ఆకాశమే హద్దు | pakistan lady traning for aircraft | Sakshi
Sakshi News home page

ఆకాశమే హద్దు

Feb 26 2014 12:28 AM | Updated on Sep 2 2017 4:05 AM

ఆకాశమే హద్దు

ఆకాశమే హద్దు

పాకిస్తాన్‌లో మహిళల సాధికారతకు అడ్డుపడే సంప్రదాయ తెరల గురించి తెలియంది ఎవరికి! అక్షరం కోసం పోరాడే మలాలాలే కాదు... ఎన్ని అడ్డంకులెదురైనా ముందుకుపోతూ విజయసౌధాలెక్కుతున్న మహిళలు కూడా ఉన్నారక్కడ.

 పాకిస్తాన్‌లో మహిళల సాధికారతకు అడ్డుపడే సంప్రదాయ తెరల గురించి తెలియంది ఎవరికి! అక్షరం కోసం పోరాడే మలాలాలే కాదు... ఎన్ని అడ్డంకులెదురైనా ముందుకుపోతూ విజయసౌధాలెక్కుతున్న మహిళలు కూడా ఉన్నారక్కడ. ‘అయేషా ఫరూక్’ అలాంటి మహిళే. పాకిస్తాన్ తొలి మహిళా యుద్ధవిమాన పెలైట్‌గా పనిచేస్తున్న ఆమె గురించి మరిన్ని వివరాలు...

 

 పాకిస్తాన్ పంజాబ్ సరిహద్దులో ఉన్న బహవల్‌పూర్ ప్రాంతానికి చెందిన అయేషా పంతొమ్మిదేళ్ల వయసులోనే ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో చేరింది. యుద్ధవిమాన పెలైట్ అవ్వడమే లక్ష్యంగా అయేషాపడ్డ శ్రమ చిన్నదేం కాదు. ఐదేళ్ల కఠినశిక్షణ...మగవారితో సమానంగా కష్టపడాలి. ‘‘మామూలు విమానాలకు, యుద్ధ్దవిమానాలకు నాకు పెద్ద తేడా అనిపించలేదు. అదే ఆకాశం, అదే విమానం’’ అని ఎంతో సున్నితంగా చెబుతుంది అయేషా. అయితే ఆమె తన వృత్తికోసం పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. కారణం... ఆడపిల్లలు రోడ్డుపై బండి నడపడమే తప్పంటే ఏకంగా యుద్ధ విమానాలెక్కుతారా! అని నిలదీసేవారి మధ్యన పెరిగిన అయేషా మౌనంగానే తన ఆశయాన్ని సాధించింది.

 

 

‘‘మా అమ్మ, అమ్మమ్మ కాలానికి మా రోజులకి చాలా మార్పు వచ్చింది. ఆ మార్పునే ఆయుధంగా మలుచుకున్నాను. పెలైట్ అవుతానన్న నా కోరిక గురించి తెలియగానే అమ్మ నోరెళ్లబెట్టింది. ‘ఆ... అయినా అమ్మాయిలకు అలాంటి ఉద్యోగాలెవరిస్తారులే!’ అని కొట్టి పారేసింది. కాని పాకిస్తాన్ సాయుధదళాలలో మహిళలకు కల్పిస్తున్న స్థానం గురించి తెలియగానే చాలా సంతోషించింది’’ అని చెప్పింది అయేషా. ‘‘పాకిస్తాన్‌లో మహిళకు యుద్ధ విమానమెక్కే అవకాశం వచ్చిందనేకంటే అవసరం వచ్చిందంటే మంచిది. నిజమే... దేశంలో ప్రతి ఒక్క పౌరుని పాదంకిందా ముష్కరులు బాంబుల్ని అమర్చారని తెలిసినపుడు పురుషులు మాత్రమే బాధ్యత తీసుకుంటే ఎలా? తన దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందులో లింగభేదాలేమీ ఉండకూడదు.

 

ఆ కారణంగానే నాకు యుద్ధవిమాన పెలైట్ అవ్వాలన్న ఆశ కలిగింది. నాలాంటి మహిళలు చాలా మంది ఉన్నారు. దానికి గత ఏడాది పాకిస్తాన్ సాయుధదళాలలో పనిచేయడానికి ముందుకొచ్చిన మహిళల సంఖ్యే నిదర్శనం. నాతోపాటు మరో 24 మంది మహిళలు యుద్ధవిమాన పెలైట్ శిక్షణ తీసుకుంటున్నారు. వారిలో నేనే మొదటి మహిళను కావడం గర్వంగా ఉంది’’ అంటూ సంతోషాన్ని జోడించి చెప్పింది అయేషా.
 

 

 పోరాటభూమిలో పాతికమంది

 చైనీస్ మోడల్ ఎఫ్ 7పిజి జెట్ విమానాన్ని నడుపుతున్న అయేషా తల్లి చదువుకోలేదు. తన బిడ్డయినా పెద్ద చదువు చదువుకోవాలని కోరుకున్న ఆమె ఏడేళ్లక్రితం భర్తను పోగొట్టుకున్నా ఒంటరిగా బిడ్డను ప్రోత్సహించింది. ‘‘పురుషాధిక్య ప్రపంచంలో ఒక ఆడపిల్ల విమానం నడపాలనుకోవడం పెద్ద ఆశకిందకే వస్తుంది. కానీ పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ మహిళలకు కల్పిస్తున్న స్థానం మా సమాజం కళ్లు తెరిపించిందనుకోవాలి’’ అని చెప్పింది అయేషా. వింగ్ కమాండర్ అబ్బాస్ ఆమెతో మాటకలుపుతూ.. ‘‘పాకిస్తాన్ సాయుధదళాలలో దాదాపు 4 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు. ఎవరూ ఆఫీసు వాతావరణం నుంచి బయటికి రావడానికి సాహసించలేదు. అయేషా ఫారుక్ యుద్ధ విమాన పెలైట్ అవ్వగానే మరో 24మంది మహిళలు హెల్మెట్‌లు పెట్టుకుని ముందుకొచ్చారు. వారిని ప్రోత్సహిస్తున్నాం అంటే అది పొరపాటు. దానికన్నా సాయుధదళంలో పాకిస్తాన్ మహిళల సేవలు అవసరమని గుర్తించామని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం ’’ అని అంటారాయన.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement