ఫ్యూచర్‌ ఫుడ్స్‌!

Hymavathi Interview on Functional Foods - Sakshi

చిరుధాన్యాల ఆహారంపై అపోహలొద్దు..

అన్ని వయసుల వారూ తినొచ్చు..

కొత్తవారు నెల రోజుల్లో క్రమంగా అలవాటు చేసుకోవచ్చు

పిల్లలు, వృద్ధులకు మాల్ట్, ఫెర్మెంటెడ్‌ ఉత్పత్తులు శ్రేష్టం

ఫుడ్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌ ప్రొఫెసర్‌ డా. హైమావతితో ముఖాముఖి

వాతావరణ మార్పులతో భూతాపం పెరిగిపోతున్న నేపథ్యంలో చిరుధాన్యాలతో తయారైన ఫంక్షనల్‌ ఫుడ్స్‌ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకే ఇవి ఫ్యూచర్‌ ఫుడ్స్‌ అంటున్నారు డాక్టర్‌ టి. వి. హైమావతి. రాజేంద్రనగర్‌లోని ప్రొ. జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం హోం సైన్స్‌ విభాగంలో డా. హైమావతి ఫుడ్స్‌ అండ్‌ న్యూట్రిషన్‌ ప్రొఫెసర్‌గా సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్నారు. తమ సంస్థలో చిరుధాన్యాలపై ముప్పయ్యేళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. చిరుధాన్యాలతో 35 రకాల విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఇందుకోసం ఎక్స్‌ట్రూడెడ్‌ టెక్నాలజీ సహా అత్యాధునిక టెక్నాలజీలను అభివృద్ధి చేశారు. వాణిజ్యవేత్తలు, రైతులు ఈ సేవలను తగిన చార్జీలు చెల్లించి వినియోగించుకోవచ్చని ఆమె తెలిపారు.

చిరుధాన్యాలను శుద్ధి చేయడం, సులువుగా తినడానికి వీలైన అనేక ఉత్పత్తులను తయారు చేయడంపై మీరు పరిశోధనలు చేస్తున్నారు కదా ఆ వివరాలు చెప్తారా?
30 ఏళ్ల క్రితం నుంచే మా యూనివర్సిటీలో చిరుధాన్యాల ఉత్పత్తులపై పరిశోధనలు చేస్తున్నాం. కెనడా, నెదర్లాండ్స్‌ ప్రాజెక్టులపై రీసెర్చ్‌ చేశాం. అందులో భాగంగా చిరుధాన్యాల పైపొట్టు తీయడానికి ఉపయోగపడే చిన్న (డీహల్లర్‌) యంత్రాన్ని తయారు చేయించి, అప్పట్లో రూ. 13 వేలకే అందుబాటులోకి తెచ్చాం. మేము వినియోగించడంతోపాటు మహిళా బృందాలు, స్వచ్ఛంద సంస్థలకు కూడా శిక్షణ ఇచ్చి చిరుధాన్యాల వినియోగాన్ని పెంచడానికి ప్రయత్నించాం. చిరుధాన్యాలు కొత్త కాదు. అయితే, రొట్టెలు, అంబలి వండుకొని తినటం వరకే అప్పటికి తెలుసు. అందుకని చిరుధాన్యాలతో అనేక రకాల ఆహార ఉత్పత్తుల తయారీపై పరిశోధనలు చేపట్టి, కొన్ని టెక్నాలజీలను తయారు చేసి, కమర్షియలైజ్‌ చేశాం. ఇవన్నీ చేయడానికి కారణం ఏమిటంటే వాతావరణ మార్పుల(క్లైమెట్‌ ఛేంజ్‌)తో పాటు సుగర్, బీపీ, కేన్సర్‌ వంటి లైఫ్‌ స్టైల్‌ డిసీజెస్‌ సమాజంలో పెరిగిపోవడమే. ఈ జబ్బులను వాతావరణ మార్పులు మరింత ఉధృతం చేస్తాయి. దీన్ని తట్టుకోవాలంటే మనం ఖచ్చితంగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి.

మన ఆహారంలో ఏ మార్పులు అవసరం?
తప్పకుండా మన ఆహారం మార్చుకోవాలి. మన దేహంలో ఇప్పటికే జరిగిన అనారోగ్యకర మార్పులు ఆపాలి. రాబోయే మార్పులను అడ్డుకోవాలి. ఇందుకోసం వాతావరణ మార్పులను తట్టుకునే చిరుధాన్యాలు బాగా ఉపయోగపడతాయి. చిరుధాన్యాల్లో మినరల్స్, ప్రొటీన్ల వంటి పోషకాల నాణ్యత మారదు. మిగతా గ్రెయిన్స్‌లో పోషకాల నాణ్యత మారిపోయే ఛాన్సెస్‌ ఎక్కువ. కాబట్టి వాతావరణ మార్పులను తట్టుకొని పండేవి కావడం వల్ల చిరుధాన్యాల ఆహారాన్ని తీసుకోవడం మంచిది. రిఫైన్డ్‌ వరి బియ్యం, రిఫైన్డ్‌ గోధుమలు తీసుకోవడం వల్ల డైటరీ ఫైబర్‌ సరిపోను మనకు అందటం లేదు. రోజుకు కనీసం 40 గ్రాముల పీచు పదార్థం ఉన్న ఆహారాన్ని ప్రతి మనిషీ తీసుకోవాలి. చిరుధాన్యాలను ప్రధానాహారంగా తీసుకుంటేనే ఇది సాధ్యం.

లైఫ్‌ స్టైల్‌ డిసీజెస్‌ రాకుండా ఆపడానికి, వచ్చిన తర్వాత తీవ్రతరం కాకుండా చూడడానికి చిరుధాన్యాల ఆహారం ఉపయోగపడుతుంది. లైఫ్‌ స్టైల్‌ డిసీజెస్‌ వున్న వారిలో కళ్లు, చర్మం, కిడ్నీలలో వచ్చే మార్పులను వాయిదా వేయడానికి ఈ ఆహారం ఉపయోగపడుతుంది. ఖచ్చితమైన ప్రయోజనాన్ని చేకూర్చుతాయి కాబట్టే వీటిని ఫంక్షనల్‌ ఫుడ్స్‌ అంటారు. మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్‌ అధికంగా ఉండటంతోపాటు.. కొందరికి సరిపడని గ్లూటెన్‌ లేకపోవడం కూడా చిరుధాన్యాల ప్రత్యేకత.

చిరుధాన్యాలను ఏ వయసు వారైనా తినొచ్చా?
ఏ వయసు వారైనా తినొచ్చు. అయితే, వయసును బట్టి మోతాదు మారాలి. 2–3 సంవత్సరాల పిల్లలకు మాల్ట్‌ (మొలకగట్టి) చేసినవి, ఫర్మెంట్‌ చేసిన చిరుధాన్య ఉత్పత్తులు ఇవ్వవచ్చు. పిల్లలు పెరిగేకొద్దీ మామూలు కేక్స్, బిస్కెట్లకు బదులుగా లెస్‌ రిఫైన్డ్‌ ఫ్లోర్స్‌తో ‘రీఫార్ములేట్‌’ చేసిన స్నాక్స్‌ ఇవ్వొచ్చు. పెద్దలు హోల్‌ గ్రెయిన్స్‌ గాని, హోల్‌ గ్రెయిన్‌ ఫ్లోర్‌తో తయారు చేసినవి వాడొచ్చు. పొట్టు తీయని చిరుధాన్యాల్లో ఫైటో కెమికల్స్‌ ఉంటాయి. లైఫ్‌ స్టైల్‌ డిసీజెస్‌ రాకుండా ఆపుతాయి. ఈ వ్యాధులు ఉన్నవారు తింటే తీవ్రత తగ్గుతుంది. మిల్లెట్స్‌ను మనం ఎక్కువగా తినాలి. రైతులు కూడా వీటిని ఎక్కువగా పండించాలి.

రైతులకు మీరు ఎలా సహాయపడగలరు?
రైతులు పండించిన ముడి చిరుధాన్యాలను తీసుకొచ్చి మా దగ్గర ఉన్న యంత్రాలను తగిన చార్జీలు చెల్లించి రాళ్లు, ఇసుక లేకుండా శుద్ధి చేసుకోవచ్చు. ముడి చిరుధాన్యాలపై పొట్టు తీసి బియ్యం తయారు చేసే యంత్రాలను వినియోగించుకోవచ్చు. ఒక్కో పనికి ఒక్కో చార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

వాణిజ్య సంస్థలకు ఎటువంటి సేవలు అందిస్తారు?
చిరుధాన్యాల బియ్యంతో 35 రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవడానికి మా దగ్గర అవకాశం ఉంది. వీటిని తయారు చేసుకోవాలనుకునే వాణిజ్యసంస్థలు  టెక్నాలజీ మా దగ్గర కొనుక్కోవచ్చు. మా దగ్గరే ఉత్పత్తులను తయారు చేసుకొని మార్కెట్‌ చేసుకోవచ్చు. అయితే, చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది

చిరుధాన్యాల ఆరోగ్య ప్రయోజనాలేమిటి?
చిరుధాన్యాలన్నీ ఆరోగ్యప్రయోజనాలను అందిస్తాయి. మనదగ్గర వరిబియ్యం తింటున్నాం. బయట దొరికే ఫుడ్స్‌ అన్నీ రిఫైన్డ్‌ ఫ్లోర్స్‌తో చేసినవే. వీటిని తగ్గించుకుంటూ.. ఫైబర్‌ ఎక్కువ ఉన్న చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
చిరుధాన్యాలు తినటం అసలు అలవాటు లేని వారు కొద్ది కొద్దిగా తక్కువ మోతాదులో తింటూ అలవాటు చేసుకోవాలి. స్నాక్స్‌తో ప్రారంభించాలి. తర్వాత చిరుధాన్యాలతో చేసిన బ్రేక్‌ ఫాస్ట్‌ను, ఆ తర్వాత మధ్యాహ్న భోజనంలో కూడా చిరుధాన్యాలు తినొచ్చు. వారానికోసారి మోతాదు పెంచుకుంటూ చిరుధాన్యాలను తినటం అలవాటు చేసుకోవచ్చు. వారానికి కొంచెం పెంచుకుంటూ నెల రోజుల్లో చిరుధాన్యాల ఆహారంలోకి పూర్తిగా మారొచ్చు. తినే వారి వయసును బట్టి రూపం మార్చి ఇవ్వాలి. పిల్లలు, వృద్ధులకు మొలక గట్టినవి, పొట్టుతీసిన పిండితో తయారు చేసిన జావలు, అంబలి ఇస్తే మంచిది. కేవలం జావ, అంబలే రోజంతా తినటం ఇబ్బంది కావచ్చు. బిస్‌ బెళా బాత్, ఉప్మా వంటి రకరకాల వంటలు తినాలి.

ఏయే చిరుధాన్యాలు మంచివి?
చిరుధాన్యాల్లో అన్నీ మంచివే. అయితే, రాగులు, సజ్జలు, జొన్న(మేజర్‌ మిల్లెట్స్‌)లో కన్నా.. కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, ఒరిగలు వంటి చిరుధాన్యా(స్మాల్‌ మిల్లెట్స్‌)ల్లో పోషకాలు, పీచు అధికంగా ఉంటాయి. ఒక్కో దానిలో కొన్ని పోషకాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి, ఒకే రకం చిరుధాన్యం మాత్రమే రోజూ తినటం కన్నా.. ఎక్కువ రకాలు తినటం మంచిది. ఒక్కో రకంలో పోషకాలు, రుచి వేర్వేరుగా ఉంటాయి. వీలైనన్ని ఎక్కువ రకాలు తినాలి.

ఎండాకాలంలో వీటి వల్ల సమస్యలుంటాయా?
ఎండాకాలం సాధారణంగానే ఎక్కువ నీరు తాగాలి. ఏ కాలంలోనైనా చిరుధాన్యాలు తినొచ్చు.  ఎండాకాలంలోనూ ఇబ్బందులేమీ రావు.

గర్భవతులు, బాలింతలు కూడా తొనొచ్చా?
తినొచ్చు. ఏమీ అభ్యంతరం లేదు. గర్భవతులకు చిరుధాన్యాల ఆహారం మంచిదే. మలబద్ధకం పోతుంది. పోషకాలూ అందుతాయి. బాలింతలు కూడా నిక్షేపంగా తినొచ్చు.  అయితే, చిన్న పిల్లలు, 70 ఏళ్లు దాటిన వృద్ధులకు సక్రమంగా జీర్ణం కావడానికి మొలక గట్టిన పిండి(మాల్ట్‌)తో జావ ఇవ్వాలి. 

మిల్లెట్స్‌ తింటే థైరాయిడ్‌ సమస్య వస్తుందా?
అలాంటిదేమీ లేదు. చిరుధాన్యాల వల్ల థైరాయిడ్‌ సమస్య వస్తుందనటం లేదా పెరుగుతుందనడం సరికాదు. శాస్త్రీయంగా ఎక్కడా రుజువు కాలేదు. తీవ్ర అనారోగ్యం ఉండి, గ్లూకోజ్‌ వేగంగా అందాల్సిన ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న వారు తప్ప చిరుధాన్యాలు ఎవరైనా తినవచ్చు.  

మీ పరిశోధనల్లో తేలిన విషయాలేమైనా చెబుతారా?
ప్రీడయాబెటిక్‌ దశలో ఉన్న వారికి నెల రోజులు కేవలం మధ్యాహ్న భోజనంలో 65 గ్రాముల కొర్ర అన్నం వడ్డిస్తే లిపిడ్, సుగర్‌ లెవల్స్‌ తగ్గాయి. డా. హైమావతి ఈ–మెయిల్‌ :mpic.milletfoods@gmail.com
ఇంటర్వ్యూ: పంతంగి రాంబాబు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top