నా బిడియమే నన్ను కాపాడింది

Mahatma Gandhi Biography Article News In Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

గాంధీజీ తన ఆత్మకథను 1925–1929 వరకు గుజరాతీ భాషలో రాశారు. ఆంగ్లంలోకి  మహదేవ్‌ దేశాయ్‌ అనువదించారు. దాని  తెలుగు అనువాదంలోంచి మహాత్ముడికి ఉండిన స్టేజ్‌ ఫియర్‌ గురించి చెప్పే కొంతభాగం. సౌజన్యం: పి.రాజేశ్వరరావు, ప్రగతి పబ్లిషర్స్‌.

అన్నాహార మండల కార్యనిర్వాహక సమితికి మెంబరుగా ఎన్నుకోబడి ప్రతి మీటింగుకు హాజరవుతూ ఉండేవాణ్ణి. కానీ మాట్లాడటానికి నోరు తెరుపుడు పడేది కాదు. డాక్టర్‌ ఓల్డ్‌ఫీల్డు యీ విషయం గమనించి ‘‘నీవు నాతో బాగా మాట్లాడతావు కానీ సమావేశంలో ఎన్నడూ నోరు తెరవవు. అందువల్ల నీకు మగ తేనెటీగ అనే పేరు పెట్టవచ్చు’’ అని అన్నాడు. నాకు ఆయన వ్యంగ్యం అర్థమైంది. ఆడతేనెటీగలు ఎప్పుడూ శ్రమపడుతూ వుంటాయి. కానీ మగతేనెటీగ తినడం తాగడమేగానీ పనిచేయదు. సోమరిపోతన్నమాట. కమిటీ మీటింగులో అంతా తమతమ అభిప్రాయాలు చెబుతూ వుండేవారు. కానీ నేను మాత్రం నోరు తెరిచేవాణ్ణి కాదు. మాట్లాడాలనే కాంక్ష లేక కాదు. నోరు తెరిస్తే ఏం మాట్లాడాలి? నాకంటే మిగతా మెంబర్లంతా ఎక్కువ తెలిసిన వారుగా కనబడేవారు. ఒక్కొక్కప్పుడు విషయం మీద మాట్లాడాలని సిద్ధపడేవాణ్ణి కానీ యింతలో మరో విషయం మీద చర్చ ప్రారంభమయ్యేది.

నేను ఒకసారి వెంటసన్‌ అనే ఊరు వెళ్లాను. నా వెంట మజుందార్‌ కూడా వున్నారు. ‘‘ది ఎథిక్స్‌ ఆఫ్‌ డైట్‌’’ గ్రంథం రచించిన హోవర్డు గారు కూడా అక్కడే నివసిస్తున్నారు. ఆయన శాకాహార ప్రవర్తక సభలో ఉపన్యసించమని మమ్మల్ని ఆహ్వానించారు. అట్టి సభలో రాసుకొని వెళ్లి చదవడం తప్పుకాదని తెలుసుకున్నాను. పరస్పర సంబంధం పోకుండా వుండేందుకు, ప్రసంగం క్లుప్తంగా వుండేందుకుగాను చాలామంది అలాచేస్తారని తెలిసింది. ఆశువుగా ఉపన్యసించడం అసంభవం. అందువల్ల అనుకున్న విషయమంతా రాసి తీసుకువెళ్లాను. ఒక ఫుల్‌స్కేపు ఠావు కంటే అది ఎక్కువగా లేదు. కానీ లేచి నుంచునే సరికి కళ్లు తిరిగాయి. వణుకు పట్టుకుంది. అప్పుడు మజుందార్‌ నా కాగితం తీసుకొని చదివారు.

ఆయన ప్రత్యేకించి ఉపన్యాసం కూడా చేశారు. అపుడు శ్రోతలు కరతాళ ధ్వనులు చేశారు. నాకు బాగా సిగ్గేసింది. నా అసమర్థతకు విచారం కూడా కలిగింది. ఆంగ్లదేశం విడిచి వచ్చేటప్పుడు చివరి ప్రయత్నం కూడా చేశాను. అప్పుడు కూడా అంతా అస్తవ్యస్తం అయింది. శాకాహారులైన మిత్రులకు హాల్‌బార్న్‌ రెస్టారెంటులో డిన్నర్‌ ఏర్పాటు చేశాను. ఆలోచించి ఆలోచించి మాట్లాడదలచిన విషయాన్ని కొన్ని వాక్యాల్లో ఇముడ్చుకొని మాట్లాడటం ప్రారంభించాను. మొదటి వాక్యంతో ప్రసంగం ఆగిపోయింది. రెండో వాక్యం నోట వెలువడలేదు. అంతా మరిచిపోయాను. చివరికి తమరు దయతో విచ్చేసినందుకు వందనాలు అంటూ ముగించివేశాను.

నన్నుయీ బిడియం చాలా కాలం వదలలేదు. దక్షిణాఫ్రికా వెళ్లిన తరువాత అక్కడ చాలావరకు తగ్గిపోయింది. ఆశువుగా నేను మాట్లాడలేను. కొత్తవారిని చూస్తే నాకు సంకోచం కలుగుతుంది. మాట్లాడకుండా తప్పించుకొనేందుకు ప్రయత్నించేవాణ్ణి. యిప్పటికి కూడా గాలి పోగుచేసి మాట్లాడటం నాకు చేతగాదు.సామాన్యంగా అబద్ధం చెప్పడం, అతిశయోక్తులు పలకడం, సత్యాల్ని మరుగుపరచడం మనిషికి కలిగే సహజ దౌర్బల్యం. అయితే మితభాషి అర్థం లేని మాటలు మాట్లాడడు. ప్రతి మాట ఆచి తూచి మాట్లాడతాడు. మాట్లాడటానికి ఆరాటపడే వారిని మనం చూస్తుంటాం. మేమంటే మేము అని అధ్యక్షుణ్ణి ఒత్తిడి చేస్తుంటారు. అనుమతి ఇవ్వగానే వక్త సామాన్యంగా సమయాన్ని అతిక్రమించడం జరుగుతుంటుంది. యిలా మాట్లాడే వారివల్ల మేలేమీ జరగదు. పైగా కాలహరణం జరుగుతుంది. అందువల్ల నా బిడియం నన్ను కాపాడింది. సత్యశోధనకు అది ఎంతగానో సహకరించింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top