో కొడుకంటే ఎ.టి.ఎం మిషన్‌. కనేది అందుకే. పెంచేది అందుకే. చదువు చెప్పించేది అందుకే. వాడు ఎంత త్వరగా సంపాదించి తెస్తాడా అని కాచుకుని ఉంటారు మీరు. మీ సుఖాల కోసం మీరు కన్న మేము భస్మమైపోయినా మీకు బాధ లేదు’ అన్నాడు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top