రేపిస్ట్‌లూ ఖబడ్దార్‌

hollywood stars protest to  raped - Sakshi

దావానలం

హాలీవుడ్‌ని ఊపేస్తున్న ‘మీ టూ’ ఉద్యమం

85 దేశాలకు పాకిన ‘మీ టూ’ ఉద్యమం అత్యాచారాలు చేసిన పెద్దమనుషుల బండారాన్ని సోషల్‌ మీడియా ద్వారా ప్రపంచానికి బహిర్గతం చేస్తూ ఉంది.

‘మీ టూ’ అంటే ‘నేను కూడా’ లేదా‘నాక్కూడా’ అని అర్థం. ‘నా మీద లైంగికదాడి జరిగింది’ అని ఒకరు ప్రకటిస్తే... ‘నా మీద కూడా’ అని మరొకరు తోడు నిలిచే ఈ ఉద్యమం ఇప్పుడు అమెరికా నుంచి దాదాపు 85 దేశాలకు పాకింది. నిజానికి ఈ ఉద్యమం 2006లో మొదలైనా మొన్నటి అక్టోబర్‌ నుంచే విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది. దానికి కారణం హాలీవుడ్‌ నిర్మాత ‘హార్వే వెయిన్‌స్టైన్‌’. దాదాపు డజను సినిమాలు మరెన్నో నాటకాలు, బ్యాలేలు ప్రొడ్యూస్‌ చేసిన హార్వేపై అక్టోబర్, 2017లో దాదాపు ఆరుమంది నటీమణులు అతడు తమపై లైంగిక దాడి చేశాడని, లైంగికంగా వేధించాడని ఫిర్యాదు చేశారు. దాంతో ఈ వ్యవహారం దావానలంలా అంటుకుంది. హాలీవుడ్‌ నటి అలిసా మిలానో ‘మీ టూ ఉద్యమం కింద వెయిన్‌స్టైన్‌ వల్ల దాడికి గురైన వారందరూ తమ తమ అనుభవాలను పంచుకోండి’ అని ప్రోత్సహించింది. దాంతో ఒక్కొక్కరుగా ‘మీ టూ’ను హాష్‌ టాగ్‌ చేసి తమ అనుభవాలు చెప్పడం ప్రారంభించారు. ఈ సంఖ్య ఎంత ఎక్కువగా ఉందంటే వెయిన్‌స్టైన్‌ పరువు గంగలో కలిసి అతడి మీద విచారణ మొదలైంది. అయితే ఆ తర్వాతే పెద్ద మలుపు తిరిగింది. అసలు ఇప్పటి వరకూ హాలీవుడ్‌లో ఎవరెవరు తమపై లైంగిక దాడులు చేశారో వాళ్లందరి పేర్లను బాధితులు ‘మీ టూ’ ఉద్యమం కింద బయట పెట్టడం మొదలుపెట్టారు. హాలీవుడ్‌ ఉద్దండుల పేర్లతో పాటు ప్రపంచంలోని వివిధ రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఇలాంటి నీచ ప్రవర్తన కలిగి ఉన్నారని ‘మీ టూ’ ఉద్యమం తేటతెల్లం చేస్తూ ఉంది.

‘ప్రముఖులు కాబట్టి మీకు ఆశ్చర్యంగా ఉంది. కానీ ఇలాంటి దాడులు చేసేవారు ప్రతిచోటా ఉంటారు. వారందరికీ తగిన గుణపాఠం చెప్పాల్సిందే’ అని మీ టూ ఉద్యమకారులు చెబుతున్నారు. రోడ్ల మీద, పని స్థలాలలో స్త్రీల మీద పరుషమైన వ్యాఖ్యలు చేయడం కూడా లైంగిక వేధింపు కిందకు వస్తుంది. అలాంటి వారిని ఎక్స్‌పోజ్‌ చేయాలని ఈ ఉద్యమకారులు ప్రోత్సహిస్తున్నారు. తాజాగా మొన్న ఆదివారం హాలీవుడ్‌లో (కాలిఫోర్నియా) నిర్మాతల నుంచి, దర్శకుల నుంచి లైంగిక వేధింపులు పొందిన నటీమణులు అంతా పెద్ద ఎత్తున గుమిగూడి ర్యాలీ నిర్వహించారు. ‘ఇది ప్రపంచం మారాల్సిన సమయం’ అని నినదించారు. ‘ఇంతకాలం నాకు జరిగింది చెప్పుకోవడానికి నేనొక్కదాన్నే ఏమో అని భయపడేదాన్ని. ఇప్పుడు నాకు తోడుగా ఇంతమంది ఉన్నారని తెలిశాక ఆనందంతో కన్నీరు వస్తోంది’ అని ఒక బాధితురాలు చెప్పిన మాటలు ఈ సమయంలో గమనించదగ్గవి. లైంగిక అత్యాచారాలు, వేధింపులు చేసి తప్పించుకోవచ్చనుకునే మగరాయుళ్లు చట్టాల నుంచి తప్పించుకున్నా సోషల్‌ మీడియా నుంచి తప్పించుకోలేని రోజులు వచ్చాయి. తోక జాడించే మగవారూ బహుపరాక్‌.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top