ముక్కు చేసే ముఖ్యమైన పనులివి...!

Nose Helps In Providing Oxygen To The Lungs - Sakshi

వావ్‌

ఊపిరి పీల్చే ప్రక్రియలో ఆక్సిజన్‌ను ఊపిరితిత్తులకు అందించడంతో పాటు మరికొన్ని ముఖ్యమైన పనులనూ చేస్తుంది ముక్కు. అవేమిటో, వాటి సంక్లిష్టతలెలా ఉంటాయో తెలుసుకుందాం. ముక్కు చేసే పనుల్లో అతి పెద్ద పని అదో ఎయిర్‌ కండిషనర్‌లా వ్యవహరించడం. ముక్కు ప్రతిరోజూ దాదాపు 500 చదరపు అడుగుల పరిమాణంలోని గాలిని శుభ్రపరచి ఊపిరితిత్తులకు పంపుతుంటుంది. చలికాలంలో వాతావరణంలో చాలా పొడిగాలి ఉంటుంది. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ఆ సమయంలో గాలిలో తేమ ఒక్కోసారి 75 నుంచి 80 శాతం వరకు ఉంటుంది. కానీ ఊపిరితిత్తులకు ఎప్పుడూ ఒకేలాంటి గాలి లాంటిది కావాలి. అందుకే ఒక పెద్ద చెట్టు సైజ్‌లో ఉండే ఎయిర్‌ కండిషనర్‌ను కేవలం రెండు సెంటీమీటర్లకు కుదిస్తే ఎలా ఉంటుందో ముక్కులో గాలి తేమను ఒకేలా ఉంచే వ్యవస్థ కూడా అలాగే ఉంటుంది.

ముక్కు రంధ్రాల పని ఇది...
ఒకప్పుడు ఇంట్లో బల్బుల దగ్గరికి, దీపాల దగ్గరికి కీటకాలు రాకుండా చూసేందుకు నూనెలో ముంచి తీసిన పేపర్‌ను వేలాడగట్టేవారు. దానికి పురుగులు అంటుకుపోయేవి. అచ,్చం ముక్కులోని వెంట్రుకలు కూడా ఇదే పని చేస్తాయి. ఆ వెంట్రుకలకు బ్యాక్టీరియా క్రిములు, దుమ్ము ధూళి అలా అంటుకుంటాయి. అయితే అలా చిక్కుకుపోయే వాటిని ముక్కు అక్కడే పేరుకుపోయి ఉండనివ్వదు. అదే జరిగితే కొద్దిగంటల్లోనే అక్కడంతా హానికరమైన క్రిములు పేరుకుపోతాయి. అందుకే అలా పేరుకుపోయిన బ్యాక్టీరియాతో కూడిన మ్యూకస్‌ బ్లాంకెట్‌ను ప్రతి 20 నిమిషాలకొకసారి తొలగిపోయేలా చేస్తుంటుంది ముక్కు. 

అలా తొలగించడానికి సీలియా అనే అతి చిన్న (మైక్రోస్కోపిక్‌) చీపుర్లు పనిచేస్తుంటాయి. అవి కొరడాల్లా కదులుతూ మ్యూకస్‌ను గొంతులోకి నెట్టేస్తుంటాయి. అక్కడ అత్యంత ప్రభావపూర్వకమైన యాసిడ్‌ స్రవించి, ఆ బ్యాక్టీరియాను కాల్చేస్తుంది. ముక్కులోని ఆ సీలియా చీపుర్లు ప్రతి ఒక్క సెకండ్‌కూ పదిసార్లు కొరడా ఝళిపించినట్లుగా కదులుతూ మ్యూకస్‌ను గొంతులోకి నెట్టేస్తుంటాయి. జలుబు చేసినప్పడు ఈ మ్యూకస్‌ మరింత ఎక్కువగా స్రవిస్తుంది. అది గొంతులోకి చేరడానికి బదులు ముక్కు రంధ్రాల ద్వారా బయటకు ప్రవహిస్తుంది. దాన్నే ముక్కు కారడంగా మనం చెబుతుంటాం.

ముక్కు వాసనలను గుర్తుపడుతుందిలా...
ముక్కు విధుల్లో ముఖ్యమైనది వాసన చూడటం కూడా. అది దాదాపుగా 4,000 రకాల వాసనలను గుర్తించగలదు. నిజానికి కొంతమందిలో వాసన పసిగట్టే సామర్థ్యం మిగతావాళ్ల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సామర్థ్యం ఉన్నవారు దాదాపు 10,000 రకాల వాసనలు గుర్తుపట్టగలరు. ప్రతి ముక్కు రంధ్రంలోనూ పేపర్‌ కంటే పలచగా ఉండే పసుపు–బ్రౌన్‌ రంగుల్లో ప్యాచుల్లా ఉండే కణజాలం ఉంటుంది. ప్రతి ప్యాచ్‌లోనూ దాదాపు కోటి రిసెప్టార్‌ కణాలు ఉంటాయి.

ప్రతి కణంలోనూ ఆరు నుంచి ఎనిమిది అతి సన్నటి కేశాల్లా ఉండే నిర్మాణాలు ఉంటాయి. ఇవన్నీ ముక్కు నుంచి మెదడుకు అనుసంధానితమై ఉంటాయి. ఏదైనా వాసన రాగానే... పదార్థాల నుంచి వచ్చిన మాలెక్యూల్స్‌ వాసన గుర్తించే ప్యాచ్‌లను తాకుతాయి. ఆ వెంటనే అక్కడి నుంచి అత్యంత తక్కువ మోతాదులో ఉండే విద్యుత్‌ తరంగాలు  వెలువడి మెదడును చేరతాయి. ఆ విద్యుత్‌ తరంగాలను మెదడు గుర్తించి అది పూలవాసనా లేక వంటింట్లో మరుగుతున్న పులుసా, కాలుతున్న రొట్టెనా మరింకేదైనా వాసనా అని గుర్తిస్తుంది. కేవలం మంచి వాసనల విషయంలోనే కాదు... దుర్వాసనలూ ఇలాగే తెలుస్తాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top