యంగ్‌ గర్ల్స్‌

One of the Young Girls video became very viral on Wednesday - Sakshi

ఒంటిని పూర్తిగా కప్పి ఉంచని బట్టలు ప్రేరేపించే దాని కన్నా.. ‘ఒళ్లు కనిపించేలా బట్టలు వేసుకున్నారు..’ అనే మాటే ఒక తగని చూపునకు ఎక్కువ ప్రేరణనిస్తుంది.

మాధవ్‌ శింగరాజు
చూసే ఉంటారు. ఓ మిడిల్‌–ఏజ్డ్‌ ఉమన్‌.. ఓ రెస్టారెంట్‌లో కురచ దుస్తుల్లో కనిపించిన యంగ్‌ గర్ల్స్‌ను తిట్టిపోసిన వీడియో ఒకటి బుధవారం బాగా వైరల్‌ అయింది. పాపం ఆ పిల్లలు హర్ట్‌ అయ్యారు.  అపాలజీ చెప్పమని ఆమెను డిమాండ్‌ చేస్తున్నారు. ‘‘నో.. నేను అపాలజీ చెప్పేది లేదు’’ అంటున్నారు ఆమె. ‘‘చెప్పి తీరాల్సిందే. ఎందుకు చెప్పరు?’ అని అమ్మాయిలు. ‘‘మీరు చేసిన పనికి (ఒళ్లు కనిపించేలా బట్టలు వేసుకోవడం) తగిన పనే (రేప్‌ చెయ్యడం)’’ అని ఆమె! ‘‘చూడు ఏం చేస్తామో.. నిన్ను, నీ మాటల్ని సోషల్‌ మీడియాలో పెడతాం’’ అని వాళ్లు. ‘‘పెట్టుకో పొండి..’’ అని ఆమె. పెట్టేశారు! ఫేస్‌బుక్‌లో వాళ్లు ఆ వీడియోను పోస్ట్‌ చేసిన వెంటనే ట్విట్టర్‌లో ‘ఆంటీజీఅపాలజైస్‌’ అనే హ్యాండిల్‌ వైరల్‌ అయింది. సమస్త ఎంగ్‌–గర్ల్స్‌ ప్రపంచం ఆ అమ్మాయిల వైపు, ఒకరిద్దరు ఆమె వైపు.

ఆమె ఆమె కాకుండా అతను అయి ఉంటే ఆ ఒకరిద్దరు కూడా ఆమె వైపు ఉండేవారు కాకపోవచ్చు. చాలా సివియర్‌ కామెంట్‌ మరి. పశుప్రవృత్తిని ప్రేరేపించడమే. ఒంటిని పూర్తిగా కప్పి ఉంచని బట్టలు ప్రేరేపించే దాని కన్నా.. ‘ఒళ్లు కనిపించేలా బట్టలు వేసుకున్నారు..’ అనే మాటే ఎక్కువ ప్రేరేపిస్తుంది. షార్ట్‌ డ్రెస్‌ని ఒక సాధారణ విషయంగా చూస్తున్న వారికి కూడా.. ‘‘చూశారా, ఎలా వేసుకున్నారో’’ అనే మాటతో వాళ్ల చూపులోకి అసాధారణత్వమేదో వచ్చి చేరుతుంది. తప్పెవరది? వేసుకొచ్చిన అమ్మాయిలదా? ‘వేసుకొచ్చారు చూడండి’ అన్న ఆమెదా? ఆమె పేరు సోమా చక్రవర్తి అని ఆ అమ్మాయిలకు ఆమె తన ఫేస్‌బుక్‌లో అపాలజీ చెప్పినప్పుడు కానీ ఎవరికీ తెలీదు. అవును. సోమా అపాలజీ చెప్పారు.‘అ ఆమ్మాయిలందరికీ మరోమాట లేకుండా క్షమాపణ చెబుతున్నాను.

  హైండ్‌సైట్‌తో (అనాలోచితంగా) నేనలా అన్నాను. అంత కటువుగా, తగనివిధంగా నేను మాట్లాడి ఉండవలసింది కాదు. సంరక్షణగా, పురో గామిగా ఉండాల్సింది పోయి సంప్రదాయవాదిగా, తిరోగామిగా ఉండడం కరెక్ట్‌ కాదని గ్రహించాను’ అని ఆ పోస్ట్‌లో రాశారు. ఆమె తిట్టడం ఎంత కోపం తెప్పించి ఉంటుందో.. సారీ చెప్పడం అంతగా ఆ కోపాన్ని తగ్గించి ఉండాలి ఆ అమ్మాయిలకు. ఇక్కడితో ఇష్యూ అయిపోయినట్లే. అయితే దీనిపై చర్చ ఇప్పుడే మొదలైంది! అయితే చర్చ అమ్మాయిల షార్ట్‌ డ్రెస్‌లపై కాదు. అమ్మాయిల్ని ‘యంగ్‌ గర్ల్స్‌’ అనడంపై.వీడియో వైరల్‌ కాగానే, ‘యంగ్‌ గర్ల్స్‌ కాల్‌ అవుట్‌ (పెద్దగా అరవడం) ఢిల్లీ ఉమన్‌ ఫర్‌ ఆస్కింగ్‌ సెవెన్‌ మెన్‌ టు రేప్‌ గర్ల్స్‌ ఫర్‌ వేరింగ్‌ షార్ట్‌ డ్రస్‌’ అని పేపర్‌లలో హెడ్డింగ్స్‌ వచ్చాయి. దీనిపై నిధి మహాజన్‌ అనే కాలమిస్ట్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ‘ది క్వింట్‌’లో ఒక వ్యాసం రాశారు.

‘యంగ్‌ గర్ల్స్‌’ అనడం ఏమిటన్నది ఆమె ప్రశ్న. వీడియోలో కనిపించిన వాళ్లంతా పద్దెనిమిదేళ్లు దాటిన వాళ్లే అయినప్పుడు వాళ్లను ‘ఉమెన్‌’ అని కాకుండా, ‘యంగ్‌ గర్ల్స్‌’ అనడాన్ని నిధి తప్పు పట్టారు. ‘‘యంగ్‌ గర్ల్స్‌ అనడంలో ‘లోకం తెలియని’ (నయావిటీ) అనే అర్థం «ధ్వనిస్తుంది. లోకం పోకడ తెలిసిన వాళ్లయితే షార్ట్‌ డ్రెస్‌ వేసుకునేవాళ్లు కాదు అనే అర్థం కూడా! అంటే.. వాళ్లు చేసింది తప్పు అని చెప్పడానికి వాళ్లను యంగ్‌ గర్ల్స్‌ని చేస్తున్నాం. మహిళల్ని ఇలా ‘ఇన్‌ఫాంటిలైజ్‌’ చెయ్యడం మొదట మనం మానుకోవాలి’’ అని నిధి ఒపీనియన్‌. ఇన్‌ఫాంటిలైజ్‌ అంటే చిన్నపిల్లల్ని చేసి మాట్లాడ్డం.నిజమే.

ఉమెన్‌ని యంగ్‌ గర్ల్స్‌ అని ఎందుకనాలి? వాళ్లకు నీతి చెప్పడానికొక కారణం వెతుక్కోవడం కాకపోతే! ‘కొంతమంది మహిళల్ని ఒక మహిళ తిట్టిపోశారు’ అన్నప్పుడు పాయింట్‌ మీద చర్చ జరుగుతుంది. ‘కొంతమంది పిల్లల్ని ఒక మహిళ తిట్టి పోశారు’ అన్నప్పుడు చర్చకు పాయింటే ఉండదు. యంగ్‌–గర్ల్స్‌కి, ఏజ్డ్‌ ఉమన్‌కి మధ్య ఫైట్‌ జరిగినప్పుడు ‘క్వైట్‌ నేచురల్‌’ అనే కదా అంటారు!అయినా కురచ బట్టలపై ఈ కాలంలో ఇంకా ఎవరు డిస్కషన్‌ పెడుతున్నారు? పెట్టినా ఎవరు చూస్తున్నారు? తిప్పేయడానికి ఎన్ని చానల్స్‌ లేవూ.. ప్రయోజనకరమైనవి.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top