ఆకాశ పెళ్లికొడుకు

 Indian Groom In Mexico Skydives To Own Wedding As Baraatis Watch In Awe - Sakshi

పెళ్లిని అందరూ గుర్తుపెట్టుకునేలా వైభవంగా జరిపించుకోవాలనుకోవడం పెళ్లిచేసుకోబోయే ఎవరికైనా అనిపించడం కామన్‌! కాని ఫీట్లు చేయాలనుకోవడమే అన్‌కామన్‌! ఒకింత వెర్రి అని కూడా ఇక్కడ ప్రస్తావించబోయే పెళ్లికొడుకు విషయంలో అనుకోవచ్చు! ఈ సంగతి చెప్పడానికి ప్రత్యేకించి సందర్భమేదీ లేదండోయ్‌.. పెళ్లికొడుకు పెళ్లిపందిట్లోకి బ్యాండ్‌మేళాల ఎదురుకోలుతోనో.. గుర్రం స్వారీ చేస్తూ బారాత్‌తోనో రాకుండా ఏకంగా స్కైడైవ్‌ చేస్తూ పెళ్లిమండపంలోకి ఊడిపడ్డాడు.. ఆ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడ్తోంది. అందుకే ఈ వార్త. అంతే! అసలు విషయంలోకి వద్దాం.. ఆకాశ్‌ యాదవ్‌ అమెరికాలో పుట్టిపెరిగిన భారతీయుడు. అతను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి గగన్‌ప్రీత్‌ సింగ్‌తో మెక్సికోలోని లాస్‌ కేబోస్‌ (డెస్టినేషన్‌ వెడ్డింగ్‌)లోని సముద్రం ఒడ్డున ఉన్న కళ్యాణ వేదికలో వివాహం నిశ్చయమైంది.

ఆ శుభ ఘడియ రానేవచ్చింది. అయిదు వందల మంది అతిథులు హాజరయ్యారు. మంటపానికి తన ఎంట్రీని బోట్‌లో వచ్చేలా ప్లాన్‌ చేయమని వెడ్డింగ్‌ ప్లానర్‌కి చెప్పాడు ఆకాశ్‌. ఆ ప్రకారమే వెడ్డింగ్‌ ప్లానర్‌ ప్రణాళిక వేయబోయాడు కాని అధికారుల అనుమతి దొరకలేదు. ‘‘అయినా వెనక్కితగ్గేది లేదు.. సముద్ర మార్గం కాకపోతే ఆకాశ మార్గాన దిగుతా’’ అని వెంటనే స్కైడైవింగ్‌కి మారిపోయాడు వరుడు. పెళ్లిరోజు.. ముహూర్తం దగ్గరపడ్తుండగా.. అయిదువందల మంది నింగికేసి చూస్తూండగా..  పసుపు, తెలుపు రంగులో ఉన్న పారాచూట్‌తో వేదిక దగ్గర వాలాడు ఆకాశ్‌ యాదవ్‌! అబ్బాయి ఎగురుతూ రావడాన్ని యూకేకు చెందిన జోహైబ్‌ అలీ అనే ఫొటోగ్రాఫర్‌ కెమెరాలో బంధించాడు. ఆకాశ్‌ అని పేరుపెట్టినందుకు బాగానే వచ్చాడు ఆకాశ మార్గాన.. పెళ్లికన్నా పెళ్లికొడుకు ఎంట్రీఫీట్‌ సూపర్బ్‌ అని సరదాపడ్డారట అతిథులు!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top