ఆ క్షేత్రమే సేంద్రియ విశ్వవిద్యాలయం!

Navdanya Organic Farming Finds a Growing Fan Base in India - Sakshi

నవధాన్య

‘నవధాన్య’.. ఈ పేరు మన దేశంలో జీవవైవిధ్యంతో కూడిన సేంద్రియ సేద్యం గురించి తెలిసిన వారికెవరికైనా చటుక్కున స్ఫురణకు వస్తుంది.. ‘నవధాన్య’ అనగానే వెంటనే మదిలో మెదిలే రూపం సుప్రసిద్ధ శాస్త్రవేత్త, సంప్రదాయ విత్తన హక్కుల పరిరక్షణ ఉద్యమకారిణి డాక్టర్‌ వందనా శివ.. మూడు దశాబ్దాలుగా మన దేశంలో వివిధ దేశీ ఆహార పంటలకు సంబంధించి కనీసం 6 వేల సంప్రదాయ వంగడాలను సేకరించి, కంటికి రెప్పలా కాపాడుతున్న ప్రముఖ సంస్థ ఇది.. ‘నవధాన్య’ జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయానికి, లోతైన శాస్త్రీయ పరిశోధనలకు పట్టుగొమ్మ.. భారతీయ పాత పంటల జీవవైవిధ్య వైభవానికి తలమానికంగా విరాజిల్లుతున్న ‘నవధాన్య’, ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌కు సమీపంలో, హిమాలయాల చెంతన సముద్ర తలానికి 500 మీటర్ల ఎత్తున కొలువై ఉంది.. ఇటీవల ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు డెహ్రాడూన్‌లోని ‘నవధాన్య’ క్షేత్రంలో పంటల వైవిధ్యాన్ని, విత్తన భాండాగారాన్ని దర్శించారు. నవధాన్య ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వినోద్‌ భట్‌తో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ‘సాగుబడి’ పాఠకులకు ప్రత్యేకం..

నవధాన్యాలు.. అంటే తొమ్మిది రకాల విత్తనాలు. నవధాన్యాలకు మన సంప్రదాయంలో విశిష్ట ప్రాధాన్యం ఉన్న సంగతి మనకు తెలిసిందే. జీవవైవిధ్య పరిరక్షణకు, సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకగా డా. వందనా శివ ‘నవధాన్య’ను 1987లో డెహ్రాడూన్‌లో నెలకొల్పారు. 1991లో ఇది ట్రస్టుగా మారింది. వేలాది ఏళ్లుగా మన భూముల్లో విరాజిల్లుతున్న సంప్రదాయ విత్తన వంగడాలను ప్రాణప్రదంగా పరిరక్షించుకోవడం.. విత్తన జ్ఞానాన్ని పదిలపరచుకోవడం.. అంతిమంగా మన విత్తనాలతో కూడిన ఆహార స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకోవడం.. జీవవైవిధ్య సేంద్రియ సేద్యాన్ని చిన్న రైతులకు అందించడం, వారికి సముచితమైన ఆదాయాన్ని అందించే నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయటం.. స్థూలంగా ఇవీ నవధాన్య లక్ష్యాలు.

నవధాన్య ప్రధాన కేంద్రం డెహ్రాడూన్‌ అయినప్పటికీ దేశంలో మరో రెండు చోట్ల ఉప కేంద్రాలున్నాయి. నవధాన్య ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వినోద్‌ భట్‌ ఇలా అన్నారు.. ‘ఇప్పటికి మొత్తం 6 వేల దేశీ పంటల విత్తనాలను పరిరక్షించాం. 22 రాష్ట్రాల్లో 127 సామాజిక విత్తన నిధులను ఏర్పాటు చేశాం. వేప, బాస్మతి వరి, గోధుమలపై విదేశీ కంపెనీలు మేధోపరమైన హక్కులు పొందే ప్రయత్నాలను న్యాయపోరాటం ద్వారా విజయవంతంగా తిప్పికొట్టాం. ఇప్పటికి సుమారు 10 లక్షల మంది చిన్న రైతులు, విత్తన సంరక్షకులు, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల సిబ్బందికి, దేశ విదేశీ కార్యకర్తలు, శాస్త్రవేత్తలకు శిక్షణ ఇచ్చాం.

20 లక్షల ఎకరాలను సేంద్రియ వ్యవసాయంలోకి మళ్లించాం. ఈ రైతుల సాగు ఖర్చును 30%కు తగ్గించి, దిగుబడులు 3 రెట్లు పెంచాం. అంతేకాదు, 40 వేల మంది చిన్న రైతులను కూడగట్టాం. దేశంలోకెల్లా మొదటిగా ఇందుకోసం ‘ఫెయిర్‌ ట్రేడ్‌ నెట్‌వర్క్‌’ను నెలకొల్పాం. వారి సేంద్రియ ఉత్పత్తులను స్థానిక మార్కెట్లలోనే విక్రయిస్తూ, వారికి గౌరవప్రదమైన ఆదాయం వచ్చేలా చేశాం. మోహన్‌ సింగ్‌ అనే ఓ రైతు ఎకరంలో అనేక పంటలు కలిపి సాగు చేసి 2013లో రూ. 80,300 ఆదాయం పొందారు...’ అని అన్నారు.

డెహ్రాడూన్‌లోని నవధాన్య సేంద్రియ వ్యవసాయ క్షేత్రం వయసు 30 ఏళ్లు. 45 ఎకరాల విస్తీర్ణం. చిన్న, చిన్న కమతాలలో ఎన్నో పంటలను కలిపి, సేంద్రియ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. వరిలో తప్ప ఇతర పంటలన్నీ మిశ్రమ పంటలే. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటలు.. అన్నిటినీ కలిపే సాగు చేస్తున్నారు. ప్రతి ఏటా అపురూపమైన ఈ వంగడాలను సాగు చేస్తూ.. విత్తనాలు సేకరించి భద్రపరుస్తున్నారు. రైతులకు ఇస్తున్నారు.

సేంద్రియ ఉత్పత్తులను ఢిల్లీ తదితర చోట్ల విక్రయిస్తున్నారు. అమూల్యమైన ఈ దేశీ వంగడాల విత్తనాలను సంప్రదాయ పద్ధతుల్లో ఇక్కడి విత్తన నిధిలో భద్రపరిచారు. 2017లో ఈ క్షేత్రంలో 1,722 వంగడాలున్నాయి. ఇందులో వరి 730, బాసుమతి 41, గోధుమ 212, కూరగాయలు 158, రాజ్మా 130, పప్పుధాన్యాలు 97, నూనెగింజ రకాలు 54, ఆవ 22, కొర్ర 21, మొక్కజొన్న 20, అమరంత్‌ 3, ఓట్స్‌ 19, రాగి 30, పచ్చిరొట్ట పంటలు 17, సుగంధ ద్రవ్యాలు 58, ఔషధ మొక్కలు 47.. రకాల పంటలను సాగు చేసి, ఆ విత్తనాలను విత్తన నిధిలో ఉంచారు.

ఏక దళ, ద్విదళ పంటలను కలిపి సాగు చేయటం, దేశీ విత్తనాలను భద్రపరచటంతోపాటు.. సేంద్రియ సేద్యం వల్ల దిగుబడులు ఎలా ఉన్నాయి? భూసారం పెరుగుతోందా తగ్గుతోందా? రసాయనిక ఎరువులు వేసే భూముల్లో భూసారం ఎలా ఉంది? వంటి ఆసక్తికరమైన అంశాలపై శాస్త్రీయ పద్ధతిలో తులనాత్మక అధ్యయనాలు చేయటం ‘నవధాన్య’ ప్రత్యేకత. ఇందుకోసం డెహ్రాడూన్‌ నవధాన్య క్షేత్రంలో 2000లోనే సాయిల్‌ ఎకాలజీ ల్యాబ్‌ను నెలకొల్పి ఎప్పటికప్పుడు పరీక్షలు జరుపుతున్నారు.

2014–15లో 5 రాష్ట్రాల్లో డాక్టర్‌ వందనా శివ ఆధ్వర్యంలో చేసిన ఒక అధ్యయనంలో రసాయనిక వ్యవసాయంలో కన్నా సేంద్రియ వ్యవసాయంలో దిగుబడులు వివిధ పంటల్లో 0.85% నుంచి 106.25% వరకు పెరిగాయని తేలింది. రసాయనిక సేద్యంలో ఒకే పంట సాగు వల్ల భూముల్లో సేంద్రియ పదార్థం నిర్దిష్ట కాలంలో 14% తగ్గిపోగా, అదేకాలంలో సేంద్రియ మిశ్రమ పంటలు సాగు చేయటం వల్ల 29–99% వరకు పెరిగిందని నవధాన్య జరిపిన మరో అధ్యయనంలో నమోదైంది.

సేంద్రియ/రసాయనిక వ్యవసాయం వల్ల కలిగే ఫలితాలను గురించి విశ్లేషించినప్పుడు భూసారం, ఉత్పాదకత, ఆదాయం వంటి విషయాల గురించే సాధారణంగా అధ్యయనం చేస్తూ ఉంటారు. అయితే, నవధాన్య అంతటితో సంతృప్తి చెందలేదు. ఎకరానికి సేంద్రియ/రసాయనిక పద్ధతుల్లో ఎంతెంత పరిమాణంలో వివిధ రకాల పోషక పదార్థాలు ఉత్పత్తి అవుతున్నాయో కూడా సశాస్త్రీయంగా అధ్యయనం చేసి, నివేదిక(హెల్త్‌ పర్‌ యాకర్‌)ను ప్రచురించడం విశేషం. సేంద్రియ పద్ధతిలో మిశ్రమ పంటల సాగు(సేంద్రియ పద్ధతుల్లో పొలం అంతటా ఒకే పంటను సాగు చేయడం కూడా అనర్థమే) వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికే మేలు కలగడమే కాదు.. అధిక పరిమాణంలో పోషక పదార్థాల దిగుబడి, తద్వారా ఆకలిని, పౌష్టికాహార లోపాన్ని పారదోలటం కూడా ఈ వ్యవసాయ పద్ధతితోనే సాధ్యమవుతుందని ఈ అధ్యయనం రుజువు చేసిందని చెప్పొచ్చు.

‘దేశీ వరి వంగడాల్లోనూ ఔషధ గుణాలున్నాయి. అయితే, చిరుధాన్యాలను ప్రధానాహారంగా తినటం ద్వారా పౌష్టికాహార లోపాన్ని పూర్తిగా అధిగమించవచ్చు. చిరుధాన్యాల పైనుంచి మన దృష్టి మళ్లించేందుకే బ్రిటిష్‌ పాలకులు వీటికి జంతువుల పేర్లతో (ఉదా.. కొర్రలకు ఫాక్స్‌టెయిల్‌ మిల్లెట్, ఉలవలకు హార్స్‌గ్రామ్‌..) పేరు పెట్టి ఉంటారు. ఇది కుట్ర పూరితంగానే జరిగింది..’ అని నవధాన్య ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ భట్‌ వ్యాఖ్యానించారు. జీవవైవిధ్య సేంద్రియ వ్యవసాయం, దేశీ విత్తన పరిరక్షణ, చిన్న రైతును ఫోకస్‌లోకి తేవడంలో 30 ఏళ్ల క్రితమే ముందు నడచిన సంస్థగా అత్యంత శ్లాఘనీయమైన కృషి చేస్తున్న ‘నవధాన్య’ దిన దిన ప్రవర్థమానం కావాలని ‘సాక్షి సాగుబడి’ ఆకాంక్షిస్తోంది!

సేంద్రియ సేద్యం భూమికి బలం!
ఐదు అంతకన్నా ఎక్కువ ఏళ్ల నుంచి సేంద్రియ, రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్న పొలాల్లో భూసారం స్థితిగతులు ఎలా మారాయన్న అంశంపై డెహ్రాడూన్‌లోని నవధాన్య జీవవైవిధ్య వ్యవసాయ పరిశోధనా సంస్థ గత ఏడాది ఆసక్తికరమైన అధ్యయనం చేసింది. ఈ రెండు రకాల వ్యవసాయ పద్ధతుల వల్ల ఆయా భూముల్లో సూక్ష్మజీవరాశి, పోషకాల స్థాయిల్లో ఎలాంటి మార్పులొచ్చాయో ఉత్తరాఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్రల్లోని వివిధ భూముల్లో శాస్త్రీయంగా అధ్యయనం చేసింది. సేంద్రియ వ్యవసాయ భూముల సారం పెరిగిందని, రసాయనిక వ్యవసాయ భూముల్లో సారం తగ్గిపోయిందని తేలింది(శివ 2017). ఈ పట్టిక చూస్తే సేంద్రియ వ్యవసాయ భూముల్లో సేంద్రియ పదార్థం, నత్రజని, పొటాషియం తదితర పోషకాలు పెరిగిన సంగతి, రసాయనిక వ్యవసాయ భూముల్లో తగ్గిపోయిన సంగతి అర్థమవుతుంది.

  నేలతల్లికి వందనం.!
సముద్ర తలం నుంచి 500 మీటర్ల ఎత్తులో నవధాన్య డెహ్రాడూన్‌ వ్యవసాయ క్షేత్రం ఉంది. జీవవైవిధ్య సేంద్రియ సేద్యం 30 ఏళ్లుగా చేస్తున్న ఆ భూమి జీవజీవాలతో సుసంపన్నంగా విరాజిల్లుతోంది. సేంద్రియ కర్బనం 1.6(తెలుగు రాష్ట్రాల్లోని భూముల్లో సేంద్రియ కర్బనం 0.5–0.2 మధ్యలో ఉన్నట్లు ఒక అంచనా!), సేంద్రియ పదార్థం 6.5, ఉదజని సూచిక 7గా ఉందని నవధాన్య సాయిల్‌ ఎకాలజీ ల్యాబ్‌ నిర్వాహకురాలు భువనేశ్వరి తెలిపారు. 1996లో ఇక్కడ 120 అడుగుల్లో భూగర్భ జలాలు ఉండేవి. 20 ఏళ్లలో నీటి మట్టం 40 అడుగులకు పెరిగాయి. భూమిలో సేంద్రియ కర్బనం, సేంద్రియ పదార్థం పెరుగుతున్న కొద్దీ నీటì  తేమను పట్టుకునే శక్తి భూమికి పెరుగుతుంది. తద్వారా నీటి వినియోగం తగ్గిపోతుంది. ఆ విధంగా ఈ క్షేత్రంలో పంటల సాగుకు 20 ఏళ్లలో నీటి వినియోగం 60% తగ్గిందని భట్‌ వివరించారు.


     నవధాన్య క్షేత్రం వరి పంట


     డెహ్రాడూన్‌ నవధాన్య క్షేత్రంలో వానపాముల విసర్జితాల కనువిందు


 విత్తన నిధిలో వేలాడదీసిన విత్తన కంకులు


         డబ్బాల్లో భద్రపరచిన విత్తనాలు


     డెహ్రాడూన్‌లోని నవధాన్య వ్యవసాయ క్షేత్రం విశిష్టతలను వివరిస్తున్న నవధాన్య ప్రతినిధి భువనేశ్వరి


     www.navdanya.org

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top