అనేసిన మాట

No research was done Wasted effort - Sakshi

చెట్టు నీడ

మనుషులం కదా.. తెలియకుండానే ముల్లు దిగబడిపోతుంది. లేదా, ముల్లులా మనమే ఎవరికో దిగబడిపోతాం.

మాటను వెనక్కి తీసుకోవడం గురించి ఇంతవరకు పరిశోధనలేం జరగలేదు. వృధా ప్రయాస. అన్నవీ, విన్నవీ మర్చిపోయేలా శాస్త్రజ్ఞులు పరీక్ష నాళికల్లో ఏవైనా రసాయనాలు కలిపి, మనిషి చేత తాగిస్తే.. ఉన్నవి కూడా కొట్టుకునిపోయే ప్రమాదం ఉంటుంది. మనసును నొప్పించిన, మనసు నొచ్చుకున్న మాటలతో పాటు మనసు పొరల్లో జ్ఞాపకాలుగా ఉండిపోయిన మంచి మాటలు కూడా కిల్‌ అయిపోతే ఏం లాభం మనిషి మెదడు అంతగా క్లీన్‌ అయిపోయి! లేదంటే బాధించిన ఆ ఫలానా మాటను మాత్రమే ఏరిపారేసే బయోటెక్నాలజీని కనిపెట్టాలి. కనిపెట్టి, ఆ మాటను తూలినవారి నుంచి, ఏళ్లు గడుస్తున్నా ఆ మాటను తట్టుకోలేకపోతున్నవారి నుంచి.. రెండు చోట్ల నుంచీ ఏకకాలంలో తీసేయాలి. అక్కడితో అయిపోతుందా! మళ్లీ ఏదో ఒకటి అంటాం. ఏదో ఒకటి అనిపించుకుంటాం. ఎంత పెద్ద శాస్త్రమైనా వచ్చినదానికి విరుడుగు కనిపెట్టగలదేమో కానీ, ఊహించనిదానికి ముందే మందు తయారు చేసి ఉంచలేదు. అయితే శాస్త్రంతో జరగనివి కొన్ని సంస్కారంతో సాధ్యం అవుతాయి. ‘నొప్పించక, తానొవ్వక’ తిరగడం అలాంటి సంస్కారమే. మరి ఎంతకాలం తిరుగుతాం.. ఒకర్ని ఒక మాట అనకుండా, ఒకరి చేత ఒక మాట అనిపించుకోకుండా! మనుషులం కదా.. తెలియకుండానే ముల్లు దిగబడిపోతుంది. లేదా, ముల్లులా మనమే ఎవరికో దిగబడిపోతాం. తప్పును దిద్దుకోడానికి మాటను వెనక్కు తీసుకునే ప్రయత్నంలో మళ్లీ ఏ ముల్లునో గుచ్చేసే ప్రమాదం ఉంది కాబట్టి, మాటను దాటుకుని ముందుకు వెళ్లిపోవడమే మనిషి చేయగలిగింది.  అనేసిన మాటలాగే, మీద పడిపోతున్న వయసును కూడా వెనక్కు తీసుకోలేం. అయితే మాటను వెనక్కు తీసుకోవడం వరకు ఈ థియరీ కరెక్టే కానీ, వయసును వెనక్కు తీసుకోవడం కష్టం కాదని కేశవ్‌సింగ్‌ అనే ప్రొఫెసర్‌ అంటున్నారు! 

యు.ఎస్‌.లోని అలబామా యూనివర్సిటీలో ఈయన, మరికొందరు శాస్త్రవేత్తలు కలిసి మనిషి వయసును వెనక్కు తెచ్చే పరిశోధనల్లో మునుపెన్నడూ లేనంతగా ముందుకు వెళ్లిపోయారు! వయసు మీద పడుతోందనడానికి కనిపించే రెండు ప్రధాన సూచనలు.. జుట్టు రాలిపోవడం, చర్మం ముడతలు పడడం. జన్యువుల్లో కలిగే మార్పుల కారణంగా జీవ కణానికి ప్రాణం అయిన ‘మైటోకాండ్రియా’ (జనరేటర్‌)  శక్తిని కోల్పోతున్నప్పుడు వృద్ధాప్యం మొదలౌతుంది. ఈ అలబామావాళ్లేం చేశారంటే.. యవ్వనంలో ఉన్న ఎలుకల్లో మైటోకాండ్రియాను శక్తిహీనం చేసి చూశారు. కొన్ని వారాలకు వాటి చర్మం మీద వార్ధక్యపు ముడతలు వచ్చేశాయి. జుట్టు రాలడం మొదలైంది. ఆ తర్వాత కొన్ని వారాలకు అవే ఎలుకల్లోని మైటోకాండ్రియాను క్రియాశీలం చేసి చూశారు. నెమ్మదిగా మళ్లీ జుట్టు రావడం మొదలైంది. చర్మం కూడా నున్నగా తయారైంది!! ఆశ్చర్యపోయారు. మనిషిలో కూడా మైటోకాండ్రియాను శక్తిమంతంగా ఉంచేందుకు జన్యు పరివర్తనను కట్టడి చేయగలిగితే.. వయసుని మళ్లీ వెనక్కి తెచ్చేసుకోవచ్చని శాస్త్రవేత్తల భావన. ఇది సాధ్యం అవొచ్చు. కాకపోవచ్చు. ఒక ప్రయత్నం అయితే జరిగింది. ఒకవేళ సాధ్యమే అయితే.. దీని పర్యవసానం ఏమిటన్నది ఏ ముందు తరాలకో తెలుస్తుంది. అప్పటికి మనం ఈ కాలాన్ని దాటిపోతాం. వెనక్కు రప్పించుకున్న వయసు సుఖవంతమైనా, దుఃఖభరితమైనా ఆ ముందు తరాలే పడతాయి.  మనిషి మాటకు మాత్రం ఇంత ‘మహద్భాగ్యం’ ఉండకూడదనిపిస్తుంది. ఏదో అనేశాం. అన్నదాన్ని వెనక్కు తీసుకోలేం. అలాగని ముందుకు వెళ్లకుండా అన్నమాట దగ్గరే వెనకే ఉండిపోతే ఎలా? ‘సారీ’తో స్థిమితపడే దారి ఎలాగూ ఉంది. అదృష్టం ఏంటంటే.. ‘సారీ’ అనేది శాస్త్రవేత్తల బీకరుల్లో తయారయ్యే మాట కాదు.
- మాధవ్‌ శింగరాజు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top