రాబంధువులు

Her Relatives Became Enemies - Sakshi

బంధాన్ని గౌరవించేవారు బంధువులు. కనుమరుగైన బంధాన్ని నిలబెట్టేవారు బంధువులు. బంధాన్ని కల్తీ చేసేవారు, పలుచన చేసేవారు, వంచన చేసేవారు బంధువులు కాబోరు. నీ రక్తం నా రక్తం అని చూసేవారు బంధువులు కాబోరు. ఆమెకు బంధువులు శత్రువులుగా మారారు. తిరిగి వారు స్నేహితులుగా మారే లోపు బాధ పెట్టారు. ఆమె దృఢంగా నిలబడేందుకు చేసిన ప్రయత్నమే ఇది.

అతనికి పుట్టినవారు అతని పిల్లలు. ఆమెకు పుట్టినవారు ఆమె పిల్లలు కారా? ఆమె బావగారు అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటారు. ఆయనను చూస్తే ఆమెకు భయం. ఆయన రోజూ ఆమె పిల్లలను తన ఫ్లాట్‌కు రప్పించుకుంటారు. చాక్లెట్‌లు ఇప్పిస్తారు. కబుర్లు చెబుతారు. షికారు తిప్పుతారు. ఆయనా ఆయన భార్యా వాళ్లిద్దరి పిల్లలూ ఆ పిల్లలను అక్కున చేర్చుకుంటారు. దానికి కారణం ఆమె పిల్లలను ఆ బావగారు ‘తన తమ్ముడి పిల్లలు’ అనుకోవడం. కాని వారి కన్నతల్లిని మాత్రం తమకు సంబంధం లేని మనిషిగా భావించడం. అది ఒక సమస్య అయితే ఇంట్లో ఉన్న అత్తగారు మరో సమస్య ఆమెకు. ఆమె ఎప్పుడూ తన ఇద్దరు మనవల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వారితో మాట్లాడుతుంటుంది. వారితో జట్టు కడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆమె వారిని తన కొడుకు పిల్లలు అనుకుంటుంది. వారిని కన్న తల్లిని కోడలు అనుకోదు. కొడుకు భార్య అని కూడా అనుకోదు. ఎందుకంటే కొడుకు చనిపోయాడు.

కోడలితో ఏం పని?! ఆమెకు 42 ఏళ్లు ఉంటాయి. ఇద్దరు పిల్లలు. కొడుక్కి పదేళ్లు. కూతురికి ఎనిమిదేళ్లు. కార్పొరేట్‌ హాస్పిటల్‌లో అకౌంట్స్‌లో ఉద్యోగం. భర్త చనిపోయి రెండేళ్లు అవుతున్నా ఆ విషాదం నుంచి ఆమె కోలుకోలేదు. అతను లేని జీవితాన్ని ఎదుర్కోవాల్సి రావడం ఒక సమస్య అయితే బంధువులతో వేగాల్సి రావడం మరో సమస్యై కూచుంది. దానికి కారణం తన తప్పేనట. ఆమెకు లేటుగా వివాహం జరిగింది. అది కూడా అతడితో రెండో పెళ్లి. మొదటి భార్యకు విడాకులిచ్చిన అతను.. ఐదుగురు సంతానంలో పెళ్లి కాకుండా ఉన్న ఆమెను ఆమె 30వ యేట పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్నప్పటి నుంచి ఆమె జీవితం అంత సరిగా లేదు. అతను మంచివాడేకాని తాగుడుకు బానిస. బాగానే సంపాదించేవాడు. కాని ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. ఒకరోజు ఉన్నట్టుండి చనిపోయాడు. అతడలా చనిపోవడానికి కారణం తనే అని అత్తగారు, బావగార్ల ఫిర్యాదు. ‘ఆమె అదుపు చేసి ఉంటే అదుపులో ఉండేవాడు’ అంటారు వాళ్లు.

‘వయసు తేడా ఉన్న వాణ్ణి అయిష్టంగా పెళ్లి చేసుకుంది. వాణ్ణి సాగనంపితే ఇంకొకరిని చేసుకొని ఆస్తి అనుభవించవచ్చునని ప్లాన్‌’ అని వాళ్లకు సందేహం. అతని ద్వారా ఆమెకు ఫ్లాట్‌ వచ్చింది. కొద్దిగా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ వచ్చింది. ఆ రెంటి కోసం భర్త ఎటుపోయినా పర్వాలేదని ఆమె అనుకుంటుందని వాళ్లు నిర్ణయానికి రావడం ఆమెను బాధిస్తూ ఉంది. రాను రాను అత్తగారి, బావగారి సందేహాలు ఇంకా పెరిగాయి. ‘ఈమె పిల్లల్నయినా చూసుకుంటుందని గ్యారంటీ ఏమిటి’ అనుకున్నారు వాళ్లు. ‘అసలు ఇదంతా ఎందుకు మన పిల్లలు మన బంగారం. వారిని మన దగ్గర ఉంచుకుని దాని దోవ దానిని చూసుకోమంటే అదే మేలు’ అనుకున్నారు వాళ్లే. ఇందుకు మార్గం పొమ్మనకుండా పొగబెట్టడం. ఆమె అది చేసినా తప్పే.. ఇది చేసినా తప్పే. చీటికి మాటికి మాటలు అంటూ ఆమె ఈ ఖర్మకు కారణం ఆమె చేష్టలే అని చెబుతూ రావడంతో ఆమెకు మెల్లగా తన మీద తనకే సందేహాలు మొదలయ్యాయి.

అవునా.. నేను దేనికీ పనికిరానా? నాకు కాపురం చక్కదిద్దుకోవడం రాదా? నేను పిల్లల్ని పెంచలేనా?... మెల్లగా ఆమెకు భయాలు మొదలయ్యాయి. ఆ భయాలు పెనుభూతాలయ్యాయి. ఆమెకు నిద్ర లేదు. ఆహారం లేదు. పిల్లల్ని చూసుకుంటూ పదే పదే ఏడవడం మొదలుపెట్టింది. ఆఫీసులో కూడా ఒకటే ఏడుపు. దీనిని చూసి ఆఫీస్‌ కొలీగ్‌ ఒకామె ఇదేదో ముదిరిపోతున్నట్టు గ్రహించి సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకొని వచ్చింది. ఆ మాత్రం స్నేహాలను ప్రకృతి ఎప్పుడూ సిద్ధం చేసి పెడుతుంది కదా. ‘నాకేమైనా మానసిక సమస్యలు ఉన్నాయా డాక్టర్‌’ అని అడిగిందామె. ఆమె కేసంతా విన్న డాక్టర్‌కు ఆమెకూ ఆమె బంధువులకూ మధ్య ఉన్న గ్యాప్‌ అర్థమైంది. ‘లేదమ్మా.. నీకేం సమస్యలూ లేవు’ అన్నారు డాక్టర్‌. ‘మరి వారెందుకు అలా చేస్తున్నారు? ఆఖరుకు నా పిల్లల మనసులో కూడా విషం నూరి పోశారు. వాళ్ల నాన్న తొందరగా చనిపోవడానికి కారణం నేనట. నేను ఆయన్ను పట్టించుకోలేదట. ఉద్యోగం చేసుకుంటూ ఆయనను నిర్లక్ష్యం చేశానట. ఇవాళ ఉద్యోగమే కదా డాక్టర్‌ నన్ను కాపాడుతోంది. నా పిల్లలతో నా బతుకు నేను బతుకుదామన్నా ఈ టెన్షన్‌ ఏంటి డాక్టర్‌’ అందామె.

‘ఏం లేదమ్మా.. ముందు నువ్వు నీ ఇంటికి తాళం వేసి వాళ్లకు దూరంగా కొన్నాళ్లు జీవించు. అన్నీ సర్దుకుంటాయి’ అన్నారు డాక్టర్‌. ‘అదేంటి డాక్టర్‌?’ అందామె. ‘అవునమ్మా. నీ జీవితం పట్ల నువ్వు సీరియస్‌గా ఉన్నావని, నీ పిల్లలకోసం నువ్వు జీవిస్తావని వాళ్లకు తెలియదు. మరొకటి. నీ భర్త చనిపోయాక నీకు మరొకరిని చేసుకునే హక్కు ఉంది. అలా చేసినా నీ పిల్లలంటే నీకు ప్రేమ అనీ, వారి అనుమతితో... వారు యాక్సెప్ట్‌ చేసినవారినే చేసుకుంటానని, వారిని యాక్సెప్ట్‌ చేసే బంధంలోకే వెళతానని, వారంటే నీకు ప్రాణమని నీ బంధువులకు తెలిసేలా చేయాలి. అసలు నీకు పెళ్లి ఆలోచనే లేకపోతే ఆ ఇష్యూయే లేదు. పెళ్లయిన ఏడెనిమిదేళ్లకే నీ భర్త చనిపోవడం వల్ల నీకూ నీ బంధువులకూ మధ్య ఇంకా బలపడాల్సినంత బంధం బలపడలేదు.

నిన్ను వారి మనిషిగా వారు స్వీకరించలేదు. ఇవన్నీ రోజులు గడిచేకొద్దీ తేలే విషయాలు. ప్రస్తుతం నువ్వు నీ జీవితాన్ని మొదలెట్టు’ అన్నారు డాక్టర్‌. ఆ తర్వాత ఆమె పిల్లలను కూడా పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చాడు. తల్లి బతికేది వారి కోసమే అనే భావన వారిలో కల్పించాడు. వాళ్లు దూరంగా వెళ్లి వేరే ఫ్లాట్‌ తీసుకున్నాక అత్తగారు, బావగారు దూరం అయ్యాక పిల్లలు తల్లికి దగ్గరయ్యారు. తల్లి మరింతగా వారికి అర్థం కావడం మొదలెట్టింది. ఆ ముగ్గురూ ఒక కుటుంబం అయ్యారు. బంధం ఎక్కడికీ పోదు. మెల్లగా అత్తగారికి బావగారికి ఆమె పట్ల ఉన్న సందేహాలు తీరిపోయాయి. ఆమె ఒంటరిగా మిగిలినా మరొకరిని చేసుకున్నా పిల్లలకు అన్యాయం చేయదు అని గ్రహించారు. మెల్లగా రాకపోకలు మొదలయ్యాయి. ఏమో.. పెద్దలు పిల్లలు అంగీకరిస్తే ఆమె మరొకరిని వివాహం చేసుకోవచ్చేమో. ఇప్పుడైతే ఆమె జీవితం సంతోషంగానే ఉంది.
– కథనం: సాక్షి ఫీచర్స్‌ డెస్క్‌
ఇన్‌పుట్స్‌: డాక్టర్‌ కల్యాణ చక్రవర్తి, సైకియాట్రిస్ట్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top