మన్య దీపిక!

manyam depika farmer producer company - Sakshi

రైతులు.. అందులోనూ గిరిజనులు.. ఇక చెప్పేదేముంది! దిగుబడులు వస్తున్నాయంటే.. దళారుల పంట పండినట్లే కదా!! కానీ, రోజులన్నీ ఒకేలా ఉండవు.. కాలంతోపాటు శ్రీకాకుళం జిల్లా సీతంపేట ప్రాంత అమాయక గిరిజన రైతులూ ఇప్పుడు తెలివి తెచ్చుకుంటున్నారు. రసాయనాల్లేకుండా ప్రాణానికి ప్రాణంగా సాగు చేసిన తమ పంటలకు ఇప్పుడు తామే ధర నిర్ణయించుకుంటున్నారు. ‘మన్య దీపిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ’ని ఏర్పాటు చేసుకున్నారు. తమ ప్రతి ఒక్కరి తలరాతను కలసికట్టుగా తిరగరాసుకుంటున్నారు. కల్లాకపటం లేని ఆ గిరిజన రైతు కలల కంపెనీకి వెలుగుబాట చూపుతున్న మార్గదర్శి.. పడాల భూదేవి! ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చైతన్య దీప్తికి ‘సాగుబడి’ నుంచి జేజేలు!

కొండకోనల్లో, ప్రకృతి ఒడిలో కపటం లేని జీవించే గిరిజన రైతులు అవగాహన లేక, దారిచూపేవారు లేక, ఐక్యత లేక, దళారుల దోపిడీ వల్ల అనాదిగా పేదరికంలో మగ్గిపోతున్నారు. అయితే, శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటీడీఏ పరిధిలోని హిర, సీతంపేట, ఎల్‌ఎన్‌పేట, కొత్తూరు, వీరఘట్టం మండలాల్లో రైతుల సంగతి వేరు. ఈ మండలాల్లో చిన్నయ్య ఆదివాసీ వికాస్‌ సంఘం ఆధ్వర్యంలో సుమారు 4 వేల మంది గిరిజన రైతులు సంఘటితమై భూమి హక్కులను సాధించుకోవడం ద్వారా పేదరికాన్ని అధిగమిస్తున్నారు. ఉమ్మడి భూమి హక్కులు సాధించుకున్నారు. మెరుగైన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అందిపుచ్చుకొని, స్వల్ప ఖర్చుతోనే అధికోత్పత్తి సాధిస్తున్నారు.

అంతేకాదు.. నాబార్డు సహాయంతో 10 నెలల క్రితం ‘మన్య దీపిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌’ను ఏర్పాటు చేసుకొని తాము పండించిన పంటకు తామే ధర నిర్ణయించుకొని పడాల భూదేవి నేతృత్వంలో అధిక నికరాదాయాన్ని పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గిరిజన నేత, తన తండ్రి దివంగత చిన్నయ్య అడుగుజాడల్లో నడుస్తూ భూదేవి గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆధునిక పోకడలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరచుకుంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించే పంటకు అధికాదాయం పొందవచ్చని గిరిజన రైతులను చైతన్య పరచి ఆమె ముందుకు నడిపిస్తున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న తీరు.. భూదేవి మాటల్లోనే..

ఎకరానికి 13 క్వింటాళ్ల చిరుధాన్యాల దిగుబడి
గత 13 సంవత్సరాలుగా సేంద్రియ సాగు విధానాన్ని మా గిరిజన రైతులకు అలవాటు చేశాం. ఇదే క్రమంలో చిరుధాన్యాలు సాగు ప్రారంభించాం. వ్యవసాయ యాంత్రీకరణ, సాగులో ఆధునిక విధానాలు అలవాటు చేస్తున్నాం. రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలను పాత పద్ధతిలో కేవలం ఎకరాకు మూడు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే సాధించేవారు. కొత్త పద్ధతులు అలవాటు చేసిన తరువాత మొక్కలు నాటే ‘గులి’ పద్ధతిలో సాగు చేసి, ఎకరానికి 13 క్వింటాళ్ల దిగుబడి సాధించే స్థాయికి చేరుకున్నారు. సీతంపేట ఐటీడీఏ, నాబార్డు, ఆత్మ, వ్యవసాయశాఖలతో పాటు మరి కొన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో చిరుధాన్యాలు, సేంద్రియ సాగుతో లాభాల బాట పడుతున్నాం.. దాదాపు 3 వేల ఎకరాల్లో రెండు వేల మంది గిరిజన రైతులు చిరుధాన్యాల సాగు చేస్తున్నారు. ఏటా రాగి వంద టన్నులు, కొర్రలు 50, జొన్న 35, సజ్జ 25 టన్నుల వరకూ దిగుబడి వస్తోంది. సొంత విత్తనాలనే వాడుకుంటున్నారు. ఈ సంవత్సరం ఏపీ సీడ్స్‌ సంస్థకు 9 టన్నుల రాగి విత్తనాలు కిలో రూ.36 చొప్పున పంపిణీ చేశాం.

11 మంది డైరెక్టర్లలో ఆరుగురు మహిళలు
ఈ ప్రాంతంలో గిరిజన రైతులు ఎక్కువగా చిరుధాన్యాలను, పప్పుధాన్యాలను సాగు చేస్తున్నారు. వారి ఉత్పత్తులను దళారులకు, లేదా స్థానిక సంతల్లో వచ్చిన ధరకు అమ్మేసుకుంటూ ఉండటం వల్ల ఎంతో ఆదాయాన్ని నష్టపోతుండేవారు. రైతు ఉత్పత్తిదారుల కంపెనీని ఏర్పాటు చేసుకున్నాక తాము నిర్ణయించుకున్న గిట్టుబాటు ధరకు అమ్ముకోగలుగుతున్నాం. ఇందులోని 11 మంది డైరెక్టర్లలో నాతో పాటు ఆరుగురం మహిళా గిరిజన రైతులమే. మన్య దీపిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసుకున్న తర్వాత తమ ఉత్పత్తులకు మేమే ధర నిర్ణయిస్తున్నాం. ఐటీడీఏ సమకూర్చిన గోదాములో సుమారు రూ.5–6 లక్షల ఖరీదైన ప్రాసెసింగ్‌ యంత్రాలను నెలకొల్పాం. కంపెనీలో సీఈవోతోపాటు పార్ట్‌టైమ్‌ సిబ్బంది సహా 30 మంది వరకు సిబ్బంది పనిచేస్తున్నారు.

చిరుధాన్యాల నుంచి బిస్కెట్ల వరకు..
 కొర్ర బియ్యం, సామ బియ్యం, ఊద బియ్యం, జొన్నలు, సజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాలు.. కంది పప్పు, మినప్పప్పు, ఉలవలు, చీపుర్లు, చింతపండు.. వంటి 25 రకాల సరుకులను శుద్ధి చేసి, చక్కగా ప్యాకింగ్‌ చేసి విక్రయిస్తున్నాం. శ్రీకాకుళం రైతుబజారులో, సీతానగరం ఐటీడీఏ ఆవరణలో ప్రత్యేక స్టాల్స్‌ను నిర్వహించడంతోపాటు.. విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంతోపాటు తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌ తదితర రాష్ట్రాలకు కూడా సరుకును నేరుగా వినియోగదారులకు, దుకాణదారులకు విక్రయిస్తున్నాం. అంతకుముందు కుంచం(3 కిలోలు) సేంద్రియ కందులు రూ.90లకు రైతులే స్థానికంగా అమ్ముకునేవాళ్లు. ఇప్పుడు రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ద్వారా రూ. 120కు బయట మార్కెట్లలో అమ్మగలిగాం. కొర్ర ధాన్యాన్ని రైతు నుంచి కిలో రూ. 40కు కొనుగోలు చేసి, శుద్ధిచేసి ప్యాకెట్లలో నింపి రిటైల్‌గా కిలో రూ. 80కు విక్రయిస్తున్నాం. గత పది నెలల్లో 325 మంది రైతులు తమ ఉత్పత్తులను రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ద్వారా విక్రయించారు. ఇప్పటికి నెలకు రూ. 4 లక్షల టర్నోవర్‌ జరుగుతున్నది.

విదేశీ మార్కెట్ల కోసం అన్వేషణ..
మా సేంద్రియ ఉత్పత్తులను మొదట మేము తింటున్నాం. ఉత్పత్తులను మా ప్రాంత హాస్టల్‌ పిల్లలకు, వివిధ రాష్ట్రాల ప్రజలకు అందిస్తున్నాం. ఇక్కడ మార్కెట్‌కు ఇవ్వగా మిగిలే ఉత్పత్తులను విదేశీ మార్కెట్లలో అమ్మేందుకు కూడా మార్గాలను అన్వేషిస్తున్నాం. పీజీఎస్‌ సర్టిఫికేషన్‌ పొందే దశలో ఉన్నాం. అడవి తల్లి ఒడిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగైన మా ఉత్పత్తులను వ్యక్తులు, సంస్థలు ఎవరైనా నేరుగా కొనుగోలు చేయవచ్చు. ట్రాన్స్‌పోర్ట్‌ ద్వారా పంపుతాం.
(వివరాలకు.. మన్య దీపిక రైతు ఉత్పత్తిదారుల కంపెనీ–హిరమండలం, శ్రీకాకుళం జిల్లా– డైరెక్టర్‌ పడాల భూదేవి: 73820 98533, సీఈఓ  కైలాస్‌ సాహు: 88978 65521)

హాస్టళ్లకు రాగి పిండి, చిరుధాన్యాల బిస్కెట్లు..
శ్రీకాకుళం జిల్లాలోని 47 గిరిజన సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు రాగి జావ కోసం ఏడాది కాలంగా నెలకు 9 టన్నుల రాగి పిండిని అందిస్తున్నారు. గిరిజన కుటుంబాల్లో వివిధ కారణాల వల్ల అనేక మంది ఒంటరి మహిళలుగా మిగిలిపోతున్నారు. వీరిలో 15 మందికి ఉపాధి కల్పించేందుకు చిరుధాన్యాలతో రుచికరమైన వంటకాల తయారీని ప్రారంభించాం.

చిరుధాన్యాల పిండితో బిస్కెట్లు, కేక్, జంతికలు, మిక్చర్, పకోడి, రాగిపిండితో అంబలి, సంగటి, అట్లు, రొట్టెలు, లడ్డూలు తయారు చేస్తున్నాం. వాటిని రైతుబజార్లతో పాటు ప్రైవేట్‌ దుకాణాలకు సరఫరా చేస్తున్నాం. వాసన్‌ స్వచ్ఛంద సంస్థ, కృషి విజ్ఞాన కేంద్రం సాంకేతిక సహకారంతో చిరుధాన్యాలతో నెలకు రూ. 5 లక్షల బిస్కెట్లను తయారు చేస్తున్నాం.  ఐటీడీఏ సహకారంతో రోజుకు 11 వేల బిస్కెట్లు గిరిజన విద్యార్థులకు అందిస్తున్నాం.  
– అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం
ఫొటోలు: కుప్పిలి జయశంకర్, సాక్షి ఫొటో జర్నలిస్టు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top