దానగుణం అంటే అది!

 That means it is spiritual

ఆత్మీయం

పూర్వం ఒక గొప్ప సంపన్నుడుండేవాడు. అతను దెవభక్తిపరుడు. క్రమం తప్పకుండా దేవాలయానికి వెళ్లేవాడు. కార్తీక వ్రతం ఆచరించేవాడు. విరివిగా దానధర్మాలు చేసేవాడు. కాశీ యాత్ర కూడా చేశాడు. కానీ ఎవరైనా అవసరార్థం పదీపరకా అడిగినా చిల్లిగవ్వ కూడా ఇచ్చేవాడు కాదు. ఒకసారి అతను ఉంటున్న వీధిలోనే ఒక పేద యువతికి ఆ వీధివాళ్ళంతా కలసి పెళ్ళిచెయ్యాలని నిర్ణయించుకొని చందా పోగుచేశారు. ఆ వీధిలోని కొంతమంది పెద్దమనుషులు ఈయన వద్దకు వెళ్ళారు. కాని అతను నేనేమీ ఇవ్వలేనని చెప్పేశాడు. దాంతో పేదలకు సహాయం చెయ్యని దైవభక్తి దేనికని తలా ఓ తిట్టు తిట్టారు. ఈ పూజలు, ఉపవాసాలు ఎందుకని నానా మాటలన్నారు.

అదే గ్రామంలో ఓ మధ్యతరగతి వ్యక్తి ఉండేవాడు. అతను బాగా దానధర్మాలు చేసేవాడు. పేద యువతుల పెళ్ళిళ్ళకు, పేదల చదువులకు, అనాథలకు, వితంతువులకు ఉదారంగా సహాయం చేసేవాడు. ఎవరైనా పేదవ్యక్తి మరణిస్తే వారి అంతిమ సంస్కారాలకయ్యే ఖర్చును భరించేవాడు. అతణì ్ణ ప్రజలు ఎంతగానో గౌరవించేవారు. అతనికోసం పూజలు చేసేవారు.
ఒకసారి ఈ సంపన్న భక్తుడు అనారోగ్యానికి గురయ్యాడు. ప్రజలకు అతని పట్ల ప్రేమ, సానుభూతి లేకున్నా, వ్యాధిగ్రస్తులను పరామర్శించడం పుణ్యకార్యమని పరామర్శకు వెళ్ళారు. ఆశ్చర్యమేమిటంటే, దానధర్మాలు చేసే ఈ మనిషి సంపన్నుడి సేవలో నిమగ్నమై ఉన్నాడు. ఈ దృశ్యాన్ని చూసినవారు ‘నిజంగా మనిషంటే ఈ మహానుభావుడే, ఆ పిసినారి నైజం తెలిసి కూడా అతనికి సేవలు చేస్తున్నాడంటే మామూలు విషయం కాదు’. అని అతణ్ణి కొనియాడారు.

కొన్నాళ్ళకు ఆ సంపన్నుడు మరణించాడు. అందరూ అతని అంతిమ యాత్రలో పాల్గొన్నారు. దహన సంస్కారాలు పూర్తయిన తరువాత ఆ పెద్దమనిషి ‘అందరూ కొద్దిసేపు ఆగండి’ అని చెప్పాడు.. అందరూ స్నానాల తర్వాత శివాలయం ఆవరణలో గుమిగూడిన తరువాత, ‘మిత్రులారా! మీకో విషయం తెలియజెప్పాలి. అందరూ ఆ పెద్దాయన్ని పిసినారి అని తిట్టుకునేవారు కదా... నిజానికి ఆయన గొప్పదాత. కుడిచేత్తో దానం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదన్నది ఆయన పద్ధతి. దానికోసం ఆయన నన్ను ఎన్నుకున్నారు. నేను చేపట్టే సేవాకార్యక్రమాలన్నీ ఆయన సమకూర్చిన ధనంతోనే!’ అని సభికులవైపు చూశాడు. అందరి కళ్లూ సజలాలయ్యాయి. ప్రతి ఒక్కరి చేతులు జోడించి ఆయన ఆత్మశాంతికోసం ప్రార్థన చేశారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top