బరువును విసిరి కొట్టండి!

Family health counseling to obesity - Sakshi

 ఊబ  కాలమ్‌ 

బరువు తగ్గడానికి ప్రపంచంలో ఉన్న ?డైట్‌ ప్లాన్స్‌ అన్నీ వివరించాం.కాని అసలైన డైట్‌ మన వాకిలి ముంగిటే ఉంది.మన చేలలోనే ఉంది.పంట పొలాల్లోనే పండుతోంది. సిరి ధాన్యాలతో ఒంటి మీద పేరుకున్న అదనపు సిరిని వదిలించుకోవచ్చు. తగ్గించుకోవచ్చు. తరిమికొట్టవచ్చు.అరికలు, సామలు, ఊదలు, కొర్రలు... ఇవన్నీ శరీరాన్ని ఆరోగ్యవంతం చేయడమే కాదు బరువును అదుపు చేస్తాయి. భారాన్ని తగ్గిస్తాయి. సిరిధాన్యాలతో బరువును విసిరికొట్టండి.

గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తినే ఆహారంలో మార్పు వచ్చింది. తినే ఆహారం మారిపోయింది. పీచుపదార్థం, పిండిపదార్థాలు సమతుల్యంగా ఉండే ఆహారాన్ని మానవాళి గత కొద్ది దశాబ్దాలుగా వదిలిపెట్టింది. ఆధునికత పేరుతోనో, సౌలభ్యం కోసమనో పీచుపదార్థం అతి తక్కువగా.. పిండి పదార్థం, చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పానీయాలను తీసుకోవటం ప్రారంభించడంతోనే రోగాలు చుట్టుముడుతున్నాయి. ఆహారానికి తోడు వ్యాయామం/నడక చాలావరకూ తగ్గిపోతూ వచ్చింది. ఒక్కమాటలో చెప్పాలంటే పిండిపదార్థం ఎక్కువగా ఉండే ఆహారం తినటం, వ్యాయామం లోపించడం, స్టెరాయిడ్స్‌ తీసుకోవటం తప్ప.. ఇటీవల దశాబ్దాల్లో ఊబకాయుల సంఖ్య తామరతంపరగా పెరగడానికి మరో మూల కారణమేదీ లేదు. అనువంశికత కారణం కాదు. ఊబకాయానికి, మధుమేహానికి కూడా ముఖ కారణాలు ఇవే. 

గతంలో ఊబకాయుల సంఖ్య తక్కువ ఎందుకని?
పూర్వం ఊబకాయంతో బాధపడే ప్రజలు దాదాపుగా లేరు. క్రీ.శ.1900 వరకు ఊబకాయ సమస్య పహిల్వానులు వంటి వాళ్లలో తప్ప సాధారణ ప్రజానీకంలో చాలా అరుదుగా ఉండేది. ఎందుకనంటే, అప్పట్లో గ్లూకోజ్‌ నిదానంగా రక్తంలో కలిసేందుకు అనువైన ఆహారం మనం తింటూ ఉండేవాళ్లం. అదీకాకుండా, ప్రజలంతా రోజూ చాలా సేపు నడిచేవారు. అంటే, ఆహారం ద్వారా రక్తంలోకి చేరే గ్లూకోజ్‌ ఖర్చు అయ్యేది. ఎప్పుడైతే గ్లూకోజ్‌ రక్తంలో ఎక్కువ అవుతూ, పేరుకుంటూ వస్తున్నదో అప్పుడు గ్లైకోజన్‌ గాను, కొవ్వు గాను, మాంసం గాను మార్చే వ్యవస్థ తయారవుతుంది. ఈ మెటబాలిక్‌ యాక్టివిటీస్‌ మొదలవుతాయన్నమాట. 

వీటికితోడు కాలక్రమంలో పంచదార ఉత్పత్తి, వినియోగం బాగా పెరిగింది. చక్కెర ఉత్పత్తి క్రీ.శ. 1846 నుంచే ప్రారంభమైంది. గడచిన 70 సంవత్సరాల్లో వరిబియ్యం, గోధుమలతోపాటు పంచదార వినియోగం బాగా పెరిగింది. వరి, గోధుమల్లో పీచుపదార్థం అతి తక్కువగా ఉంది. పంచదార ద్వారా తీసుకునే గ్లూకోజ్‌ను ఖర్చు చేసే వ్యాయామం చేయకపోవడం వల్ల ఊబకాయం ఏర్పడుతోంది.  సూటిగా చెప్పుకోవాల్సిందేమిటంటే.. ఆహారంలో వచ్చిన మార్పు వల్ల, వ్యాయామం తగ్గిపోవడం వల్ల ఊబకాయం వచ్చింది. సరైన ఆహారం తినాలి. సరిగ్గా వ్యాయామం చేయాలి. అప్పుడే తిరిగి సంపూర్ణ స్థితి నెలకొంటుంది.  అంటే ఊబకాయులు తమ శరీరంలో అతిగా పెరిగిన మాంసం, కొవ్వు పదార్థం, గ్లైకోజెన్‌ కరిగించుకునేలా ఆహార విహారాలను నియమబద్ధంగా మార్చుకోవాలి. అంటే, ఎక్కువగా నడవాలి. గ్లూకోజ్‌ను రోజూ నడక ద్వారా ఖర్చు చేయాలి.  అదే సమయంలో.. ఆహారం ద్వారా గ్లూకోజ్‌ నిదానంగా రక్తంలోకి వచ్చేలా చూడాలి. సిరిధాన్యాలను ఎప్పుడో  ఒక సారి కాకుండా రోజువారీగా ముఖ్య ఆహారంగా తింటూ ఉంటేనే ఇది సాధ్యమవుతుందని గుర్తించాలి. 

స్టెరాయిడ్స్‌ వల్ల ఊబకాయం.. 
ఆహారం వల్ల సహజంగా ఊబకాయం తయారవటం ఒకటైతే వైద్యచికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్‌ ఎక్కువగా వాడటం కూడా ఊబకాయానికి మరో ముఖ్య కారణం. రోగాలకు చికిత్సలో భాగంగా ఈ మధ్యకాలంలో డాక్టర్లు స్టెరాయిడ్స్‌ వాడుతున్నారు. ఆడవాళ్లలో హార్మోన్‌ అసమతుల్యతకు, ఆస్తమా, నొప్పి మందులుగా వాడుతున్నారు. సాధారణంగా ఆహార విహారాలలో మార్పుల వల్ల కన్నా స్టెరాయిడ్స్‌ వాడే వారికి మరింత వేగంగా ఊబకాయం వస్తుంది. స్టెరాయిడ్స్‌ వల్ల ఆకలి ఎక్కువ కావటం వల్ల ఎక్కువగా తినటం జరుగుతూ ఉంటుంది. దీని వల్ల కూడా కొందరు ఊబకాయులుగా మారుతున్నారు. 

మాంసం, కోడిగుడ్లను తక్కువ రోజుల్లో 
అధికోత్పత్తి సాధించే క్రమంలో పశువులకు, కోళ్లకు స్టెరాయిడ్స్‌ వాడుతున్నారు. అలా ఉత్పత్తయిన మాంసం, కోడిగుడ్లను తిన్న వారి ఆరోగ్యంపై కూడా ఈ స్టెరాయిడ్స్‌ ప్రభావం ఉంటుంది. వీళ్లు కూడా ఎక్కువ తినటం మొదలు పెట్టి ఊబకాయులుగా మారిపోతున్నారు. మాంసాహారం తినటం అంతకంతకూ ఎక్కువై పర్యావరణ అసమతుల్యతకు దారితీస్తోంది. జంతువుల పాలు మనిషి ఆరోగ్యానికి సరిపడవు. పాలు, టీ, కాఫీలు తాగటం వల్ల హార్మోన్‌ అసమతుల్యత మనుషుల ఆరోగ్యాన్ని అస్థవ్యస్థం చేస్తోంది. పాలను తోడు వేస్తే ఈ అలసమతుల్యత సమసి పోతుంది. కాబట్టి, పెరుగు, మజ్జిగ పర్వాలేదు. మొత్తంగా ప్రపంచం ఇప్పుడు తింటున్న ఆహారం పర్యావరణానికి కూడా పెనుముప్పుగా మారాయి. సిరిధాన్యాలతో మనుషులు సంపూర్ణ ఆరోగ్యం పొందటమే కాకుండా భూతాపాన్ని కూడా సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. మెట్ట రైతులనూ బతికించుకోవచ్చు. 

నెమ్మదిగానైనా రోజూ నడవాలి
అన్నిటికన్నా ముఖ్యంగా ఉదయం గంట, సాయంత్రం గంట నడవాలి. అధికబరువు ఉన్న వారు నడవడానికి ఇబ్బందులు ఉంటాయి. అయితే, ఈ రోగానికి కారణభూతాలైన ఆహారం తినటం మాని, సిరిధాన్యాలు తినటం,  కషాయాలు తాగటం మొదలు పెడితే వారికి నడిచే శక్తి వస్తుంది. కీళ్ల నొప్పులు, సంధివాతం కొర్రలతోనే బాగువుతుంది. అందుకే ఐదు ధాన్యాలూ తినాలి.  అరికెలు, సామలు ఎక్కువ రోజులు తింటూ మిగతా 3 ధాన్యాలూ తక్కువ రోజులు తినాలి. ఊబకాయులు వేగంగా నడవనక్కర లేదు. నెమ్మదిగా నడిచినా చాలు. ఉదయం, సాయంత్రం గంట చొప్పున వారికి చేతనైనంత వేగంతో నడవవచ్చు. రోజులు గడిచేకొద్దీ వారు బాగా నడవగలుగుతారు. 

వేగంగా తగ్గటం మంచిది కాదు..
ఆహారంలో, శారీరక వ్యాయామంలో వచ్చిన మార్పు వల్ల ఊబకాయం మరీ వేగంగా పెరగదు.  కొన్ని ఏళ్లపాటు, నిదానంగా పెరుగుతూ వస్తుంది. కాబట్టి, తగ్గేటప్పుడు కూడా ఆహారంలో మార్పు చేసుకొని, నడక వంటి వ్యాయామం క్రమబద్ధంగా చేస్తూ నిదానంగానే ఊబకాయాన్ని తగ్గించుకోవాలి. సిరిధాన్యాలు తింటూ, కషాయాలు తాగుతూ, నడుస్తూ ఉంటే.. ఆరు నెలల నుంచి రెండేళ్లలో వయసు, ఎత్తుకు తగిన బరువును సంతరించుకోవటంతోపాటు.. ఏ వయస్కులైనా, ఏయే జబ్బులున్న వారైనా, ఆడవారైనా, మగవారైనా సంపూర్ణ ఆరోగ్యవంతులు కావచ్చు. 6 నెలల్లో 10–25 కిలోల వరకు బరువు తగ్గవచ్చు. మరీ ఎక్కువ బరువున్న వారు కొంచెం వేగంగా, మధ్యస్థంగా అధిక బరువున్న వారు కొంచెం నెమ్మదిగా బరువు తగ్గుతారు. 

ఉదాహరణకు 100 కిలోల బరువున్న మనిషి ఆహార విహారాలను మార్చుకుంటే ఆరునెలల్లో 12 కిలోల వరకు తగ్గొచ్చు. 80–90 కిలోలున్న వారు అదే ఆరునెలల్లో 10 కిలోలు తగ్గొచ్చు. చిన్న వయస్కులైన ఊబకాయులు 50 ఏళ్లు దాటిన ఊబకాయులకన్నా కొంచెం వేగంగా బరువు తగ్గుతారు. ఇంతకన్నా వేగంగా బరువును తగ్గించే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అవి ప్రమాదకరం.మరీ వేగంగా బరువు తగ్గటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల కిడ్నీ సంబంధమైన సమస్యలు వస్తాయి.  హానికరమైన ఆహారాన్ని తినటం మానేసి చిరుధాన్యాలను (కనీసం 2–4 గంటలు నానబెట్టుకొని వంట చేసుకోవటం విధిగా పాటించవలసిన చాలా ముఖ్యమైన నియమం) తింటూ, కషాయాలు తాగుతూ, క్రమం తప్పకుండా నడుస్తూ ఉంటే.. ఆరు నెలల నుంచి రెండేళ్లలోపు ఎంతటి రోగాలున్న వారైనా (అవసరాన్ని బట్టి హోమియో/ఆయుర్వేద మందులను తీసుకోవాలి) ఆయా రోగాల పీడ నుంచి పూర్తిగా బయటపడటమే కాకుండా.. సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని నా దగ్గరకు వచ్చిన వేలాది మంది సాక్షిగా బల్లగుద్ది చెప్పగలను. 

అరికెలు, సామలు ఎక్కువ రోజులు తినాలి..
ఏ కారణంగా ఊబకాయం వచ్చినా.. ఊబకాయాన్ని ఆరోగ్యదాయకంగా తగ్గించుకోవాలనుకునే వారు మొదట ఆహారం మార్చుకోవాలి. గ్లూకోజ్‌ను అసమతుల్యంగా, తక్కువ సమయంలోనే రక్తంలోకి పంపించే వరి బియ్యం, గోధుమలు, మైదాతో చేసిన ఆహారాన్ని తినటం మానేయాలి. గ్లూకోజ్‌ను సమతుల్యంగా, కొన్ని గంటల పాటు నెమ్మదిగా రక్తంలోకి వదిలే సిరిధాన్యాలను ముఖ్య ఆహారంగా తినాలి. వరుసగా మూడు రోజులు అరికెలు, మరో మూడు రోజులు సామెలు రోజువారీ ముఖ్య ఆహారంగా తినాలి. కొర్రలు, ఊదలు, అండుకొర్రలను వరుసగా ఒక్కోరోజు తినాలి. ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు తినాలి. 

సిరిధాన్యాలు  తింటే ఏమవుతుంది?
కాలేయం, క్లోమం.. ఇవన్నీ తమ పనులను సక్రమంగా పనిచేయాలంటే రక్తం శుద్ధంగా ఉండాలి. రక్తం పలచగా, తేలిగ్గా ఉండి, ఇమ్యునో బాగ్యులన్స్‌ అన్నీ సరిగ్గా ఉంటేనే నిర్ణాల గ్రంథులన్నీ(ఎండోక్రైన్‌ గ్లాండ్స్‌) సరిగ్గా పనిచేసేది. రక్తం శుద్ధ కావటానికి, నిర్ణాల గ్రంధులు సరిగ్గా పనిచేయటానికి ఈత ఆకు కషాయం పని చేస్తుంది. దీనికి తోడు సిరిధాన్యాలు ప్రధాన ఆహారంగా తినాలి. ఇలా చేస్తే దేహంలో పేరుకున్న కొవ్వు, మాంసం క్రమంగా కరగటం ప్రారంభమవుతుంది.

పసుపు, గరిక, ఈత ఆకుల కషాయాలు తాగాలి
సిరిధాన్యాలు తినటంతోపాటు.. పసుపు, గరిక, ఈత ఆకుల కషాయాలు తాగాలి. వీటిల్లో వారానికి ఒక రకంæచొప్పున తాగాలి. ఉదయం, సాయంత్రం తాగాలి. దీనిలో కొంచెం ఈతబెల్లం లేదా తాటిబెల్లం పాకాన్ని రెండు చుక్కలు కలుపుకుంటే.. కషాయం రుచిగానూ ఉంటుంది. రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.  ఈతబెల్లం జనాన్ని సన్నగా ఉంచుతుంది. ఈతాకులో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకల మజ్జలో పనిచేస్తుంది. ఎముకల మజ్జ శుభ్రం అయితేనే ఊబకాయం తగ్గుతుంది. 
– డా. ఖాదర్‌ వలి, స్వతంత్ర శాస్త్రవేత్త, 
ప్రముఖ ఆహార, ఆరోగ్య నిపుణులు, హోమియో వైద్యులు, మైసూరు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top